పద్మవ్యూహం
రాత్రి ఎనిమిదిన్నర అవుతుంటే పరుగులాంటి నడక తో యింట్లో అడుగు పెడ్తూ చెప్పులైనా సరిగా వదలకుండా వంటింట్లోకి పరిగెత్తింది జయలక్ష్మీ. డ్రాయింగు రూమ్ లో కూర్చుని టి.వి చూస్తున్న మామగారిని చూసి "సారీ మామయ్యగారూ , ఆలస్యం అయిపొయిందివాళ. పది నిమిషాల్లో పెట్టేస్తాను ఫలహారం" అంది అపాలజిక్ గా.
"ఫరవాలేదమ్మా' అన్నాడాయన - తల్లిని చూసి చేతులు చాపుతూ మొహం అంతా నవ్వు చేసుకుని చేతులందిస్తున్న కూతురి తల నిమిరి వంటింట్లోకి దూరి కుక్కరులో నాలుగు యిడ్లీలుపెట్టింది. ఫ్రిజ్ తీసి పచ్చడి బయట పెట్టి , ఉదయం వంటంతా వేడి చేయసాగింది. తల్లిని చూసి టి.వి. చూస్తున్న ఐదేళ్ళ బాబు పరుగెత్తి వచ్చి తల్లి నడుం వాటేసుకున్నాడు. 'ఆకలేస్తుందా నాన్నా ఒక్క పదినిమిషాలు అగు, తాతగారికి టిఫిన్ పెట్టేసి నీకు అన్నం పెడతాను. హోం వర్క్ చేసేశావా. రేపెదన్నా యూనిట్ టెస్ట్ ఉందా. పుస్తకాలన్నీ బ్యాగ్ లో సర్దేశావా లేదా" కొడుకుతో మాట్లాడుతూనే ఇడ్డెన్లు తీసి ప్లేటులో పెట్టి నెయ్యి పచ్చడి మంచినీళ్ళ గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెట్టి 'రండి మమ్మయ్యా ఫలహారం పెట్టాను' అంది దగ్గరికి వెళ్లి వాకర్ కర్ర చేతికి అందించి, అయన అది పట్టుకుని అతి కష్టం మీద లేచి ఒక కాలు యిడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు.
"రాహుల్ చారు వేడి చేస్తున్నాను , ఒక్క నిమిషం , బాత్ రూమ్ కెళ్ళి బట్టలు మార్చుకు వచ్చి భోజనం పెట్టేస్తాను. ఏం' అంది లాలనగా. ఏడాది కూతురు మళ్ళీ తల్లిని చూసి చేతులందించింది. 'వస్తానే తల్లీ , ఒక్క నిమిషం వుండూ బయట బట్టలు మార్చి వస్తాను' అంటూనే తువ్వాలు పట్టుకుని బాత్ రూమ్ లో దూరి రెండు చెంబులు దిమ్మరించుకుని నైట్ గౌను తొడుక్కుని వచ్చింది. జుత్తు పైపైన దువ్వుకుని, బొట్టుబిళ్ళ తగిలించుకుని పనమ్మాయి చేతిలోంచి పాపను అందుకుంది. ఏడాది పాప ఆబగా తల్లి మెడ కరుచుకుపోయింది. కూతుర్ని ముద్దులు పెట్టుకుంటూ ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది. వంటి చేత్తోనే పటకారతో వంట గిన్నెలన్నీ తెచ్చి టేబిల్ మీద పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్ లో పనమ్మాయి పడేసిన అన్నం గిన్నె పట్టుకుని వచ్చింది. కంచంలో వేడి అన్నం, పప్పు నెయ్యి వేసి మెత్తగా కలిపి 'నాన్నా రాహుల్ రా' అంది. కూతుర్నేత్తుకుని కుర్చీలో కూర్చుని కొడుక్కి అన్నం తినిపిస్తూ స్కూలు విశేషాలు , హోంవర్కు వివరాలు అడిగింది.
'మామయ్యా హోంవర్కు చేశాడా వీడు' అంది. అయన తలూపి నవ్వాడు మనవడి వంక చూసి 'వీడికింకా చదువు మీద ధ్యాస లేదమ్మా. చదివేది ఒకటో క్లాసు, అయినా బోలెడు పుస్తకాలు, హోం వర్కులు- ఓ అరగంట కూర్చునే సరికి వాడి ధ్యాస మారిపోతుంది' అన్నారు. మనవడి మీద కంప్లయింట్ చేస్తున్నట్టు. 'రాహుల్ తాతగారిని అల్లరి పెట్టకుండా చకచక హోంవర్క్ చేసుకోవాలని చెప్పానా, తరువాత ఆడుకోవచ్చుగా' అంది.
రాహుల్ "తాతయ్య రోజూ వన్ టూత్రీలు , చూచి రాత రాయమంటాడు. స్కూలు కాపి రాయాలి. మళ్ళీ యింటి దగ్గర చూచి రాయాలా' అది కాదు నాన్నా. చూసిఅంకేలు అక్షరాలూ అన్నీ బాగా రాయాలి. ఫౌండేషన్ సరిగా వుండాలని తాతగారు పదేపదే రాయమంటారు. పుస్తకంలో పాఠం చూసి రాస్తే లెసన్ చదవక్కరలేకుండా బాగా వచ్చేస్తుంది తెలుసా' కొడుక్కి లాలనగా చెప్తూ పెరుగు అన్నం కలిపి తినిపించి వెళ్ళు మూతి కడుక్కుని కాళ్ళు కడుక్కుని నైట్ డ్రెస్ వేసుకుని పడుకో యింక, తొమ్మిదయింది మళ్ళీ లేవవు ప్రొద్దుట.
ఎంగిలి కంచాలు తీసి సింక్ లో పడేసి, పాపకి ఫారెక్స్ కలిపి వళ్ళో కూర్చోపెట్టుకుని తినిపించింది. తల్లి వళ్ళో కూర్చుని తృప్తిగా తిని కాసేపు ఆదుకుని వళ్లోనే నిద్రపోయింది. పాపని పడుకోబెట్టి - ఫ్రిజ్ తీసి రేపటికి కూరలు బయటపెట్టి పనమ్మాయి కిచ్చింది తరగమని , కాసేపు రిలాక్సింగ్ గా సోఫాలో కూర్చుని టి.వి. చూస్తూ పేపరు తిరగేసింది. బయట కారు చప్పుడు విని పుస్తకాలు, పేపర్లు అవి సరిగా సర్ది పిల్లల బొమ్మలు సామాన్లు అవి సరిగా సర్దింది.
మామగారు తినగానే వెళ్ళి పడుకున్నారు. తోమిదిన్నర అవుతుండగా ప్రకాష్ లోపలికి వచ్చి అలసటగా సోఫాలో వాలిపోయాడు. "పిల్లలు పడుకున్నారా, నాన్న నిద్రపోయారా' రొటీన్ గా అడిగే ప్రశ్నలు వేస్తూనే బూట్లు విప్పుకున్నాడు. 'త్వరగా ఫ్రెష్ అయిరండి. ఆకలేస్తుంది తిందాం' అంది జయలక్ష్మి అలసటగా ఆవలిస్తూ.
'జస్ట్ ఏ మినిట్ - బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. పది నిమిషాల్లో అతను బయటికి రాగానే యిద్దరికీ కంచాలలో వడ్డించి, పనమ్మాయి ప్లేటులో అన్నీ పెట్టి అందించి 'తినేసి వంటిల్లు సర్ది తుడిచేయి' అంది.
భార్యభర్త రోజంతటిలో భోం చేసే ఈ పది నిమిషాలే కాస్త సావకాశంగా కూర్చొని మాట్లాడుకునే సమయం. యిద్దరి ఆఫీసు కబుర్లు, పిల్లల విషయాలు, డబ్బు ఇన్ వెస్ట్ మెంట్లు , ఇంటి సామాన్లు వచ్చిన ఉత్తరాలు - ఏది మాట్లాడాలన్నా యీ టైములోనే ఓ అరగంట కాస్త సావకాశంగా తినేసరిక్ నిద్ర ముంచుకు వస్తుంది. పది పదిన్నర మధ్య పక్క మీద వాలీ వాలగానే నిద్ర ముంచుకు వస్తుంది.
తెల్లారి ఐదు గంటలకి అలారం గుండెల మీద తన్ని కూర్చోపెట్టినట్టు మెలకువ రాగానే కళ్ళైనా పూర్తిగా విప్పకుండానే బాత్ రూము లోకి పరిగెత్తి రెండు సార్లు టూత్ బ్రష్ ఆడించి మొహాన చన్నీళ్ళు కొట్టుకున్నాక మెలకువ వస్తుంది. అప్పుడు వంటింట్లోకి ప్రవేశించి అష్టావధానం, శతావధానంలా కాఫీ తో మొదలెట్టి, టిఫిన్లు, రెండు పూటలకి వంట, బాక్సుల్లోకి చపాతీలు , మధ్యలో కొడుకుని లేపడం, మామగారికి కాఫీ అందించడం కొడుకుని తయారు చేసి అటో ఎక్కించి భర్తగారి అవసరాలు చూసి పనిపిల్లతో గదులు తుడిపిస్తూ, వస్తువులు సర్దుతూ , బట్టలు నానబెట్టి, టిఫిను టేబిల్ మీద సర్ది, పాపని లేపి, నీళ్ళు పోసి , యింకో రెండు చేతులుంటే యింకో రెండు స్టవ్ లు అంటించి వంటింకా తొందరాగా చేద్దును కదా అనుకుంటుంది. ఎనిమిదికల్లా అన్నీ రడీ చేసి స్నానించి, ఏం కట్టుకుంటుందో కూడా చూసే తీరిక లేక దొరికిన చీర కట్టుకుని, మొహాన యింత బొట్టు పెట్టుకుని, రెండిడ్దేన్లు నోట్లో కుక్కుకుని , చపాతి బాక్స్ తీసుకుని పనిపిల్లకి పాపా జాగ్రత్తలు చెపుతూ , పార్క్ చేసిన కేనటిక్ హోండా ఎక్కి ఆఫీసుకి పరుగు , ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు కళ్ళు చిల్లులు పడేలా కంప్యూటర్ ముందు కూర్చుని - మధ్యాహ్నం కూరో, పచ్చడో, రొట్తో , అన్నమో కూడా తెలియకుండానే నోట్లో యింత పడేసుకోడం - మళ్ళీ రాత్రి ఎనిమిదికిల్లు చేరితే ఎదురుచూసే పని, ఒక యంత్రానికి , తనకీ తేడా లేదనుకుంటుంది జయలక్ష్మీ.
కాలేజిలో చదువుతుండగా పెద్ద పెద్ద చదువులు చదివేసి అమెరికా వెళ్ళిపోయి ఎమ్మెస్ లు చేసేసి లక్షల రూపాయలు డాలర్లలో సంపాదించేసేయాలన్న కాలలన్నీ నిజమయ్యేయి. ఇంజనీరింగు చేసింది. కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగమూ సంపాదించింది. డాలర్లు సంపాదించుకుంది. అట్టహాసంగా మరో కంప్యూటర్ యింజనీరింగ్ తో పెళ్ళయింది. కన్న కలలకీ, జీవితానికి చాలా తేడా ఉంటుందన్నది పెళ్ళయ్యాక అర్ధం అయింది. ఇంజనీరయింది , డబ్బు సంపాదించింది కాని సుఖం అన్న పదం జీవితంలోంచి మాయమైంది.
అమెరికాలో వున్నన్ని రోజులు ఒకరకంగా కాస్త నయం. శని, ఆదివారాలు , యిల్లు తుడుచుకోవడాలు , వంటలు చేసుకోవడం, బట్టలుతుక్కోవడం, అనింటికి మిషన్లు హాట్, కోల్డ్ వాటర్లు, వారానికి ఒకసారి తుడిచినా దుమ్ము ధూళి లేని ఇల్లు, చెమట పట్టని బట్టలు - ఉదయం ఏ ఫ్రూట్ జ్యూసో, కార్న్ ప్లేక్కో, మధ్యాహ్నం ఓ శాండ్ విచ్ - అంత ఆకలి కూడా వుండదు కనక ఎక్కువ వండుకోలేకపోయినా ఫరవాలేదు . రాత్రి వచ్చి షాపులో దొరికే తందూరీ రొట్టెలు నాలుగు మైక్రో వోవెన్ లో వేడి చేసుకుని , కాస్త అన్నం కుక్కర్లో పడేస్తే వంట అయిపోయేది. అంత శ్రమ అన్పించేది కాదు. అదీకాక అక్కడ పనివాళ్ళు వుండరు కనక సగం యింటి పని ప్రకాష్ చేసేవాడు. పెళ్ళయ్యాక ఉద్యోగాలలో స్థిరపడ్డాక పిల్లాడిని ప్లాన్ చేసి కన్నారు. బేబి సిట్టర్ కి బోలెడు డబ్బులు పోసినా పిల్లావాడిని సరిగానే చూసేది.
