అతడో నిర్ణయానికి వచ్చాడు. తనపేరు చెప్పకుండా- ఆఫీసువేపు వెళ్ళబోయి, దారితప్పి ఇటు వచ్చాను అని చెప్తాడు. అది అంత నమ్మశక్యం కాని విషయమైనా ఈ పరిస్థితులలో తప్పదు. అదే మంచిది. ఆఫీసుకి తీసుకెళ్లి రెండు మూడు ప్రశ్నలు వేసి వదిలేస్తారు. వెళ్లిపోవచ్చు.
అతడు ఆ నిర్ణయానికి వచ్చి రెండు అడుగులు తనూ ముందుకు వేసేడు. దాంతో అవతలవ్యక్తి చటుక్కున ఆగిపోయి, చేతిలోని 'వాకీ టాకీ' (దూరంగా వున్న తన వాళ్ళతో మాట్లాడటానికి వాడే వైర్ లెస్ లాటి యంత్రం) నోటి దగ్గరికి తీసుకుని ఏదో మాట్లాడటం ప్రారంభించాడు.
భార్గవకి అర్థంకాలేదు. సామ్సన్ అండ్ సామ్సన్ చాలా పెద్ద కంపెనీ కావచ్చు. కానీ సెక్యూరిటీ విషయాలు మరీ ఇంత పకడ్బందీగా వున్నాయా? ఒక పరాయి వ్యక్తిని చూస్తే వాకీ టాకీలో చెప్పవలసిన అవసరం ఏముంది? అకస్మాత్తుగా భార్గవకి భయం చేసింది. ఏదో జరుగబోతూందని ఎందుకో అనిపించింది. పారిపోవాలి.... అక్కణ్నించి పారిపోవాలి.
భార్గవ ఆలోచన్లని దూరంనుంచే పసిగట్టినట్టున్నాడు గార్డు, 'ఆగు' అని అరుస్తూ దగ్గరకు రాబోయాడు. ఇంతలో దూరంగా మరోవ్యక్తి రావటం కనిపించింది. భార్గవ వెనక్కి తిరిగి ఫ్యాక్టరీలోకి వెళ్ళబోయాడు. వెనుకనుంచి బిగ్గరగా విజిల్ వినిపించింది. రెండు అడుగులు వేసి భార్గవ ఆగిపోయాడు.
ముందునుంచి మరో గార్డు వస్తున్నాడు.
భార్గవ పని బోనులో పడ్డట్టు అయింది. తనెంత తప్పు చేశాడో అర్థమయింది. మొదటి గార్డు వచ్చినప్పుడే దగ్గిరకు వెళ్ళి వివరాలు చెప్పి వుంటే బావుండేది. ఇప్పుడిక తన పేరు చెప్పటానికి కూడా వీల్లేదు.
అంతలో ఒక చిత్రం జరిగింది.
చెవులు చిల్లులు పడేలా సైరన్ వినిపించింది.
ఆ ఊళ్లో అందరికీ సామ్సన్ అండ్ సామ్సన్ మందుల కంపెనీ నుంచి ఆ టైమ్ కి వినబడే సైరన్ గురించి తెలుసు. ముందు సన్నగా వుండి తరువాత ఎక్కువై క్రమక్రమంగా సన్నబడుతుంది. అది వెలువడగానే వాచీలు సరిచేసుకోవటం కూడా ప్రజలకి అలవాటే. చిన్న పిల్లల ఏడుపులాగా వుండే ఆ సైరన్ ని పిల్లలు ఆడుకొనేటప్పుడు ఇమిటేట్ చేస్తూ వుంటారు కూడా.
అందువల్ల ఆ సైరన్ అతడికి ఏమీ అనిపించలేదు.
కానీ దగ్గరికి వస్తున్న గార్డులు మాత్రం ఆగి, జేబులోనుంచి మాస్క్ లు తీసి మొహానికి తగిలించుకోవటం చూసేడు. ప్రతిరోజూ ప్రొద్దున్నే పాలు సరఫరాచేసే ప్లాస్టిక్ సంచుల్లా వున్నాయి అవి. వాటిని తలమీదనుంచి క్రిందికి జార్చుకుని మెడదగ్గిర తాడు బిగించుకుంటున్నారు. వాళ్ళు అదేదో చాలా అలవాటయిన విద్యగా, ఆ సమయానికి ఆటోమాటిక్ గా చెయ్యవలసిన చర్యగా దాన్ని చేస్తున్నారు. ఇంతకాలం అతడు ఈ సైరన్ ని షిఫ్టు మారటానికి వేసే సైరన్ అనుకునే వాడు.
అతడు తనచుట్టూ అంతా నిర్మానుష్యంగా వుండటం గమనించాడు. ముగ్గురు గార్డులు మూడువైపులా వున్నా, వారు తమ తమ పనులలో నిమగ్నమై వున్నారు. ఆ తరువాత అంతకన్నా మంచి అవకాశం వస్తుందనుకోలేదు. చటుక్కున నాలుగోవేపు పరిగెత్తాడు.
సైరన్ వున్నట్టుండి ఆగిపోవటంతో అక్కడ అకస్మాత్తుగా నిశ్శబ్దం వ్యాపించింది. ఎండ ఇంకా తగ్గలేదు. సైరన్ మొత్తం రెండు నిముషాలపాటూ మ్రోగిందీ అనుకుంటే- ఈ కొద్దిపాటి సమయంలోనూ తను చాలాదూరం పరుగెత్తుకుంటూ వచ్చాననుకున్నాడు అతడు. ఈ లెక్కన ఇంకో నిమిషంలో ఆఫీసు దగ్గర వుంటాడు. పరుగెత్తే హడావుడిలో వున్న భార్గవ వెనుకే గార్డులు ఆగిపోవటం, గాలి పీల్చకుండా మొహానికి మాస్కులు తగిలించుకోవటం గమనించలేదు.
అతడు మరో అడుగు వెయ్యగానే స్ స్ స్ మన్న శబ్దం ఒక్కసారిగా వినిపించింది. అతడు తలతిప్పి చూడబోయాడు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. కడుపులోంచి, లావా పొంగినట్టు ఏదో ద్రవం బైటకొస్తూన్న అనుభూతి కలిగింది. కళ్ళు తిరిగాయి. కాలు పట్టుతప్పి క్రిందికి జారిపోయాడు. కడుపులో ద్రవం వాంతి రూపంలో బైటకొచ్చింది. అప్పటికే అతడికి స్పృహ తప్పింది. గొట్టంలోంచి వస్తూన్న గాలి అతడిని చుట్టుముట్టింది.
స్పృహలో లేకుండానే, హిస్టీరియా వున్న మనిషి కొట్టుకున్నట్టూ కాళ్ళూ చేతులూ కొట్టుకున్నాడు. నోట్లోంచి వస్తూన్న ద్రవం అలా ఉబికి ఉబికి వస్తూనే వుంది.
అయితే అది కడుపులో జీర్ణంకాని పదార్ధం కాదు - రక్తం.
* * *
అతడు వెళ్ళేసరికి ఇల్లంతా నిర్మానుష్యంగా వుంది. వంటింట్లో జిన్నీ, శ్రీనూ తమకు తామే వడ్డించుకుని నిశ్శబ్దంగా తింటున్నారు.... జుట్టంతా చెదిరిపోయి, పది లంఖణాలు తీసినవాడిలా వచ్చిన అతడిని చూసి ఆ చిన్నపిల్లలిద్దరూ బెదిరిపోయారు.
"ఏమైంది నాన్నా"
భార్గవ కుర్చీ లాక్కుని వాళ్ళపక్కనే మౌనంగా కూర్చున్నాడు - చాలాసేపు మాట్లాడలేదు.
"ఏమైంది నాన్నా" తిరిగి అడిగింది జిన్నీ.
వాళ్ళకి అర్థమయ్యేటట్టూ ఎలా చెప్తాడు? 'ఇంకో పదిరోజుల తర్వాత మీ అక్కయ్య ఈ లోకంలో వుండదు' అని వాళ్ళకే భాషలో చెప్పగలడు?
"అమ్మా, పన్నక్కా ఏరి?"
"ఇంకా ఆస్పత్రిలోనే వున్నారు".
"ఇంకా ఎందుకు?"
అతడు వివరించి చెప్తున్నట్టుగా అన్నాడు. "చూడు జిన్నీ పన్నక్కకి సీరియస్ గా వుంది. చాలా సీరియస్ గా... మీరు అల్లరి చేయకూడదు ... కంగారు పడకూడదు".
"ఏమైంది డాడ్?"
"ప్రొద్దున్న తనకి మారో ఆపరేషన్ చేసారు".
"మారో అంటే మూలగ కదూ" అంది జిన్నీ.
భార్గవ ఆశ్చర్యంతో "నీకెలా తెలుసు?" అని అడిగాడు.
"శేఖరం అంకుల్ భోజనానికి వచ్చినప్పుడు చెప్పావు గుర్తులేదూ? అప్పట్నుంచే తను మూలగ తిననని ఒట్టేసుకున్నాడు. అదేగా-"
"అవును, అదే దాన్నే పరీక్ష చేస్తారు".
"ఎముకకి కన్నంపెట్టి తీస్తారా?"
"అవును".
"బాగా నొప్పిగా వుంటుందా?"
అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న శ్రీనూ తలెత్తి అడిగాడు "పన్నక్కకి బాగా జ్వరంగా వుందా?"
"ఉంది".
"తగ్గుతుందా?"
ఆ పిల్లవాడు చాలా మామూలుగా అడిగినా సూటిగా తగిలినట్టయి భార్గవ తడబడి, తమాయించుకుని, "త... తగ్గుతుంది" అన్నాడు. తింటున్నది ఆపి "డాడ్" అన్నాడు శ్రీనూ. ఏమిటన్నట్టు చూసేడు భార్గవ.
