Previous Page Next Page 
నా కథవింటావా పేజి 26


    "అన్నయ్యా ! నేనేమీ దేశం వొదిలేసి  ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి పోవడం లేదుకదా! తలుచుకున్నప్పుడల్లా మీరు రావొచ్చూ, నేనూ ఒస్తాను" ఓదార్పుగా అంది.
    "మనిద్దరం ఒకింట్లో  పుట్టాం. ఒక్కలాగే పెరిగాం. ఒక కంచంలో తిన్నాం. ఒక మంచంలో పడుకున్నాం. కానీ  ఇప్పుడెలా  వేరువేరుగా  అయిపోయాం! తలుచుకుంటే అంతా చిత్రంగా  అనిపిస్తుంది!"
    "హూఁ ఏ ఇద్దరూ  కలిసి  పుట్టరు, కలిసిపోరు. కలిసుండడమనేది కాస్త కాలమేనన్నయ్యా! అదే జీవితం! ఆ కాస్తకే, దెబ్బలాటలూ, అసహ్యించుకోవడం, హత్యలూ, ఆత్మహత్యలూ అన్నీ  క్షణం  తేడాతో కలిసి పుట్టిన కవలలుకూడా  ఒకేలా  వుండలేరు. దేముడు చాలా గొప్పవాడు. ఏ ఇద్దరి జాతకాలూ ఒక్కలా లేకుండా, కొద్ది తేడాయైనా  కల్పించి పుట్టిస్తాడు! అదే! అది ఎలా సాధ్యమో ఎవ్వరికీ  అర్ధంకాదు" అంది.
    "బాగుందిలెండి. వయస్సయిపోయిన ఇద్దరు  ముసలాళ్ళు  మాట్లాడుకుంటున్నట్టుంది మీ సంభాషణ! ఒంటరిగా ఆడపిల్లని  పంపిస్తున్నాం ఎలా వుంటుందో ? ఇప్పటికే నిందల పాల్పడి వున్నాం! అన్న దిగులు మీకూ లేదు. అందరిమధ్యా వున్నప్పుడే, ఇటువంటి  అపనిందని  మొయ్యాల్సొచ్చిందీ, ఇల్లు విడిచి వెళ్లి, వున్న వూరు కాదని  ఎక్కడికో  వెళితే, ఇంకా ఎన్ని బాధలు  పడాలో  అన్న ఆలోచన  ఆమెకీ లేదు" విసుక్కుంది శోభన.
    క్రాంతి ఆఫీసుకి తయారవ్వాలంటూ  లేచి నుంచున్నాడు.
    కావ్య తన గదిలోకి వెళ్లిపోయింది.
    శోభన స్వగతంలాగా మాట్లాడే మాటలు వినబడుతూ వున్నాయ్ కావ్యకి.
    "రాత్రంతా చిలకకి చెప్పినట్టు చెప్పాను. అంతా విని సరేనని తెల్లారాక అంతా మరిచిపోయి  ఆవిడగారి మాటలకి  తందాన  తానా  అంటూ తాళం వేశారు. ఇల్లొదిలి  పెట్టి  పోతోందిట ! అదీ ఆశ్రమానికట ! తన వాటా డబ్బులు తనకివ్వాలట. వాటాలేదూ  పేటాలేదూ ! మొగపిల్లాడిలా వాటా అడిగి తీసుకుని పోవడానికి  ఎలా కుదురుతుంది ? ఆడపిల్లకదా! రేపు పుట్టింటికి  తీసుకో రావడాలూ, తీసుకుపోవడాలూ  ఇవేవీ  వుండవా ? అందులో పెళ్ళి కూడా చేసుకోకుండా  వుంటే, రోగమొచ్చినా, నొప్పొచ్చినా  ఖర్చు ఆవిడే పెట్టుకుంటుందటనా ?" సణుగుతూంది శోభన!
    కావ్యకి వెఱ్ఱెత్తి నట్టయింది ! "ఎంత  దూరం  ఆలోచిస్తోంది  ఆ అమ్మాయి ? తనకి  రోగం ఒస్తే ఈమె డబ్బు ఖర్చవుతుందా ? అంటే మా అన్నయ్యకి నేను పరాయిదానినయి  పోతానని నన్ను హెచ్చరిస్తోందా? ఆవేశంతో ఊగిపోయింది  కావ్య !
    శోభన  గదిలోకి  పరుగులాంటి నడకతో వెళ్ళి, "వొదినా ! నన్ను పుట్టింటికి తీసుకురావడాలూ, పోవడాలూ  నువ్వేమీ  చెయ్యనక్కర్లేదు. రోగం  నొప్పీ ఒస్తే, నీ డబ్బేమీ  ఖర్చు పెట్టఖ్కర్లేదు. నేనిప్పుడడిగిన డబ్బుతో నీకేమీ సంబంధం లేదు. అది మా అమ్మా నాన్నగారూ  వాళ్ళు నా పెళ్ళికోసం, నాకోసం  అంటూ  వుంచిన డబ్బు."
    "అదే నేననేది ! పెళ్ళికోసం  అని వుంచిన  డబ్బుని  తీసికెళ్ళిపోతే, పెళ్ళి ఏం పెట్టి చెయ్యాలి !"
    "నీ డబ్బు పెట్టి మట్టుకు  చెయ్యక్కర్లేదు! డోంట్ వర్రీ, ఇన్నాళ్ళూ మీరు చెప్పినట్టల్లా ఆడాను. ఇక ముందు నాకు నచ్చని పన్లు ఛస్తే  చెయ్యను అందులో కట్నం అడిగేవాడు ఎంత  గొప్పవాడయినా  సరే, పెళ్లి చేసుకోకపోవడమొకటి.
    ఏదో అనబోయింది  శోభన.
    "శోభనా ! విల్....యూ....షట్ అప్!" అరిచాడు క్రాంతి.
    "అనండి ! నన్నే అనండి! నేనే  ఉద్దేశ్యంతో  చెబుతున్నానో, అది అర్ధంచేసుకోక మీ ఇష్టం ఒచ్చినట్టు  అనండి" అని  సణుక్కుంటూ, వంట ఇంట్లో కెళ్ళిపోయింది  పని చూసుకుంటూ.
    వకీలుని పిలిచి  నోటు తయారు చేయించాడు  క్రాంతి. ఆమెకోసమని తల్లి చేయించి పెట్టిన నగలూ ,యాభై వేల నగదూ, ఆమె కిచ్చేస్తూన్నట్టు రాయమన్నాడు. కావ్య ఒప్పుకోలేదు !
    "అన్నయ్యా! ఇది నాన్న మనకోసం  ఒదిలిన  మొత్తం  ఆస్తి. ఆ రోజుల్లో వాళ్ళు యాభై వేలు కట్నమడిగినప్పుడు  నువ్వు మొత్తం నాకే ఇవ్వడానికి సిద్ధపడ్డావ్! ఆ పరిస్థితి వేరు. ఇప్పుడింక  అటువంటి అవసరం రాదు. ఈ డబ్బునీ, ఈ నగలనీ కూడా చెరిసగం చేయించు" అంది.
    "కావ్యా! నాకెందుకమ్మా? నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. సంపాయించుకుంటున్నాను. ఇది నీకు అవసరం. నీ దగ్గరే వుండనీ!"         
    "అన్నయ్యా! రేపు  నేనూ  ఉద్యోగం  చేసి  సంపాదించొచ్చు ! అది వేరే విషయం. ఒక వేళ ఆ రోజున ఆ పెళ్ళి జరిగిపోయుంటే  నేనేం చెయ్యలేక పోయేదాన్ని. ఈ రోజు ఇదంతా  నాన్నగారి  ఆస్తిని  నేనొక్క దాన్నే  తీసుకోవడం అన్యాయం, అధర్మం ! లాయరుగారూ! చెరి సమానంగా  దీన్ని పంచండి !" అంది. ఆ గొంతులో  ఆజ్ఞాపిస్తున్న  స్వరం స్పష్టంగా  వినబడుతోంది. క్రాంతికి  తెలుసు, అదే ఆమె నిర్ణయమని, అది ఇంక మారదనీ ! లాయర్ గారు క్రాంతి  కేసి చూసేడు, ఏం చెయ్యాలీ అన్నట్టు.
    "అలాగే  చెయ్యండి. మా చెల్లెలు  నిర్ణయాలు  మార్చుకోదు" అన్నాడు.
    నగదు  చెరో  పాతికవేలూ  పంచాడు. నగలని  పంచడానికి  ఒప్పుకోలేదు క్రాంతి. లీగల్ గా తండ్రి ఆస్తిని ఇరువురూ  పంచుకోవడం అయిపోయింది.
    కావ్య ప్రయాణం  పెట్టుకున్న  రోజు దగ్గరపడింది.
    "శోభనా ! ఇప్పుడైనా  కాస్త  నవ్వుతూ  పంపించు  నా చెల్లెల్ని. ఆమెది ఎంత మంచి  హృదయమో  చూశావుగా లాయరిగారి  ముందు ! మేమిద్దరం  ఒకే ఐడియాస్ తో పెరిగాం. కాకపోతే  దాని  దురదృష్టం. ఒక్కటీ  అనుకున్నట్టు  జరగక, విధి ఇలా  మిగిల్చింది తనని !" అంటూ పసిపిల్లాడిలా  ఏడుస్తున్న  భర్తని  ఆశ్చర్యంగా  చూసింది!
    "ఏమండీ ! ఏమిటిది ? పసిపిల్లాడిలా ! మనమేమీ  వెళ్ళమనలేదుగా ! తనే ఈ నిర్ణయం తీసుకుంది. అందులో  ఆమెకి  తృప్తుంటే  అలాగే  కానీ అని, మీరూ అన్నారుగా. మరి ఇప్పుడిదేమిటి ?"
    "శోభనా ! నీ కర్ధంకాదులే. మమతా, ఆప్యాయతా, వీటిని కేవలం డబ్బుతో  విలువకట్టే వాళ్ళకి, మనసు  పడే బాధ  అర్ధంకాదు ! ఆ గుండె కోత బోధపడదు" అంటూ  లేచి కావ్య గదిలోకెళ్ళాడు.
    ఆమె గదిలో ఇంకా దీపం  వెలుగుతూనే వుంది. వెలుగు బయటపడి  మిగిలిన వాళ్ళని డిస్ట్రబ్ చెయ్యకుండా  వుండడానికి, తలుపులు దగ్గరగా  వేసుంచింది.
    లోపల   చదువుకుంటోందేమోననుకున్నాడు  క్రాంతి ! మెల్లగా తలుపు తోసుకుని  లోపలికెళ్ళాడు.
    కావ్య మంచంమీద పడుకుని  వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    ఆ దృశ్యం, అతని గుండెని రెండుగా  చీల్చేసినట్టయింది. వెనక నుంచి  తలమీద గొడ్డలితో కొట్టినంత బాధ కలిగింది.    
    "కావ్యా! ఎందుకమ్మా  ఏడుస్తున్నావు ? నువ్వెళ్ళొద్దమ్మా. నన్ను విడిచి నువ్వు ఒంటరిగా  ఎక్కడికీ వెళ్ళకు. న్యాయానికీ, ధర్మానికీ ప్రాణం విడుస్తావు నువ్వు. అధర్మాన్నీ, అన్యాయాన్నీ  నీకేకాదు, నీ కళ్ళ ముందు ఎవరికి జరిగినా  భరించలేనంత  సున్నిత హృదయం  నీది. అమ్మ లేకుండా  నేనూ లేకుండా, ఈ పాడు ప్రపంచంలో  నువ్వు బ్రతకలేవమ్మా!" అటూ కావ్య పక్కన కూర్చుని, పసిపిల్ల  తల  నిమురుతూన్నట్టుగా, ఆమె తల నిమురుతూ  అన్నాడు.
    కావ్య అతని ఒళ్ళో  తలపెట్టుకుని  తనివితీరా  ఏడ్చింది! గుండె లవిసిపోయేలా  ఏడ్చింది! అలా అతని వొళ్ళో తలపెట్టుకుని  పడుకుంటే, అమాంతం ఒక పదేళ్ళు  వయస్సు వెనక్కి వెళ్ళినట్టనిపించింది! సంతోషమొచ్చినా, దుఃఖ మొచ్చినా  తల్లి ఒళ్ళోనో లేకపోతే, అన్నయ్య వొళ్ళోనో అలాగే తలపెట్టుకుని  పడుకునేది  తన ఆనందాన్నీ, ఆవేదననీ  పంచుకున్న ఆ వొడిలో, మళ్ళీ  ఇన్నేళ్ళకి తలపెట్టుకుని పడుకుని, దుఃఖంలో కూడా  తృప్తిగా  నిట్టూర్చింది. "అన్నయ్యా! తండ్రి ప్రేమ  నాకు తెలీదు. నా జీవితంలో నాకు అసలు ఇంకెవ్వరి ప్రేమా తెలీదు. నాకు బుద్దొచ్చినప్పటి నుంచీ  అమ్మా, నువ్వు, మీ ఇద్దరూ  నాకు ఏ కొరతా  రానివ్వకుండా  చూసుకున్నారు. జన్మ జన్మలకీ  నువ్వే నాకు అన్నయ్యగా  పుట్టాలని కోరుకుంటున్నాను" అంటూ  లేచి కూర్చుంది.
    "కావ్యా! ఈ ప్రయాణం మానుకోకూడదూ ?" బతిమాలుతున్నట్టుగా  అన్నాడు.
    "అన్నయ్యా! జీవితంలో  అభిమానాలూ, ఆప్యాయతలూ, ప్రగతికి అడ్డురాకూడదు! నీటితో అల్లుకుపోతూనే, వీటిని అధిగమించి, కర్తవ్య నిర్వహణలో మునిగిపోవాలి."
    "కావ్యా! నాకన్నా  చిన్నదానివి. నిన్న మొన్నటివరకూ, అమ్మ పక్కన పడుకుని, కబుర్లు చెబుతూ, చిలిపిగా  ఆడుతూ కబుర్లు చెప్పేదానివి, అల్లరి చేసేదానివి. అంతలోనే  ఈ అల్లరిపిల్ల, ఇంత ఎత్తు ఎప్పుడు ఎదిగిపోయిందో, అర్ధం  కావడంలేదు. ఈ వేదాంతం, ఈ సహనం, ఇవన్నీ  ఎక్కడ  నేర్చుకున్నావమ్మా ? ఆశ్చర్యంగా  వుంది!" అన్నాడు.
    "అవసరానికి కాలమే  పాఠాలు  నేర్పుతుందన్నయ్యా! జీవితం అనుభవాన్ని ప్రసాదిస్తుంది. దాంతోనే  సంప్రాప్తమవుతుంది, వేదాంతం. పైగా వేదాంతం, నిరాశకో, నిస్పృహకో  చిహ్నం  కాదు. అది విజ్ఞానానికి ఒకమెట్టు!"
    దాదాపు తెల్లవారేదాకా, అనేక విషయాలు  మాట్లాడుకున్నారు ఆ అన్నాచెల్లెళ్ళు. చిన్ననాటి కబుర్లు  దగ్గర్నుంచి, ఆ రోజు ప్రయాణం వరకూ, భావిలో తీసుకోవలసిన  చర్యల గురించీ, బాధ్యతల గురించీ, అనేకం చర్చించుకున్నారు. తేలికపడ్డ  మనసుతో, తెల్లారుజామునెప్పుడో నిద్రపోయారు, ఇరువురూ!
    పసుపూ, కుంకం, పట్టుచీరతో సారెపెట్టి  పంపినట్టు  పంపించాడు క్రాంతి.
    మిసెస్  శాంత డెలివరీకి బొంబాయి  పుట్టింటికి  వెళ్ళడంతో, ఆమెకి చెప్పలేకపోయింది కావ్య !
    కావ్య  గడపదాటి  వెళుతూ వుంటే, ఆ అన్నా చెల్లెళ్ల  మూగబాధని  అర్ధం చేసుకున్న  శోభన మనసుకూడా, కొంచెం  కరిగిందేమో. కళ్ళల్లో  తేమ కనిపించింది.
    శోభనా, క్రాంతీ కూడా  స్టేషనుకి  బయలుదేరారు, మద్రాసు ఎక్స్ ప్రెస్ కి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS