"జీతం భార్యకిస్తే, అర్చన కేమిస్తావ్?" అడిగాడు రామకృష్ణ.
కొన్ని క్షణాల తరువాత చెప్పాడు జవాబు.
"జీవితాన్ని...."
ఆ సంభాషణ జరుగుతున్న సమయానికి హైదరాబాద్ నగరంలో ఒక దినపత్రిక ఉద్యోగి జనరల్ పోస్టాఫీసులో ఎప్పటిలా పోస్టు బాక్స్ ఓపెన్ చేశాడు. లోపల నుండి ఉత్తరాలు తీసి వరుసగా పెర్చాడు. వాటిలో లావుపాటి బ్రౌన్ రంగు కవరు ఒకటి ఉంది.
శివరావు సమస్యకి పరిష్కారం చూపే కవరు అది.
12
ఆర్. టి. సి. కాంప్లెక్స్ లో బస్సు దిగాడు శివరావు.
అతనితో పాటు బస్సు దిగిన ఒక వ్యక్తి శివరావు మీదనుంచి దృష్టి మరల్చకుండా జనంలో నిలబడ్డాడు. శివరావు కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చి బూత్ దగ్గరకు వెళ్ళాడు. తాళం తెరచి లోపలకు ప్రవేశించాడు.
అంతవరకూ శివరావుని అనుసరించిన ఆ వ్యక్తి తాపీగా కిళ్ళీషాపు వైపు నడిచాడు. బీడీ కట్టకొని ఒక బీడీ ముట్టించాడు. అక్కడనుంచి పాల పాకెట్లు అమ్ముతున్న శివరావు కనిపిస్తున్నాడు. బీడీ కాల్చడం అయ్యేవరకూ అక్కడే నిలబడి టీ కొట్టులోకి నడిచాడు. అరగంటసేపు టీ కొట్టులో కూర్చుని రెండు టీలు త్రాగాడు. టీలకి డబ్బులు చెల్లించి బయటకొచ్చి జర్దా కిళ్ళీ కట్టించుకున్నాడు. కిళ్ళీ నములుతూ శివరావు వంక చూస్తూ ఆలోచించసాగేడు.
మూడు రోజుల క్రితం శివరావు ఇంటి దగ్గర అతనికోసం నిరీక్షించాడు. సాయంకాలం వరకూ చూసి విసిగిపోయి అతని ఇంటివైపు నడిచి తలుపు తట్టాడు.
"ఆయన లేరామ్మా!" అడిగాడు వినయంగా.
"లేరు....." మొహం చిట్లించి చెప్పింది.
"ఎప్పుడొస్తారమ్మా?"
"తెలియదు."
చెప్పి విసురుగా తలుపు మూసింది.
చుట్టుప్రక్కల వారిని అడిగి తెలుసుకోవడానికి అతని పేరు తెలియదు. ఇంటికి నేమ్ బోర్డులేదు. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. అతను వెనక్కి తిరిగాడు. దారిలో ఒకాయన ఎదురయ్యాడు. అతనికి అరవై సంవత్సరాలు ఉంటుంది వయసు. కంటికి పెద్ద మనిషిలా కనిపించాడు.
"ఆ ఇంట్లో ఉంటున్నది సుబ్బారావు కదండీ?" అడిగాడు.
ఆయన కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు.
"సుబ్బారావు అనే వ్యక్తి ఎవరూ ఆ ఇంట్లో ఉండడం లేదు. ప్రక్క వీధిలో జీవిత భీమా కంపెనీలో పనిచేసే సుబ్బారావు ఉన్నాడు. కనిపిస్తే ప్రాణం తీస్తాడు భీమా చెయ్యమని, మేమంతా అతన్ని తప్పించుకు తిరుగుతాం. మీకు కావాల్సిన సుబ్బారావు అతనే కావచ్చు...."
ఆ ఇంట్లో నివసించే అతని పేరేమిటండి? అడిగాడు శివరావు ఇల్లు చూపించి.
"ఎవడో పుల్లయ్య. నీకెందుకు సుబ్బారావు కానప్పుడు" కసిరాడు.
"మాట వరసకి అడిగానంతే, ఎవరైతే నాకెందుకు...."
తన అభిప్రాయం ఒప్పుకోవడంవల్ల ఆయన మొహం వికసించింది. ఉత్సాహంగా చెప్పసాగేడు.
"ఇల్లు కట్టిన కొత్తలో కోటేశ్వరరావు దిగాడు. నలుగురు పిల్లలు అతనికి. అద్దె ఇవ్వడానికి తెగ ఇబ్బంది పెట్టేవాడు. పేరుకి కోటేశ్వరరావు, కాని నిజానికి కటిక దరిద్రుడు. కష్టపడి అతన్ని ఖాళీ చేయించాం. తరువాత సోమేశ్వరరావుగారు దిగాడు. వాళ్ళావిడ ఇంటినిండా మేకులు దిగొట్టేది నానా తంటాను పడి వాళ్ళని పంపేసాం. రామేశం వచ్చాడు. అతను తలవంచుకుని తన పని చేసుకు పోయేవాడు. అద్దె సరిగ్గా ఫస్టు తారీఖున ఇచ్చేవాడు. అతను పలకరించినా పలికేవాడు కాడు. మొదట చెముడు అనుకున్నాం. కాని కాదట. అతనికి భార్యంటే వల్లమాలిన భయం. అతను ఎవరితోనైనా మాట్లాడటం చూస్తే తన వంట గురించి చెబుతున్నాడని అనుకుని ఆ పూట అన్నం పెట్టేది కాదట. ఆ తరువాత రామారావు అద్దెకొచ్చాడు. వాళ్ళావిడిని పలకరిస్తే తమ వంశంలోని వాళ్ళ గొప్పదనం గురించి చెప్పేది. ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చేది కాదు. వాళ్ళువెళ్ళిపోయిన తరువాత...."
"అయ్యా! ఇంతకీ తమరెవరో చెప్పలేదు." అంతవరకూ ఒపికపత్తి ఆయన మాటలకు అడ్డొచ్చి అడిగాడు.
"ఆ...ఇల్లు కట్టినవాడిని నేనే. ఇప్పుడు శివరావు అనేవాడికి ఇచ్చాం...." చెప్పాడు.
తనకి కావాల్సిన వ్యక్తి పేరు శివరావు అని తెలుసుకున్న మరుక్షణం అతను అక్కడ నుంచి కదిలాడు. ఆ ముసలాయన పిలుస్తున్నా వినిపించుకోకుండా మరునాడు శివరావు కోసం వెళ్ళాడు. చీకటి పడే వరకూ అక్కడే ఉండి తిరిగొచ్చాడు. ఈరోజు ఇంటి నుంచి బయటకురావడం చూసి అనుసరించాడు.
ఆరిపోయిన బీడీ పారేసి మరోటి వెలిగించాడు. సమయం నెమ్మదిగా గడవసాగింది. ఐదున్నరకి బయటకొచ్చి బూత్ కి తాళం వేశాడు శివరావు. అక్కడే నిలబడి చూడసాగేడు. అరగంట తరువాత వచ్చిన వ్యాన్ ఎక్కాడతను.
ఆ వ్యక్తి ఆటోలో వ్యాన్ ని అనుసరించాడు. వ్యాన్ దారిలో బూత్ ల వద్ద ఆగుతూ సేల్స్ మాన్ ని ఎక్కించుకుని ఆఫీసుకి చేరుకుంది. అతను ఆఫీస్ కి దూరంగా ఆటో దిగి డ్రైవర్ కి డబ్బులిచ్చి పంపేశాడు.
పది నిముషాల్లో శివరావు బయటకొచ్చాడు. అతను తిన్నగా సిటీ బస్ స్టాఫ్ దగ్గరకు నడిచాడు. ఆ వ్యక్తి కూడా శివరావుకి కనిపించకుండా జనంలో నిలుచున్నాడు.శివరావు ఒక సిటీబస్సు ఎక్కడం గమనించి తను కూడా ఎక్కాడు.
శివరావు కండక్టర్ కి ప్యాసు చూపించాడు. ఆ వ్యక్తి పాత పోస్టాఫీస్ వరకూ టిక్కెట్ తీశాడు, శివరావు ఎక్కడా దిగుతాడో తెలియక.
శివరావు కురుపాం మార్కెట్ దగ్గర బస్సు దిగాడు. తిన్నగా రామకృష్ణ ఇంటివైపు నడిచాడు. అర్చన తలుపు తీసింది. అక్కడవరకూ అనుసరించి వచ్చిన ఆ వ్యక్తి చప్పున తల ప్రక్కకు తిప్పుకుని మరోవైపు నడిచాడు. మూడు రోజులు శ్రమపడి అర్చన ఎక్కడుందో కనుక్కున్నాడు.
అతని మనసు సంతోషంతో నిండిపోయింది.
* * * *
శనివారం సాయంకాలం కస్టమ్స్ ఆఫీస్ వెనుక కొండమీదున్న వెంకటేశ్వరస్వామి గుడికి చేరుకున్నాడు రామకృష్ణ. గుడిలోని భక్తులను పరీక్షగా చూసి భాగ్యలక్ష్మి రాలేదని నిర్ధారించుకుని గుడి ఆవరణలో ఓ రాయి మీద కూర్చున్నాడు.
అక్కడా నుంచి విశాలమైన సముద్రం కనిపిస్తోంది. కుడివైపు కొండపైన మసీదు, ఎడమ ప్రక్క కొండపైన చర్చి ఉన్నాయి. మూడు మతాలకు చెందిన దేవాలయాలు త్రికోణంలా మూడు కొండలపైన నిర్మించబడ్డాయి. ఒక మేధావి ఆలోచనకు రూపకల్పనలా కనిపిస్తున్నాయవి. గుడిని ఆనుకుని ఉప్పుటేరు, అవతల గట్టుపైన పచ్చటి చెట్లతో నిండిన కొండ చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలా ఆ ప్రాంతం ప్రశాంతంగాను, మనోహరంగాను ఉంది.
భాగ్యలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే మొదటిసారి ఆ ప్రాంతాన్ని చూశాడు. వచ్చిన పది నిముషాలకే ఆ గుడి, అక్కడి వాతావరణం అతన్ని ఆకట్టుకుంది.వారానికి ఒక్కసారైనా అక్కడకు వచ్చి కాసేపు గడిపి వెళ్ళాలని అనుకున్నాడు.
శనివారం కాబట్టి భక్తులు ఎక్కువగా ఉన్నారు. యధాశక్తి దేవుడ్ని ప్రార్ధించి వెళుతున్నారు. వాళ్ళ మొహాల్లో భక్తి భావం తొణికిసలాడుతోంది. జీవించడానికి అవసరమైన మనోధైర్యం దొరికినట్టు భక్తులు తిరిగి వెళుతున్నారు.
"ఏమిటాలోచిస్తున్నారు....
"వెనక్కి చూశాడు రామకృష్ణ. భాగ్యలక్ష్మి నిలబడుంది. ఆమె పెదవుల పైన చిరునవ్వు మెరుస్తోంది. తలంటు పోసుకోవడంవల్ల పొడిగా ఉన్న జుట్టు సముద్రపు గాలికి ఎగురుతోంది. నీలం రంగు చీరలో హుందాగానూ, పోయిన వారం చూసినప్పటి కంటే అందంగాను కనిపిస్తోంది.
"కూర్చో...."
ఆమె మరో రాయి మీద కూర్చుని పూల సజ్జ ప్రక్కన పెట్టింది. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం పరుచుకుంది.
"ఈ రోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను...." భాగ్యలక్ష్మి అంది.
"అడుగు."
"స్త్రీ గురించి మీరేమనుకుంటున్నారు?"
"ఏ వయసులోనైనా పురుషుడు ఆరాధించి, అభిమానించాల్సింది స్త్రీనే" తడుముకోకుండా చెప్పాడు.
"ఎందుకని?"
"మగవాడికి జన్మనిచ్చేది స్త్రీ. అదే గర్భం నుంచి తోబుట్టువుగా పుడుతుంది. పెళ్ళి చేసుకుంటాడు. వాడికి కూతురు పుడుతుంది. కొడుకు ఓ అమ్మాయిని చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. వాడికో కూతురు పుడుతుంది. ఇలా మనిషి చచ్చేవరకూ ఆడవాళ్ళతో అనుబంధం పెనవేసుకుంటాడు. మగవాడు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి కారణమైన స్త్రీని ఆరాధించడంలోను, అభిమానించడంలోను తప్పేముందు...."
