"సర్లే ఏదో తంటాలు పడతాను. తప్పుతుందా!" అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.
చెప్పినట్లే మర్నాడు స్టేషన్ కి వెళ్ళాడు. అనుకున్న టైముకి గంటలేటుగా గోదావరి వచ్చేసింది. చీమల పుట్టలోంచి వచ్చే చీమల్లా ఉన్న జనాన్ని చూసి విసుక్కున్నాడు కృష్ణ. ఇప్పుడీ జనంలో వాళ్ళని ఎలా పట్టుకోవడం అనుకున్నాడు. మరోసారి తనవాళ్ళని తిట్టుకున్నాడు.
ఓ పక్కగా నిలబడ్డాడు. పదినిముషాల్లో రష్ తగ్గింది రైలు పక్కనే నడుస్తూ రిజర్వేషన్ కంపార్టుమెంట్ ల దగ్గర వెతకడం మొదలుపెట్టాడు.
ఇంకా చాలామంది కంపారర్టుమెంట్లలోంచి దిగుతున్నారు.
ఓసారి ఆ చివరిదాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు. క్రమంగా ప్లాట్ ఫాం ఖాళీ అయిపోతుంది. ఓ త్రీటయర్ బోగీ పక్కన నిలుచుని కనిపించింది ఓ అమ్మాయి.
పక్కన సూట్ కేసు. రెండు పెద్ద పెద్ద తెల్ల టిఫిన్లు రెండు తాటాకు బుట్టలు, అరటిపళ్ళ గెల ఆ అమ్మాయి వంకే చూస్తూ అటువెళ్ళాడు. ఎవరూ తనకి కావలసిన వాళ్ళలా కనిపించలేదు.
మళ్ళీ వెనక్కి వచ్చి దూరాన నిలబడి ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాడు. తనవంకే చూస్తున్న అతడిని చూసి తల తిప్పుకుంది ఆ అమ్మాయి.
మళ్ళీ అనుమానం వచ్చింది అతనికి. ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళి కంపార్టుమెంట్ కి అతికించి వున్న చార్టు చూశాడు. సగం చిరిగిపోయి వుంది అది. వున్న సగభాగములో తనక్కావల్సిన పేరు లేదు.
ఇంకోసారి ఎగాదిగా ఆ అమ్మాయిని చూసి దగ్గరకు వెళ్ళాడు. సూట్ కేస్ టాగ్ మీద కనిపించాయి రాధ అనే అక్షారాలు. అమ్మయ్య అనుకుని "నువ్వు రాధవా? నేను కృష్ణని" అన్నాడు అంతే తారాజువ్వలా లేచింది రాధ.
"ఇందాకటినించీ చూస్తున్నాను నీ వ్యవహారం! ఏం నీకు అక్కాచెల్లెళ్ళు లేరూ?" అంటూ పెద్ద గొంతేసుకొని అరవసాగింది.
చుట్టుపక్కలున్న జనం అంతా పరిగెట్టుకువచ్చారు. "ఏమిటమ్మాయ్? ఏం జరిగింది?" ఓ నడివయస్సాయన అడిగాడు.
"చూడండీ! ఈ రౌడీ ఇందాకటినించి నావంకే చూస్తూ వూరికే అటునించి ఇటు ఇట్నించి అటూ తిరుగుతున్నాడు. నేను ఒంటరిగా వచ్చాను. బంధువుల ఇంటికి వెళ్ళాలి మా వాళ్ళు వస్తానన్నారు. వాళ్ళకోసం చూస్తూ నిలబడ్డాను. వంటరిగా ఉన్నానని అలుసు కనిపెట్టి దగ్గరికొచ్చి నువ్వు రాధవి నేను కృష్ణుడిని అంటూ ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు" అంది రాధ.
చుట్టూ చేరిన జనం అంతా కృష్ణవంక కోపంగా చూశారు. "అమ్మో! పట్టపగలు, స్టేషన్లో ఆడపిల్లని ఏడిపిస్తున్నాడంటే గుండెలు తీసిన బంటులా ఉన్నాడు" అని గుసగుసలాడుకున్నారు.
"ఏవయ్యా? నీకు బుద్ధి వుందా? చూడ్డానికి మర్యాదస్తుడిలా వున్నావు. వంటరిగా దొరికిందికదా అని ఆడపిల్లని అల్లరి చేస్తావా? అంటూ పోట్లాటకి సిద్దపడ్డాడు ఒక యువకుడు.
"ఇలాటాళ్ళని దేహశుద్ధి చేసి వదలాలి బాబూ!" అంటూ తన్నడానికి రెడీ అయిపోయాడు.
తెల్లబోయి నిలబడి జరుగుతున్నది అంతా చూస్తున్న కృష్ణ తెలివి తెచ్చుకుని చేతులు జోడించాడు.
"అయ్యా, అమ్మలారా కాస్త నామాట వినండి. నేను రౌడీని కాదు. నా పేరు కృష్ణ. మా బంధువుల అమ్మాయి బెజవాడనుంచి వస్తుంటే రిసీవ్ చేసుకోడానికి వచ్చాను. ఆవిడ పేరు రాధ. ఈవిడ ఆవిడేమోననుకొని పలకరించాను. అంతేగానీ ఏడిపించాలనీ, ఆటపట్టించాలనీ కాదు" అన్నాడు.
"ఏమిటీ? నువ్వు వర్ధనమ్మ అత్తయ్య కొడుకువా?" అంది రాధ ఆశ్చర్యంగా.
అవును.....అని తలూపాడు కృష్ణ.
ఈ తమాషా గమనించి అందరూ నవ్వుకుంటూ తప్పుకున్నారు. "భలేపిల్ల సీమటపాకాయలాటి పిల్ల. అసలు అందరాడపిల్లలూ ఇంత ధైర్యంగా వుంటే రౌడీల ఆట కట్టయిపోతుంది. ఈవ్ టీజింగ్ వుండదు" అనుకున్నారు కొంతమంది తమ దారిన వెళ్ళిపోతూ.
రాధకు అయ్యో అనిపించింది. "వర్ధనమ్మ అత్తయ్య వస్తుంది స్టేషన్ కి అని చెప్పారు నాన్న. నువ్వొస్తావని నాకేం తెల్సు అయినా అలా ఎగాదిగా చూడకపోతే నేను ఫలానా అని చెప్పొచ్చుగా" అంది నిష్టూరంగా.
"చెప్పేదాకా ఎక్కడ ఆగావు నువ్వు? పలకరించగానే గయ్ గయ్ మని ఆల్సేషన్ డాగ్ లా అరవడం మొదలు పెట్టావు ఇంకా నేనేం చెప్పేది నా తలకాయ" విసుగ్గా అన్నాడు కృష్ట.
"మరి అరవక ఏం చెయ్యమంటావు చెప్పు! నేనా వంటరిగా వున్నాను. ఊరా కొత్త ఊరు. నిన్నూ నీ వాలకాన్ని చూస్తె భయం వేసింది. అయినా ఆ గడ్డం ఏమిటీ? ఏదయినా మొక్కా?" అడిగింది.
ఒళ్ళు మండింది కృష్ణకి "మరే! ఎవరిచేతా తన్నులు తినకుండా నిన్ను తీసుకుని తిన్నగా కొంపకిచేరితే కొండకి వస్తానని మొక్కుకున్నాను!" అనేసి ముందుకు నడిచాడు.
టాక్సీ మాట్లాడాడు కృష్ణ. సామాన్లు పెట్టించి "ఎక్కు" అన్నాడు.
ఎక్కి కూర్చుంది రాధ. టాక్సీ బయలుదేరింది.
"అమ్మయ్య! నువ్వొచ్చావు హాయిగా వుంది. నాన్నగారు ఎంత కంగారుపడ్డారు. ఆడపిల్లని వంటరిగా వాల్తేరు పంపుతున్నాను అని ఆదుర్దాపడ్డారు" అంది రాధ.
" ఏ ఆదుర్దా అక్కరలేదు, నిన్ను వాల్తేరుకాదు, వాషింగ్ టన్ వంటరిగా పంపినా ఏమీ ఢో కాలేదు" అనుకున్నాడు కృష్ణ.
వాకిట్లో టాక్సీ ఆగగానే మెల్లిగా మంచంమీద నుండి లేచి గుమ్మంలోకి వచ్చింది వర్ధనమ్మ సామానులు పట్టుకుని లోపలికివస్తున్న కొడుకునిచూసి "రాధ వచ్చిందా?" అని అడిగింది.
"ఆ వచ్చింది. చావుతప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లు ఎలాగో తీసుకొచ్చాను" అనేసి ఆ సామానులు అక్కడపడేసి మళ్ళి బయటికి వెళ్ళాడు. టాక్సీకి డబ్బులిచ్చి పంపించేశాడు.
రాధ లోపలికి వచ్చింది. 'వచ్చావుటే తల్లీ! ఎన్నాల్టికి చూశాను. కిందటిసారి చూసినపుడు పదేళ్ళ పిల్లవి." అంటూ ఆదరంగా దగ్గరికి తీసుకుంది వర్ధనమ్మ. సత్యం గారూ, దీపికాకూడా ఆప్యాయంగా పలకరించారు.
దీపిక కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి తను తెచ్చినసామానులు అన్నీ ఓ పక్కగా సర్దేసింది రాధ. బాత్ రూం ఎక్కుడుంది? స్నానం చెయ్యాలి" అంది.
"చూపిస్తాను రండి" అందిదీపిక.
"నన్ను అంత గౌరవించనక్కరలేదు దీపికా! రాధా అను. మీరూ, అండీ అనుకుంటూవుంటే ఏమిటో పరాయి వాళ్ళు మాట్లాడుతున్నట్లు వుంటుంది" అనేసింది రాధ.
స్నానంచేసి వచ్చేసరికి వడ్డన ప్రయత్నం చేస్తుంది ఓపిక లేకపోయినా వర్ధనమ్మ. ఆవిడకి సాయం దీపిక.
అది చూసి కంగారుపడిపోయింది రాధ. "అదేమిటి అత్తయ్యా! నువ్వు చేస్తున్నావేం? నేనొస్తానాగు" అంటూ వారించింది. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆవిడని బలవంతాన ఓ పక్కన కూర్చోబెట్టి దేపికనికూడా వారించి కొంగు దోపుకుని పన్లో దిగిపోయింది.
చకచక వడ్డించి తనువస్తూ తెచ్చిన నెయ్యి బయటకు తీసింది. సత్యంగారూ, కృష్ణ భోజనాలకి కూర్చున్నారు.
"నాన్న ఎలా వున్నాడమ్మా? ఆరోగ్యంగా వుంటున్నాడా?" భోంచేస్తూ అడిగారు సత్యంగారు.
"బాగానేవున్నారు మామయ్యా. ఈ మధ్య ఆ పెళ్ళి ఆగిపోవడంతో బాగా కృంగిపోయారు."
"అసలు అతను ఎలా పోయాడమ్మా?"
"ఏమిటోమరి అదేదో జ్వరం వచ్చిందిట అప్పటికీ గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్ళారట. కానీ ఫలితం దక్కలేదు" అంది రాధ.
"ప్చ్ ఏమిటో పాపం!" సానుభూతిగా అన్నారు సత్యంగారు.
