Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 27


    అలాగే మేనకా సరస్సులోని నీటికి ఒక విలక్షణం వుంది. మనుషుల్లో అంతర్గతంగా ఉండే జంతులక్షణాలు , వికారాలు ఆ నీరు తాగితే బయటపడతాయి. సామాన్య ప్రజానికానికి ఇంత సున్నితంగా చెబితే ఎక్కడ అర్ధం అవుతుంది? అందుకే ఆ సరస్సు శాపగ్రస్తమనీ, అందులోని నీళ్ళు తాగితే మృగాలయిపోతారని చెబుతారు మనవాళ్ళు. వినయంగా చెబితే ఎవరు వింటారు? భయంగా చెబితే గానీ వినరు కదా?" అన్నాడు బ్రహ్మచారి.
    నరవానరంలా కనబడుతున్న ఈ మనిషిలో ఇంత తార్కికంగా ఆలోచించే మనసు ఉన్నదని ఊహించలేదు ఉదయార్కర్. అతను చెప్పిన విషయం గురించే కొద్ది సేపు ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత సంకోచంగా అన్నాడు.
    "అయితే కదళీనాధుడూ, శునకశాల్మనీ వృక్షం ఇవన్నీ కూడా...."
    "ఉన్నాయి" అన్నాడు బ్రహ్మచారి స్థిరంగా.
    "మీరు చూశారా?"
    "ఇవేకాదు. ఇంకా చాలా చూశాను."
    "ఏం చూసారు?"
    చిన్నగా నవ్వాడు బ్రహ్మచారి.
    "శ్రీశైలం ప్రాంతపు అరణ్యాల గురించి, అక్కడ ఉండే వింతలూ, విశేషాల గురించీ ఒక సంవత్సరం పాటు చెప్పినా ఇంకా చెప్పవలసింది మిగిలిపోతుంది" అని హటాత్తుగా మౌనంలోకి జారిపోయి చాలా సేపటి తర్వాత ఏదో గుర్తు వచ్చినట్లు అన్నాడు.
    "నా కయితే ఆకలిదప్పికలు లేవనుకో. మరి నీ సంగతి చూడొద్దు." ఏం తీసుకుంటావు! ఇంత అన్నం ఉడకేయ్యనా!"
    బ్రహ్మచారి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎగ్జయిటేడ్ గా అడిగాడు ఉదయార్కర్.
    "ఏమిటీ! మీకు ఆకలిదప్పికలు లేవా? ఎందుకని?"
    "తాత్కాలికంగా! ఇవాళే కదా అడవులలో నుంచి తిరిగి వచ్చాను. అడవుల్లో తిరిగేటప్పుడు మూలికలు కొన్ని తింటాను నేను. దానితో ఒక వారం రోజుల పాటు ఆకలీ దప్పికా లేకుండా పోతాయి."
    తటపటాయిస్తూనే అడిగాడు ఉదయార్కర్.
    "ఏం మూలికలు అవి?"
    "రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్షణులకు ఉపదేశిస్తాడు చూడు! బల అతిబల అని! అవి మంత్రాలు కాదు. కొన్ని మూలికలు. మగ బెండ అని వుంది. అది తింటే ఆకలీ దాహమూ వుండవు."
    వెంటనే అన్నాడు ఉదయార్కర్.
    "దేశంలో ఎంతోమంది ప్రజలు అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నారు. వాళ్ళకి ఈ విద్యను నేర్పిస్తే మీ పేరు చెప్పుకుంటారుగా!"
    వేదాంతంగా నవ్వాడు బ్రహ్మచారి.
    "చెప్పాను కదా! దీని ఫలితం తాత్కాలికమని! అయినా, సాధన శరీరాలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలను తట్టుకోగలవు. అందుకే అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. అందరికీ సాధ్యమయ్యే ప్రయోగాలు కొన్ని వున్నాయి. మచ్చుకి జ్ఞాపకశక్తిని పెంచే మందు"
    ప్రశ్నార్ధకంగా చూసాడు ఉదయార్కర్.
    "సరస్వతి ఆకు, రత్నపురుష ఆకులతో చేస్తారు దాన్ని! మొన్న వర్షాలు పడగానే వెళ్ళి కంభం చెరువులో సరస్వతీ ఆకూ, క్రోసూరు కొండ మీద రత్నపురుష ఆకూ కోసుకొచ్చి ఉంచాను. వాటితో మందు చెయ్యాలి. మందికి పంచాలి. వీటి సంగతి వదిలేయ్! చిన్న చిన్నవి శ్రీశైలంలో వున్న మూలికలు అసంఖ్యాకం! అక్కడలేని మూలికలు ఇంకెక్కడా ఉండదు? అన్నాడు బ్రహ్మచారి. "అయితే వాటికోసం వెదకాలి. సేకరించాలి! మందులు చెయ్యాలి. పంచిపెట్టాలి. అవన్నీ చెయ్యాలంటే డబ్బు కావాలి. ఎవరిస్తారు అంత డబ్బు!"
    "మీకు ఇన్ని విషయాలు తెలిసి ఉంటే గవర్నమెంటుని అప్రోచ్ అయి గ్రాంట్ ఏదన్నా సంపాదించవచ్చు గదా!" అన్నాడు ఉదయార్కర్.
    "గవర్నమెంటా!" అని విరక్తిగా నవ్వాడు బ్రహ్మచారి. "ఆ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా అక్కమాంబ బిలం లో ఆ చివరి నుంచి ఈ చివరకు అరవై సార్లు తిరగడం సులభం!"
    అది నిజమే అనిపించింది ఉదయార్కర్ కి.
    కాసేపు ఆగి అన్నాడు బ్రహ్మచారి.
    "ఇందులో దాపరికమేమీ లేదు. నేను ఈ ప్రయోగాలన్నీ చెయ్యాలి. చేసి తీరాలి. చెయ్యాలంటే డబ్బు ఉండాలి. డబ్బు నా దగ్గర లేదు కాబట్టి ఏదన్నా నిధి దొరకాలి! అదొక్కటే మార్గం!"
    "అది అంత సులభమా!" అన్నాడు ఉదయార్కర్. అతనికి సంతోషంగా వుంది. అనుకోకుండా తన ప్రయత్నమేమీ లేకుండా బ్రహ్మచారి తన రూట్ లోకి వచ్చేస్తునాడు.
    ఈ ఇన్ఫర్మేషనే నాకు కావాల్సింది. అంతేగానీ కదళీనాధుడూ, కల్పవృక్షము కాదు.
    సోఫార్, సోగుడ్"
    "నువ్వెందుకోచ్చావో నాకు తెలుసు" అన్నాడు బ్రహ్మచారి వున్నట్లుండి.
    అనుకోని ఆ మాటలకు ఇబ్బందిగా కదిలాడు ఉదయార్కర్.
    సో వాట్ నెక్స్ట్?
    "ఆ సదానంద్ కి సహనం లేదు. అతనేక్కువకాలం ఒకేచోట వుండలేడు ఒకరినే అంటిపెట్టుకుని వుండలేడు . చపలచిత్తం" అన్నాడు బ్రహ్మచారి.
    అప్పుడు హటాత్తుగా ఒకటి స్పురించింది ఉదయార్కర్ కి.
    ఈ బ్రహ్మచారికి , ఆ సదానంద్ కీ కూడా వికృత రూపాన్ని కలిగించే వ్యాధులు వచ్చాయి.
    ఎందుకని?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS