రాగిణికి తోచనప్పుడల్లా అన్ని ఉత్తరాలూ, అందరివీ తీసి చదువుకుంటూ కూర్చుంటుంది. అల్బమ్ తీసి ఫోటోలని చూస్తూ, ఏదో తృప్తిపడుతుంది. రామకృష్ణ మఠానికి రాసి, ఎన్నోపుస్తకాలు తెప్పించుకుని తెగ చదువుతోంది తీరిక వెళల్లో. రెండు నెలల్లోనూ, బోలెడు పుస్తకాలు చదివింది. "ఒంటరితనం తెలీకుండా వుండాలంటే, చక్కటి పుస్తకాలుంటేచాలు" అనిపించింది రాగిణికి.
అమెరికానుంచొచ్చిన 'కేబిల్' విప్పి చదువుతుంటే చేతులు గడగడలాడాయి. ఎందుకనో భయంవేసింది. "మదర్ ఎక్స్ పైర్డ్...... ఎస్టర్ డే..... భరణి" అని వుంది. రాగిణి భోరుమని పసిపిల్లలాగా ఏడ్చింది సిస్టర్ ఫెర్నాండిస్ దగ్గరకెళ్ళి. "ఊరుకో అమ్మా" అని ఓదార్చింది సిస్టర్ ఫెర్నాండిస్.
కోటయ్యగారినించి ఉత్తరం వచ్చింది వివరాలన్నీ చెప్పాను. అతనిప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకొని కెనడాలో స్థిరపడిపోయారని చెప్పాను. "ఎందుకు..... డాడీ, మమ్మీ పొట్లాడుకున్నారు?" అనీ అడిగింది. రాగిణీ, నువ్వు నమ్మవు. శిల్పకి ఎంత పట్టుదల అంటే చెప్పేవరకు ఒదిలిపెట్టలేదు నన్ను. చివరికి జరిగినదంతా చెప్పక తప్పలేదు.
"అమ్మకి, నాన్నకన్నా పుట్టబోయే నాకన్నా నాట్యమే కావలసొచ్చిందన్నమాట! ఛ....! నాకు ఆమె అంటే అసహ్యం" అంది.
"శిల్పా! అలా అనకు. అమ్మకి మీనాన్నకన్నా, నీకన్నా నాట్యం ఎక్కువ అని చెప్పను. కానీ చిన్నప్పటినుంచీ, మయూరిలా ఆడుతూ పాడుతూ పెరిగిన మీ అమ్మకి, నాట్యం కూడా జీవితంలో ఒక భాగమే అయిపోయింది. ఆ కళారాధన అటువంటిది. ఆ కళాపిపాసికి, జీవితంలో సంసారం, పిల్లలూ, బంధాలూ, అన్నీ ఎంత ముఖ్యమో, ఇదీ అంతే ముఖ్యమనిపిస్తుంది! మీ అమ్మ ఒక గొప్ప ఆర్టిస్టు! ఈ ఆర్టిస్టుల జీవితాలు, అందంగా కళాత్మకంగా, హాయిగా సాగిపోవాలంటే, అవతలివాళ్ళు అంటే పెళ్ళిచేసుకున్న అతనికి విశాలమైన హృదయం ఉన్నతమైన భావాలూ వుండాలి. అప్పుడే కట్టుకున్న భార్యలో, కేవలం ఒక ఆడదాన్ని, అర్ధాంగిని మాత్రం చూసి, ఆమెలోని 'కళ'ని ఆమెకి దూరం చెయ్యడు అప్పుడు జీవితం సంతోషంగా సాగిపోతుంది. కానీ నూటికి తొంభైతొమ్మిది మంది పెళ్లికి ముందు వారిలోని కళని గౌరవించడం- అసలు అవన్నీ చూసే వారిని ప్రేమించడం జరిగినా - పెళ్ళయ్యాక వాటన్నిటికి నిబంధనలు పెట్టి వాటిని దూరంచేసి కేవలం, మామూలు మనిషిగా వుండమని ఆదేశించడం జరుగుతుంది. వాటివల్ల కళాకారులలో నిరుత్సాహం పుట్టుకొస్తుంది. దాంతో భార్యాభర్తల మధ్య సంఘర్షణ పుట్టుకొస్తుంది. ఉదాహరణకి మీ అమ్మానాన్నల సంగతేచూడు! రాజేష్, రాగిణి నృత్యాన్ని చూసే ఆమె అందాన్ని చూసి ప్రేమించి వాళ్ళింట్లో అనుమతి లేకపోయినా, అమ్మని ఒప్పించి, స్నేహితుల మధ్య గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు. అతడంతగా ప్రేమిస్తున్నాడని చెప్పేకదా. మీ అమ్మ అందుకు ఒప్పుకుంది. అటువంటప్పుడు, పెళ్ళయ్యాక ఒక్కసారిగా ఎందుకతను మీ అమ్మమీద అన్ని ఆంక్షలు పెట్టాలి? "ఆమె నాట్యం మానెయ్యాలి? అసలు ఆ ఊసైనా ఎత్తకూడదు" అని!
"శిల్పా! భార్యాభర్తలిరువురూ ప్రేమించుకోవడంతోపాటు ఒకరికొకరు వారిలో వున్న ప్రతిభను గుర్తించి, ఆ ప్రతిభ పెంపొందెలా చూసుకోవాలిగానీ, అణచి వేయడానికి ప్రయత్నిస్తే ఎలా? కొన్ని సందర్భాలలో, వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి, అలా ఆ ప్రతిభను అణచివేయాలనుకున్నప్పుడు, ఆత్మాభిమానం దెబ్బతిని, ఎదురుతిరగడం జరుగుతుంది. దాంతో పంతాలూ, పట్టింపులూ పెరుగుతాయి అవి మరీ పెరిగిపోతే, విడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పురుషులు స్త్రీలకు ఈ నిబంధనలు ఎక్కువ పెడతారు. పెళ్ళికాగానే ఆమె మనస్తత్వాన్ని ఏ మాత్రం ప్రదర్శించకూడదు. ఒక దాసీదానిలాగ, అతడు చెప్పే ప్రతి మాటకి తలూపుతూ నటించే గంగిరెద్దులా పడుండాలేతప్ప, తన స్వతంత్ర భావాలు ప్రకటించకూడదు. పురుషుడి ఆదిక్యతను అలవాటు పడిపోయింది మన సమాజం. స్త్లీలోని ఈ స్వతంత్రభావాలు హర్షించడంలేదు కనీసం సాటి స్త్రీలు కూడా. ఎవరికివారు బాధపడతారేతప్ప. సానుభూతి కోరుతారేతప్ప అది వారి న్యాయమైన హక్కు అని అడగడానికి ముందుకు రారు!" అని ఉపన్యాసంలా నేను, చెప్పుకుపోతున్నా శిల్పకి అర్థమౌతోంది. "రాగిణి! శిల్పాకి వయస్సుకు మించిన జ్ఞానం భగవంతుడు ప్రసాదించాడు.
"చూడమ్మా! శివుడూ, పార్వతీ మనకి దేముళ్ళు కదా! ఇద్దరినీ సమానంగా మనం పూజిస్తున్నాం కదా! మరి శివుడు పార్వతిని తనతో సమానంగా నాట్యం చెయ్యడానికి ఒప్పుకోలేదూ? పార్వతిని నువ్వు నాట్యం చెయ్యకు అని శాసించలేదే! ఆదిశక్తిగా ఆమెని గౌరవించాడు. తన శరీరంలో సగభాగం ఆమెకిచ్చాడు. అంటే ఏమిటి? శరీరాన్ని రెండు ముక్కలు చేసి, ఆమెకి ఒక ముక్కని ఇవ్వడమా? కాదు! ఆమెకి తనతోపాటు, సమానస్థానాన్ని అంటే స్టేటస్ ని కల్పించడమన్నమాట. ఆనందతాండవం, శివపార్వతులిద్దరూ కలిసి ఆడతారు పాడతారు. అది చూసైనా, మన మగవారు, ఆడవాళ్ళకి సమానస్థానం కల్పించడం నేర్చుకోలేదు. పౌరాణిక కధల్లోగానీ, ఏ నీతి కథల్లో గానీ, పురుషుడు తనకి కావలసిన దాన్ని మాత్రం ఏరుకొని దాన్ని రూలుగా పెట్టుకొని రాజ్యం చేశాడు. స్త్రీలు తమ హక్కులని తాము గుర్తించలేనంత గుడ్డిగా పురుషుడి చేతిలో కీలుబొమ్మగా బతుకుతూ వచ్చారు.
ఇప్పుడిప్పుడు విదేశీయులూ, వారి ప్రభావంవల్ల మనదేశంలో కొందరు మహిళామణులూ దెబ్బలాడి స్త్రీలకోసం హక్కులకై ఆందోళన చేస్తున్నారు. మన శాస్త్రంలో ఎప్పుడో వున్నాయి. స్త్రీలే వాటిని ఉపయోగించుకోలేదు! స్త్రీ స్వాతంత్ర్యం అంటే స్త్రీలు పురుషుడికి ఎదురు తిరగడం కాదు. స్త్రీ విచ్చలవడిగా భర్తనీ, పిల్లలనీ, ఇంట్లో వారిని లెక్కచెయ్యకుండా తిరగడం అసలేకాదు. ఇంటిని గాలికొదిలేసి, వేదికలెక్కి ఉపన్యాసాలిస్తూ ఊరినుద్దరిస్తున్నామనుకోవడం అంతకంటే కాదు. కొన్ని కొన్ని పత్రికలలో చూసినకార్టూన్ల లాగా "నేను ఆఫీసుకి పోతున్నాను, మీరు వంట చెయ్యండి" అని ఆమె వెళ్ళిపోవడం. అతను గరిటతిప్పడం కాదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిలోని శక్తిని మరొకరు గుర్తించుకుంటూ, వాటికోసం ఇరువురూ కలిసి పనిచెయ్యడం, ఇరువురూ స్నేహితుల్లా సమభావాలతో మెలగడం! ఈ విషయాన్ని మగవాళ్ళు పూర్తిగా చక్కగా అర్థం చేసుకున్న రోజున ఆలుమగల మధ్య హెచ్చుతగ్గూ తేడాలుండవు. అసలు సంసారంలోనే కాదు, సమసమాజ నిర్మాణానికీ ఇదే సూత్రం అవసరం" అలానేను చెప్పుకుపోతున్న ఉపన్యాసంలోని ప్రతి అక్షరం ఎంతో శ్రద్ధతో వింది శిల్ప. నువ్వు నమ్ముతావో లేదోగానీ, నేను చెప్పినవి చెప్పినట్టుగా ఆ పిల్ల తన నోటు బుక్కులో ఈ మాటలు రాసుకుని నాకు చూపించింది. ఆశ్చర్యపోయాను. నీ కూతురు పెద్దదయితే ఏమవుతుందో కాని, దాని ఆలోచనలూ, మాటలూ, అదివేసే ప్రశ్నలూ, దాని వయస్సుకి కనీసం ఒక పది సంవత్సరాలైనా మించి ఉంటాయి.
శిల్ప డైరీలో ఒకచోట రాసుకుంది. పొరపాటున అది నేను చూడడం జరిగింది. "శివుడూ-పార్వతీ" ఉదాహరణ కోటయ్య తాతగారు చెప్పింది, నాకు చాలా నచ్చింది. అందులో ఎంతో నిజం వుంది. "కళాకారులకి, వారి కళే వారికి జీవం! అది లేని రోజున వారి జీవితాలు, గాలి తీసేసిన బెలూన్లలా ముడుచుకుపోతాయి!" ఇది సత్యం. ఇలా రాసుకున్న ఎన్నో మాటలు చూశాను.
రాగిణీ! ఏదో ఒక రోజున శిల్ప తప్పకుండా మారుతుంది. నిన్ను చేరుకుని, నీ కౌగిట్లో తనివితీరా కబుర్లు చెబుతూ నిన్ను మురిపిస్తుంది. శిల్పలాంటి తెలివైన బిడ్డని కన్న నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. భగవంతుడు నీకోరిక తప్పక తీరుస్తారు."
ఆ ఉత్తరం చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చింది రాగిణి దుఃఖం కాదు ఈసారి ఆనందబాష్పాలూ వున్నాయి ఆ కన్నీళ్లలో. ఎన్నిసార్లు చదివిందో, ఆ వుత్తరం, భద్రంగా అలమారలో పెట్టి తాళం వేసింది. అంతేకాదు! సిస్టర్ ఫెర్నాండిస్ కి కూడా ఆ వుత్తరం, చదివి వినిపించి, మురిసిపోయింది.
సెలవులయిపోయాయి! శిల్పా అవినాష్ లు ఊటీకి తిరిగొచ్చారు.
సిస్టర్ ఫెర్నాండిస్ శిల్ప చేతికి ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చింది! "మీ అమ్మ ఎవరిచేతో ఇది నీకివ్వమని చెప్పి పంపించింది" అంది.
"మా అమ్మ పంపించిందా?"
"ఊ......."
"ఎక్కడుంది ఆమె?"
"తెలీదు!"
"సిస్టర్ ఎవరొచ్చి ఇచ్చారు?"
"తెలీదు! ఇచ్చేసి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు." శిల్ప పార్సిలు తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. పార్శిల్ విప్పి చూసింది. చక్కటి డిజైన్లలో కుట్టిన డ్రెస్సులు, మిడ్డీలూ, షెల్ వారు సూట్సూ ఒక ఆరు, చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన చేతిరుమాళ్ళు ఒక పన్నెండు, రంగు రంగుల జడపిన్నులూ వున్నాయందులో! డ్రెస్సులు ఎంతో బాగున్నాయి. మొదటిసారిగా శిల్పకళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అవన్నీ అవినాష్ కి చూపించింది.
