"చచ్చిపోయడేమో బ్రతికిపోయాడు. స్వర్గంలో నయినా సుఖంగా వుంటాడు మానవుడు" కసిగా అనుకున్నాడు కృష్ణ.
వాళ్ళ భోజనాలు అయ్యాక ఆడవాళ్ళు కూడా తినేశారు. భోజనాలు అయ్యాక పెట్టేతీసి తండ్రి వర్ధనమ్మ కోసం పంపిన వెంకటగిరి చీరె తీసి యిచ్చింది. బుట్టల్లోవున్న మామిడిపళ్ళూ టిఫెన్ల లో వున్న పిండివంటలూ కూడా తీసి ఇచ్చింది.
"ఎందుకే ఇవన్నీ?" అంది వర్ధనమ్మ లోలోపల తృప్తి పడుతూనే.
రాధనీ రాధ పనినీచూసి మహా ముచ్చటపడి పోయింది వర్ధనమ్మ. "ఆడపిల్ల అంటే యిలా వుండాలి. ఆ చురుకుతనం చూడు. ఎప్పుడుచూసినా ఈసురోమంటూ వుంటావు" అని కూతురితో అనేది.
దీపకి రాధాని చూస్తే సరదాగానే వుండేది. సత్యం గారు కూడా మంచిపిల్ల బుద్దిమంతురాలు అని మెచ్చుకున్నారు. రాధకి కూడా యింట్లో అందరూ నచ్చేరు ఎటొచ్చి ఒక్క వ్యక్తి తప్ప.
యెప్పుడుచూసినా గంభీరంగా వుంటూ పలకరిస్తే చిర్రుబుర్రుమంటూ అవసరం లేకుండా అడ్డంగా వాదించే బావనిచూస్తే వింతగా తోచింది.
"అత్తయ్యా బావ అలా వుంటాడేం?" అని అడిగింది కూడా. "ఏమిటో! చిన్నతనం నుంచీ వాడంతే!" అనేసింది ఆవిడ.
కానీ రాధ అలా వదిలేసి ఊరుకోలేకపోయింది ఓ రోజు పనిగట్టుకుని బావ అలమర సర్దింది. అనవసరంగా పడున్న పుస్తకాలన్నీ కట్టకట్టి అటకమీద పారేసింది.
సాయంత్రం రాగానే చూసి మండిపడ్డాడు కృష్ణ.
"నిన్ను అసలు నా అలమర యెవరు ముట్టుకో మన్నారు? చుట్టపుచూపుగా వచ్చినదానిని చుట్టంలాగానే ప్రవర్తించు. అంతేగానీ మా అందరి నెత్తెక్కి డాన్సు చెయ్యాలని చూడకు!" అన్నాడు.
"వీడికోపం కొరివిగానూ! బొత్తిగా ముందూ వెనకా చూసుకోడు. పరాయిపిల్ల మనసు కష్ట పెట్టుకుంటుందేమో" అని భయపడింది వర్ధనమ్మ.
కానీ రాధ అలా మనసు కష్ట పెట్టుకోలేదు. సరిగదా "యిది మా అత్తయ్య ఇల్లు నా యిష్టం వచ్చినట్లు తిరుగుతాను. నా యిష్టంవచ్చిన పన్లు చేస్తాను. నాకు తిక్కరేగిందంటే నిన్నుకూడా ఆటకమీదికి విసిరేస్తాను జాగ్రర్త" అని అరిచింది.
ఆ మొండి ఘటాన్ని ఏం చెయ్యాలో అర్ధంకాలేదు కృష్ణకి. ఏమిటో వణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
కాసేపు అక్కడా ఇక్కడా తిరిగి ఇంటికొచ్చాడు. వచ్చీరాగానే "కూరలు లేవురా! ఓ అడుగు వెళ్ళిరా!" అంది వర్ధనమ్మ.
మరింత చిరాకు వేసింది అతనికి. "ఆ మాట ఇందాకే చెప్తే తెచ్చేవాడినిగా?" అని విసుక్కునాడు.
లోపలికి వెళ్ళి "దీపా! ఓ సంచీ ఇలా పట్రా !" అని కేకశాడు.
"దీప లేదు! యేం కావాలి?" అంటూ వచ్చింది రాధ.
"ఓ సంచీ యిలా పట్రా!" అన్నాడు కృష్ణ విసుగ్గా.
"ఎందుకు?" అడిగింది రాధ.
"కూరలు తేవాలి."
"ఏ సంచి తెమ్మంటావ్?"
"అబ్బ విసిగించకు, ఏదో ఒకటి పట్రా!"
"బాగుంది. ఏదో ఒకటి ఎలా తెలుస్తుంది స్పష్టంగా చెపితే తెస్తా!"
"సరే ఆ ఎర్ర ప్లాస్టిక్ బాగ్ పట్రా!"
"ఏం నీలంది పనికిరాదా!"
"సరే అదే పట్రా!"
"మరిందాకా ఎర్రది తెమ్మన్నావుగా"
"అబ్బా, నన్ను చంపుకు తినక ఏదో ఒకటి తెచ్చి నా మొహాన తగలెయ్"
"ఇందుకే నాకు ఒళ్ళు మండేది. ప్రతి పనికీ ప్లాన్ అనేది వుండాలి ఓ ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. చెపితే వినవు మార్కెట్ కి వెళ్ళేవాడివి ముందుగానే ఏ సంచీ తీసుకెళ్ళాలో ప్లాన్ వేసుకోవద్దూ. ఏది కావాలో డిసైడ్ చేసుకు చెపితే తెచ్చి నీ మొహాన తగలేస్తాను"
"ఆ సోద భరించలేక తనే లోపలికి వెళ్ళి సంచీ తెచ్చుకున్నాడు కృష్ణ.
గుమ్మంలో ఎదురైంది వర్ధనమ్మ. అ"అబ్బ చూడమ్మా ఈ రాధ. ఎలా భేతాళ ప్రశ్నలు వేస్తోందో! కాసేపు వినేసరికి తల పగిలిపోతోంది. దినమంతా ఎలా భారిస్తున్నావో నువ్వు?" అన్నాడు విసుగ్గా.
వింతగా చూసింది ఆవిడ. "నాకేమీ కష్టంగా అనిపించడం లేదురా. రాధతో మాట్లాడుతుంటే అచ్చంగా నీతో మాట్లాడుతున్నట్లే వుంటుంది నాకు!" అంది.
తెల్లబోయాడు కృష్ణ. "ఏమిటమ్మా నువ్వనేది, నేను కూడా అలాగే అడ్డదిడ్డం ప్రశ్నలు వేస్తానా?" అన్నాడు.
"అవున్రా, అదింకానయం అచ్చ తెలుగులోనే వాదిస్తుంది. నువ్వు మధ్యలో యింగ్లీషులో కూడా అరుస్తూ వుంటావ్!" అనేసి వంట యింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ.
అయోమయంగా నిలబడిపోయాడు కృష్ణ హఠాత్తుగా అతనిలో ఏదో మార్పు వచ్చింది. తలొంచుకుని వెళ్ళి పోయాడు ఆ రాత్రి అంతా మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు వుండిపోయాడు.
మర్నాడు పొద్దున్నే లేచి అలవాటు ప్రకారం ఓ పుస్తకం మొహాన వేసుకుని కూర్చోకుండా ఇల్లంతా తిరుగుతూ అందరితో సౌమ్యంగా మాట్లాడాడు. ఒక్కసారి కూడా ప్లాన్ వేసుకుని పనిచెయ్యండి అని ఎవరితోనూ దెబ్బలాడలేదు.
అతనిలోని మార్పుని గమనించి ఆనందపడ్డారు తల్లిదండ్రులు వారం రోజులు చకచకా గడిచిపోయాయి. వీలు చూసుకొని రాధను, తల్లీనీ, ఊళ్ళో ఎక్కడికైనా తీసుకువెళ్ళేవాడు కృష్ణ.
రాధ వర్ధనమ్మకి మహా నచ్చింది చూస్తున్న కొలదీ ఆ అమ్మాయిని తనింట్లో శాశ్వతంగా వుంచేసుకోవాలని అనిపించింది.
సమయం చూసి రాధ అభిప్రాయం అడిగింది." అబ్బపో అత్తయ్యా" అంటూ సిగ్గుగా పారిపోయింది రాధ. ఆ రోజే కొడుకు అభిప్రాయం కూడా అడిగింది. చిన్నగా నవ్వేసి తలోంచుకున్నాడు కృష్ణ.
"నీ ఇష్టం అమ్మా. అయినా నా పెళ్ళికేం తొందర? ముందు చెల్లాయి పెళ్ళి కావద్దూ!" అన్నాడు.
"ఆ మాట నిజమేలే ముందు దాని పెళ్ళి చేసాక నీ పెళ్ళి ఏదైనా యిక ఆలస్యం అనవసరం చెల్లాయికి కూడా సంబంధం చూడడం మొదలు పెట్టాలి" అనేసింది.
వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి ఆయన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది ఆ రోజు ఆదివారం కావడంవల్ల దీపిక రిసెర్చ్ వర్క్ పొద్దునే పూర్తి అయిపోయింది కాబట్టి ఇంట్లోనే వుంది.
భార్య అమిత ఆదరంగా కొడుకు పెళ్ళి వార్త చెప్పి, వెంటనే కూతురికి కూడా సంబంధం చూడమంది కుదరగానే ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం అంది.
ఆయన ఎంత మాత్రం సంతోషించలేదు సరికదా గయ్ మని లేచాడు. "ఓ చెంప నేను నా సమస్యలతో సతమతం అవుతుంటే నీకు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తొందర వచ్చిందా?" అన్నాడు.
"ఇది మరీ బావుంది. పిల్లలకి పెళ్ళీడు వచ్చేసింది అసలు ఇప్పటికే ఆలస్యం అయింది. యికనైనా తొందర పడకపోతే ఎలా?" అంది ఆవిడ.
"మరేం ఫర్వాలేదు. వాళ్ళకేం వయసు మించిపోడంలేదు. ఇప్పుడప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఆలోచనలేదు నాకు. నా దశ తిరిగి నేను అనుకున్నది నాకు దక్కాక నాకూతురి కోటీశ్వరుడి కొడుకుని వెతికి తెస్తాను. కొడుక్కి మినిష్టరు కూతుర్ని తెస్తాను" అన్నాడు
