"వూరికే గాల్లో మేడలు కట్టకండి అంతంత ఆశలు పెట్టుకోడానికి మనం ఏమైనా కోటీశ్వరులమా? మనిష్టర్లమా? కృష్ణ, రాధని చేసుకోడానికి యిష్టపడ్డాడు. దీపికకి ఏదో మనకు తగిన సంబంధం చూసి పెళ్ళిచేద్దాం. ఇక ఆలస్యం చెయ్యొద్దు దీపా, భారతీ ఒక తోటివాళ్ళే. అప్పుడే అన్నయ్యగారు అల్లుడిని వెతికి తెచ్చుకున్నారు. త్వరలోనే ఆ శుభకార్యం కూడా జరిపేస్తారుట" అంది.
అంతే, సత్యంగారి ఆగ్రహం అవధులు దాటింది. "ఆ సన్నాసి వెధవ పేరు నాదగ్గర ఎత్తకు. వాడు వాడి కూతురికి పెళ్ళి చేస్తున్నాడని మనం ఏమీ తొందర పడక్కర్లేదు నా పిల్లలకి ఎప్పుడు పెళ్ళి చెయ్యాలో నాకు తెలుసు. నీ బోడి సలహా అనవసరం!" అని అరిచాడు.
"ఏం మనిషో. ఆయన చెప్పింది తప్ప ఇతరులమాట వినిపించుకోరు" అని విసుక్కుని వెళ్ళిపోయింది వర్ధనమ్మ.
ఏం చెయ్యాలో తోచక వర్ధనమ్మా వుట్టి లక్ష్మితో తన గోడు వెళ్ళబోసుకుంది. అది విన్న వుట్టిలక్ష్మికి ఒక అయిడియా వచ్చింది.
భర్తరాగానే కాఫీ యిచ్చి తన ఐడియా వివరించింది.
"నీకేం మతిపోయిందా? అతన్తో మనకున్న పరిచయం ఎంత? ఆ మాత్రాన చనువు తీసుకుని న్వవిషయాల్లో జోక్యం కలుగ చేసుకుంటే మర్యాదగా వుంటుందా?" అన్నాడు విశ్వనాధం.
"యిది మరీ బాగుంది. మనం ఏమైనా బ్యాంకు దొంగతనం చెయ్యమంటున్నామా? జైలు కెళ్ళమంటున్నామా? పెళ్ళి చేసుకోమంటున్నాం. అదైనా అతనికి మన స్ఫూర్తిగా ఇష్టం అయితేనే! అతను వద్దంటే మనం బలవంతం చెయ్యంకదా! ఓసారి ఓ మాట అడిగితే వచ్చే నష్టం ఏముంది?" అంది లక్ష్మి.
సర్లే చూద్దాం! వీలుచూచుకుని అడుగుదాం."అనేశాడు విశ్వనాధం.
వెంటనే వంటింటిలోకెళ్ళి వంటచేసేసింది. పుస్తకం చదువుకుంటూ కూర్చుంది.
మామూలుగా ఏడున్నర అవుతూండగా రూమ్ కి వచ్చాడు శ్యామ్. ఆ రోజు అతని మనస్సు చిరాకు గా వుంది. కారణం ఆవేళకూడా తను ట్యూషన్ చెప్పి వస్తుంటే జంక్షనులో మోహన్ కనిపించాడు. అతనివెంట ఆ ఆమ్మాయి కూడా వుంది.
ఇటు చూస్తే మోహన్ నా అల్లుడు అని ఢంకా మీద దెబ్బకొట్టి చెపుతూవుంటారు సూర్యంగారు. ఆ బస్టాప్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చిట్టిబాబుతో పందెంకాసి వున్నాడు మోహన్.
ఇదంతా పెద్ద గందరగోళంగా అయోమయంగా అనిపిస్తోంది శ్యామ్ కి. కొంపతీసి మోహన్ ఏదైనా డబల్ గేమ్ లాంటిది ఆడడం లేదుకదా! ఇటు ఈయన్నీ భారతనీ, అటు ఆ బస్టాప్ అమ్మాయినీ కూడా మోసం చేస్తున్నాడా?
పైకి మరి యెంతో మంచివాడిలా కనిపిస్తాడు. ఏమో ఏం చెప్పగలం! ఆలోచిస్తున్నకొద్దీ బుర్ర వేడెక్కి పోసాగింది అతనికి. లేచి చన్నీళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకుని రూం తాళం పెట్టి హొటల్ కి వెళ్దామని బయటికి వచ్చాడు.
వాకిట్లోనేవుంది వుట్టిలక్ష్మి . ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగింది. చెప్పాడు.
ఈ పూటకి మా ఇంట్లో భోం చెయ్యండి!" అంది.
ఆడపాదడపా వాళ్ళింట్లో భోం చెయ్యమంటుంది. ఆవిడ ఆనందంగా అంగీకరిస్తాడు అతను. కానీ ఆ వేళ అతనికి వాళ్ళింట్లో భోంచేసే మూడ్ లేదు వద్దన్నాడు. కానీ ఆవిడ వినలేదు. బలవంతపెట్టేసింది. విధిలేక అంగీకరించాడు.
శ్యామ్ కీ, విశ్వనాథానికి పక్కపక్కనే వడ్డించింది వుట్టిలక్ష్మి.
"శ్యామ్ సుందరంగారూ? ఉద్యోగం వచ్చేసింది మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు?" అని అడిగేసింది.
తలవంచుకున్నాడు శ్యామ్ "ఆలస్యం యెందుకు? లక్షణంగా పెళ్ళి చేసుకోండి. నా ఎరికలో మంచి సంబంధం వుంది!" గడగడచెప్పేస్తున్న భార్యవంక చిరాగ్గా చూసి కళ్ళతో వారించాడు విశ్వనాధం. కానీ ఆవిడ లక్ష్యపెట్టలేదు.
"నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలనిలేదండీ!" అనేశాడు శ్యామ్.
"సర్లెండి అప్పుడే ఏమిటి?
"ఎన్నాళ్ళు హొటల్ భోజనం చేస్తారు చెప్పండి. నా మాటవిని లక్షణంగా పెళ్ళి చేసుకోండి. మాంచి సంబంధం చూశాను. ఈ వీధిలోనే వాళ్ళ యిల్లు. సత్యనారాయణ మూర్తిగారని కలెక్టరాఫీసులో పనిచేసేవారు. పాపం ఆరోగ్యం బాగుండక రిటైరైపోయారు. మంచి కుటుంబం మంచి సాప్రదయం ఇద్దరే పిల్లలు. కొడుకు పెద్దవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు.ఈ అమ్మాయి రెండోది. డిగ్రీ తీసుకుంది. అమ్మాయి చక్కగా చిదిమిదీపం పెట్టుకునేలా వుంటుంది. గొప్ప ఐశ్వర్యవంతులుకారుగానీ పెట్టుకునేలా వుంటుంది. గొప్ప ఐశ్వర్యవంతులుకారుగానీ పెట్టుపోతలకేం లోటు చెయ్యారు. వాళ్ళు అమ్మాయి పెళ్ళి చెయ్యాలని తొందరలో వున్నారు మీరు సరేనంటే మీ పెద్దవాళ్ళం రాస్తాం. ఆగకుండా చెప్పేసింది.
అసలే అయిమయంగా వున్న శ్యామ్ కి ఈ వివరాలు వినేసరికి మరింత మతిపోయింది. అతని ముఖంవంక చూసిన విశ్వనాథం ఇక లాభం లేదని రంగప్రవేశంచేశాడు.
"లక్ష్మీ నువ్వు కాస్తాగు!" అని కసిరేశాడు. ఆదరంగా శ్యామ్ భుజం తట్టాడు. "కంటికి నదురుగా కనిపించే బ్రహ్మచారి. అందులోనూ ఉద్యోగస్తులు మీకీ బాధలు తప్పవుమరి!" అన్నాడు హాస్యంగా చిన్నగా నవ్వేడు శ్యామ్.
"లక్ష్మి చెపుతున్న మేచ్ చాలామంచిది. అసలు పెళ్ళి అనేది మీ స్వవిషయం. ఏదో మంచి సంబంధంకదా అని ఆరాటపడుతోంది లక్ష్మి.
మీరూ ఆలోచించుకోండి తొందరపడాల్సింది ఏమీలేదు. బలవంతం అంతకంటే లేదు" అన్నాడు పెద్దరికంగా.
రాత్రంతా కలతనిద్దరే అయింది అతనికి. మర్నాడు పొద్దున్న రోజుకంటే ముందే బయలుదేరి మోహన్ వాళ్ళింటికి వెళ్ళాడు. అలావాటు ప్రకారం వాకిట్లోనే ఎదురయింది. భారతి రోజూ అతను నమస్కారంపెడితే ప్రతి నమస్కారం పెట్టె భారతి ఆ రోజు అతన్ని చూడగానే కంగారుగా యెదురోచ్చింది. "అలావున్నారేం ఆరోగ్యం బాగా లేదా" అని అడిగింది ఆత్రంగా.
శ్యామ్ మనస్సు కలుక్కుమంది. "ఏం లేదు నేను బాగానేవున్నాను!" అన్నాడు.
తల ఆడించింది భారతి "మామూలుగా లేరు. ఊర్నిండా ప్లూజ్వరాలు యెందుకైనా మంచిది. ఓసారి డాక్టర్ కి చూపించుకోండి. వంటరిగా వుంటున్నారు. మీకు ఏ జ్వరమైనా వస్తే ఎంత కష్టం." అంది మరింత ఆదరంగా.
బలవంతాన తలతిప్పుకుని "మోహన్ ఏం చేస్తున్నాడు?" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. హాల్లోనే వున్నాడు మోహన్. యితన్ని చూసి గోడగడియారం వంక చూశాడు. ఏమిటీ మా వాచీ స్లోనా?" అన్నాడు.
"కాదు నేనే కొంచెం ఎర్లీగా వచ్చాను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏర్లీగా బయలుదేరుదాం! భోజనం బయట చెయ్యచ్చు" అన్నాడు శ్యామ్.
సీరియస్ గా వున్న అతడినిచూసి మారు మాట్లాడకుండా బయలుదేరాడు మోహన్.
ఇద్దరూ హొటల్ వెళ్ళారు. మీల్స్ కి ఆర్డర్ చేశాడు శ్యామ్. "నిన్న సాయంత్రం అటునించి వస్తూ చూశాను. మీరూ మీ గరల్ ప్రెండ్ జంక్షన్ లో కనిపించారు" అన్నాడు.
"నేనా! లేదే! ఎవరినిచూసి ఎవరనుకున్నారో. ఇన్ని సార్లు నేనే అనుకుని పొరబడ్డారంటే నా డూప్ యెవరైనా వున్నాడేమో వెతికిచూడాలి" నేవసలు అటు వెళ్ళనేలేదు. బజారుకి వెళ్ళి షేవింగ్ క్రీమ్ కొనుక్కుని యింటికొచ్చేశాను. యెప్పటిలాగే దబాయించేశాడు.
ఒళ్ళు మండిపోయింది శ్యామ్ కి. కాలరు పుచ్చుకుని నిలదీయాలనిపించింది. అంతలోనే కోపం దిగమ్రింగుకొని నవ్వు తెచ్చి పెట్టుకున్నాడు. "ఈ పూట మిమ్మల్ని యెందుకు పిల్చానో తెలుసా? మీకు మంచి శుభవార్త చెప్పాలి" అన్నాడు.
"ఏమిటది?"
"నాకో మంచి మేచ్ సెటిల్ అయింది"
మోహన్ ఎగిరి గంతేశాడు "అలాగా! హార్టీ కంగ్రాట్స్ యెవరా లక్కీ గరల్? పెళ్ళెప్పుడు?" అన్నాడు సంబరంగా.
"థాంక్యూ! వివరాలడిగారుకదూ? ఈ ఊరే ఆ అమ్మాయి అందంగా వుంటుంది. చాలా మంచమ్మాయి. వాళ్ళది మంచి ఫేమిలీ బి.ఏ. పాసయింది. వాళ్ళ నాన్నగారు కలెక్టరాఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు నారాణమూర్తిగారు. ఆ అమ్మాయి పేరు దీపిక" తాపీగా వివరాలు చెప్పాడు శ్యామ్.
కత్తివేటుకి నెత్తురులేనట్లు పాలిపోయింది మోహన్ మొహం.
అతని ముఖంలో మారిపోతున్న రంగులని గమనిస్తూ చెప్పుకు పోతున్నాడు శ్యామ్.
"నాకు ఆవిడ నచ్చింది. మా నాన్నగారికి లెటర్ రాస్తారుట వాళ్ళు. పెద్ద వాళ్ళు ఓసారి మాట్లాడేసుకుని ముహూర్తలు" యిక వినలేక చెయ్యిచాపి వారించాడు మోహన్.
"మీరు చెప్పేది నిజమేనా?" నీరసంగాఅడిగాడు.
"ఆహ అక్షరాలా నిజం. మా ఇంటావిడ ఈ మేచ్ చెప్పారు. ఆవిడే మధ్యవర్తి" అన్నాడు శ్యామ్ కాసేపు కదలకుండా రాయిలా కూర్చున్నాడు మోహన్. ఆ తరువాత "శ్యామ్ మీతో చాలా మాట్లాడాలి" అంటూ మొదలుపెట్టి మొదటినించి జరిగింది అంతా చెప్పు కొచ్చాడు.
దీపికను చూడగానే లవ్ చేశాను నేను "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తనులేకుండా బ్రతకలేను" అన్నాడు దీనంగా .
"మరైతే భారతి?"
"భారతిని ఆ ఉద్దేశ్యంతో నేను ఏనాడూ చూడలేదు శ్యామ్ సమయంచూసి మామయ్యతో చెప్పాలని చూస్తున్నాను. కానీ పరిస్థితులు కలిసి రావటం లేదు. ఎటుచూసినా అగమ్యగోచరంగా వుంది!" వాపోయాడు.
"దీపిక కూడా సరేనంది అంటున్నారు కదా యిక ఆలస్యం ఎందుకు? పెద్దవాళ్ళకు చెప్పి గడువుకి ముందే పెళ్ళి చేసేసుకుంటే పందెం గెల్చుకోవచ్చు కదా!" తేలికపడిన మనస్సుతో అడిగాడు శ్యామ్.
