అయితే డబ్బు నీకు రాలేదా?"
"నాకు డబ్బెందుకమ్మా! కడుపు కింత తిండీ, కట్టుకునేందుకు ఈ బట్టలూ చాలు కదా!' అన్నాడు.
"అదేమిటి! నీ డబ్బు నీ కివ్వాలి కదా!"
"టికెట్ నేను కొనలేదు. నా డబ్బుతో కొనలేదు"
"అయితే నీ సంతకాలు ఎందుకు తీసుకున్నారు"
"ఆ టికెట్ నా పేరు మీద అయ్యగారే కొనుంటారు. మీ పేరు మీద నగరంలో చాలా వ్యాపారాలున్నాయి. భవనాలున్నాయి. అవన్నీ మీరు కొన్నారా?" అయ్యగారే ,కదా కొన్నారు?"
"ఇది టాక్స్ అడ్జస్టు ,మెంట్స్ కి సంబంధించిన విషయం అయి వుంటుంది లేవే! నువ్వు కల్పించుకోకు. మీ డాడీ బాధ పడతారు. ఇలాంటివి జరుగుతుంటాయి.
"నేను ఎకనామిక్స్ స్టూడెంట్ ని కదా! నాకు తెలుసు!" అంటూ సలహా యిచ్చింది ఓ స్నేహితురాలు!
తండ్రి తాలుకూ వ్యాపార పరిధుల్లోకి విషయం వెళ్ళి పోగానే మరింక మాట్లాడకుండా కూర్చుంది ప్రియాంక.
ఐస్ క్రీం లు తినటం పూర్తి అయింది. రాందుల్లారీ రాత్రి పగలు ఒకటే కదా! అపప్తికి ప్రొద్దుపోయింది. భవనంలో అన్ని ప్రక్కలూ దీపాలు వెలిగాయి.
ట్రే తీసుకుని కర్ర ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు దుల్లారీ!
"సో! వియ్ డిస్బర్స్ ఫర్ టుడే!" అంటూ లేచారు మిత్రబృందం.
ఆలోచనల మధ్య కూరుకుపోయి వున్న ప్రియాంక యాంత్రికంగా "ఊ అలాగే!' అంది.
"మళ్ళీ రేపు ఉదయం కలుస్తాం" అంది మరొకామె!
"పెందలాడే రండి" అంది ప్రియాంక అలవాటు ప్రకారం.
"ఇలాగే మమ్మల్ని పెందలాడే రమ్మంటావు. నువ్వు మాత్రం తొమ్మిది గంటల వరకూ బెడ్ రూమ్ విడిచి రావు" నిష్టూరంగా అంది.
"నో! అలా కాదు . ఎనిమిదన్నర లోగానే మనం కారు తీసుకుని నగరం మీదికి దండయాత్ర పోతున్నాం . పెందలాడే రావాలి"
"అలాగే ! జై !" అందరూ వెళ్ళిపోయారు.
ప్రియాంక అలాగే బొమ్మలా కూర్చుంది. ఆమె మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. మెయిన్ గేటు తెరచుకుంది. కారు హెడ్ లైటు కాంతులు ఆమె ముఖం మీద పడ్డాయి.
కారు హారన్ జోరుగా విన్పించింది.
ధర్మాజీరావు పరిస్థితి గమనించి త్రుళ్ళిపడ్డాడు. ప్రొద్దుపోయింది. కొంచెం ఈదురు గాలి వీస్తోంది.
బేబీ ఏదో ఆలోచనలో పడిపోయి యింకా అలాగే ఉండిపోయింది.
రాస్కేల్స్ ఎవరూ పట్టించుకోలేదు. జలుబు చేయదు.
కారు దిగి వచ్చాడాయన.
"బేబీ! చలిగాలిగా ఉంది! ఏం చేస్తున్నావమ్మా యిక్కడ?" దగ్గరగా వచ్చి మరో లాన్ చెయిర్ లో కూర్చుని ఆమె తల మీద చేయి వేశారు.
"ఆలోచిస్తున్నాను డాడీ!"
"దేన్నీ గురించి తల్లీ! పుస్తకాల గురించా? పిక్నిక్ గురించా? శారీల గురించా? కారు గురించా?"
"అవేవీ కావు డాడీ! రాందుల్లరీ గురించి"
"పోనీలేమ్మా! పాపం గ్రుడ్డివాడయినా విశ్వాసపాత్రుడు. రాత్రిపూట ఎవరయినా మెయిన్ గేటు దాటి వస్తారనుకో! మన అల్శేషియస్ కన్నా ముందు కనిపెట్టేస్తాడు తెలుసా!
ఏదయినా పొరపాటు చేశాడేమో! క్షమించు . పాపం! మంచివాడు"
"అతనే పొరపాటు చెయ్యలేదు డాడీ! అతనికే అన్యాయం జరిగిందేమో అని ఆలోచిస్తున్నాను."
"అతని కెవరు అన్యాయం చేస్తారమ్మా! ఏదైనా ప్రజెంటేషన్ కొని యివ్వలనుకుంటే కొని యివ్వు. దాన్దేముంది? ఎవరు కాదంటారు?"
"ఇవాళ పత్రికలో వార్త చదివాను" ఉలిక్కిపడ్డారు ధర్మాజీరావు .
"నా వ్యాపారం గురించి మాట్లాడనని నాకొకసారి ప్రామిస్ చేశావు గుర్తుందా! లే, వెళ్ళిపోదాం" అంటూ చేయి పుచ్చుకున్నారాయన! ఆమె లేచి నిలబడింది.
12
"బాబూగారు! మీకు టెలిగ్రాం వచ్చిందీ వేళ! మూడు రోజుల క్రితం ఓ ఉత్తరం కూడా వచ్చింది" అన్నాడు పానకాల్సామీ!
ఉత్తరం దాని వెంట టెలిగ్రాం అని వినగానే జయసింహ ముఖం నల్లగా అయిపొయింది. పెదవులు పాలిపోతున్నాయి.
"కనిపించి వారం రోజులయింది. ఎక్కడ తిరుగుతున్నారు బాబూ........!"
"ఊళ్ళోనే ఉన్నాను. ఎక్కడుంటే ఏమిటి? నా కోక యిల్లూ నా వాళ్ళు అనుకునెందుకేమీ లేదు కదా! ఉత్తరం ఎక్కడుంది?"
పానకాల్సామీ పాకలోకి వెళ్ళిపోయాడు. ఉత్తరం అనగానే అదేమీటో జయసింహ ఊహించగలడు..
"డబ్బు కావాలి. వెంటనే పంపించు" అనే కదా ఉంటుంది. అతని ముఖం దిగులుగా అయింది కవరు అందుకున్నాడు.
చింపి చూచాడు. "పదివేలు కావాలి. వెంటనే పంపించు" దాన్ని చించి అవతల పారేశాడు . మూడు రోజుల క్రితం ఉత్తరం. ఇవాళ టెలిగ్రాం అంటే అదే మాటర్ అయుండాలి!
"బాబూ! నీకు ఉద్యోగం కాని వచ్చిందా?"
"నేను ప్రయత్నం చేస్తే కదా రావటానికి"
"ఎందుకని ప్రయత్నం చెయ్యవు బాబూ!"
"నా అవసరాలన్నీ ఏ ఉద్యోగమూ తీర్చలేదు"
"మరి ఎవరు వ్రాశారీ ఉత్తరం?"
"అర్జంటుగా డబ్బు పంపాలి. పదివేలు!"
"ఎవరికి పంపాలి"
"పానకాల్సామి! ఈ ప్రశ్న నువ్వు ఎన్ని సార్లు అడిగినా నేను సమాధానం చెప్పలేను. అది నీకు తెలుసు! ఎందుకడుగుతావు?"
"మరిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది?"
"ఎలాగో సంపాదించాలి.' ఆవేశంగా లేచాడు జయసింహ! అతని వంక అయోమయంగా చూస్తూ వుండిపోయాడు పానకాల్సామీ.
చాలా సేపు గడిచిపోయింది.
ఎవరి ఆలోచనలో వాళ్లుండిపోయినారు.
"బాబూ! బట్టలు మాసి ఉన్నాయి. మరొక జత కూడా లేవు కదా------!"
అతని సూచన అందుకుని లేచాడు. బట్టలు పించుకుని మూడు గంటల సేపు చిన్న తువాలుతో కాలక్షేపం చేశాడు.
పైపు కింద కూర్చుని అలసట అంతా తీరిపోయేలా చాలా సేపు స్నానం చేశాడు. ఈలోగా పానకాల్సామీ భోజనం వండి వడ్డించాడు.
వేడి వేడి అన్నం తినగానే నిద్ర ముంచుకు వచ్చింది.
మళ్ళీ పార్కులోకి జనం వస్తున్నారు. నిద్ర లేవగానే మడతల వేయించి తెచ్చిన బట్టలు అందించాడు పానకాల్సామీ!
తలకు రాచుకునేందుకు నూనె అందించాడు. పగిలిపోయిన అద్దం విరిగిపోయిన దువ్వెన యిచ్చాడు.
ఉద్దరించాల్సిన కొడుకు బ్రతికి ఉండగా వాటిని కొన్నాడు.
వాడకుండానే అవి జీర్ణగతికి వచ్చాయి. ఇప్పుడు వాడేందుకు జయసింహ తప్ప ఎవరున్నారు?
"మరి డబ్బు సంగతి యెలా చేస్తావు బాబూ!"
"ఏదో చెయ్యాలి! ఇప్పుడెలా చెప్పగలడు?"
"మీ కోసం ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది"
"ఆమె సానుభూతి నేను భరించలేను పానకాల్సామీ"
"పోనీ అప్పుగా అయినా యిస్తారేమో!"
"డబ్బు కలిగిన వాళ్ళ మీద డబ్బు లేని వాళ్ళు సహజంగా ఆశలు పెంచుకుంటారు. ఇది చాల సహజం! ఆశ అలాంటిది!
