"మొన్న పన్నక్కకి రక్తం పాడయిందని కొత్త రక్తం ఎక్కించారు?"
"అవును".
"అలాగే ఎముకలకి కన్నంపెట్టి మొత్తం మూలగ లాగేసి, కొత్త మూలగ ఎక్కిస్తే"
మనసులోనే వాళ్ళ తెలివికి ఆశ్చర్యపడుతూ, "దాన్ని ఇంగ్లీషులో మారో ట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు. ఇంకా మనదేశానికి రాలేదు".
"వస్తే పన్నక్కకి నయం అయిపోతుందా?"
"రోగం లేతగా వుంటే నయం అవుతుంది. కేన్సర్ కణాలు బాగా పెరిగిపోతే అవదు" అన్నాడు. ప్రార్థనది టెర్మినల్ కేస్ అన్న విషయము వాళ్ళకి చెప్పదల్చుకోలేదు. (మరణం నిర్థారణ అయి, రోగి కొద్ది కొద్దిగా కృశిస్తూ వుంటే దాన్ని టెర్మినల్ కేసు అంటారు.)
పిల్లలిద్దరూ చాలాసేపు మాట్లాడలేదు. ఏమనుకున్నాడో ఏమో శ్రీనూ తింటున్న ముక్కని కంచంలో పడేసి, "ఈ రోజునుంచి నేను మూలగ తినను" అన్నాడు.
జిన్నీ "నేను కూడా" అంది.
ఈ ఇబ్బందికరమైన స్థితిని తప్పించటానికి "సర్లెండి, సర్లెండి. తొందరగా తయారవండి. మనం ఆస్పత్రికి వెళ్ళాలి" అన్నాడు.
వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళేసరికి వసుమతి బయట వరండాలో నిలబడి వుంది. కారిడార్ లో ఇద్దర్నీ చెరోవైపునా చేతులు పట్టుకుని వస్తూన్న భార్గవని చూడగానే ఆమెకి అంతక్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి తప్పుచేసిన దానిలా బాధపడసాగింది. భార్గవ మొహం మాత్రం మామూలుగా వుంది. వాళ్ళు ఆమెని చూడలేదు.
వాళ్ళు ముగ్గురూ అలా ప్రార్థన మంచం దగ్గిర నిలబడి మాట్లాడుతూ వుంటే ఆమె దూరంగా నిలబడి చూడసాగింది. ఒక్కరోజులో ఆ కుటుంబానికి ఎంత దగ్గిరగా వచ్చి ఎంత దూరంగా వెళ్ళిపోయింది తను... వాళ్ళంతా ఒకటి. తను ఒక్కతే వేరే అన్న భావం ఎంత కాదనుకున్నా కలుగుతుంది.
లోపల ప్రార్థన పిల్లలిద్దర్నీ చూసి "హాయ్" అంది నవ్వుతూ.
'హాయ్ పన్నక్కా'.
ఈ లోపులో భార్గవ కేస్ షీట్ చూసేడు. సెల్ కౌంట్ 56,000 ఇన్ టేక్ ఆఫ్ కాన్స్ - క్యూర్ ఎంతుందా అని చూసేడు. 3 డోసెస్, అతడి భృకుటి ముడిపడింది. పేషెంట్ ని చేర్చి ఇంకా పూర్తిగా ఆరు గంటలు కాలేదు. అప్పుడే మూడు డోసులు.
టెంపరేచర్ చూసేడు. నూట ఒకటి.
భార్గవ అవన్నీ పరీక్షిస్తూంటే పిల్లలు ప్రార్థనతో మాట్లాడసాగేరు.
"పరీక్షలు మార్చి ఆఖరులో అట. ఈ రోజు బోర్డులో పెట్టారు".
"నిజమా? తొందరగా వచ్చెయ్యాలయితే".
ఈ లోపులో వసుమతి లోపలికి వచ్చింది. భార్గవ ఆమెతో, "నువ్విక్కడే వుండాల్సి వుంటుందేమో రాత్రికి" అన్నాడు.
ఆమె బాధపడింది. అతడనకముందే ఆ మాట తను అనాల్సింది. అయినా తనెప్పుడూ లేటే... జరిగిపోయిన దానికి క్షమాపణ చెప్పుకోవాలి. అదొకటి వుంది. ఎలా ప్రారంభించాలో తెలియటంలేదు. దాన్ని ఇతడు పట్టించుకోకపోవడం మరింత బాధ కలిగిస్తూంది.... నేనూ మీలో ఒకదానినే, నన్నూ మీలో ఒకరిగా గుర్తించండి, ప్రార్థన మీ అందరికన్నా ఎక్కువగా నాకు కావాలి, మీకు ఇదెలా చెప్పటం?
ఆమె మౌనాన్ని అతను మరోలా అర్థం చేసుకుని "పోనీ పిల్లల్తో ఇంట్లో నువ్వుండు, నేను ఇక్కడ వుంటాను" అన్నాడు. ఆమె కంగారుగా "లేదు లేదు నేనుంటాను" అన్నది.
అతడు మరేమీ మాట్లాడకుండా, "మంచిది. ఈసారి వచ్చినపుడు పక్కబట్టలు తీసుకొస్తాను" అని, పిల్లలవైపు తిరిగి "వెళదామా" అన్నాడు. వాళ్ళు ప్రార్థనవైపు తిరిగి చెయ్యివూపి, తండ్రితో కలిసి బయటకు నడిచారు. అందరూ అలా వెళ్ళిపోయేసరికి వసుమతి గోడకి ఆనుకుని నిలబడి క్రింది పెదవిని పంటితో నొక్కిపట్టి రాబోతున్న దుఃఖాన్ని ఆపు చేసుకుంది. ఆ చిన్నపిల్లలు కూడా తన ఉనికిని గుర్తించలేదు. ప్రార్థనకి తన దగ్గరున్నంత చనువు వీరికి లేదు. అది వేరే సంగతి, కానీ.... కానీ....
రూము ముందున్న వరండాలోంచి ఆమె క్రిందికి చూస్తూ నిలబడింది. పిల్లలిద్దరూ చెరోవైపూ అతడి చేతులు పట్టుకుని నడుస్తున్నారు. ఇంకా సాయంత్రం కాలేదు. ఎండ వేడిగా మొహానికి కొడుతూంది. వాళ్ళు కారు దగ్గరికి చేరుకుంటున్నారు. ఆమె అలానే నిలబడి వుంది.
ఇరవై నాలుగ్గంటల్లో జీవితం ఎంతగా మారిపోయిందో తల్చుకుంటూంటే బాధగా కన్నా భగవంతుడి లీలలపట్ల ఆశ్చర్యంగా వుంది.
* * *
ఆమె అలా వరండా చివర నిలబడి వెళ్ళిపోతున్న భర్తనీ, పిల్లల్నీ చూస్తున్న సమయానికి, మరోవైపు నుంచి శారద ప్రార్థన వున్న గదిలోకి ప్రవేశించింది.
"ఏమ్మా, బావున్నావా?"
ప్రార్థన ఆమెని చూసి సంభ్రమంతో లేవబోయి, చేతికున్న ఐ.వి. ఫ్లూయిడ్ తాలూకు గొట్టం అడ్డుపడగా, మళ్ళీ పడుకుంటూ "రండి టీచర్" అంది సంభ్రమంతో. తన చిన్న అనారోగ్యాన్ని పరామర్శించటానికి టీచర్ స్వయంగా రావటం ప్రార్థనకి సంతోషాన్ని కలుగచేసింది. ఆ సంభాషణలో వచ్చింది 'శారద' అన్న విషయం మర్చిపోయింది.
"ఏసుపాదాన్ని చూడటానికి వచ్చానమ్మా. నువ్వూ ఇక్కడే వున్నావని చెప్పాడు.... పాపం నీకూ కేన్సరటగా..."
ఆ పాపకి ముందు ఆమె చెపుతున్నది అర్థం కాలేదు. చేసుకునేటంత వయసు కూడా లేదు. కేన్సరన్న పదం తెలుసు, దాని ప్రమాదం సంగతి తెలీదు. కేన్సరన్న పదంకన్నా శారద చెపుతూన్న తీరే ఆమెనెక్కువ భయపెట్టింది.
"అందులోనూ బ్లడ్ కేన్సరొస్తే మరీ కష్టమటగా. అయినా ఇదంతా నీ తప్పుకాదులే- ఒక్కొక్కరు అడుగుపెట్టిన వేళా విశేషం... ఆ రోజు చెప్పా పెట్టకుండా శుభలేఖలు పంచినప్పుడే అనుకున్నా - జాతకాలూ అవీ చూడకుండా ఈ పెళ్ళిళ్ళేమిటి? అని. అయినా గేలాలేసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఇలా గప్ చిప్ గానే చేసుకోవాలి. లేకపోతే చరిత్రలు బయటపడ్తాయి. అయినా మీ నాన్నగారికి తెలియకపోతే నువ్వయినా చెప్పొద్దా అమ్మాయ్.... పుట్టింట్లో వుండగా తల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి చంపింది. ఇప్పుడు ఈ ఇంటికొచ్చి నిన్ను... అయినా నా కెందుకులే అమ్మాయ్! క్లాసులో బ్రిలియంట్ స్టూడెంట్ కి ప్రాణంమీద కొచ్చిందంటే మనసు ఆగక వచ్చాను గానీ- లేకపోతే నాకు అవసరం ఏముంది! వెళ్ళొస్తానమ్మాయ్..." అని లేచి బయటకొచ్చి వరండాలో నిల్చుని అటు చూస్తున్న వసుమతిని పలకరించకుండా మరోవైపు నుంచి వెళ్ళిపోయింది.
క్రిందకి చూస్తున్న వసుమతి, భార్గవ కారు ఎందుకో గేటు దగ్గిర ఆగటం గమనించింది. అలా ఆగటానికి కారణం జిన్నీ. ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా "డాడీ ఒక్కక్షణం. ఇది ఇవ్వటం మర్చిపోయాను" అంది కంగారుగా. ఆ చేతిలో ఇంటి దగ్గర్నుంచి తెచ్చిన ప్యాకెట్ వుంది. భార్గవ విసుక్కుంటూ కారు వెనక్కి తిప్పి ఆపుచేశాడు.
