Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 27

    ఎవరి పని వారిదే. దేని దారి దానిదే సరోజా! ఇప్పుడు నా సంగతి చూడు. ఏమయ్యింది? 'ఆకలి మంటలు' ఫిల్మ్  తియాలని ఎంతగానో  ఉబలాట  పడ్డాను. ఎన్ని విధాలుగానో  ప్రయత్నించాను.

    నా ఆశయం, ధ్యేయం అన్నీ బాగానే వున్నాయి. కానీ ఏం లాభం? ఎవరైనా ముందుకొచ్చి 'మేం ఫైనాన్స్ చేస్తాం' అని అన్నారా? ప్లాన్లూ, ఆదర్శాలూ ఏమయ్యాయి?

    ఇదే  పెట్టుబడిదారీ విధానం సరోజా! 'ఎంత పెడుతున్నాం. దీనిమీద  మనకెంత వస్తుంది?' అన్నదే లెక్క. ఇది బూర్జువా  సమాజం, బూర్జువా సంస్కృతి. ఒక్క మాటలో  చెప్పాలంటే  మానవజీవితం యావత్తూ బూజుపట్టిన విలువలకే  అంకితమైపోతోంది.

    అందుకనే  నేనంటున్నదేమిటంటే...మానవ  జీవితాన్ని  తేజోవంతం  చెయ్యడానికి, కడుపునిండా  కూడు, ఒంటినిండా  గుడ్డా  వుండడానికి, నూతన జీవిత  ప్రాప్తికి  శాయశక్తులా  కృషి  చెయ్యాలి" అని ఆయన చెబుతూవుంటే...

    "ఏమిటండీ  మీ ఆవేశం? ఇది  ఒక్కరివల్ల  జరిగేపనా? ఇదివరలో  ఎంత మంది  కాలగర్భంలో కలిసిపోలేదు? చివరికి ఏమిటి మిగిలింది? ఏమిటి సాధించారు?" అని అడిగాను.

    "నీకు తెలియదు సరోజా! వివరంగా చెప్పాలంటే  ఒక్క   రోజుతోనో, ఒక్క  నెలతోనో  అయ్యే  పనికాదు. నువ్వు నాకు ఇన్స్ పిరేషన్. నువ్వలా వింటూ  వుండు. మూడ్ వచ్చినప్పుడు నేనలా మాట్లాడుకుంటూ పోతాను. వినడంలో  తప్పులేదుకదా!" అన్నారు.

    "భలేవారే! వినడం ఏమిటి? మీ నోటంటే  వచ్చే  ప్రతి  అక్షరాన్నీ రాసుకుంటున్నానండి" అన్నాను. చాలా సంతోషించారు.      

    "రాసి ఏం చేస్తావు?" అని అడిగారు.

    "భద్రంగా  దాచుకుంటాను" అన్నాను.

    గట్టిగా  ఒక దమ్ము  లాగారు.



                                 *    *    *    *


    కాలచక్రం  మరికొంత  తిరిగింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. తర్వాత ఓ కొడుకు పుట్టాడు. వాడిని మేము 'బైజూ' అని పిలిచేవాళ్ళం. ఈ పేరు నేను పెట్టుకున్నదే. శ్రీశ్రీగారికి కూడా  ఈ పేరు బాగా నచ్చింది. వారికి పిల్లలందరిమీద  విపరీతమైన ఇష్టం వుండేది. నెత్తిమీద  కూర్చోపెట్టుకునేవారు.
    మగపిల్లవాడు  పుట్టాడంటే  ఆయన మొదట నమ్మలేదు. "నిజంగా నాకు కొడుకు పుట్టాడా?" అని అడిగారు.

    1964 వ సంవత్సరంలో  ఆగస్టు  నెల  పదిహేడవ తేదీన  వాడు పుట్టాడు. వాడికి శ్రీశ్రీగారు వెంకటరమణ  అని తన తండ్రి పేరు పెట్టారు ఇంట్లో మాత్రం  బైజూ  అని పిలుచుకునే వాళ్ళం. మా రెండో అమ్మాయిని 'బుజ్జీ' అని నేను పిలిచేదాన్ని  శ్రీశ్రీగారు 'బజ్జీలూ' అని పిలిచేవారు.

    ఒకనాడు  శ్రీశ్రీగారు  కంపెనీనుండి వచ్చి, "సరోజా ! గుడ్ న్యూస్" అన్నారు.

    "ఏమిటి?" అని అడిగాను.

    "నేను కథ, స్క్రీన్ ప్లే  రాసిన  'రుక్మిణీ కళ్యాణం' తియ్యమని అందరూ  అంటున్నారు. 'డిస్ట్రిబ్యూటర్స్ ని మేము ఏర్పాటు చేస్తామ'ని  దుక్కిపాటి  మధుసూదనరావుగారు మాట ఇచ్చారు. అక్కినేని  నాగేశ్వరరావుగారు కృష్ణుడుగానూ, కృష్ణకుమారి  రుక్మిణిగానూ  నటిస్తామన్నారు.
రాజేశ్వరరావుగారు సంగీత దర్శకత్వం, గోఖలేగారు ఆర్టు_ ఒకటేమిటి_అందరూ సహకరిస్తామన్నారు" అని చెప్పారాయన.

    "దర్శకత్వం ఎవరు?" అని అడిగాను.

    "నేనే చేస్తాను సరోజా!" అన్నారు.

    "పురాణంలోని  'రుక్మిణి కల్యాణమా' లేక  అది కూడా కలియుగ రుక్మిణీ కృష్ణుల కళ్యాణమా?" అని అడిగాను.

    "నీ సందేహం  కరెక్టే. మార్పులు చాలా వుంటాయి. నీకు చెప్తాగా!" అన్నారు.

    "బాగానేవుంది. కానీ 'ఆకలి మంటలు" సంగతి?" అని అడిగాను.

    "అది కూడా తప్పకుండా తీస్తాను సరోజా! దానిని  మనస్సులో పెట్టుకొనే ఇవన్నీ  చెయ్యడం" అన్నారు.

    "ఆలోచించండి. ఆర్ధికంగా  ఇప్పటికే  మనం దెబ్బతిన్నాం" అన్నాను.

    "అంటే మనం స్ట్రయిట్ పిక్చర్  తియ్యలేమంటావా?" అని అడిగారు.

    "ఎందుకు తియ్యలేమండీ. తియ్యగలం. పోతే చిప్పా దొప్పా  చేతికి రాకుండా  చూసుకోవాలి. నన్ను అడిగితే_నా  కిష్టంలేదు. తర్వాత  మీ ఇష్టం" అన్నాను.

    అనుకోకుండా అన్నీ కలిసొచ్చి "రుక్మిణీ కల్యాణం పూజ  మందపల్లిలో  మా ఇంట్లోనే సింపుల్ గా చేస్తున్నామ"ని వారు ఒకరోజు హఠాత్తుగా చెప్పారు.    

    ఆయన అనుకున్న ప్రకారం మా ఇంట్లోనే  పూజ సింపుల్ గా ముగిసింది. నాగేశ్వరరావుగారు, దుక్కిపాటి  మధుసూదనరావుగారు, గోఖలేగారు, కృష్ణకుమారిగారు, రాజేశ్వరరావుగారు_మొదలైన  వాళ్ళంతా వచ్చి పూజలో పాల్గొన్నారు.

    మరునాడు  ఫిల్మ్ సెంటరులో  పి. లీల పాడిన  'అమ్మలగన్నయమ్మ' పద్యంతో రికార్డింగ్ ప్రారంభమయింది. దాంతోపాటు  ఓ పాటకూడా రికార్డు చేశాం. అంతే_ఆ పిక్చర్  సురక్షితంగా  మూలపడింది.

    "దీనివల్ల  మనకి ఎంత నష్టం వచ్చింద"ని అడిగాను.

    "ఇరవైవేలు" అన్నారు.

    "నేను ముందే చెప్పాను కదండీ. మనిద్దరం బిజినెస్ కి పనికిరాము. ముందు తల పెట్టిన రెండు డబ్బింగ్ పిక్చర్లు ప్రారంభించి మూలపడకుండా  పూర్తిచేసిందే గొప్ప సంగతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS