తన సీటు వెతుక్కుంటూ వెళ్ళి, తన 'బర్తు' మీద సామాన్లుపెట్టి, కిటికీలో నుంచి మాట్లాడుతూ వుంది కావ్య!
"ముందు సామాన్లు సర్దుకోమ్మా. అన్నీ బెర్తుకింద పెట్టేసేయ్! అదేమిటీ ? ఎవరి సామానూ ?" అడిగాడు క్రాంతి.
కావ్య తిరిగి చూసింది "ఏదో మూట! ఎవరో పెట్టినట్టున్నారు. రైలు కదిలాక సర్దుకుంటాం అన్నయ్యా!నువ్వేమీ కంగారుపడకు" అంది.
"కావ్యా! నేనిచ్చిన అడ్రసు వుందా ? నా ఫ్రెండ్ వినోద్ వాళ్ళ ఫ్రెండుది! వాళ్ళని కలుసుకో! తప్పకుండా వాళ్ళు నీకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు లోకల్ గా ఏ సహాయం కావాలన్నా చేస్తారు."
"అలాగే అన్నయ్యా! ఉత్తరాలు రాస్తూ వుండు" అంది.
ఇంకా టైముందీ అని రైలు దిగబోతూ.
"కూ...." అంటూ, పెద్దగా కూతపెట్టింది రైలు.
నేల ఈనినట్టున్న, ఆ జన సందోహాన్ని చీల్చుకుంటు బ్రహ్మ రాక్షసిలా పెట్టిన రైలు కేకకి, ప్రతివాళ్లూ 'అటెంషన్' లో కొచ్చారు. గబగబా ప్లాట్ ఫారంమీదున్న ప్రయాణీకులందరూ రైలేక్కేశారు. ప్రయాణం చేస్తున్నవారి పక్కన కూర్చుని కబుర్లు చెబుతూన్న వారందరూ బిలబిల మంటూ రైలు దిగిపోయారు. రైలు మరో కూత కూసింది. కొద్ది క్షణాలలో "చుకు....చుకు....చుకు" మంటూ, ప్రయాణీకుల గుండెల్లా కొట్టుకుంటూ, ఎందరినో కలుపుతూ, మరెందరినో విడదీస్తూ కదిలింది రైలు, సాగనంపడానికొచ్చిన వారి గుండెల్లో బాధని నింపుతూ.
రైలు వేగం హెచ్చి, కనుమరుగయ్యేదాకా, చెయ్యూపుతూనే వుంది కావ్య.
మెల్లగా వొచ్చి తన సీట్లో కూర్చోబోయింది.
'క్యారు' మని ఏడుపు వినిపించింది.
ఆశ్చర్యంగా చూసింది కావ్య! 'ఆ ఏడుపు ఎక్కడి నుంచొస్తోందా' అని అటూ ఇటూ చూసింది. మళ్ళీ వినిపించింది ఏడుపు. అది ఆ మూట లోంచే ఒస్తోంది. మెల్లగా చూసింది.
తెల్ల గౌనులో, నోట్లో వేలేసుకుని మిటుకు మిటుకు చూస్తున్న పసిపాప! రెండు మూడు నెలల పిల్లలా వుంది! నల్లని జుట్టు, పచ్చని శరీరం! మూటలో సరిగ్గా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూన్న పసిపాప!
"ఎవరిదీ పాప ?" అంది కావ్య అక్కడున్నవాళ్ళని.
"బాగుంది. నీ సీట్లో నీ పక్కనున్న పాపని చూస్తూ, మమ్మల్నడుగుతావేంటి ?" అందొకావిడ.
"అయినా బట్టలో అలా చుట్టేస్తారా ? ఊపిరాడ్డంలేదు బేబీకి!" అన్నాడొకాయన.
"ఇంకానయం! వస్తువనుకుని కింద పెట్టెయ్యలేదు." అందింకొకావిడ.
కావ్యకి మతిపోయింది. నోట మాట రాలేదు. చూస్తూ నుంచుండి పోయింది. ఆ పిల్ల క్యారుమన్న శబ్దం కూడా వినబడ్డంలేదు. ఉక్కిరిబిక్కిరై పోతోంది.
"ఎత్తుకోమ్మా! ఏమిటా పరధ్యానం ?" మందలించారెవరో!
"ఈ పాప ఎవరో నాకు తెలీదు...." అక్షరాలు కూడబలుక్కుని మెల్లగా అంది కావ్య.
"బలేదానివే! ఇదేం బుద్దమ్మా ? వాళ్ళతో మాట్లాడుతూన్నంత సేపూ, ఈ పిల్ల ఇక్కడే వుంది. రైలు కదిలాక, ఈ పిల్ల నాది కాదంటావా ? అసలు నువ్వు ఆడదానివేనా ?"
"కలికాలం ! కన్నబిడ్డనే నా బిడ్డ కాదని తల్లి వారించే రోజులొచ్చాయి."
"పెళ్ళి పెటాకులూ కాకుండా కనిపారేసుంటుంది ? తప్పించుకోవడానికిదొక మార్గం."
"పుట్టగానే ఎవరికైనా ఇచ్చెయ్యొచ్చుగా! పిల్లల్లేని వాళ్ళెవరైనా, నిక్షేపంగా పెంచుకునుండేవారు."
ఆ పిల్ల క్యారు క్యారు మంటోంది. ఆ గుడ్డలో ఊపిరాడక చుట్టుకు పోతోంది. అది చూళ్ళేక ఆ గుడ్డల్ని పాప మొహంమీంచి తీసింది.
అప్పటికే నానామాటలూ అంటూ అక్కడ పోగయిన జనం, బలవంతంగా ఆ పిల్లని కావ్యచేతిలో పెట్టారు.
"ఇంకెప్పుడూ అలా వొదిలేసే ప్రయత్నం చెయ్యొద్దు" అంటూ బుద్ధి చెప్పారు.
కావ్యకి బుర్ర పనిచెయ్యడం లేదు! అసలు ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలీలేదు. తను చెప్పేదేదీ వాళ్ళు నమ్మే స్థితిలో లేరు! పైగా మంగళసూత్రాలు, మట్టెలూలాంటి పెళ్ళయిన చిహ్నాలేమీ ఆమెలో కనబడక పోవడం, ఆమెని ఒక పెళ్ళికాని తల్లిగా ఊహించుకున్నారు.
అప్పుడేం చెప్పినా అల్లరి పాలవడంతప్ప, లాభం లేదనుకుంది కావ్య! అన్నీ వింటూ, భరిస్తూ ఆ పాపని తన వొళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది, కొయ్యబారిపోయి !
18
రైల్లో జరుగుతూన్న ఈ గొడవనంతా గమనిస్తున్న ఇద్దరు మొగాళ్ళు లేచొచ్చి కావ్యని చూసి "అమ్మా! ఏమీ అనుకోవద్దు. ఆ పాప మా పాపే! నా మనమరాలు! వీడి కూతురు! రైలు కదిలే సమయానికి మేము కాఫీ తాగుతూ ప్లాట్ ఫారమ్ మీద వుండిపోయాం. అందుకని పక్క కంపార్ట్ మెంట్ లో కెళ్ళిపోయాం. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడి కొచ్చేసరికి ఇంతసేపు పట్టింది" అన్నాడు ఇద్దరిలో కొంచెం వయసు మళ్ళినాయన.
కావ్య వాళ్ళ కేసి చూసింది .ఎక్కడా వాళ్ళ మొహాలలో ఆదూర్దా గానీ, పాపని ఒదిలేసి ఎక్కడో ఎక్కినందుకు ఆందోళనగానీ కనిపించలేదు. కావ్యకి అనుమానం ఒచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా ఈ పాపకి తాతా, తండ్రులు కారు. అదివరకే ఈ పాపని ఎక్కడినుంచయినా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టిన బాపతయి వుండాలి. లేదా ఇప్పుడిక్కడ జరిగిన సంఘటన చూసి కొత్త ఆలోచనలొచ్చి, ఒక ఎత్తుతో వొచ్చుండాలి! తీసుకుపోయి ఏ వ్యభిచార గృహాలకైనా అమ్ముకుంటే ?
"ఆమ్మా! మా పాపని మాకిచ్చెయ్యండి. ఇంతసేపూ మీకు ఇబ్బంది కలిగినందుకు మమ్మల్ని క్షమించండి" అంటూ దండాలు పెట్టారు.
పాప ఏడుపు లంకించుకుంది. ఆకలేస్తోందో ఏమో !
ఉలిక్కిపడింది కావ్య! "ఓ....ఓ....ఓ...." అంటూ ఓదార్చింది పాపని అనుకోకుండానే !
"మా పాపని మా కిచ్చెయ్యండి మా బాధ మేం పడతాం" అన్నారు వాళ్ళు !
అందరూ వింతగా వీళ్ళనే చూస్తున్నారు. కావ్యకి మతిపోతున్నట్టని పించింది. పాప గట్టిగా ఏడుస్తోంది.
"ఈ పాప నా పాప! మీరెవరు?" అంటూ గద్దించింది, ధైర్యానంతా కూడగట్టుకుని కావ్య !
అందరూ ఆశ్చర్యబోతూ వీళ్ళవంకే చూస్తున్నారు.
"మీ పాపయితే ఈ పిల్ల తల్లేది ?" అంది.
"ఆమెకి ఒంట్లో బాగులేదు. వూర్లోనే వుంది."
"ఇంత చంటిపిల్లని ,తల్లి నుండి వేరుచేసి ఎందుకు తీసుకెళుతున్నారూ? ఎక్కడికి తీసుకెళుతున్నారు ?" దబాయించింది.
"అది మా ఇష్టం! నువ్వెవరివి అడగడానికి ?" అతనూ దబాయిస్తూనే అన్నాడు.
"నేను ఎవరినా ? ఈ బిడ్డని కన్నతల్లిని!" అప్రయత్నంగానే అనేసింది కావ్య!
పాప ఏడుపు ఎక్కువై పోతూ వుంది. "ఓ....ఓ...." అంటూ ఊరుకో బెడుతూనే వుంది కావ్య!
"ఏమ్మా ? ఇందాకేమో ఈ పాపెవరో నీకు తెలీనే తెలీదన్నావ్! ఇప్పుడేమో ఈ పాప నాకన్న బిడ్డ అంటున్నావ్ ? ఇందులో ఏది నిజం ?" అడిగిందొకావిడ.
"పాపకి ఆకలేస్తోంది. మీ దగ్గర పాలడబ్బాలూ పాలసీసా వుందా?" ఆ పెద్దమనుషులని అడిగింది కావ్య.
"లేవు !"
"తల్లిని ఒదిలేసి వొచ్చామంటున్నారు. పాలసీసాలూ, పాలడబ్బా లేకుండా వొచ్చారు. ఏడిస్తే ఏం చేద్దామనుకున్నారూ ?"
ఇద్దరూ ఒకళ్ళ మొహాలొకరు చూసుకున్నారు." పాలుకొని తాగిద్దామనుకున్నాం !"
"దేంతోటీ ? గ్లాసుతోటా ?"
ఇద్దరూ కంగారుపడ్డారు. అందరూ ఈ వింత సంఘటనని ఆదూర్దాగా చూస్తూ వున్నారు.
కావ్య బుర్రలో ఆలోచన తళుక్కున మెరిసింది .వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి! ఎత్తుకు పైఎత్తు వేస్తేనేగానీ, ఈ పసిపాప వాళ్ళబారి నుండి రక్షించబడదు.
పాప గుక్కపెట్టి ఏడుపు లంకించుకుంది.
కావ్య పైటకొంగు మెడచుట్టూ కప్పుకుని, జాకెట్టు గుండీలు విప్పదీసి రొమ్ము పాప నోటి కందించింది!
పాప ఏడుపు ఠక్కున మానేసింది!
కావ్య అందరివైపూ చూసింది. "ఒప్పుకుంటారా ఇప్పటికైనా ఈమె నా బిడ్డేనని ?" అన్నట్టున్నాయి ఆమె చూపులు.
"చైన్ లాగండి! వీళ్ళని పోలీసులు కప్పగించాలి!" అంటూ కొందరు తిరగబడ్డారు వాళ్ళమీదికి.
ఆ గొడవలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేలోగా, మెల్లగా జారుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ !
రైలాగింది. రైలు మొత్తం గాలించారు అందరూ తరవాత స్టేషన్లో! ఎక్కడా వాళ్ళజాడ కనిపించలేదు.
కావ్య గబగబా రైలుదిగి స్టేషన్లో ఒకకప్పు పాలుకొంది. పక్కనే జనరల్ షాపులో రెండు గ్లాసులూ, రెండు స్పూన్లూ కొంది. పాలు కొంచెం కొంచెం చెంచాతో ఆ పాప నోట్లో పోసింది !
