Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 27

 

    "సాగర్" మాధవి కళ్ళు అర్ధ్రమైనాయి.
    "నువ్వు నువ్వు నిజంగా....."
    "దేముడివి! అదేగా నీ డైలాగ్......ఇది మరీ పాత సినిమా డైలాగ్."
    "సాగర్! అంతకంటే ఇంకేదయినా మంచిమాట ఉందంటావా?" ఆమె చెంపల మీద కన్నీటి బొట్లు రాలాయి.
    "మనిద్దరం స్నేహితులం . ఒకరినొకరం అర్ధం చేసుకున్నా వాళ్ళం. పరస్పరం అభిమానించు కొంటున్నాం. ఒకళ్ళ కొకళ్ళం కావాలను కొంటున్నాం. కలిసి జీవించాలను కొంటున్నాం. కష్ట సుఖాల్లో భాగం పంచుకొంటున్న వాళ్ళం, అవసరం ఇద్దరిదీ. అనుబంధం ఇద్దరిదీ. అనందం ఇద్దరిదీ . సహచరులుగా జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నాం...." సాగర్ ధోరణికి అడ్డొచ్చి,
    "ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళం!" అన్నది మాధవి.
    "అది మరీ పాత డైలాగోయ్!" సాగర్ పెదవుల మీద చిరునవ్వు తోనికింది.
    "నాకు తెలుసు సాగర్! డైలాగ్ - అంటూ మాట మాటకీ ఎందుకు ఎత్తి పొడుస్తున్నావో! ఒకప్పుడు నీ ప్రతి మాటా తెలుగు సినిమా డైలాగ్ అని హేళన చేస్తూ ఉండేదాన్ని! అది మనసులో పెట్టుకుని అంటున్నావు కదూ?"
    సాగర్ కొంటెగా చూస్తూ హాయిగా నవ్వుకున్నాడు.
    "పాత తెలుగు సినిమా అయినా కొత్త తెలుగు సినిమా అయినా కొన్ని భావాలను, అనుభూతులను ప్రత్యేక మైన సందర్భాలలో ప్రకటించాలంటే ఆ డైలాగ్ లకు మించిన మాటలు లేవేమో ననిపిస్తుంది సాగర్ - కాకపోతే ప్రేమించాను అని చెప్పడానికి పౌరాణిక డ్రామాల్లోని కొండవీటి చాంతాడంత సంభాషణ మొదలు పెట్టావా లేదా? నువ్వే చెప్పు సాగర్!"
    'ఇంతకీ నన్నేమని చెప్పమంటావూ?"
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను! అని"
    "నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానా?"
    "మనసారా గినసారా - ఇవన్నీ సూపర్ ఫ్లుయస్ సింపుల్ గా క్లుప్తంగా అంటే చాలు. దానికి మించినది లేదు తెలిసిందా మిస్టర్?" అన్నది మాధవి.
    "తెలిసింది మిస్" అన్నాడు సాగర్.
    వినీల ఆకాశంలో ధనస్సులా వంగిన రంగులు కరిగి పోయాయి. కారుమేఘాలు కమ్ముకు రాసాగాయి. తళుక్కున మెరుపు! దూరంగా మేఘ గర్జన! టపటప మని చినుకులు పడసాగాయి.
    "మాధవీ! లే! వాన ముంచుకొస్తుంది" సాగర్ లేచి మాధవి చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ పార్కు బయట పెట్టిన కారు దగ్గరకు చేరే సరికే తడిసి ముద్దయి పోయారు. సాగర్ పక్కన ముందు సీటులో మాధవి కూర్చోగానే సాగర్ కారు స్టార్ట్ చేశాడు. కారు టాప్ మీద వానచినుకులు గులకరాళ్ళలా శబ్దం చేస్తున్నాయి. అప్పటి కప్పుడే రోడ్డు మీద ప్రవహించసాగాయి.
    "చాలా పెద్ద వర్షం! కారు నడపటం కూడా కష్టంగా ఉన్నది. ప్రక్కనే ఎక్కడన్నా అగుదామా?" అన్నాడు సాగర్.
    "వద్దు! వద్దు! ఈ వాతావరణం నాకెంతో బాగుంది వర్షంలో కారు పోతుంటే నాకెంతో సరదాగా వుంటుంది పోనీయ్!" తడిచిన మాధవి ముఖంలో వింత వెలుగుల్ని చూడగలిగిన సాగర్ తార్రోడ్డు మీద దృష్టినిలిపి కారు నడపసాగాడు.  విండ్ స్కీన్ మీద జారిపోతున్న నీటి ధారలను చూస్తూ మధురాను భూతులను మననం చేసుకుంటూ కూర్చున్నది మాధవి.
    "సాగర్! ఎక్కడకు పోతున్నాం మనం?" ఆమె మనసు దూర తీరాల్లో విహరిస్తున్నది.
    "మీ ఇంటికి!"
    "మా ఇంటికా!"
    "అవును మీ ఇంటికే!"
    "వద్దు! వద్దు!"
    "పోనీ మా ఇంటికి వెళ్దామా?"
    "అక్కడికీ వద్దు!"
    "మరెక్కడికి పోదాం?" సాగర్ కారు రోడ్డు పక్కకు తీసి ఆపాడు.
    "ఏదైనా గుడికి పోదాం!"
    "ఇప్పుడా? గుడికి ఎందుకు?"
    "ఆమాత్రం అర్ధం చేసుకోలేవా?"
    "మనోరధం ఈడేరిందని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటావా?"
    "అలా చెప్పుకోడానికి గుడికే వెళ్ళాలా? మనసులో చెప్పుకుంటే చాలదా?"
    "మరి గుడికెందుకు వెళ్దా మంటున్నావ్?"
    "నీకెమీ తెలీదోయ్!"
    ఈసారి నిజంగానే సాగర్ ఏమి తెలియదన్నట్టు బుర్ర గోక్కున్నాడు. హిందీ సినిమాల్లో హీరో- హీరోయిన్ వర్షంలో - తెలుగు సినిమాలే చూడడు , ఇంకా హిందీ సినిమాలేమి చూస్తాడు ఈ సాగర్ అనుకొన్నది మాధవి.
    "ప్రకృతి ఎలా వుందో చూడు, ఉరుములతో, మెరుపులతో , జడివాన - బయట చలిగాలి , లోపల ...."
    "లోపల వేడి! అంతేనా?' సాగర్ అందుకున్నాడు మాధవి చెక్కిళ్ళు ఎరుపెక్కాయి.
    "ఇంత వర్షం పడుతున్నా అంత "పొడి" గా ఎలా ఉండగలుగుతున్నావోయి సాగర్ అని మనసులోనే అనుకొన్నది. అంతలోనే మాధవి సర్దుకొన్నది. సాగర్ వుదాత్తమయిన హృదయం కలవాడు, సంస్కృతీ , సభ్యత గలవాడు. అతడు తనవాడు కాబోతున్నందుకు వేయి దేవతలకు మనసులోనే మొక్కులు చెల్లించింది.
    "సాగర్! ఇలా వర్షం పడుతున్నప్పుడు బార్ లో కూర్చొని సిప్ చేయడం నీకు సరదాగా ఉండదా!"
    "బార్ లో కూర్చొని విస్కీ సిప్ చేయడమా?" సాగర్ గొంతు పట్టుకుపోయినట్టయింది.
    "కాఫీ బార్ లో విస్క్ సిప్ చేస్తారా ఏం?" మూతి తిప్పుకోన్నది మాధవి.
    "ఓ, ఐసీ , కాఫీ బార్ లోకా? దానికేం అలాగే!" కారు తిప్పి కాఫీ బార్ వైపు పోనిచ్చాడు సాగర్.
    కారు దిగి కాఫీ బార్ లోకి వెళ్ళారు. తడిచిన బట్టలు ఒంటికి అతుక్కుని వున్నాయి. బార్ లోఫేన్ వున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. గాలికి మాధవి బట్టలు అర్చుకుంటూ కూర్చున్నది. సాగర్ కాఫీ ఆర్డరిచ్చాడు. బార్ లో మనిషి కనబడనట్టు వెలుతురు. ఆ వెలుతురులో మాధవి కళ్ళలోకి చూస్తూ సాగర్. ఆమెలో ఏనాడూ  చూడని సరికొత్త అందాలేవో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. బేరార్ కాఫీ తెచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS