Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 26


    సమాధానంగా జ్యోతి లేచి కూర్చుంది. జయకృష్ణ వంక అయోమయంగా  చూసింది. ఆ తరువాత సన్నని స్వరంతో రోదించసాగింది. ముఖాన్ని మోకాళ్ళ మధ్య దాచుకుని ఎక్కిళ్ళు పెడుతోంది జ్యోతి.
    రవంత సేపు ఆ భామావిలాపం చూశాక జయకృష్ణ మనసు కరిగి పోయింది. పాపం అతడు అసలే బ్రహ్మచారి. అది చూస్తె అర్ధరాత్రి సమయం. ఉన్నదేమో కొండలు అడవుల మధ్య. వారిరువురూ తప్పించి మరొకరి పోలకువ లేకపోయే. అక్కడ జరిగే ప్రమాదానికయినా ప్రేమ కలాపానికయినా నిండుతల్లి కృష్ణమ్మ ఒక్కతే సాక్షి!
    ఆ స్థితిని తలుచుకుని త్వరగా కరిగిపోయినాడు జయకృష్ణ. ఆమె చేస్తున్న నిస్సహాయ రోదనా తరంగాలు గాలిలో తేలివచ్చి అతని గుండెల్ని తూట్లూ పొడుస్తున్నాయి. మనసు విచలితమయిపోయింది.
    "జ్యోతి! ఏడవకు. నీకు ఎందుకు యిటువంటి ప్రయత్నం చేశావు! మన్హ పూర్వకంగా చేశావని నేను అనికోవటం లేదు. నీవు అలా చేయదలిస్తే ఇంత దూరం రావలసిన పని లేదు. ఆ సంగతి నాకు తెలుసు. కాని ఎందుకు యిలా ఆత్మహత్య ప్రయత్నం చేశావో చెప్పు" అన్నాడు జాలి గొలిపే కంఠంతో.
    జ్యోతి మరింత దుఖంతో ఉద్విగ్నురాలు అయింది.
    అతడు దగ్గరగా వచ్చి ఆమెకు చేయి అందించాడు. అతని చేయి పుచ్చుకుని లేచి నిలబడింది జ్యోతి. "వెళ్ళిపోదాం పద" అన్నాడతడు, తాను అడిగిన ప్రశ్నలకు ఆశించిన సమాధానం ఆమె నించి ఆ సమయంలో రాదన్న నిర్ణయానికి వచ్చినవాడిలా!
    అతడు ముందు నడుస్తున్నాడు. ఆమె అతని చేయి పుచ్చుకుని వెనుకగా అడుగులు లేక్కిస్తున్నట్లు నడుస్తోంది. ఏటి మీది నుంచి వచ్చే విసురు గాలి నించి రక్షణ కోసం వారు విడిది చేసిన చదును అయిన ప్రదేశంలో చిన్ని డెరాలా ఓ బట్టను అమర్చాడు జయకృష్ణ.
    నడిచేందుకు సాయం కోసమని తెచ్చుకున్న హాండ్ స్టిక్స్ ని స్తంభాల్లా ఉపయోగించాడు. డెరాలోకి దూరాక చితుకులు రగిలించి నిప్పు చేశాడు. వెచ్చని చితుకుల మంటకి ఈ ప్రక్క ఒకరూ ఆ ప్రక్క ఒకరూ కూర్చున్నారు. నిప్పు సెగ తగిలాక ఆమె రవంత స్వస్తురాలయింది. ముఖంలో వెనుకటి కాంతి తిరిగి రావటం ఆరంభమయింది.
    "నేను రావడం అరక్షణం ఆలస్యమయితే ఏమి జరిగివుండేది?" జయకృష్ణ మళ్ళీ ప్రారంభించాడు తొలిపాఠం క్రొత్త పద్దతిలో!
    "నా అంతట నేను వెళ్ళలేదు. ఆమె రమ్మంటే పోయినాను" అని బదులు చెప్పింది జ్యోతి అరచేతులు చితుకుల మంటకు దగ్గర చేర్చుతూ.
    "ఆమె రమ్మంటే పోయినావా?" అంటూ సదరు ఆమె ఎవరో తెలుసుకుందుకు చుట్టూ ప్రక్కల అంతా పరిశీలించి తిరిగి తిరిగి చూడసాగాడు జయకృష్ణ. పాపం అతని శ్రమ వృధా అయింది. ఈమె ఒక్కతే కాని ఆమె ఎవరో అతనికి కన్పించనేలేదు.
    "ఆమె ఎవరూ?" అని అడిగాడు కంగారుగా.
    "శ్వేతకి" అని బదులు చెప్పింది జ్యోతి.
    అది విని ఇది పురాణయుగమా అన్నట్లు అయోమయంగా చూచాడు జయకృష్ణ. అప్పటికీ పూర్తిగా స్వస్తురాలయిన జ్యోతి అతని వాలకం గమనించి కిలకిలా నవ్వింది.
    "ఎందుకు అలా చూస్తారు. శ్వేతకి గురించి తామ్రపత్రాల ఫోటో స్టాట్స్ లో మీరు చదవలేదా? ఆ శ్వేతకి నాకు అప్పుడప్పుడు కన్పిస్తూ వుంటుందని నేను మీతో చెప్పలేదా?" అన్నదామె.
    మరింత అయోమయంగా చూచాడు జయకృష్ణ. "మీ కధ వింటూ వుంటే విఠాలాచార్య సినిమా చూస్తున్నట్లుగా వుంటుంది." అన్నాడు నవ్వుతూ. జ్యోతి సిగ్గుపడి నవ్వింది. "మీరు భలే తమాషాగా మాట్లాడుతారు" అన్నది.
    ముందునించి చితుకుల మంట వేడిగా తగులుతున్నా వెనుకనించి చల్లని ఏటిగాలి వెన్నులోంచి ఒణుకు పుట్టిస్తోంది.
    కొంతసేపు మౌనం తరువాత జ్యోతి తనే చెప్పింది.
    "అవును జయకృష్ణగారు! కొన్ని విషయాలు నమ్మశక్యం కానివిగానే ఉంటాయి. ప్రొఫెసర్ శ్రద్దాదేవి అంటూ వుండేది. ఈ ప్రకృతి చాలా విశాలమయినది. విశాల విశ్వంతరాళంలోని రహస్యాలన్నీ అగాధమయినవి.
    ఒక్క పాలపుంతలోనే కొన్ని లక్షల నక్షత్రాలుంటాయి. ఒక నక్షత్రంలో లక్షల వంతు మాత్రమే ఉంటుంది ఈ భూమి. దానిలో కోటాను కోట్ల వంతు చోటుని మాత్రమే ఆక్రమించగల మనిషి తాహతు ఎంతంటారు?"
    "ఇది నిరాశా వాదమనుకోకండి. మనిషి తన పరిధిలో తాను ఎన్నో సాధిస్తాడు. కాని అది విశాల విశ్వాంతరళంలోని అద్భుతమయిన, అగాధమయిన రహస్యాలతో పోల్చుకుంటే ఎంత?
    ప్రకృతికి ఈ భూమి యావత్తూ ఒక అణువు అంత కూడా కానప్పుడు దానిలోని అణువు అయిన మనిషి ఎంత? భూమి మీది అన్ని రహస్యాలు కొంతవరకు విజ్ఞాన శాస్త్రం అర్ధం చేసుకోగలుగుతోంది.
    కాని ఆత్మరూపాల విషయానికి కొస్తే అది మొత్తం విశాల విశ్వంతరాళానికి సంబంధించిన అంశమవుతుంది. దాని గురించి అనుభవాలే విశ్లేషణ వల్ల సంపూర్ణమయిన విజ్ఞానం లభిస్తుందని నేను అనుకోను.
    ఆత్మరూపాలను విశ్లేషించగల సాధనాలూ, వైజ్ఞానిక పురోగతి మనమింకా సాధించలేదని నేను అనుకుంటాను. శ్వేతకి తాలూకు ఆత్మ రూపాన్ని నేను అనేక సార్లు చూచాను. ఆమె అభ్యంతర పెడుతున్న కొలదీ నా పట్టుదల మరింత అవుతోంది. ఈ ప్రయత్నంలో పురోగమిస్తున్న ప్రతి సారీ ఆమె నాకు ఏదో ఒక చెడు అనుభవాన్ని మిగుల్చుతోంది.
    తామ్రపత్రాలు బయటపడే తొలినాడు ఒక ప్రాణం పోయింది.  ఎలాగో నేను మాత్రం బ్రతికాను. తరువాత అవి చదివే ప్రయత్నంలో వుండగా తిరిగి ప్రాణగండాలు ఎడురయినాయి.
    అన్వేషణకని పూనుకున్న ఈసారి ఇలా అయింది."
    "ఇదంతా చూస్తుంటే ఈజిప్టు పిరమిడ్లలోని మమ్మీల గురించి ప్రచారమయిన కధల్లో కొంత నిజం లేకపోలేదని నాకు అనిపిస్తోంది. ప్రేతాత్మలు మనుషుల బౌతిక జీవితాలలో క్వాచిత్కంగా ప్రత్యేక్ష సంబంధానికి వస్తాయని రుజువు అవుతోంది" అని చెప్పింది జ్యోతి.
    ఆమె మాటల్ని శ్రద్దా సక్తులతో ఆలకించాడు జయకృష్ణ. ఆమె చెప్పే మాటలు తేలికగా నమ్మశక్యం కాని యదార్ధమే అనిపించసాగింది.
    "మీరు ఎలా రాగలిగారు అని నేను అడగను. మీకు అనుకోకుండా మెలకువ వచ్చి వుంటుంది. నా బెడ్ మీద నేను లేను. బయటకు వచ్చి చూసి వుంటారు. వెంబడించి వచ్చారు. నన్ను కాపాడి నాకు ప్రాణదాతలయినారు. కాని నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి జయకృష్ణగారూ?"
    "నాకు కన్పించిన శ్వేతకి ఆత్మ రూపం మీకు కన్పించలేదా?" అని అడిగింది జ్యోతి. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊగించాడు జయకృష్ణ.
    ఆ సమాధానం అర్ధం చేసుకుని విభ్రాంత అయి రవంత సేపు అలాగే మౌనంగా వుండిపోయింది జ్యోతి.
    "ఆమె కన్పించినప్పుడు మీరు నన్నెందుకు పిలువలేదు?" అని అడిగాడు ఆసక్తిగా.
    "అది సాధ్యపడదు జయకృష్ణగారూ! శ్వేతకి సూర్యకిరణాలను పోలిన ధవళమూర్తిలా ప్రత్యక్షమయి, సమ్మోహనకరమయిన చూపులతో ఒకసారి నా కన్నుల్లోకి చూచిందంటే ఇంక నన్ను నేను మరచిపోతాను వివశురాలను అయిపోతాను! నేనేం చేస్తున్నానో నాకే తెలియని స్థితి అవుతుంది " అని చెప్పింది జ్యోతి. జయకృష్ణ ఏదో ఆలోచిస్తూ చాలాసేపు అలాగే కూర్చుండి పోయినాడు. తన ప్రాణదాత అయిన అతని వంక ఆరాధనగా చూస్తోంది.
    వెనుకనించి రివ్వున వీచే గాలి వల్ల అతని జుత్తు విశాలమయిన నుదురు మీదకి వచ్చి పడుతోంది. చూపుడు వ్రేలితో వాటిని పైకి ఒత్తిగిస్తూ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు జయకృష్ణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS