Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 26


    హో ఈజ్ దిస్ గర్ల్?
    ఎందుకలా మాటిమాటికి ఫోన్ చేస్తుంది? ఎందుకు ఇలా అజ్ఞాతంగా వుంచాలని ప్రయత్నిస్తోంది."
    ఏమన్నా మోటివ్ వుండివుంటుందా ఈ ప్రవర్తన వెనకాల?
    సాలోచనగా నోట్ పాడ్ ముందుకు లాక్కుని దాని మీద పెద్ద అక్షరాలతో 'ధనందిబ్బ' అని రాసుకున్నాడు ఎడిటరు.
    ఆ తర్వాత ఇంక ఆ అమ్మాయి సంగతి మర్చిపోయాడు.
    
                            *    *    *    *

    "రండి" అన్నాడు బ్రహ్మచారి.
    సంకోచంగా లోపలికి అడుగు పెట్టాడు ఉదయార్కర్.
    చిన్న కిరోసిన్ దీపం ఒకటి వెలిగించాడు బ్రహ్మచారి.
    ఆ వెలుగులో పరిసరాలను గమనించాడు ఉదయార్కర్. చాలా పాతకాలపు ఇల్లు అది. కనీసం వందేళ్ళు దాటి వుంటుంది దాన్ని కట్టి. గట్టిగా ఒక జడివాన కురిస్తే కుప్పకూలిపోయేట్లు వుంది యిల్లు. నేలకు వేసిన గచ్చు పెచ్చులుగా లేచిపోయింది.
    మౌనంగా ఒక చింకి చాప పరిచి కూర్చోమన్నట్లు చేత్తో సైగ చేశాడు బ్రహ్మచారి.
    కూర్చున్నాడు ఉదయార్కర్.
    అతను కూర్చున్న తరవాత, ఇంక అతని ఉనికిని మర్చిపోయినట్లు పెద్ద పెద్ద అంగలతో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు బ్రహ్మచారి. వచ్చిన మనిషి ఎవరని గాని, ఎందుకు కొచ్చారని గానీ తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అతనికి ఉన్నట్లులేదు.
    అతను పచార్లు చేస్తుంటే అతని నీడ భీతిగోలిపేటట్లు అటూ యిటూ నగయాడుతోంది.
    కాసేపు వెయిట్ చేసి తరువాత చిన్నగా దగ్గాడు ఉదయార్కర్.
    వెంటనే టక్కుమని ఆగిపోయి అతని మొహంలోకి చూసాడు బ్రహ్మచారి.
    "నేను ఒక అన్వేషణ మీద బయలుదేరాను " అన్నాడు ఉదయర్కర్ ఉపోద్ఘాతంగా.
    మాట్లాడకుండా తీక్షణంగా చూస్తున్నాడు బ్రహ్మచారి.
    "మా తాతగారి కాలంనాటి పాత పత్రాలు దొరికాయి నాకు. అవి తిరగేస్తుంటే ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది."
    బ్రహ్మచారి మౌనంగానే వున్నాడు.
    జేబులోంచి ఒక కాయితం తీశాడు ఉదయార్కర్. ఎడిటరు ఇచ్చిన భూర్జపత్రంలోని ఇన్ఫర్మేషను దానిలో కాపీ చేసి వుంది.
    "ఇది చదవమంటారా?"
    తల వూపాడు బ్రహ్మచారి.
    చదవడం మొదలెట్టాడు ఉదయార్కర్.
    "కదళీనాధుడు ......శునక శాల్మనీ వృక్షము........"
    అతను చదవడం అపుచేయ్యగానే అసహనంగా అన్నాడు బ్రహ్మచారి-
    ఈ సదానంద్ కి సంబడం ఎక్కువ! సహనం తక్కువ. నేను చెప్పిన వివరాల్లో సహమే రాసుకున్నాడన్నమాట!"
    ఆ మాటలు వినగానే దొరికిపోయిన దొంగలా ఫీలయ్యాడు అతను.
    తను చెప్పబోయే కాకమ్మ కధను మొదట్లోనే తుంచిపారేశాడు బ్రహ్మచారి.
    ఈ ఇన్ఫర్మేషన్ తనకు సదానంద్ ద్వారానే వచ్చి ఉంటుందని ఇతనికి బాగా తెలుసునన్నమాట!
    ఇంక యితని రియాక్షన్ ఎలా వుంటుంది యిప్పుడు!
    శాంతంగానే తనలో తను మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు బ్రహ్మచారి.
    శ్రీశైలానికి పద్దెనిమిదో కిలోమీటరు రాయి దగ్గర నుంచి అచ్చంపేట దారిలో పడమటి ఎనిమిది కిలోమీటర్లు నడవాలి. అదంతా చిక్కటి అడవి. అక్కడ భ్రుగుపాతం అనే నది వుంది. అది పోయి కృష్ణలో కలుస్తుంది.
    అక్కడ మూడు గుహలు వుంటాయి. గుహ ద్వారంలో శివలింగాలు వుంటాయి.
    అక్కడే వుంది అక్కమాంబ బిలం!
    దానిలో నుంచి వెళితే మొహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా రంగాపురం ఫిర్కాలో వున్న గుట్టల్లో తెలతాం. దాదాపు నలబై అయిదు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది ఆ గుహ. ఐదురోజులు నడక ప్రయాణం. అలవాటున్న వాళ్ళకి రెండు రోజులు చాలు.
    ఆ అక్కమాంబ బిలానికి ఒకటిన్నర రోజు ప్రయాణ దూరంలో ఉంది కదళీవనం. పులుల బెడద చాలా ఎక్కువ అక్కడ. రాత్రి పడగానే ప్రయాణికులు అక్కడ వున్న ఎత్తుగా ఉండే ఒక విశాలమైన బండ మీద ఎక్కి అక్కడే వంట చేసుకుని తిని విశ్రమిస్తారు. పులిబండ అంటారు దాన్ని. ఆ ప్రదేశం అంతా రాతినేల. దానిమీదే దాదాపు వంద ఎకరాల మేర అరటి తోట వుంది. ఆ తోటలో వుంది ఒక లింగాకారం. ఆ లింగమే కదళీనాధుడు. దాని మీదికి అభిషేకం చేస్తున్నట్లుగా ముడోందల అరవై అయిదు రోజులపాటు నీళ్ళు చుక్కలు చుక్కలుగా ప్రసరిస్తూ వుంటాయి. కర్నాటక ప్రాంతం నుంచి ఎక్కువమంది వస్తుంటారు కదళీనాధుడి దర్శనం చేసుకోవడానికి.'
    బ్రహ్మచారి గడగడ చెప్పేస్తూ వుంటే ఉదయార్కర్ కి ఎడిటర్ చేసిన కామెంట్ గుర్తు వచ్చింది.
    జానపద గాధ!
    యా! జానపదగాధే ఇది! నధింగ్ మోర్ దాన్ దట్! దిసీజ్ సింప్లీ ఫాంటసీ! నధింగ్ ఎల్స్!
    బ్రహ్మచారి తనలో తానూ మాట్లాడుకుంటున్నట్లు చెబుతూనే వున్నాడు.
    "అక్కడికి  దగ్గరలోనే ఉంది మేనకా సరస్సు. అది శాపగ్రస్తం అందులోని నీళ్ళు తాగితే మృగాలయిపోతారు!"
    "నౌ దిసీజ్ ద లిమిట్!" అనుకున్నాడు ఉదయర్కర్ విసుగ్గా.
    మేనకా సరస్సు! శాపగ్రస్తం! అందులోని నీరు తాగితే మృగాలయిపోవడం.
    ఇది ఇరవయ్యో శతాబ్దపు చివరి భాగమా! లేక పురుణయుగామా!
    ఈ బ్రహ్మచారి చెప్పబోయేది ఇలాంటి పుక్కిటి పురాణాలే అయితే తను ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం.
    అతని ఆలోచనలు తను చదివేసినట్లు తీక్షణంగా చూసి అన్నాడు బ్రహ్మచారి.
    "అంత నమ్మకం లేనివాడివి ఇక్కడి కేందుకోచ్చావ్? నీ పేరు ఉదయార్కర్ కదూ! రచయితవి! అవునా?"
    ఉలిక్కి పడ్డాడు ఉదయార్కర్!
    ఈ వివరాలన్నీ ఇతనికేలా తెలిసాయి?
    "అపనమ్మకం, అపనమ్మకం!" అని గొణుక్కున్నాడు బ్రహ్మచారి. "మన పెద్దలేం తెలివి తక్కువ వాళ్ళు కారు మనుషులు మనస్సులో బాగా నాటుకోవడానికి గానూ సింబాలిక్ గా చెప్పేవారు అన్నిటినీ. మేనకా సరస్సు లో నీరు తాగితే మృగాలయిపోతారంటే నిజంగా జంతువు అయిపోతారని కాదు. మనుషుల్లో జంతు ప్రవృత్తి ప్రకోపిస్తుందని అంతే! అదీ అర్ధం! అది అసంభవమేమీ కాదు. ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొన్ని నీళ్ళు తియ్యగా ఉంటాయి. కొన్ని ఉప్పగా వుంటాయి. కొన్ని నదుల నీళ్ళు తాగితే ఆకలి పెరుగుతుంది. కావేరీ నీటిలో ఫాస్పరస్ ఉందనీ, ఫాస్పరస్ తో కలిసిన నీరు మెదడుని చురుగ్గా చేస్తుందనీ చెబుతారు. అందుకే తమిళులకి తెలితేటలు జాస్తి. ఇంకొన్ని రకాల నీళ్ళలో మునిగి స్నానం చేస్తే జబ్బులు నయమవుతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS