Previous Page Next Page 
ప్రార్థన పేజి 27


    ప్యాక్ చేసిన ఐస్ క్రీమ్ కరిగి కాగితంలోంచి చుక్కలు చుక్కలుగా జారిపోతూంది.

 

                                               5

 

    సామ్సన్ అండ్ సామ్సన్.

 

    పన్నెండెకరాల విస్తీర్ణంలో కట్టబడ్డ మూడంతస్తుల భవనం! ఎత్తుగా పక్కనే బాయిలర్, దానికి కొద్దిదూరంలో వాటర్ కూలింగ్ ప్లాంట్. ఒక పక్క చిన్న ఆఫీసు. ఒక డిజైనర్ గీసినట్టు పెద్ద పెద్ద పైపులైన్లు. సంవత్సరానికి అరవైకోట్ల అమ్మకాల్తో ఆరుకోట్ల లాభాల్తో నడుస్తూన్న మందుల కంపెనీ సామ్సన్ అండ్ సామ్సన్.

 

    ఇద్దరు కేంద్ర మంత్రులకు అందులో వాటాలున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర బంధువులు ఇద్దరికీ అందులో పెద్ద పెద్ద పొజిషన్ లున్నాయి. ఆ కంపెనీలో స్ట్రయికులు లేవు. ట్రేడ్ యూనియన్ లు అందులో ప్రవేశించటానికి ప్రయత్నించి అంతగా సఫలీకృతం కాలేక పోయాయి. నలభ శాతం బోనస్- ప్రకటిస్తూన్న భారతదేశపు చాలా తక్కువ ప్రభావవంతమైన కంపెనీల్లో ఒకటి - సామ్సన్ అండ్ సామ్సన్.

 

    పది సంవత్సరాల క్రితం అది చాలా సామాన్యమైన కంపెనీ. మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రిసెర్చి నుంచి కేన్స్- క్యూర్ మందు తాలూకు పేటెంట్ కొనుక్కొన్న తరువాత దాని దశ తిరిగింది. షేరు ధర పాతిక నుంచి నూటయాభైకి పెరిగింది. మరిన్ని రంగాల్లో విస్తృతమైంది.

 

    సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ మానేజింగ్ డైరక్టరు పేరు ఆర్.ఎస్.కె. నాయుడు. ఆరడుగుల ఎత్తు. భారీ విగ్రహం. అతడంటే అందరికీ హడల్. కానీ మనిషి మాత్రం సౌమ్యుడు. సగంకాలం తిరుపతి, భద్రాచలం, పుట్టపర్తిలాంటి ప్రదేశాల్లో గడుపుతూ వుంటాడు. మిగతా సగంకాలం ఢిల్లీలో వుంటాడు. ఒక మార్వాడీ అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పటి మాటకాదది. పాతిక సంవత్సరాల క్రితం సంగతి. ఆ వివాహం జరిగేక అతడిని అదృష్టం వరించింది అని చెప్పుకుంటారు. అతడి క్వాలిఫికేషన్స్ సంగతి ఎవరికీ తెలీదు. గత చరిత్ర గుర్తురాదు. ఆ అవసరం కలిగించడు. ఏయే దేశంలో ఏయే మందు ఎంతకి అమ్ముడు పోతుందో- ఏ మందు దిగుమతి చేసుకుంటే ఎంత లాభం వస్తుందో అతడు నోటి చివర లెక్కకట్టి చెప్పగలడు. బోర్డు మీటింగ్ లో కూర్చుంటే ఏ డైరెక్టర్ కి ఏ అవసరం వుందో వాళ్లు చెప్పకుండానే తెలుసుకోగలడు. ముఖ్యమంత్రితో రాజకీయాలు, సాయిబాబా భక్తులతో తాత్వికచర్చలు, భారతదేశపు చీఫ్ డ్రగ్ కంట్రోలర్ తో స్త్రీ సంబంధమైన విషయాలు ఒకే లెవల్లో అంటీముట్టకుండా మాట్లాడగలడు. అందుకే ఆరెస్కే నాయుడు తన కొత్త "మాత్ర"తో వస్తున్నాడంటే మిగతా కంపెనీలు భయపడతాయి. 'కొత్త' టానిక్ పరిచయం చేస్తున్నాడంటే తమ అడ్వర్ టైజ్ మెంట్ బడ్జెట్ సరిచేసుకుంటాయి.

 

    అంతవరకూ ఎందుకు?

 

    అనుబంధ సంస్థగా ఒక కంపెనీ పెట్టాడు. పాలని మైదాలో కలిపి బాగా వేడిచేసి నల్లబడేవరకు ఇగిర్చి ఆ పొడిలో 'కోకో' గింజల పొడి కలిపి పంచదార చేర్చాడు- అంతే.

 

    "నూట్రా కోకోమాల్ట్" తయారయింది.

 

    దానికి ఐ.ఎస్.ఐ. మార్క్ సంపాదించాడు. మరుసటి రోజునుంచి రేడియోలో ప్రకటనలు ప్రారంభమయ్యాయి. "మీ పాప ఆరోగ్యకరమైన బోసి నవ్వులు మీ ఇంట్లో ప్రతిబింబించాలనుకుంటున్నారా? ఇప్పట్నించే వాడటం ప్రారంభించండి.... న్యూట్రా కోకోమాల్ట్. అనారోగ్యంనించి తొందరగా కోలుకోవటానికి అయిదు రకాల విటమిన్లు కలిసిన మాల్టు న్యూట్రా కోకోమాల్టు. రోజంతా మిమ్మల్ని హుషారుగా వుంచటానికి కాఫీకన్నా మేలయినది... నూట్రా కోకోమాల్టు".

 

    అంతే ఆర్నెల్లకల్లా అది అమ్మకంలో టాప్ అయింది. అర్థరూపాయి మైదాలో రెండు రూపాయల పాలు కలిపి పన్నెండు రూపాయలకి అమ్మగలిగే ఘనత అతడికే దక్కింది. డబ్బాడు మాల్టుకన్నా అర్థపావు గోధుమలు ఇంకా ఎక్కువ బలం ఇవ్వగలవన్న సత్యాన్ని గ్రహించలేని ప్రజలు, ఈ పానీయాల్ని తాగి రోజురోజుకి పెరుగుతున్న తమ కండల్నీ, బలాన్నీ చూసుకొని సంతృప్తి పడుతున్నారు. ప్రజల అజ్ఞానాన్ని పారద్రోలే బాధ్యత ప్రభుత్వానిది కాదు. (ఇప్పటికీ మీరు చేస్తున్నది అదే- ప్రియమైన పాఠకులారా! మీ వంటింట్లో డబ్బాలమీద కంపోజిషన్ ని ఒకసారి పరీక్షించి చూసుకోండి) ఒక మందుగానీ, ప్రొడక్టుగానీ, దానిధర, ఎలా నిర్ణయించాలో నాయుడికి బాగా తెలుసు. ఎవరెవర్ని ఎలా ఎలా ఆకట్టుకోవాలో కరతలామలకం. ఎన్ని తెలియకపోతే అతడు 'కాన్స్ క్యూర్' ని మిల్లీగ్రాము రెండొందలకి అమ్మగలడు.

 

                                                            *    *    *

 

    అక్కడ అంతా నిశ్శబ్దంగా వుంది. లోపల ఫ్యాక్టరీలో కూడా ఎవరి పని వారు మౌనంగా చేసుకుపోతున్నారు.

 

    పులి నిద్రపోతున్నప్పుడు బోనుచుట్టూ పేరుకున్న నిశ్శబ్దంలాంటి నిశ్శబ్దం అది. భార్గవ లోపలికి వెళ్లడాన్ని గార్డు గమనించలేదు. అతడు ఫెన్సింగ్ దాటి అట్టపెట్టెల మధ్యకు చేరుకున్నాడు. ఖాళీ పెట్టెలు అవి. పెట్టెలమీద మాత్రం పెద్ద అక్షరాలతో వ్రాసివుంది.

 

    కాన్స్ - క్యూర్ అని.

 

    అతడు వాటిని దాటి లోపలికి వెళ్లడాన్ని గార్డు గమనించలేదు. అతడు ఫెన్సింగ్ దాటి అట్టపెట్టెల మధ్యకు చేరుకున్నాడు. ఖాళీ పెట్టెలు అవి. పెట్టెలమీద మాత్రం పెద్ద అక్షరాలతో వ్రాసివుంది.

 

    కాన్స్ - క్యూర్ అని.

 

    అతడు వాటిని దాటి లోపలికి వెళ్లబోతూంటే వెనుకనుంచి "హేయ్ ఎవరది?" అన్న కంఠం ఒకటి బొంగురుగా వినిపించింది. భార్గవ ఉలిక్కిపడి వెనుదిరిగాడు.

 

    భార్గవ గుండెల్లో రాయి పడ్డట్టయింది. అనుమతి లేకుండా అక్కడి వరకూ రావటం తప్పని తెలుసు. దానికి కూడా సరి అయిన కారణం లేదు. అందుకని వెంటనే సరి అయిన సమాధానం చెప్పలేకపోయాడు. అతడి మౌనం అవతలి వ్యక్తికి అనుమానం తెప్పించింది.


    
    "ఆగక్కడే..." అని అరచి దగ్గరకు రాబోయాడు. అతడికి అనుమానం బాగా దృఢమైనట్టూ అతడి వైఖరే చెపుతూంది. భార్గవకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తన పేరూ, ఉద్యోగం చెప్పొచ్చు.

 

    కానీ అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాలి. అది చెప్పలేడు. తన పేరు చెపితే ఈ విషయం శంకర్ లాల్ వరకూ వెళుతుంది. తనకి కాన్స్ - క్యూర్ పట్ల నమ్మకం లేదన్న సంగతి అతడికి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో తనిక్కడికి చాలా అనధికారంగా వచ్చాడన్న విషయం అతడి వరకూ వెళ్ళటం బావోదు. తన పేరు చెప్పకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వుంటుంది. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ సెక్యూరిటీ ఎంత కాఠిన్యమయినదో తనకి తెలియంది కాదు.

 

    భార్గవ ఈ ఆలోచనల్లో ఉండగానే ఆ గార్డు దగ్గరికి వచ్చాడు. భార్గవ చుట్టూ చూసేడు. పారిపోవటానికి చోటులేదు. ఎత్తయిన గోడ, మీద ఫెన్సింగు. అయినా తను పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే వాళ్లు 'షూట్' చేసినా చెయ్యొచ్చు. అందులోనూ నాయుడుగారి కంపెనీ. చంపి ఏ బాయిలర్ లోనో పడేస్తే బట్టలతో సహా ఆసిడ్ లో కరిగిపోతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS