దూరం నుంచి స్పూన్లు తీసుకువస్తూ కన్పించాడు రాందుల్లారీ!
పూల మొక్కల మధ్య నించి తడుముకోకుండా నడుస్తున్నాడు.
"ఈ మనిషిని ఎక్కడో చూచినట్లు అన్పిస్తోంది . కదుటోయ్ " గాలికి పైకెగిరి పోతున్న మిడ్డీ అంచుల్ని చేతులతో క్రిందికి అదుముకుంటూ అడిగింది స్నేహితురాలు.
"అవును అన్పిస్తోంది . అనిపిస్తోంది. నువ్వు మిడ్డీ వేసుకుని తిరగటం ప్రమాదంలా కనిపిస్తోంది" అంది మరో అమ్మాయి.
"షటప్! వాగావంటే తంతాను" రాందుల్లారీ వంక రెప్పవేయ కుండా చూస్తోంది మిడ్డీ వేసుకున్న యువతీ!
అతను దగ్గరకు వచ్చాక కీచుమని అరిచింది.
"హాయ్! హాయ్! పోల్చుకున్నాను గుర్తొచ్చింది."
"ఎక్కడ? ఎప్పుడైనా డిల్లీ రైల్వే స్టేషన్ లో చూశావా?"
"నువ్వు కూడా ట్రాన్సిష్టర్ మర్చిపోతే తెచ్చి యిచ్చాడా?"
"ఏదో యిచ్చే ఉంటాడు!"
"కాదు లేవోయ్ దిన పత్రికలో అతని ఫోటో చూశాను."
"తప్పిపోయాడు కన్పిస్తే కబురు చేయ్యండు కాలంలోనా?"
"కాదు ఎలక్షన్స్ లో నిలబడ్డాడేమో!"
"అడ్వర్టైజ్ మెంట్ మోడలింగ్ యిచ్చుంటాడోయ్"
"ఎగతాళి చేయకండి. మీ కళ్ళు కూడా కుళ్ళి పోతాయి. అతనికి సౌభాగ్యవల్లీ బంపర్ లాటరీ లో పదిలక్షలు ఫస్ట్ ప్రయిజు వచ్చింది "
"ఈజిట్!? లాకియర్ అన్నమాట!"
"కళ్ళు లేక పోయినా అదృష్టం ఉందోయ్" ప్రియాంక బిగ్రేడ్ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.
'ఆర్ యూ ష్యూర్?" అమితాశ్చర్యంతో అడిగింది ప్రియాంక.
"యస్ ఆయామ్ ! కావాలంటే అతన్నే అడగండి"
రాందుల్లరీ దగ్గరగా రాకముందుగానే అందరూ పరుగు పరుగున ఎదురు పోయారు.
తలొక స్పూను అందుకుని చేతులు పెట్టి ఊపేశారు.
"హెహ్! వేరి వేరి లక్కీ యూ ఆర్"
రాందుల్లారీ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
"ఏమయింది మీకు? ఎందుకిలా నామీద విరుచుకు పడుతున్నారు?" అన్నాడు ఆశ్చర్యంలో మునిగిపోతూ!
"దుల్లారీ! నాతొ చెప్పకుండా దాచావన్న మాట! కంగ్రాచ్యులేషన్స్" అంది ప్రియాంక సంతోషంగా.
"ఎవరికి? నాకే? కంగ్రాచ్యులేషనా? నేనేం చేశాను?" రాతి బొమ్మలా అయిపోయాడు రాం.
"అదృష్టం నిన్ను వరించిందట కదా! ఏం తెలీయనట్టు మాటాడతావేం?"
"నేను పుట్టినప్పుడే అదృష్టం నన్ను వరించింది అమ్మాయిగారూ! వెలుగు వాకిళ్ళు మూసుకున్నాయి నాకోసం! మరింక ఈ ప్రపంచాన్ని అదే పాపిష్టి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా!"
"అది కాదు! సౌభాగ్యవల్లీ బంపర్ లాటరీ వచ్చిందట కదా!"
"ఎవరికి ? నాకా ! భలే చిత్రంగా ఉందే! లాటరీ టికెట్స్ కొన్న వాళ్లకే కదా ప్రయిజులు వస్తాయి."
"కొనకుండా ఎలా వస్తుంది మరి! ఎన్ని టికెట్స్ కొన్నావు!"
"ప్రయిజు వస్తుందని ముందే నీకు తెలుసా!"
"ఎవరి దగ్గరయినా పరో స్కోప్ చూపించుకున్నవా!"
"అలివేలుమంగా సామెత శ్రీ వెంకటేశ్వరస్వామి హుండిలో ఎంత వేస్తానని మ్రొక్కుకున్నావు!"
"ఇక నుంచి ఇక్కడ పని మానేస్తావా!"
"ఇల్లెక్కడ కట్టు కుంటావు!"
"పెళ్ళి చేసుకుంటావా!"
"ఏ కారు తీసుకుంటావు! మారుతీ తీసుకో!"
"ఇక్కడే ఉంటావా! మీ డిల్లీకి వెళ్లిపోతావా!"
"మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావా! మర్చిపోతావా!"
"విమల్ సూట్లు కుట్టించుకో!"
"కాదు . ఆర్ .ఒ. కె కుట్టించుకో"
"అని బావుండవు . మఫత్ లాల్ తీసుకో!"
"కాదు. బాంబే డయింగ్ " అతన్ని గాలిపటంలా ఆకాశంలోకి ఎగరేస్తున్నారు ఆడపిల్లలు! ఆ ప్రయత్నం చేస్తున్నారు!
అతను మాత్రం భూమి మీద స్థిరంగా నిలబడ్డాడు. అంగుళమయినా గాలిలోకి లేవలేదు.
"నేనెప్పుడు లాటరీ టికెట్ కొనలేదు. సౌభాగ్యవల్లీ లాటరీ అనేది ఒకటుందని నా కసలు తెలియదు. అది బంపర్ లాటరీ నిర్వహించిందని నేను కల కూడా కనలేదు."
"మరి నీకు ప్రయిజ్ ఎలా వస్తుందంటారు?"
"అందరూ కూర్చుని ఐస్ క్రీంలు తినండి హాయిగా! నా కోసం హడావుడి పడకండి అలసిపోతారు. హైరానా పడకండి. నాకు అటువంటి దురశాలు లేవు."
'ఇలా ఒక పనివాడుగా జీవితం చెల్లిపోతే చాలు!"
"అయినా టికెట్ కొనేందుకు నా దగ్గర డబ్బు లెక్కడున్నాయి ! కడుపునిండా తిండి పెడుతున్నారు. కట్టుకునేందుకు బట్టలిస్తున్నారు. వీధిన పడి అడుక్కు తినకుండా నా జీవితానికి అర్ధం కల్పించి ఆదుకున్నారు ఆ దొరబాబు!"
"నేను ఆయన్ని వదిలిపోలానా? లాటరీ నా కెందుకు?"
"తినండమ్మా! లాన్ లో యిలా పూల మొక్కల మధ్య చల్లగాలిలో కూర్చుని జిల్లు జిల్లు మనేలా ఐస్ క్రీం లు తింటే అదో అనందం. మీరంతా చిన్నవాళ్ళు!
అపోహలు పెంచుకుని అలసిపోకండమ్మా!!" అని బ్రతిమాలి చెప్పాడు రాందుల్లారి.
ప్రియాంక కి వళ్ళు మండిపోయింది. మిడ్డీ వేసుకుని అందాల గాలి విసురుకి పైకి లేవకుండా చేత్తో పుచ్చుకుని లాన్ ఛెయిర్ లో కూర్చున్న అమ్మాయి వంక గుర్రున చూసింది.
"ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నావా? మా మీద ?" అంది కోపంగా.
"అబద్దాలా? మమ్మల్ని ఫూల్స్ చెయ్యాలనుకుంటున్నావా?"
"మేం అంత వెర్రి నాగమ్మల్లా కన్పిస్తున్నామా నీ కళ్ళకి ?"
"ఏమే! మా చెవ్వుల్లో పువ్వులు కన్పిస్తున్నాయా?"
"ఆడపిల్లలు తలలో పెట్టుకుంటారు పూలు! మగాళ్ళు మాత్రమే చెవుల్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చెయ్యి" ఇలా తలొక వంక పట్టుకుని ఆమెను సతాయించారు.
అ అమ్మాయి మిడ్డీ అంచుల్ని వదిలిపెట్టి లేచి నిలబడింది.
'చాలెంజ్! అరవ తేదీ పత్రిక లో నేను చూశాను . కాదని మీరేవరయినా నిరూపించగలిగితే వంద పందెం" అంది.
"ప్రియాంకా! పేపరు తెప్పించవోయ్" టెన్షన్ పెరిగింది. అందరికి హుషారు వచ్చేసింది.
తింటున్న ఐస్ క్రీం ని వదిలేసి ఓ అమ్మాయి యింటి లోకి పరుగు తీసింది. అరవ తేదీ దినపత్రిక వెదికి తెచ్చింది. వస్తూనే రాందుల్లారీ పోటో గ్రాఫ్ అందరికీ కన్పించేలా పట్టుకుంది.
"యూ ఆర్ రైట్ మిస్ మిడ్డీ" అని అరిచింది.
అందరూ నిలువు బొమ్మల్లా అయిపోయారు. ఐస్ క్రీం తినటం మర్చిపోయారు. ప్రియాంక పేపరు అందుకుంది.
"సుప్రసిద్ధ వాణిజ్యవేత్త ధర్మాజీరావు గారి అటెండర్ కి పట్టిన అదృష్టం! సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ ఫస్టు ప్రయిజు పది లక్షల రూపాయలు అతన్ని వరించింది.
టికెట్ నంబర్ HH10760969.దృష్టం వరించిన రాందుల్లరీ అంధుడు! బ్యాంకులో డిపాజిట్ చేయగా ఆ మొత్తం డ్రా చేశాడు! నగరంలో పదివేలకి మించిన మొత్తంలో లాటరీ ప్రయిజ్ రావటం యిదే మొదలు!"
పెద్దగా చదివి అందరికి విన్పించింది. రాందుల్లారీ ఒక చేత్తో కాలరు చివరి గుండీ పట్టుకుని , రెండో చేతిలో ఉన్న ఊత కర్ర గాలిలో కదుపుతూ ఆ వార్త అంతా విన్నాడు.
"అయ్యగారూ మొన్నీ మధ్య వేలు ముద్రలు వేయించుకున్నారు అదే కాబోలు!" అన్నాడు . అంతా వినటం పూర్తయ్యాక!
