ప్రజాసేవలో ప్రసారసాధనాలు
నిండుదనంతో, చల్లదనంతో, యీ పర్వదినాన శుభాకాంక్షలందజేస్తున్నది మా తెలుగింటి ఆడబడుచుల సుస్వరం, మధుర స్వరం.
ఆవేశంతో, ఆవేగంతో, ఉద్వేగంతో, ఉల్లాసంతో నింగికెగసిన కడలి కెరటంలా కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న సెలయేరులా ఉత్సాహంతో చూస్తున్నది తెలుగు యువత - మీరే కార్యక్రమం అందజేస్తారని.
మూగవోయిన పేదలు, మేధస్సు వికసించిన విజ్ఞానులు, వారు, వీరు అందరూ ఆరుకోట్ల ప్రజానీకం అభినందిస్తున్నది యీనాడు మీరు ప్రారంభం జేస్తున్న యీ ప్రసార కేంద్ర కార్యక్రమాన్ని తిలకించి, పులకించి, పొంగువారిన నిండు గుండెతో.
ఆశతో ఆశిస్తున్నది మీ నుండి ఎంతో మా ఆశలను ఫలింప జేయడం మీ బాధ్యత.
ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం, దేశాభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ప్రజాప్రతినిధులందరికి కల్పించబడాలని, తాము అధికారం అప్పగించే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు హృదయపూర్తిగా ప్రజలు. అట్టి ప్రజలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని సమన్వయపరచి ఏ విధమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టుతున్నదో తెలుపడం అవసరం. అది ప్రజా ప్రతినిధుల ధర్మం.
ఈ ఆధునిక నాగరికతా ప్రపంచంలో దినదిన ప్రవర్ధమాన మవుతున్నటువంటి సర్వ సౌకర్యాలను ప్రజలకే ఉద్దేశించడమవుతున్నది గనుక, వారు అనుసరించే, ఆచరించే కార్యక్రమాల ద్వారా నిత్యం జరుగుతున్నటువంటి సామాజిక విధానాలను, ప్రజలకు ప్రబోధించవలసివున్నది. గనుక యీనాడు రేడియోకుగాని, టెలివిజనుకుగాని మరియే యితర ప్రచార సాధనాలకుగాని యింత ప్రాముఖ్యత గలిగివున్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఈ సౌకర్యాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొనే విధానం యూనియన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కలుగచేయాలి. కార్యక్రమాలలో మా రాష్ట్రాభ్యుదయ కార్యక్రమప్రసారాలకు, మా తెలుగు భాషా సంస్కృతీ వికాసాలకు అనువుగా తగినంతగా సమయం కేటాయించాలి. ప్రజలకు తృప్తి కలిగించాలి.
ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులచే ప్రజలకోసమే అనుసరించబడుతున్న రాజ్యాంగ విధానంలో ప్రసార సౌకర్యాలను వినియోగించుకోవడంలో తగినంత సమయం రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించబడాలని మనవి చేస్తున్నాను.
అహోరాత్రిళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొన్నా, ఆర్జించిన సంపాదన కడుపు నింపుకోవటానికి చాలక అర్ధాకలితో అలమటిస్తున్న పేద ప్రజానీకానికి, తల్లి హృదయం వేదన కోతతో నిండిపోయి బిడ్డల ప్రగతిని చూచుకోడానికి నిచని వ్యధిత బాధిత ఆడబడుచులకు, అక్కాచెల్లెండ్రకు, కళ్ళలో నీరు యింకిపోయి మూగబాధతో నోరు పెగలక అలమటించే కర్షకులకు, శ్రామికులకు, కార్మికులకు, నీడలేని వారికి, కట్టుబట్ట కూడా లేనివారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను యీ ప్రజా ప్రభుత్వం అందజేస్తున్నదో వారికి తెలియజెప్పడం కనీస ధర్మం. మాటైనా విన్నామన్న తృప్తితో, భవిష్యత్తులో మంచి జరుగుతుందన్న ఆశతో, నిరాశులు, హతాశులు నిలవరించుకొనే అవకాశం ఆ దరిద్ర నారాయణులను ఉద్దరించే విధానం వాడల్లో, గూడేలలో, గుడిశెలలో ప్రతిధ్వనించాలి.
కనుక ఈనాడు ఎంతైనా, కొంతైనా నా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ విధానాలు, ప్రగతి పథకాలు, వారికి తెలియడం అవసరం. ఆ విధాన ఫలితాలు ఎవరికోసం నిర్దేశించబడినవో, అది వివరంగా తెలుసు కొన్నప్పుడుగాని ఆచరణలో వున్న అవినీతిని, ప్రచారంలో వున్న అసత్యాన్ని అవగాహనలో వున్న అపార్దాన్ని తీసివేయడం జరగదని మనవి చేస్తున్నాను కాబట్టి కేంద్రానికి యిది ఎంత అవసరమో రాష్ట్రానికి మరింత అవసరమో వుందని మాత్రం చెబుతున్నాను. ఎంతో ఆదరంతో, ఆప్యాయ అభిమానంతో ఈ వనీన ప్రసార సాధన వ్యవస్థకు ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన గౌరవనీయురాలైన ప్రియతమ ప్రధానికి ఆరుకోట్ల ప్రజానీకం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆదరణ చూస్తే ఆపేక్ష పెరుగుతున్నది మా మనస్సులలో-ఆశలు, కోరికలు చిగురిస్తున్నాయి మా మనస్సుల్లో-
మా రాష్ట్రానికి చెందిన సమస్యా పరిష్కారంలో తెలుగుజాతి నిర్ణయించుకొని తమ ముందుంచిన విధానాలను గౌరవించాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తోడుపడాలని మా ఆశను వ్యక్తం చేస్తున్నాను.
మాకున్న వనరులన్నీ ఉపయోగించుకొని, ధర్మంగా మాకు సంక్రమించవలసిన హక్కులను పరిరక్షించుకొని జాతి తుష్టితో, పుష్టితో, నిండుగా, నిబ్బరంగా వుండాలని మా బలాన్ని స్వీకరించి, మా పరిపూర్ణమైన సహకారం అందుకొని మన జాతీయ వ్యవస్థ యీ ప్రపంచంలో మరే దేశమో కన్నెత్తి చూడలేనంత అంతస్థుకు ఎదగాలని, మహోన్నత జాతీయ సంస్కృతీ వికాసాలతో మనదేశ ప్రతిష్ఠ దిగ్దిగంతాలలో పరిక్రమించాలని, యీ భారతదేశంలో భాగంగా, యూనియన్ ప్రభుత్వంలో భాగస్వాములుగా భారతీయులంగా మేము నిండుగా కోరుకొంటున్నాము.
"సారే జహాసే అచ్చా, హిందూ సతా హమారా
హం బుల్ బులేహై ఇస్కే, యే గుర్ సితా హమారా"
ఈ దేశం మనది. భవిష్యత్ ప్రగతికే జాతి పురోగమనం, దేశ సమైక్యతే మా సిద్ధాంతం. మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్దే మాలక్ష్యం.
విజయవాడలో దూరదర్శన్ ట్రాన్స్ మీటరు ప్రారంభోత్సవం సందర్భంగా 1984 మార్చి 23న చేసిన హిందీ ప్రసంగానికి తెలుగుసేత
