"క్లుప్తంగా చెప్పాలంటే ఉన్మాదానికి ముందుండే స్థితికి చేరుకుంది మాధవి."
"ప్రొఫెసర్ !" అరిచినంత పని చేశాడు సాగర్.
"వెంటనే షాక్ ట్రీట్ మెంట్ మొదలు పెట్టించడం మంచిది."
"ప్రొఫెసర్! అప్ సర్ట్! మీరు పోరాపడుతూన్నారని నా అభిప్రాయం." సాగర్ కంఠం తీవ్రంగా ఉన్నది. షాక్ ట్రీట్ మెంట్ తనకే ఇచ్చినట్టయింది.
"ప్రేమలూ, అభిమానాలు వాస్తవాల్ని కప్పి పుచ్చలేవు. సైకాలజీ స్టూడెంట్ వి నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. త్వరపడటం మంచిది. షాక్ ట్రీట్ మెంట్ ఇప్పించితే మాధవి బాగుపడే అవకాశాలున్నాయి."
"అంతలో టెలిఫోన్ మ్రోగింది. ప్రొఫెసర్ ఫోన్ అందుకొని "హల్లో!' అన్నాడు.
"గుడ్ మార్నింగ్ డాక్టర్ మూర్తిని."
"గుడ్ మార్నింగ్ డాక్టర్! సాగర్ ఇక్కడే వున్నాడు. మాధవి కండిషన్ గురించి ఇంతకుముందే చెప్పాను. మీరు వెంటనే ఆమెకు ట్రీట్ మెంట్ ఇప్పించాలి. బెంగుళూరు నుంచి తిరిగి వచ్చాక కలుసుకుందాం. సో బై." ప్రొఫెసర్ రిసీవర్ పెట్టేశాడు.
"ప్రొఫెసర్! అయితే డాక్టరు మూర్తి కి ఈ విషయం ముందే చెప్పరన్నమాట!" సాగర్ కంఠం తీవ్రంగా ఉన్నది.
"యస్, యస్! హహి ఈజ్ వెరీమచ్ ఇంటరిస్టడ్ ఇన్ హర్'!"
"దగా! మోసం! కుట్ర - నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావు. ఆ డాక్టర్ మూర్తే వెనుక నుండి ఈ నాటకం అడిస్తున్నాడు. స్నేహం కోసమో, డబ్బు కోసమో, పరపతి కోసమో, నిజాయితీని అమ్ముకున్న సైక్రియాటిస్టు వి నువ్వు ! నిన్ను నమ్ముకొని వచ్చిన ఎంతమంది మానసిక రోగులను ముంచేసావో? నువ్వు మానసిక వైద్యుని పేరుతొ చలామణి అవుతున్న మోసగాడివి! ఆ డాక్టరూ, నువ్వూ కలిసి చేసిన కుట్ర యిది - ' సాగర్ గుండెలు కుతకుతలాడిపోతున్నాయి. ప్రొఫెసర్ ను ఎన్నో అనాలనుకున్నాడు. కాని పెదవి మీద ఒక్క మాట రాలేదు. ప్రొఫెసర్ గొంతు పట్టుకొని నులమాలనివుంది. కాని చేతులాడటం లేదు. ఏదో లోతు తెలియని ఊబిలో దిగిపోతున్న వాడిలా ఉక్కిరిబిక్కిరయిపోయాడు.
"సాగర్! అధైర్యపడకు. నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. మాధవి మళ్ళీ మామూలు మనిషి అయేందుకు అవకాశం ఉన్నది." ప్రొఫెసర్ లేచి నిలబడ్డాడు.
"అంటే మంధవికి పిచ్చని నన్ను నమ్మమంటావా! అసలు నీ పెళ్ళానికి పిచ్చి ' నీకు పిచ్చి!' అలా అని అన్నానని అనుకున్నాడు. కాని అనలేకపోయాడు. కణతలు అడిరిపోతున్నాయి. రెండు చేతులతో తల పట్ట్టుకున్నాడు. లేచి నిలబడటానికి ప్రయత్నం చేశాడు. కాళ్ళు వశం తప్పిపోతున్నాయి.
"ఓ.కే సాగర్! నేను చెప్పినట్లు చేస్తావుగా? అశ్రద్ధ చేయొద్దు! నేను బెంగుళూరు నుంచి తిరిగి రాగానే మాధవి ఎలా వుందో వచ్చి చెప్పు బై బై" అంటూ ప్రొఫెసర్ సాగరును బయటికి తీసుకొచ్చాడు. సాగరు మౌనంగా వరండా మెట్లు దిగి కారు దగ్గరకొచ్చాడు. ప్రొఫెసర్ ను కన్నెత్తయినా చూడకుండా కారు స్టార్ట్ చేశాడు. అలా వెళ్తున్న సాగరును చూస్తూ ప్రొఫెసర్ భుజాలు ఎగరేశాడు.
12
"సాగర్"
"ఊ!"
"ఏమిటాలోచిస్తున్నావ్?"
"ఏమి లేదు"
"నిజం చెప్పు"
"నిజంగానే మాధవీ. నా మనస్సులో ఇప్పుడు ఏ ఆలోచనా లేదు. అటు చూడు! ఆ విరిసిన ఇంద్రధనస్సులోని రంగులతో మనసు నిండిపోయింది.
సాయంకాలం నీరెండలో పార్కులో తివాచిలా పరుచుకొని వున్న పచ్చటి మైదానంలో సాగరూ, మాధవీ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. అప్పుడే ఆకాశం అంచును కలుపుతూ ఆవిర్భవిస్తున్న హరివిల్లును తదేక దీక్షగా చూస్తున్నాడు సాగర్. మాధవి సాగర్ కు దగ్గరగా జరిగి ఆకాశంలో పెరిగిపోతున్న ఇంద్రధనస్సు ను కళ్ళార్పకుండా చూడసాగింది.
సాగర్ చేతుల్ని తాకుతూ మాధవి "సాగర్! ఈ రోజు నాకు ఎంతో హాయిగా వున్నది. మనస్సు తేలిగ్గా ఉన్నది" అన్నది.
సాగర్ మాధవి చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు.
"మాధవీ! ఈరోజే మీ నాన్నగారితో మాట్లాడాలను కుంటున్నాను."
"దేన్నీ గురించి?"
"మన పెళ్ళి గురించే!"
మాధవి సాగర్ చెయ్యి గట్టిగా పట్టు కొన్నది సాగర్ కళ్ళల్లోకి చూసింది.
"అవును మాధవీ, మా అమ్మ ఆరోగ్యం గురించి నీకు తెలుసు. ఆమె ఆఖరి కోరిక ఏమిటో తెలుసా? ఆమె బ్రతికుండగానే నా పెళ్ళి జరగాలట!"
"నా అభిప్రాయం నీకు అవసరం లేదా?"
"ఇష్టం లేకపోతె చెప్పు!"
"యూ నాటీ బాయ్!" మాధవి సాగర్ చేతిని మృదువుగా గిల్లింది.
"నన్ను చేసుకొని నువ్వేం సుఖపడదామనుకుంటున్నావ్?" ఆ ప్రశ్న అడుగుతూ మాధవి సాగర్ ముఖంలోకి చూడలేకపోయింది.
"ఏం? ఇంకేవరినన్నా ప్రేమిస్తున్నావా?"
"యూ సిల్లీ! నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను!"
"ఎక్కడికి? ప్రియుడి దగ్గిరకా?" సాగర్ కొంటెగా అన్నాడు.
"సాగర్ - నిన్నూ - నిన్నూ -" అంటూ మాధవి సాగర్ మెడ చుట్టూ చేతులు వేసి రక్కినంత పని చేసింది!
"ఏయ్ మాధవీ! ఇది పార్కు" సాగర్ మాధవి చేతుల్ని విడదీశాడు.
"మరయితే ఎందుకమ్మా నన్ను ఉడికిస్తావ్?" మారాం చేస్తూ అన్నది మాధవి.
"సరే! నీ అభిప్రాయం చెప్పు."
మాధవి మౌనంగా విడిపోతున్న ఇంద్రధనస్సు రంగుల కేసి చూడసాగింది. ఇద్దరూ మౌనంగా ఐదు నిమిషాలు అలాగే కూర్చున్నాడు . మాధవి మనసులో మెదలుతున్న ఆలోచనలను ఆమె ముఖం దాచలేక పోతున్నది. వివర్ణమవుతున్న ఆమె ముఖాన్ని చూసి సాగర్ కంపర పడ్డాడు.
"మాధవీ! నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్ధం చేసుకోగలను. నీ ఆరోగ్యం గురించి బాధ పడాల్సిందేమీ లేదు. ఇంతవరకూ జరిగింది ఒక పీడ కలగానే భావించు . నీ అంతరాంతరాళంలో వున్న భ్రమలూ, భయాలూ, దూర మయ్యాయి. నువ్వు ఇప్పుడు మాములుగా వున్నావు. మానసిక స్థితిలో ఓడిదుగులు రావడం కొందరికి సహజం. అందులో నుంచి బయటపడటమూ సర్వసాధారణంగా జరిగేదే. ఇది మానసిక శాస్త్రానికి విరుద్దమేమి కాదు...." మాధవి మనస్సులో ఇంకా ఎక్కడో దాగి వున్న అంకురాన్ని పెకలించి వేయడానికి సాగర్ ప్రయత్నం చేశాడు.
