Previous Page Next Page 
యువత నవత పేజి 26

        "సరే ఆ పంట జోలి వదిలిపెడదాం. ఇళ్ళలో కోళ్లు సాకుతారు కదా? నెలకి ఓ పదో పాతికో ఆదాయం వచ్చేట్టు చూచుకో. ఆ వచ్చింది ఇంట్లో ఖర్చుపెట్టొద్దు. జాగ్రత్తగా తీసి చిన్న మొత్తాల పొదుపుపథకంలో వేసుకో? అలాగే మీ పెరట్లో నాలుగు రకాల కూరగాయల మొక్కలు వేశారంటే ఆ కూరగాయలు అమ్మావంటే  నెలకు పదోపాతికో రాకపోవు. అవీ స్మాల్ సేవింగ్స్ లో వేయి. నువ్వు ఎక్కడికో బాంక్ కి వెళ్లి వేయనక్కరలేదు. నీ దగ్గరికే వాళ్లు వచ్చి తీసుకు పోతారు. అలా కూడికూడి నీకెంత ఆసరాగా నిలుస్తాయో తెలుసా?"

    "రెండు కోడిపిల్లలు సాక్కున్నాంగానీ  పండగలకి పబ్బాలకి మేమే పీక్కు తింటం, పంతులమ్మా, కోళ్లమీద నేను ఒక్కపైస కూడ కళ్లు జూడలేదు!"

    "చూడలేదుగాని చూడాలని సంకల్పం చేసుకో! ఇంట్లో కోడిని  కోస్తే ఆ కోడి డబ్బుమీ ఆయన దగ్గర వసూలు చేసుకో! ఒక్క పైసా కూడా ఇంటి ఖర్చులకు వాడుకోనని ఖచ్చితంగా చెప్పెయ్యి! ఇలా భవిష్యత్తు కోసం దాస్తున్నానను, మీ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి."

    గ్రామాల్లో పొదుపు ఉద్యమ ప్రచారానికి సుధ సొంతంగా చార్టులు కూడా తయారుచేసింది. బొమ్మల రూపంలో చెబితే గ్రామస్తుల బుర్రలో తొందరగా, సులువుగా ఇముడుతాయని.

    "ఈ నెల శానా ఖర్చులున్నయ్యి. వచ్చే నెల కాడినుండి చూద్దంలే" అని చాలామంది తప్పించుకొన్నా కొంతమందితో సేవింగ్ చేయించగలిగింది సుధ.

    వారం వారం కొద్ది కొద్ది మొత్తాలు కూడి అసలు పెరుగుతూంటే వాళ్లకే ఉత్సాహం, ధైర్యం వచ్చేస్తున్నాయి. వాళ్లను చూసి ఇంకొందరు తయారవుతున్నారు గేదె పాలు అమ్ముకున్నవో, కట్టెపుల్లలు అమ్ముకొన్నవో - ఏదో కొంత తీసి దాచుకొంటున్నారు.
                                                                         3

    ఆ రోజు కిష్టరెడ్డిపేట  టూర్ వెళ్లింది సుధ. సుజాతా వాళ్ల ఊరది. వెళ్లన పని చూసుకొని వచ్చేప్పుడు సుజాతా వాళ్ల ఇల్లు కనుక్కొని వెళ్లింది.

    చాలా పూరిల్లు వాళ్లది. ఇంట్లో తల్లీ తండ్రీ వున్నారు పిల్లలెవరూ లేరు. వాళ్ల పేదరికం ఓ పదిపన్నెండు సంవత్సరాలిముందే  వార్దక్యాన్ని పిలుచుకు  వచ్చేసినట్టుంది! ఇద్దరి జుట్లూ బాగా తెల్లబడిపోయి నడుం వంగిపోయి కనిపిస్తున్నారు.

    సుజాత సాయంత్రం వొరకు వస్తానంది. కూర్చోండమ్మా! చాయ్ తాగి ఎడుదురు" అంది సుజాత తల్లి చాలా మర్యాదగా.

    "నాకు చాయ్ అలవాటు లేదుగాని కాస్సేపు ఇలా కూర్చోండి. ఓ రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను" అంది సుధ.

    "కాసిన్ని మంచినీళ్ళయినా తాగండి" అంటూ ఆవిడ చెంబుతో నీళ్లూ, గ్లాసూ పట్టుకువచ్చింది.

    "మీ వారు ఏం చేస్తుంటారు?"

    "బియ్యం మిల్లుకాడ కావలి పడుకోను ఎడతడు."

    "ఎంతిస్తారు జీతం?"

    "ఓ పదిరూపాయలు, పదిశేర్ల బియ్యం ఇస్తడమ్మ సేటు."

    "మీ కుటుంబం పరిస్థితి అంతా చెప్పింది సుజాత.  మీకు గేదెలకోసం గాని,ఏదైనా చిన్న ఇండస్ట్రీకిగాని లోన్ ఇప్పిస్తే చేసుకోగలుగుతారా?"

    "బర్రెకొక బానిస అన్నారు. దానికి ఎంత  చేస్తేనో చారెడు  పాలు రాల్పుతది. పచ్చగడ్డి కోసం ఎవరూ చేలకి రానీయరు. తౌడు రూపాయికి నాల్గుశేర్లు రాదు. ఇన్నీ చేసిచూస్తే కొన్ని గేదెలు పాడి ఇయ్యవు. అప్పు నెత్తినపడి వడ్డీ మమ్మల్ని నిలువునా ముంచేస్తదమ్మా?"

    "రిస్క్ తీసుకొని ఏదో ఒక పని చెయ్యకపోతే మీరెలా బాగుపడతారు?"

    "వట్టి దురదృష్ట జాతకులం. బంగారం ముట్టుకుంటే మట్టవుతది. ఊర్కె కూచుంటేనే ఏదో వచ్చి నెత్తిన పడతది. గవర్నమెంటు అప్పిస్తద కదాని తీసుకొని కట్టలేకపోయిన్నాడు చెంబు తపేలా బయట పారేసి ఇంటికి తాళం పెడతరు. మళ్లీ మాట్లాడితే తీస్కపోయి జైల్ల పెడతరు. ఎందుకొచ్చినతంట?మా రోజులు గిట్ల గడవనీ తల్లీ! మీకేదన్నా సాయం చేయాలనిపిస్తే మా పెద్దోడికి నౌకరీ ఇప్పించమ్మా? ప్యూన్ ఉద్యోగం అయినా సరే!"

    "ఏం చదివాడు?"

    "పది తప్పిండు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS