ఇటువంటి వ్యాఖ్యానాలన్నీ రచ్చబండదగ్గర కృష్ణయార్యుడికీ, నీలాటిరేవుదగ్గర మంగమాంబకీ వినటం అలవాటయ్యింది. 'అమ్మాయి భవిష్యత్తు ఇట్లా అయిందే, తమ తర్వాత ఆమెని జీవితం ఎట్లా?' అని బాధ పడుతున్న వాళ్ళని ఈ మాటలు సమ్మెటపోటుల్లాగా బాధిస్తున్నాయి. పైకి మాత్రం ఇవేమీ తమనికానట్టు, పట్టించుకోనట్టు గంభీరంగా ప్రవర్తిస్తుంటే మరింత కసి పెరుగుతోంది అవతలవారికి. బాధించటంలో కొత్త పుంతలు తొక్కారు.
"పెనిమిటిని అట్లా తిడుతుంటే ఎట్లా ఊరుకున్నావు మంగా" సోమిదమ్మ సూటిగానే అడిగింది.
"భయపెట్టి తరుముతుంటే మందలించద్దూ? ఆమోదించి ఊరుకున్నావా? తప్పుకాదూ!" రామక్క మొహానే అడిగింది.
"భయపెట్టి తరుముతుంటే మందలించద్దూ? ఆమోదించి ఊరుకున్నావా? తప్పుకాదూ!" రామక్క మొహానే అడిగింది
"మంత్రాలు, పూజలు, పాటలు, ఆటలు అన్నప్పుడే రెండుతగిలిస్తే ఇందాకా వచ్చేది కాదు కదా!" ఓదార్చినట్టుగా పొడిచింది లక్షిందేవి.
"తాతగారూ, నాయనమ్మా కూడా గారాబం చేశారు వీళ్ళతోపాటు. అందుకే ఇట్లా అయింది" బుచ్చిలక్ష్మి సన్నాయి నొక్కులు నొక్కింది.
"గారాబం గజ్జెలకేడిస్తే వీపు దెబ్బలకేడ్చిందిట!" సోమిదమ్మ కసిగా అంది.
"మనం ఇన్ని మాట్లాడినా మంగమ్మ ఒక్కమాట మాట్లాడిందేమో చూడు" భ్రమరాంబ అంది. అందరూ ఆగి మంగమాంబ వంకచూశారు.
"మీరు అన్నవన్నీ నిజమే! కాని మా వెంకు మాత్రం పెనిమిటినేమీ అనలేదు. అతడూ మా అమ్మాయి ఏమీ అనలేదనే చెప్పాడు. అతడికే వాళ్ళ కులదైవం కనిపించి ఆజ్ఞాపించిందిట. దాని అత్తగారూ మామగారూ ఆ సంగతే చెప్పారు" మంగమాంబ చెప్పింది.
"కూతురికోసం ఎందుకే అబద్ధాలాడతావ్ కోడలుపిల్లా?" సోమిదమ్మ చనువు ప్రదర్శిస్తూ మందలించినట్టుగా అంది.
"నేను నిజమే చెపుతున్నానత్తగారూ!"
"ఈ రోజుల్లో కూడ దేవతలూ, దేవుళ్ళూ కనపడతారా? అంతా కట్టుకథ"
"అవునవును. మనలాంటి దెయ్యాలున్నచోట దేవతలు కనపడరులే. పిచ్చిమాటలు మాని ఇళ్ళకెళ్ళి ఇంట్లోవాళ్ళకి వండి పెట్టండి. వంటలు రుచిగా చెయ్యటం వెంకమాంబ దగ్గర నేర్చుకోండి" నాంచారమ్మ వచ్చి కేకలెయ్యటంతో అందరూ ముఖాలు ముటముటలాడించుకుంటూ ఇళ్ళవైపుమళ్ళారు.
"వాళ్ళమాటలు పట్టించుకోకమ్మా! వాళ్ళు మూర్ఖులు" అంది మంగమాంబతో.
"వెంకూ కూడ అదే అంటుంది అమ్మమ్మగారూ!"
"అది విజ్ఞురాలు! వీళ్ళమాటలు విని దానిని కష్టపెట్టకు, దాని దారికి అడ్డుపడకండి."
"అలాగే!" అంది కృతజ్ఞతగా.
* * *
ఇంటికి వచ్చాక మంగమాంబ కూతురుని దగ్గర కూర్చోపెట్టుకుని అడిగింది.
"అల్లుడు నీకు నచ్చలేదా? మంచివాడుకాదా? నిన్నేమైనా అన్నాడా? బాధించాడా?"
"ఆయన చాలా మంచివారు. పండితులు, బ్రహ్మ జ్ఞానులు. పరతత్త్వం దర్శించినవారు. అంతటి గొప్పవారిని చూడటం చాలా అరుదు."
"అల్లుడుగారితో నువ్వేదయినా దురుసుగా మాట్లాడావా? తూలనాడావా?"
"లేదమ్మా! అంత అవసరం లేదు. వారు ఎంతో మర్యాదగా ప్రవర్తించారు. వారంటే నాకెంతో గౌరవం"
"పోనీ భయపెట్టావా?"
"ఎందుకట్లా అడుగుతున్నావ్?"
"అందరూ నీవల్లే ఆయన ఇల్లువదలి వెళ్ళారనుకుంటున్నారు."
"అప్పటికే ఆయన ముక్తజీవులు. కనకనే వేడుకగా అయినా నా పక్కన కూర్చోగలిగారు. నిరంతరం జగన్మాత సాన్నిధ్యాన్ని అనుభవించే ఆ మహానుభావుని పేరైనా ఎత్తే అర్హతలేనివాళ్ళు వీళ్ళు. మూర్ఖులు, అజ్ఞానులు మాట్లాడే మాటలు పట్టించుకోకు. నిబ్బరంగా ఉండు. అన్నింటికీ పైవాడుండనే ఉన్నాడు కదా!
నన్ను నేను వారి ధర్మపత్నిగానే పేర్కొంటాను.
ఎలమిని పెంపు సొంపొదవ నింజెటి వంశజుడైన వెంకటా
చలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రు లి
మ్ములముదమంద నీశతకమున్ రచియించి యొసంగెమీకుఁగో
ర్కులు సమకూర్పవయ్య తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!" అంటూ నృసింహాలయంవైపు తిరిగి చేతులు జోడించింది వెంకమాంబ.
మంగమాంబ మనసులో ఉన్న సందేహం తుడిచి పెట్టుకుపోయింది.
* * *
తాను కాశీనుంచి వచ్చానని వేంకటాచలపతి అక్కడ గంగలో కొట్టుకుపోవటం చూశానని, అతడు చనిపోయినట్టు అతడి బైరాగి బృందం నిర్థారించిందని ఒక వార్త పట్టుకొచ్చాడు ఒక యాంత్రికుడు. ఇంకేముంది కావలసినంత సందడి. ఇది నిజమని కొందరు, సోమయాజి కల్పించిందని కొందరూ బాహాటంగానే వాదించుకున్నారు. అంత్యక్రియలు చెయ్యాలని, సన్యాసి కనక చెయ్యనక్కరలేదని, అయినా అది తల్లితండ్రులపని అనీ ఒకటే చర్చలు, నిర్ణయాలు, నిషేధాలు. ఏతావాతా అందరూ కలిసి వేంకటాచలపతి మరణాన్ని నిర్థారించటానికి ఒక నిర్ణయానికి వచ్చారు. అతడి భార్య వెంకమాంబని విధవరాలుగా చేస్తేసరి అని.
భర్తని కోల్పోయిన స్త్రీ అయిదోతనపు గుర్తులన్నీ తీసివెయ్యవలసి వుంటుంది. అదీ మామూలుగా కాదు. దానికొక తంతు. హృదయవిదారకంగా సాగే ఆ తంతుని ఆడవాళ్ళంతా ఏడుస్తూనే నిర్వహిస్తారు. అలా చెయ్యకపోతే ఆకీడేదో తమకి చుట్టు కుంటుందని భయంతో కొందరు, చెయ్యటం వల్ల సంప్రదాయాన్ని నిలబెడుతున్నామనే భేషజంతో కొందరు, తామనుభవించిన హింస ఇతరులు కూడా అనుభవించాలనే క్రూరత్వంతో కొందరు, తాము కాదంటే వినేవారులేక తప్పక అయిష్టంతో కొందరూ ఆ అవమానకర ప్రహసనంలో పాల్గొంటారు.
ఊరిలో పెద్దలందరి పక్షాన సోమయాజి ఆనతి మేరకి సోమిదమ్మ మంగమాంబతో ఈ విషయం చెప్పింది. తల్లిహృదయం తల్లడిల్లిపోయింది. కూతురితో ఈ సంగతి చెప్పటం ఎట్లా? నోరు రాదు. సోమిదమ్మ మర్నాడు ఏం చేశావని హెచ్చరించటానికి వచ్చింది. తోడుగా పారిజాత. కూతురికి చెప్పటానికి తనకి నోరు రాలేదంది మంగమాంబ. నేనే చెపుతాను. అని 'వెంకూ!' అని పిలిచింది. మంగమాంబ చేసేదిలేక గుడ్లనీళ్ళు కుక్కుకుంటూ పక్కగా నిలబడింది.
"ఏమిటి మామ్మగారూ" అంటూ వచ్చింది వెంకమాంబ.
వెంకమాంబని పట్టుకుని కౌగలించుకుని "ఈ వయసులో నీకెంత కష్టం వచ్చిందే తల్లీ!" అని బావురుమంది.
"ఎందుకలా ఏడుస్తున్నారు! ఏమైంది?" అని ప్రశ్నించింది వెంకమాంబ.
"చెప్పటానికి నోరు రావటంలేదమ్మా! కాని తప్పదుకదా!" కాసేపు ఆగింది.
"... ... ..."
"వెంకటాచలపతి పోయాడుకదా! నువ్వు ఇప్పుడు విధవరాలివి."
