ఆ ఏకాంత రమణీయమయిన క్షణాలు జ్యోతి గుండె తలుపుల్ని తట్టి పిలుపు యిచ్చినాయి. ఆమెలో వ్యాపకాల వల్ల , అనేకంగా తల మునకలయ్యే సమస్యలవల్లా నిద్రాముద్రితమయిపోయిన స్త్రీత్వం తాలుకూ ఆలోచనలు ఆవులించి నిద్రలేపినాయి.
ఆ పురుషుడు తన వాడయితే ఎంత బాగుండును అని ఒక్క క్షణం అనిపించింది ఆమెకు. కాని సమస్యలతో నిండిన బ్రతుకు . ఏ క్షణంలో ఎందుకోసం తనవయిన తన మనః ప్రాణాలను బలియివ్వవలసి వస్తుందో అర్ధం కాని అనిశ్చిత స్థితి.
ఈ స్థితిలో తానుండి అతడు తన పురుషుడు కావాలని ఆశించటం దురాశ అనిపించిందామెకు. ఏవో కలలు కంటూ అలా చితుకుల కాకతో మన్హ తాపాన్ని వుపశమింప చేసుకున్నదా సాహసి అయిన ముగ్ధ జ్యోతి!
మరింక వారి మధ్య మాటలు నడవలేదు. కొంతసేపు అయాక ఎవరి ప్రక్కమీదికి వారు పోయి పడుకున్నారు. జ్యోతికి నిద్రపట్టలేదు.
ఈసారి జయకృష్ణ ఆదమరచి నిద్ర పట్టించేశాడు.
అటు కర్తవ్యపాలనలో ఎదురవుతున్న భయావహమయిన పరిస్థితులకు ఇటు నిద్రలేచిన స్త్రీ హృదయం పెడుతున్న అరాటానికీ మధ్య ఊగిసలాడుతున్న మనసుతో నిద్రలేని రాత్రిని గడిపింది జ్యోతి.
తెల్లవారింది. ప్రొద్దు పొడిచింది. రవి కిరణం సోకగానే విచ్చిన చిరునవ్వుతో అలసట తీరి కళకళలాడుతున్న ముఖ ముద్రతో లేచికూర్చున్నాడు జయకృష్ణ.
తామ్రపత్రాలు ఆధారంగా తీసిన ఫోటో స్టాట్స్ మరొక మారు క్షుణ్ణంగా పరిశీలించుకుని ఈ దారిన పయనిస్తే లక్ష్యాన్ని చేరగలమని మరొకమారు ధైర్యం తెచ్చుకున్నారు.
గుండె దిటవు కలిగిన తరువాత మళ్ళీ కిట్టు సర్దుకుని ప్రయాణ మయినారు. సుప్రభాత సమయం. ఏటి మీది పచ్చిగాలి వచ్చి మృదువుగా చెంపల్ని తాకుతుంది.
గిలిగింతలు అవుతున్నాయి.
ఆ ప్రొద్దు ఎదురుకానున్న మంచి చెడు అనుభవాలను ఊహించాలని ప్రయత్నిస్తూ నడుస్తోంది జ్యోతి. ఏరు పొంగినప్పుడు తీర భూములపై వున్న రాళ్ళను తాకిన అలలు వాటిని అరగదీసి గుండ్రాళ్ళుగా మార్చుతాయి.
నాడాలు దట్టించిన బూట్లూ గుండ్రాళ్ళపై అనినప్పుడు కాలు జారుతోంది. హాండ్ స్టిక్ ఆధారంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు తూలి పడబోతోంది జ్యోతి.
ఆర్కెలాజికల్ డిపార్ట్ మెంట్ వ్యక్తిగా ఇటువంటి అనుభవాలను ఇదివరకే గమనించి ఉన్నాడు జయకృష్ణ. అందునించి అలవాటయిన రీతిలో తాను నడుస్తూ , అవుసరమనిపించి నప్పుడు జ్యోతికి ఆసరాగా చేయి అందిస్తూ నడుస్తున్నాడు.
ప్రయాణం ప్రారంభమయిన రెండవ రోజు అది. అప్పటికీ శ్రీపర్వం ప్రాంతాలను దాటి , అడవి లాంటి దారికి వచ్చేశారు. అక్కడ పీటభూమి పై ఒయారంగా ఒంపులు తిరుగుతూ అటుపోటులు లేకుండా నెలలు నిండిన గర్బిణీలాగ నింపాదిగా నడుస్తోంది కృష్ణవేణి. చేపల వేటకై తిరుగాడే పడవలు కన్పిస్తున్నాయి. తెరచాప లేని కట్టమారాన్ లు, పుట్టీలు నల్లని చుక్కల్లా కన్పిస్తున్నాయి. ఒక్కొక్క దానిపై ఇద్దరు ముగ్గురు పల్లెవారు. చిన్న చిన్న గుడ్డ పీలికలు ఆచ్చాదనగావల విసురుతూ పాటలు పాడుకొంటూన్నారు.
తల్లి ఒడిలో నిండారిన తృప్తితో తనివి తీరిన ఆనందంతో ఆడుకుంటున్నా పసిపాపల్లాగా ఏటి తల్లి వొడిలో పల్లెవారు పదాలు పాడుకొంటున్నారు.
కడుపు నింపుకున్నా కన్ను మూసినా ఆ తల్లి ఒడిలోనే వారి బ్రతుకు ప్రొద్దు వాలుతున్న కొద్దీ పరిసరాలు దట్టమయిన వృక్షాలతో నిండి దారి యిరుకులా అన్పించింది.
ఆ చుట్టూ ప్రక్కల అంతా అడవి అనే విషయాన్ని సులభంగానే గ్రహించాడు జయకృష్ణ. రాత్రి తలదాచుకుందుకు అనువు అయిన చోటు ఎక్కడా అని అన్వేషించటం ముందుగానే ప్రారంభించాడు.
నాలుగు దాటుతూ వుండగా సువిశాలంగా విస్తరించిన శాఖలతో, కాండానికి కాలం తొలిచిన తోర్రలతో నేలలోకి దిగిపోయిన ఊడలతో పెద్ద బూగురుచెట్టు ఒకటి కన్పించింది.
బూరుగు చెట్టు కొమ్మలు ఏనుగు తొండల్లా కన్పిస్తాయి . కాండం ఏనుగు కుంభ స్థలంలా కన్పిస్తుంది. దాని రూపు రేఖలలో చూడదలచిన వారికి అదొక ప్రత్యేకత కన్పిస్తుంది.
తొలుచుకుపోయిన తొర్రలు చిన్నవో పెద్దవో విధిగా వుండి తీరతాయి. తాము ఆ రాత్రి గడిపేందుకు అది సరి అయినచోటు అని భావించాడు జయకృష్ణ.
అప్పటికే జ్యోతి ముఖం వాడిపోయింది. ప్రయాణపు బడలిక ఆపాదమస్తకమూ కన్పిస్తోంది.
"ఈ రాత్రికి యిక్కడే మన మకాం" అన్నాడు జయకృష్ణ బూరుగు చెట్టు వంక చూపుతూ. క్షణాలలో దాని క్రిందికి చేరిపోయి కూలబడింది జ్యోతి. రెండు చేతులతో నుదురు పట్టుకుని ముఖం మీద పడిన ముంగురుల్ని పైకి త్రోసుకుంది.
"పగలంతా నడవటం తప్ప సాధించింది మరొకటి లేకపోయినా పెందరాడే ప్రయాణం ఆటవిడుపు ఇచ్చినందుకు మీకు థాంక్స్" అంది నవ్వుతూ. జయకృష్ణ రవంత దూరంగా వెళ్ళి పరిసరాలను నిశిత దృష్టితో జాగ్రత్తగా పరిశీలించాడు.
ఆ రాత్రి అక్కడ మకాం చేస్తే ప్రత్యేకమయిన ప్రమాదాలు ఏవీ రావని నిశ్చయమయాక తిరిగి వచ్చి కిట్టు దింపేశాడు.
రవంత సేదతీరిన తరువాత "నాతొ ఇలా ఒంటరిగా పయనించడం నీకు భయంగా లేదా!" అని ప్రశ్నించాడు.
చిన్నపిల్లాడి వంక చూచినట్లు ముద్దుగా జాలిగా అతని వంక చూచింది జ్యోతి. "డియర్ జయకృష్ణా!: అంటూ మొట్ట మొదటిసారి ఏకవచనంలో సంభోదించి మాట్లాడటం ప్రారంభించింది.
"ఆడదంటే ఏమిటో మీకు తెలియక పోవటానికి కారణం మీరు బ్రహ్మచారులు అయి వుండటం మాత్రం కాదు!
ఎందుకంటే దశాబ్దాలపాటు ఒక ఆడదానితో బ్రతుకు పంచుకుని అధిక సంఖ్యలో ఆడపిల్లల్ని కని పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాక కూడా ఆడదంటే ఏమిటో రవంత అయినా అర్ధం కాని, అర్ధం చేసుకొని అనేక మందిని నేను చూచాను.
మీ ప్రశ్నకు సమాధానం వినబోయే ముందుగా మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.
అదేమంటే ఒక గ్రంధాలయాన్ని చదవడం సులభతరం కావచ్చునెమో గాని, ఒక ఆడదాని హృదయాన్ని చదవటం సులభతరం కాదు.
వందలు, వేలు సంవత్సరాలుగా మగవాడిని నమ్మి వాళ్ళ నీడన ఒద్దికగా జీవిస్తున్నట్లు కన్పించే ఆడదానికి అంతరింకంలో మరొక ఆలోచనల ప్రపంచం వుంటుంది.
వాటి తాలూకు నీడ కూడ మగవాడికి కన్పించడు. ఆ పోలకువ అతి రహస్య మయమయినది. ఈ సువిశాల విశ్వాంతరళం లోని అద్భుత రహస్యాలకన్నా గాడతరమయినది.
ఆ రహస్యాన్ని రహస్యంగా దాచుకోవటంలోనే స్త్రీకి భద్రత సులభతరంగా లభిస్తుంది. అందునించి ఆ రహస్యమయ ప్రపంచాన్ని ఎంతో పదిలంగా అంతర్యపు పొరల్లో దాచుకుంటుంది స్త్రీ.
మీరు అభ్యంతర పడి మరొకలా భావించక పొతే ఒక్క విషయం చెప్తాను. దంపతులకు స్త్రీ పుం సయోగం సర్వసాధారణం.
ప్రేయసీ ప్రియులకు అరుదయినా అది సంభవం. అతడు ప్రియమైన భర్త అయినా, కేవలం ప్రియుడయినా స్త్రీ పుంసయోగం ముగిసిన అనంతరం అలసి సొలసి విశ్రాంతిని ఆశ్రయిస్తాడు.
