మూడు సంవత్సరాల వయసుగల శివరావు కూతురు గుమ్మం దాటి వచ్చింది. తండ్రిని చూసి మొహం చాటంత చేసుకుని దగ్గరకు వచ్చింది. శివరావు చప్పున కూతుర్ని అందుకుని బుగ్గపైన ముద్దు పెట్టుకున్నాడు. తల్లిని తప్పించుకుని బయటకు ఎలా వచ్చిందో అతనికి అర్ధం కాలేదు. తండ్రి ఒడిలో కూర్చుని తను నేర్చుకున్నమాటలు చెప్పసాగింది. కూతురి మాటలు వింటూ తన అలసట మర్చిపోయాడు.
అరగంట తరువాత శివరావు భార్య కూతుర్ని వెదుకుతూ వచ్చింది. కూతురు భర్త ఒడిలో కూర్చోవటం గమనించి గబగబా వచ్చి పిల్లని తీసుకుపోయింది. అటువంటి ప్రవర్తన కొత్తకాకపోయినా ఆ సమయంలో తీసుకుపోవడం కష్టం కలిగించింది.
పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని, వాళ్ళకు స్వయంగా ఎన్నో విషయాలు బోధించాలని అనుకునేవాడు. భార్య పిల్లల్ని దూరంగా ఉంచడంతో చాలాసార్లు వాళ్ళ మధ్య ఘర్షణ జరిగేది. ఇరుగు పొరుగు వాళ్ళు తగువు తీర్చడానికి వచ్చేవాళ్ళు. అందుచేత శివరావు పిల్లలకోసం భార్యతో ఘర్షణకు దిగటం మానేసాడు. మగపిల్లలు అతన్ని చూస్తే వణికిపోతారు. కూతురు చిన్నది కావటం వల్ల అప్పుడప్పుడూ తండ్రి దగ్గరకు వచ్చి కొద్దిసేపే అయినా అతనికి మనస్సాంతి కలిగిస్తుంది. రెండు మూడు సంవత్సరాలు గడిస్తే కూతురు కూడా దగ్గరకు రాదు.
పెళ్ళయిన సంవత్సరానికి భార్యలో ఎటువంటి మార్పు తీసుకురాలేనని గ్రహించి అసహనంతో ఆమె మీద కేకలు వేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది అరవటం మానేసి మౌనాన్ని ఆశ్రయించాడు. పిల్లల్ని దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దూరంగా పారిపోయేవారు. అటువంటప్పుడు తను బ్రతకడం వృధా అనిపించేది.
ఆలోచనల్ని త్రొక్కిపట్టి లోపలకు నడిచాడు. పిల్లల్ని ఎత్తుకోవాలని గుండెకు హత్తుకోవాలని మనసు ఆరాట పడుతోంది. స్కూలుకి వెళుతున్న పిల్లలు కనిపిస్తే వాళ్ళని ఆసక్తిగా గమనిస్తాడు. గుంపులుగా పిల్లలు వెళుతుంటే అతనికి ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. యువతీ యువకుల ప్రేమకు, ఎన్నో రాత్రులు చెప్పుకున్న ఊసులకు, మనసులకు, ఆశలకు ప్రతిబింబాలు వాళ్ళు.
"రాత్రి రాలేదేం?"
మంచంపైన పడుకుని ఆలోచిస్తున్న శివరావు కళ్ళు తెరిచాడు. వంటగది గుమ్మంలో నిలబడిన భార్యని చూడగానే ఆలోచనలు చెదిరి పోయాయి. ఆమెనుంచి చూపు మరల్చి తిరిగి కళ్ళు మూసుకున్నాడు.
పెళ్ళయిన క్రొత్తలో ప్రతి విషయం సౌమ్యంగా వివరించి చెప్పేవాడు. ఆ తరువాత చెప్పింది వినడంలేదని కేకలు వెయ్యడం మొదలెట్టాడు. ఫలితం కనిపించక తిట్టేవాడు. తను అనుకున్నది జరగటంలేదనే ఉక్రోషంతో కొట్టేవాడు. ఒకసారి కోపం పట్టలేక బలంగా కుడిచేతిని విసిరాడు. అది ఆమె గూబకు తగిలింది. విరిగిన పచ్చికొమ్మలా క్రింద పడిందామె. అతను అలాగే నిలబడిపోయాడు. చాలాసేపు ఎటువంటి భావం కలగలేదు. రెండు నిముషాల తరువాత అనుమానంగా దగ్గరకు వెళ్ళాడు.
ఆమెకు స్పృహ తప్పింది.
నిటారుగా నిలబడ్డాడు శివరావు. క్రమంగా అతని మెదడులో చలనం వచ్చింది. పెళ్ళి చేసుకుని తనతో కలిసి బ్రతకడానికొచ్చిందామె. పెళ్ళయిన తరువాత ఆమె తల్లిదండ్రులు మరణించారు. ఆమెకు బంధువులు పెద్దగా లేరు. ఆమె మూర్ఖురాలే కావచ్చు. అటువంటి ఆడదాన్ని కొట్టి తనేం సాధిస్తాడు? అహాన్ని సంతృప్తిపరుచుకోవడానికి కొట్టాలి తప్ప అంతకు మించి ప్రయోజనం లేదు. తనకొచ్చిన కష్టం చెప్పుకోవడానికి బంధువులులేని ఆమెను జీవితంలో మరెప్పుడూ కొట్టగూడదని అనుకున్నాడు. ఆ తరువాత అతని మనసు కాస్త తేలిక పడింది.
ఆమెను తీసుకెళ్ళి మంచంపైన పడుకోబెట్టి లేచేవరకూ అక్కడే కూర్చునిసపర్యలు చేశాడు. ఆ సంఘటన అనంతరం ఆమెమీద ఎప్పుడూ చెయ్యి చేసుకోలేదు.
"సమాధానం చెప్పరేం?" గొంతు పెంచి అడిగిందామె.
"దేనికి సమాధానం?" కళ్ళు తెరచి శాంతంగా అడిగాడు.
"రాత్రి ఇంటికెందుకు రాలేదు?"
"రాత్రి వస్తేనేం. రాకపోతేనేం మన ఇద్దరి జీవితాల్లో రాత్రికి ఎటువంటి ప్రాముఖ్యత లేదుకదా!"
"రాత్రి ఎక్కడున్నారు?"
"స్నేహితుని ఇంట్లో...." చెప్పాడు.
అవతల మంచంపైన నిద్రపోతున్న కూతురిపై అతని దృష్టి పడింది. ఒత్తైన ఉంగరాల జుట్టు రిబ్బన్ తో కట్టుంది. రిబ్బన్ ముడినుండి తప్పించుకున్న కొంత జుట్టు మెడమీద పడుతోంది. ఎక్కువ శాతం వెంట్రుకలు ముడినుంచి బయట పడటం వల్ల రిబ్బన్ జారిపోవడానికి సిద్దంగా ఉంది.
"నిన్న ఉదయం వేసుకెళ్ళిన, బనీన్ ఏమయింది?" అడిగింది, శివరావు మొహంలోకి పట్టి పట్టి చూస్తూ
"స్నేహితుని గదిలో వదిలేసాను...."
"నేనమ్మను.....ఒళ్ళు తెలియకుండా త్రాగి పడిపోయుంటావు. అందుకే రాత్రి ఇంటికి రాలేదు."
శివరావు నవ్వాడు.
త్రాగి పడిపోతే శరీరం మీదున్న బనీన్ ఎందుకు పోతుంది. అంతేకాదు తను అప్పుడప్పుడూ స్నేహితునితో బార్ కెళతాడని ఆమెకు తెలియదు. బయట జరిగే సంగతులు చెప్పేంత చనువులేదు. తనని రెచ్చగొట్టడానికి అలా అంటున్నదని గ్రహించి నవ్వాడతను. రెచ్చిపోతే పశువులా మారిపోతాడు తను.
"నిజంగానే స్నేహితుని గదిలో వదిలేశా....."
ఆమె తీవ్రంగా చూసింది.
"అబద్దాలు చెప్పడానికి సిగ్గుండాలి. నిన్న వెళ్ళేటప్పుడు నీ జుట్టుకి నూనె రాసుకోలేదు. వచ్చేటప్పుడు మాత్రం రాసుకుని వచ్చావు. నీ ప్యాంటు కుడికాలి మడత కుట్టూడిపోయింది. ఈరోజు అది కుట్టి ఉంది. నిజం చెప్పు ఎక్కడ కెళ్ళావ్?"
ఆమె తనని అంత తేలిగ్గా వదలదని గ్రహించాడు.
ఉదయం రామకృష్ణ ఇంటినుంచి బయలుదేరినప్పుడు బనీన్ అక్కడా వదిలేసాడు. రాత్రి స్నానానికి ముందు అర్చన తలకి నూనె రాసింది. ఊడిపోయిన ప్యాంటు మడత కుట్టింది. తను అర్చన గురించి ఏదో రోజు భార్యకి సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలుసు. అయితే అది అంత తొందరగా వస్తుందని ఊహించకపోవడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. సంభాషణ ఎక్కడ ప్రారంభించాలో, ఎలా ప్రారంభించాలో అర్ధం కాలేదు.
లేచి కిటికీ దగ్గరకు నడిచాడు. కిటికీ అవతల ఖాళీ స్థలంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. కొన్ని క్షణాలపాటు వాళ్ళని చూసి వెనక్కి తిరిగాడు. అతని మొహం భావరహితంగా ఉంది.
"నువ్వు చాలా తెలివైన దానివి. మగవాడిని నిర్వీర్యంచేసే తెలివితేటలు నీ దగ్గర అపారంగా ఉన్నాయి. నాకు మనసుందని, అది స్పందిస్తుందని, కోరికలు పుడతాయని, వాటిని తీర్చాలని భార్యగా నువ్వేనాడూ అనుకోలేదు. దానికితోడు పిల్లల్ని కూడా దూరంగా ఉంచావ్. నేను మిమ్మల్ని పోషించే యంత్రంగా భావించావు. ఇదంతా నీ వల్లనే జరిగిందని చెప్పటం నా అభిమతం కాదు. ఇంతవరకూ, జరిగిన దానిని గుర్తు చేస్తున్నాను...." అని కాసేపు ఆగి తిరిగి చెప్పసాగేడు.
"....నా జీవితంలో ఇంతవరకూ నన్ను అభిమానంగా చూసే మనిషిని సంపాదించు కోలేకపోయాను. నేను ఇందుకోసం కష్టపడాలో ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు. నన్ను చేసుకున్న తరువాత ఒక్కసారైనా నాతో మనస్పూర్తిగా గడిపావా? సరిగ్గా అండం విడుదలయ్యే సమయంలో మొక్కుబడిగా శరీరాన్ని అప్పగించే దానివి.ఇది తెలుసుకోవడానికి నాకు పది సంవత్సరాలు పట్టింది."
హఠాత్తుగా అతను తన లోపం గురించి మాట్లాడేసరికి ఆమెకు మతిపోయింది. డాని గురించి తెలుసుకుంటాడని ఏనాడూ అనుకోలేదు.
"ప్రక్కింటావిడ భర్త త్రాగుబోతు, రోజూ త్రాగి స్పృహలేని స్థితిలో ఇంటికి చేరుకుంటాడు. అయినా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. నా స్నేహితుడు రాత్రంతా పేకాడి తెల్లవారు ఝామున ఇంటికొస్తాడు. వాళ్ళు కూడా ఆనందంగానే ఉన్నారు. నువ్వు నాకు సంతోషం, ఆనందం లేకుండా చేశావ్. ఎన్నోసార్లు నీ పక్కలోకి వస్తే నిర్మొహమాటంగా దూరంగా నెట్టావ్. నన్ను ఎంత బలంగా నెట్టావంటే, నేను ఓ ఆడదాన్ని వెదుక్కుని ఆమెతో గడిపేంత దూరంగా నెట్టావ్...." చెప్పాడు.
ఆమె చిన్నగా నవ్వింది.
"నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇప్పుడు నేను సెక్స్ కి సహకరించడం లేదంటే ఎవరూ నమ్మరు. నాకు, నా పిల్లలకు అన్యాయం జరిగిన రోజు నేను రోడ్డు ఎక్కుతాను." చెప్పింది.
శివరావు మొహం గంభీరంగా మారింది.
"నువ్వొక విషయం గుర్తుంచుకో. గొడవచేస్తే నేను భయపడతానని మాత్రం అనుకోవద్దు. నా శరీరంతో నీకు ఎటూ అవసరం లేదు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. కాని నా జీవితంతో నీకు అవసరముంది. అతితెలివి చూపించి దానిని మాత్రం పోగొట్టుకోకు." చెప్పి బయటకొచ్చాడు.
అతని మనసు తేలిక పడింది.
* * * *
మరునాడు గోడౌన్ దగ్గర రామకృష్ణని కలిశాడు శివరావు. ఏమీ దాచకుండా ముందురోజు ఇంటి దగ్గర జరిగిన విషయాలు అతనికి చెప్పాడు.
