"వీలైతే చూస్తాను?" అని లేచింది సుధ. నడుస్తూ అనుకొంది. ఈ పల్లెటూళ్లలో దరిద్రం ఎందుకిలాతిష్టవేసిందో అర్దమౌతుంది! మనుషుల్లో స్థబ్దత గూడు కట్టుకుంది. "కొంచెం మంచిగా బ్రతుకుదాం!" అన్న ఆశలేదు. జీవితం ఇంతకంటే వేరే వుంటుందని, ఉండాలనీ అనుకోవడంలేదు. ధైర్యం చేసి ఓ క్రొత్త పని ప్రారంభించలేరు. అవకాశం వాళ్ల దగ్గరికి రావాలే తప్ప వీళ్ళు అవకాశం వెతుకుతూ వెళ్లరు. దీనికంతటికీ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి మూలం చదువు రాకపోవడం ఎన్ని అనియత విద్యా కేంద్రాలు, ఎన్ని వయోజన కేంద్రాలు పెడితే ఈ ఆవిద్య, ప్రజలనుండి, ముఖ్యంగా ఈ మారుమూల పల్లెలనుండి తరిమివేయబడుతుంది?
ఆలోచనలో మునిగి నడుస్తున్న సుధ, వెనక్కి పడబోయింది. పదహారు, పదిహేడేళ్ళు వయసుండే ఓ అబ్బాయి ఇచ్చిన డాష్ కు.
అతడు సడెన్ గా ఆగిపోయి, "అయ్యబాబోయ్! దండాలమ్మా? చూసుకోలేదు! ఆడ జొన్నచేల్లో సుజాతమ్మను సంపేసిన్రు! ఊళ్ల ఆ కబురందించేటందుకు పోతున్న, ఆత్రంలో చూసుకోలేదు" అన్నాడు రొప్పుతూ.
"సుజాతను చంపేశారా? అంటే అంగన్ వాడీ వర్కరేనా?"
"అవును!" ఆగి వివరంగా చెప్పే స్థితిలో లేడతను. ఈ కబురు ఊళ్లో అందించే తొందరలో దూసుకుపోయాడు బాణంలా.
హత్యగావింపబడేంత వైరం ఎవరితోతెచ్చుకుంది సుజాత? ఎందుకు తెచ్చుకుంది? తనకు తెలిసి వున్నంత వరకు సుజాత మంచిపిల్ల. నెమ్మదైంది. ఆర్దిక దుస్థితే ఆమెకా వినయం నేర్పి వుంటుంది! అలాంటి పిల్ల ప్రామాలకు ముప్పు తెచ్చుకొనే పనేం చేసింది?
జొన్నచేల్లో ఎక్కడ పడిందో చెప్పలేదతడు.
ముందుకూ ప్రక్కలకూ చూస్తూ నడుస్తూంది సుధ.
ఆమె ఎక్కువ శ్రమపడ నక్కరలేకపోయింది.
కాలిబాటకు దగ్గరలోనే సుజాత కనిపించింది.
వంద పిడుగులు పడ్డట్టుగా మ్రాన్పడిపోయింది సుధ. భయంతో జలదరించిపోయింది. కమ్ముకు వస్తూన్న ఆ మసకచీకట్లో శవాన్ని చూసి కాదు. సుజాత పడున్న స్థితిచూసి. ఆ పిల్ల ఒంటిమీద ఒక్క నూలుపోగులేదు. నగ్నంగా వెల్లికిలా పడుంది! కళ్లు మూతలుపడి వున్నాయి.
సుధ చూడలేనట్టుగా కళ్లు త్రిప్పుకొని ఆ పిల్ల బట్టలకోసం చూసింది కొంచెం దూరంలో చీర కనిపించింది. గబుక్కున పట్టుకువచ్చి ఆ పిల్ల గుండెలవరకూ కప్పింది సుధ.
సుజాత ఏదైతే ఊహించి భయపడిందో అదే జరిగిందన్నమాట. చాలా అమానుషంగా ఆ పిల్లమీద అత్యాచారం జరిగింది. జరగడానికి ముందు హోరాహోరీ యుద్దం జరిగినట్లుగా ఆ ప్రాంతంలో జొన్నపైరు నడుములు విరిగిపోయి, కాళ్లుక్రింద నలిగిపోయి కనిపిస్తూంది.
సుజాత జీతంతో కాస్త గంజినీళ్లయినా తాగుతున్న ఆ కుటుంబం ఇప్పుడు ఏమైపోతుంది.
ఆడపిల్లను ఉద్యోగాలకు పంపిస్తే ఇలాంటి ప్రమాదం వుంటుందనే చాలామంది తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తుంటారు. ఈ సంఘటన వాళ్ల భయాలకి ఊపిరి పోస్తుంది కదూ.
జీవితంలో ఏదీ అనుభవించకుండా మొగ్గలోనే త్రుంచివేయబడింది. ఒక చేదు అనుభవంతో ఆ పిల్లనిండు జీవితం ముగిసింది. సుధ కళ్లు చెమ్మగిల్లాయి.
పది పన్నెండు నిమిషాలు గడిచాయో లేదో ఊళ్లోనుండి జనం పరుగెత్తుకొచ్చారు. గట్లు త్రెంచుకొన్న ప్రవాహంలా వచ్చేశారు. సుజాత చుట్టూ మూగారు.
కడుపులోంచి కదలివస్తూన్న దుఃఖంతో తల్లి సుజాతమీద పడబోయింది.
ఊరి పోలీస్ పటేల్ ఆమెను వెనక్కిలాగాడు. "పంచనామా జరగాలి అంతవరకూ ఎవరూ శవాన్ని తాకటానికి వీల్లేదు."
ప్రక్కవూరు పోలీస్ స్టేషన్ కి మనిషిని పంపబోతున్నాడు పటేల్
అంతలో వినబడింది చిన్న మూలుగు.
ఎక్కడో నూతిలోనుండి వస్తూన్నట్టుగా వినిపించింది తరువాత చిన్న కదలికతో ఆ మూలుగు వస్తూన్నది సుజాతనుండని తెలిసింది.
ఒక ఉదుటున సమీపించింది సుధ గుండెలమీదా ముక్కు దగ్గరా వేళ్లుంచి చూసింది. "థాంక్ గాడ్! సుజాత బ్రతికేవుంది" ఆనందంతో అరిచినట్టుగా అంది తరువాత ఆమె భుజాలమీదా, చెంపలమీదా తట్టి" సుజాతా! సుజాతా! అని పిలిచింది.
