Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 26


    "రాగిణిగారూ! మనమందరం నిమిత్తమాత్రులమే! మనని నడిపించే శక్తి వేరేవుంది?"
    "నాకు కనిపించే శక్తి మీరే సిస్టర్! మీరు రాకముందు అనేకరకాలుగా ఆలోచించాను. చచ్చిపోదామనుకున్నాను. మళ్ళీ నాకు నేనే అది చేతకాని తనం అని ఊరుకున్నాను. ఏదైనా ఆశ్రమంలో చేరిపోదామనుకున్నాను, ఎవ్వరికీ భారం కాకుండా శేష జీవితాన్ని గడపడానికి! కానీ, అదీ పిరికితనమని ఊరుకున్నాను పైగా సోమరితనమని కూడా అనిపిస్తుంది నాకు! అందుకే ఆ రెండూ కాకుండా, ఈ మూడో మార్గాన్నెంచుకున్నాను."
    "మంచి పనిచేశారు!" అంటూ చేతికున్న గడియారం చూసుకుంది. ఎనిమిది గంటలవుతోంది రాత్రి!"
    "ఇక వెళతాం రాగిణిగారూ" అంది పిల్లలకోసం రహీంతో కబురు పంపించిన సిస్టర్ ఫెర్నాండిస్.
    "అలాగే అప్లికేషన్ రేపే రాసిస్తాన్ గుడ్ నైట్" అంది రాగిణి.
    "అలాగే. అంది సిస్టర్ ఫెర్నాండిస్.
    గుడ్ నైట్" అన్నారు పిల్లలు అందరికీ కలిపి గుడ్ నైట్ చెబుతూ!
    వాళ్ళు వెళ్ళినవైపే కన్నార్పకుండా చూస్తూనుంచుంది రాగిణి!
    "ఏమంటుంది సిస్టరు?" అడిగింది సూర్యకుమారి. జరిగినదంతా చెప్పింది రాగిణి! తనుతీసుకున్న నిర్ణయంకూడా చెప్పింది.
    "మంచిపని చేశావు. ఏదో ఒకరోజు శిల్ప మారకపోదు! నువ్విక్కడుండడమే మంచిది" అంది సూర్యకుమారి!
    "పిన్నీ! శిల్ప మీతో బాగా మాట్లాడిందా?"
    "ఓ..... బోలెడు కబుర్లు! దాని వయస్సుకి మించిన ఆలోచనలూ, మాటలూ!"
    "నా ఊసేమైనా ఎత్తిందా?" ఆత్రుతగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.....
    "లేదు! నేనే నీ ఊసెత్తాను రాగిణీ!"
    "అది తప్ప ఏమైనా చెప్పు మామ్మా అంది! ఆ పిల్ల మనస్సులో నీమీద కోపమూ, ద్వేషమూ తప్ప ఏ మాత్రం అభిమానమూ, ఆప్యాయతా లేవు! అవి కావాలంటే, శిల్ప ఎప్పటికయినా మారాలంటే, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలామంచిది" అంది ఆమె.
    రాగిణి సరేనన్నట్లు తలూపింది. నాలుగు మెతుకులు తిని, నిద్రలోకి జారుకున్నారిద్దరూ!
                                                                      *    *
    జరిగిదంతా తెలుసుకుని ఎంతో బాధపడ్డారు కోటయ్యగారు! అందుకేనేమో 'మనసు విరగకూడదు', అంటారు! పిల్లలకైనా పెద్దలకైనా మనసు విరిగితే అతుక్కోదు అతికించడం కష్టం.
    పదిరోజుల లోపలే సిస్టర్ ఫెర్నాండిస్ దగ్గరనుంచి రాగిణికి లెటర్ వొచ్చింది ఊటీలోనే, ప్రైమరీ స్కూలు "డెఫ్ అండ్ డమ్" స్కూల్లో, అంటే మూగా, చెవిటీ స్కూల్లో, డాన్సు టీచరు ఉద్యోగం ఒకటి వుందనీ; మూగా, చెవిటీ వారికి సంగీతం నృత్యాల ద్వారా ఆ పిల్లల్లో చైతన్యాన్ని కలిగించాలని, ప్రభుత్వంవారు ఒకకొత్త స్కీముని ప్రారంభించారని రాసింది సిస్టర్ ఫెర్నాండిస్.
    రాగిణి హృదయం ద్రవించింది! ఒకరోజున భార్గవ దగ్గర నుంచి తిరిగొచ్చేశాక, తన జీవితానికి ఈ గజ్జలే శాపంగా తయారయ్యాయని చెప్పి, 'వాటిని ఈ జీవితంలో మళ్ళీ చూడను' అంటూ ఒకపాత గుడ్డలో పెట్టి మూట కట్టేసి, పెట్లో ఎక్కడో అడుగున పడేసింది. కానీ ఈ సంగతి విన్నాక, ఈ గజ్జెలకి, మాటరాని చెవులు, వినపడని అభాగ్యులు, ఆ చిన్నారి జీవితాలను బాగుచెయ్యడానికి పనికొస్తాయని తెలిసి సంతోషించింది. తన అజ్ఞానానికి తనే విస్తుపోయింది. నిప్పు కాలుతుందని, వంట చెయ్యడం మానేస్తామా? ఈ అనంత సృష్టిలో, ప్రాణం తీసే శక్తి ప్రాణం పోసే శక్తి ఒకేచోట వుంటాయి! మనిషికి భగవంతుడిచ్చినవరం తెలివితేటలు! ఆ ఆయుధంతో, ఆ శక్తిని మంచి పనులకి ఉపయోగించుకోవాలి! అనుకుంటూ ఆ ఉత్తరాన్ని కోటయ్య బాబాయ్ కి చూపించింది. "రాగిణీ! నిన్ను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది, కన్నవారికీ, కట్టుకున్నవారి, నిన్ను కోరుకున్నవారికీ, నువ్వు కోరుకున్నవారికీ కూడా ధూరమైపోయావు. చివరికి కన్నబిడ్డకి కూడా కాకుండా పోయావు. నీ ఏకాకి జీవితం ఎలా గడుపుతావో ఏమో! దేముడు నీకు ఎప్పుడూ మేలుచేసి నిన్ను చల్లగా చూడాలనీ, నీకోరిక నెరవేరాలనీ ఆశీర్వదించడం తప్ప ఏం చెయ్యగలను? వెళ్ళిరా!" అన్నారు కోటయ్యగారు!
    మర్నాడే ప్రయాణమయింది రాగిణి. పసుపూ కుంకుమ చీరా సారెతో పుట్టింటి మర్యాదలన్నీ చేశారు కోటయ్యగారు, తల్లీతండ్రీ ఇక్కడలేనిలోటు తీరుస్తూ! కొత్త జీవితంలోకి కాలుపెట్టింది రాగిణి మరో మజిలీని ప్రారంభిస్తూ!
    రాగిణి తిన్నగా స్కూలుకే వెళ్ళిపోయింది సామాన్లతో సహా. సిస్టర్ ఫెర్నాండిస్, టాక్సీని పిలిపించి, రహీంని పంపించారు రాగిణి కోసం తీసుకున్న ఇల్లు చూపించి రావడానికి స్కూలు అడ్రసు ఇచ్చింది రాగిణికి ఆ పూటంతా రహీంని రాగిణి దగ్గిరే వుండమంది, కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యడానికి. ఆ ఇల్లు ఒక బ్యాంక్ ఆఫీసరుది. అతనికి ట్రాన్స్ ఫర్ అవడంవల్ల, ఫర్నీచర్, గ్యాస్ స్టౌతో సహా అన్నీ వదిలి అయిదొందలకి ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళకి. సిస్టర్ ఫెర్నాండిస్ రహీంకి, లిల్లీకి వాళ్ళందరితోనూ చెప్పి పెట్టింది శిల్పతో రాగిణి గురించి మాట్లాడొద్దని, ఆమె ఈ ఊళ్లోనే వుంటునట్టూ, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పొద్దనీ, రాగిణి, స్నానంచేసి తయారై, రహీంని వెంటబెట్టుకుని ఆ స్కూలుకెళ్ళింది. ఇంటినుంచి బడి, అట్టే దూరంలేదు. నడిచి వెళ్ళవచ్చును.
    ఆ పిల్లల్ని - ముద్దుగానే ఆ పసికూనలని - చూస్తూవుంటే భగవంతుడు వారికి అందాన్ని, తెలివితేటలనీ ఇచ్చి కూడా మాట్లాడలేకుండా నాలుక పెట్టకపోవడం, చెవులు వినపడకుండా చెయ్యడం  దారుణమనిపించింది. దేముడికికూడా ఇంత పక్షపాతమెందుకూ? కొందరి రాతల్ని ఒకలాగా, కొందరి రాతల్ని మరొకలాగా ఎందుకు రాయాలి? అనుకుంది. మళ్ళీ తనకి తానే సమాధానం చెప్పుకుంది! ఇదేనేమో పూర్వజన్మ సుకృతం అంటే, పాపం పుణ్యం అంటే! ఏనాటి పాపమో, ఏనాటి శాపమో, దురదృష్టం కొందరిని వెంటాడుతుంది. అటువంటి వారికి సేవచేసినా పుణ్యమొస్తుందంటారు అనుకుని తృప్తిపడింది రాగిణి. ఉద్యోగాన్ని కేవలం ఒక వృత్తిగా కాక, సేవాధర్మంగా స్వీకరించింది. పట్టుదలతో, కార్యదీక్షతో వాళ్ళకి నాట్యాన్ని నేర్పిస్తోంది.
    ప్రతిరోజూ శిల్పకి సాయంత్రాలు ఆటలు ఉంటాయి. రాగిణి తన బడి నుంచి వొస్తు కాస్సేపు అక్కడ ఆగుతుంది. తనివితీరా శిల్పని చూసుకుంటుంది. ఆ తరువాత ఇంటికొచ్చి, వంటచేసుకుంటుంది. కాస్సేపు పుస్తకాలూ, పేపర్లు చదువుతుంది టి. వి. చూసి, భోంచేసి పడుకుంటుంది. ఇది ఆమె కార్యక్రమం.
    ఇక్కడ ప్రశాంతంగా గడిచిపోతుందని, శిల్పతో మాట్లాడకపోయినా కళ్లారా చూసుకుంటున్నానన్న తృప్తీ పిల్లలకి సేవచేస్తున్నానన్న తృప్తీ తనకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నాయని రాసింది. కోటయ్యగారికి. రాగిణి ఉత్తరం చూసి తృప్తిగా నిట్టూర్చారు కోటయ్యగారు! రాగిణి ఉద్యోగం చేసుకుంటోందని వేరే ఊళ్ళో ఎక్కడో వుందనీ తెలిసిన శిల్ప కోటయ్యగారు రమ్మని రాయగానే అవినాష్ తో పాటు సెలవులకి హైదరాబాదొచ్చేసింది.
    తను అక్కడ లేకపోవడం వల్లే శిల్ప హైదరాబాదు వెళ్ళిందని తెలుసుకుని, నవ్వుకుంది రాగిణి!
    అమెరికానుంచి రాగిణికి ఉత్తరాలొచ్చాయి "మంచిపని చేశావు" అభినందిస్తూ రాసింది భరణి. తండ్రి కూడా అలాగే రాశాడు. తల్లి ఉత్తరంలో అన్నీ భయాలూ, సందేహాలూ! జాగ్రత్తగా వుండమనీ, మళ్లీ అటువంటి తప్పు ఇంకోసారి చెయ్యవద్దనీ...... మరీ..... మరీ రాసింది. ఆమె ఆలోచనలు అర్థంచేసుకున్న రాగిణి ఆమెకి ధైర్యంచెబుతూ, అటువంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చెయ్యనని వాగ్ధానంచేస్తూ రాసింది. రాగిణికి ఇప్పుడు ఒకరకమైన వైరాగ్యంతప్ప ఏకోరికాలేదు. ఉన్నదల్లా ఒక్కటే! శిల్ప తనతో మాట్లాడాలి! తనని క్షమించాలి! అంతే!
            *    *
    శిల్ప సెలవులకి ఇంటికి వెళ్ళిన రెణ్ణెళ్ళూ రాగిణికి రెండు యూగాల్లా అనిపించింది. "అంతకుముందు రెండేళ్ళు శిల్పని చూడకుండా ఎలాగుండగలిగానా అని" తనే ఆశ్చర్యపోయింది. కోటయ్యగారి దగ్గరినుంచీ ఉత్తరాలొస్తూనే వున్నాయ్. శిల్ప ని గురించి ప్రతి ఉత్తరంలోనూ రాస్తున్నారు. కానీ శిల్ప మనసు మారినట్టు మాత్రం ఏ ఉత్తరంలోనూ లేదు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS