"కష్టమో, నష్టమో శ్రీశ్రీగారు పిక్చర్ తీస్తే మాత్రం ఆగిపోదు. పూర్తిచేస్తారు" అని ఓ మంచి పేరుంది. మనం ఆ పేరుతోనే స్వంత పిక్చర్లు తియ్యాలనే ఉద్దేశం నుండి విరమించుకుందాం. మన ఇద్దరిదీ బిజినెస్ మైండ్ కాదు. ఉన్న ఈ రెండిళ్ళూ దక్కించుకొని, వచ్చిన పిక్చర్లు చూసుకుంటూ, ఉన్న దాంతో హాయిగా వుందాం" అన్నాను. ఆయన ఏం మాట్లాడలేదు.
* * * *
మా అబ్బాయికి కన్నతల్లి నన్న పేరేగానీ నెల పిల్లాడి నుండీ మా పెద్దావిడ(రవణమ్మగారు)దగ్గరే పెరుగుతూ వచ్చాడు. వాడంటే ఆవిడకి విపరీతమైన ప్రేమ. మా పిల్లలంతా ఆవిడ్ని ఆ ఇంటి అమ్మ అని పిలిచేవారు.
1966 వ సంవత్సరంలో మా ఆఖరి పాప కడుపున పడింది. 'ఇక్కడితో పుట్టిన పిల్లలు చాల'ని ఆపరేషన్ చేయించేసుకున్నాను.
ప్రసవమైన మూడో రోజున ఆపరేషన్ అయిన తర్వాత చాలా సీరియస్ అయిపోయింది. జన్ని (సంధి) కమ్మేసింది. నేను బ్రతకడం కష్టం అనేశారు. ఒంటిమీద తెలివి లేకుండా 'ఏవండీ' అని అరుస్తూ శ్రీశ్రీగారిని పట్టుకొని వదలలేదట.
దాంతో ఆయనకి మతిపోయి, ఎలాగో నన్ను వదిలించుకొని, ఒక టేక్సీలో బయలుదేరి తనకి తెలిసిన ప్రతి కంపెనీకి వెళ్ళి_"సరోజ చచ్చిపోతోంది, సరోజ నాకికలేదు. నా సరోజ చచ్చిపోతోంద"ని చెప్పారుట. ఆ రోజు టేక్సీకే అయిదువందల రూపాయలు చెల్లించారంటే_ఎన్నిచోట్లకి, ఎన్ని కంపెనీలకి వెళ్ళారో ఆలోచించండి.
ఉదయం పదకొండు గంటలకి బయలుదేరిన మనిషి మధ్యాహ్నం మూడు గంటలకి తిండయినా తినకుండా హాస్పిటల్ కి చేరుకునేసరికి, "ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రపుచ్చేశామ"ని చెప్పారట. అలాగే నా పక్కన పది నిముషాలు కూర్చొని 'మళ్ళీ వస్తానని' వెళ్ళిపోయారట.
ఈ మాట మా పెద్దావిడకి తెలిసి నన్ను చూడడానికి మర్నాడు హాస్పిటల్ కు వచ్చారు. అప్పుడు నేను మామూలు స్థితిలో వున్నాను.
నా దగ్గర ఆవిడ ఓ గంటసేపు వుండి, "మరేం భయపడకు, ముందు నీ ఆరోగ్యం చూసుకో. బైజు నా దగ్గరే వుంటాడు. వాడి గురించి బెంగ పెట్టుకోకు. నేను వచ్చి నిన్ను చూస్తూ వుంటాలే" అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు.
నాలుగోరోజంతా శ్రీశ్రీగారు నా దగ్గరే వున్నారు. చనిపోవలసిన నన్ను బ్రతికించుకుంది కనుక మా ఆఖరి పాప అంటే మా ఇద్దరికీ యిష్టం. అందులో నిజం లేకపోలేదు. అసలు నేను బ్రతకడానికి అవకాశాలే లేవు. అది పాప అదృష్టమనే ఇప్పటికీ నా అభిప్రాయం.
పాప మాట మీద శ్రీశ్రీగారికి భలే నమ్మకం. వీధిలోకి వెళ్ళేముందు, "పాపీ! (దాన్ని ఆయన 'పాపి' అని పిలిచేవారు) ఇవాళ డబ్బులొస్తాయా చెప్పు" అని అడిగేవారు.
దాని మూడ్ బాగుంటే, రెండు చేతులు చాచి, "ఇవాళ ఇంత...డబ్బు వస్తుంది అప్పా" అని అనేది.
అలాగే...నాలుగువేలూ, మూడువేలు తక్కువ లేకుండా తెచ్చేవారాయన. దాంతో చెప్పకుండా మాత్రం వీధిలోకి వెళ్ళేవారు కారు.
షష్టిపూర్తి సన్మానం
"ఏవండీ. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చెయ్యాలండీ" అన్నాను.
"అదేమిటి సరోజా. మరీ చిన్నపిల్లలు వీళ్ళు. అయిదేళ్ళయినా రాకుండా స్కూలా?" అని తిట్టారు.
"మీరేమనండీ_వాళ్ళని జాయిన్ చెయ్యాల్సిందే" అని మొండికేశాను.
పెద్దమ్మాయిని, చిన్నమ్మాయిని మూడవఏడు రాకుండానే 'బోస్ సర్కిల్స్ కాన్వెంట్'లో ఇంగ్లీషు మీడియమ్ లో జాయిన్ చేసేశాం.
సాధారణంగా అందరు పిల్లలూ స్కూల్లో ఏడుస్తారు. మా వాళ్ళు అందరూ హేళన చేస్తారన్న భయమో ఏమో. ఇంటికి వచ్చి ఏడ్చేవాళ్ళు.
"అప్పా! మేమిక స్కూలుకి వెళ్ళం అప్పా!" అని వాళ్ళు గొడవపెడితే, "పోనీలేవే! పిల్లలు బి.ఏ. చదువుతున్నారా? ఎమ్మే చదువుతున్నారా? ఓ రెండు రోజులు స్కూలు మానేసి ఇంట్లో నా దగ్గరే వుంటారులేవే" అని అనేవారాయన.
"నాదెలాగూ అత్తెసరు చదువే. నా పిల్లలయినా పెద్ద చదువులు చదవాలి. ఇప్పుడు కరెక్టుగా వుంటేనే రేపు బి.ఏ. ఎమ్మేలకి వెళతారని అనేదాన్ని.
వాళ్ళని స్కూలుకి పంపే విషయంలో రోజూ ఇద్దరికీ పేచీ వచ్చేది.
పిల్లలు స్కూలుకి వెళ్ళిరావడానికి ఓ రిక్షా కొన్నారు. ముట్టు అని ఓ రిక్షా డ్రైవర్ని పెట్టారు. అతనికి ఆ రోజుల్లో నెలకి డెబ్బయ్యయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఆ రిక్షా కేవలం పిల్లల కోసమే.
ఒకరోజు శ్రీశ్రీగారు నాతో "సరోజా! పిల్లల్ని స్కూలుకి కారులో పంపితే సరిపోదూ!" అన్నారు.
"మరి మనం స్టూడియోలకి వెళ్ళడంమాట?" అని అడిగాను.
"మనం టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుందాం" అన్నారు.
"వద్దండి. ఈ సినిమా టైమ్ దేనికీ సరిపోదు. అదో ప్రపంచం. పిల్లలకి డిస్ట్రబెన్స్ లేకుండా వాళ్ళమానాన వాళ్ళు పోయి వస్తూంటారు" అన్నాను.
ప్రతి శని ఆదివారాలు పిల్లల్ని తీసుకొని కార్లో మెరీనాబీచ్ కి వెళ్ళేవారు. తొంభైపాళ్ళూ నేనూ వెళ్ళేదాన్ని. పని వుండి నేను వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చుగానీ ఆయనమాత్రం పిల్లలు పెద్దవాళ్ళయ్యేవరకూ ఆ అలవాటు తప్పించలేదు. ఇంతలో షష్టిపూర్తికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖపట్నం నుండి ఉత్తరం వచ్చింది. రెండురోజులు ముందుగానే విశాఖ వచ్చెయ్యమని కూడా రాశారందులో.
