"గొడవలంటూ ఏమీ లేవు. సునీల్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదు" అతను మీకు కనిపించి ఎన్ని రోజులు అవుతుంది .
"పది రోజుల పైనే అవుతుంది."
"సునీల్ కనిపిస్తే నేను వచ్చినట్టు చెప్పండి" పోలీస్ క్లబ్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెను దిరిగింది ధీరజ.
ధీరజ అక్కడ నుండి బయలుదేరి సరాసరి రవి గార్డెన్స్ దగ్గర అటో దిగింది.
అక్కడ దొరకని పూల మొక్కల రకాలంటూ ఏమీ ఉండవు. ఆ గార్డెన్స్ యజమాని నంద కుమార్ కు సునీల్ కు మంచి స్నేహం ఉంది.
అందుకే ఆఖరి ప్రయత్నంగా అతని దగ్గరకు వెళ్ళింది.
"ధీరజా.....ఏమిటి ఈ అకాల దర్శనం. వైజాగ్ ఎప్పుడు వచ్చావ్" ఆమెను చూస్తూనే నంద కూమార్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
"ఎప్పుడు వస్తే మాత్రం ఏమిటి కానీ .....ముందు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు ....సునీల్ ఎక్కడున్నాడు?"
"అది మాత్రం నన్ను అడగవద్దు"
"ఏం నీ స్నేహితుడు చెప్పవద్దు అన్నాడా?"
"నిజం ధీరజ -----నిజంగానే నాకు తెలియదు?"
"అని నన్ను నమ్మమంటావు"
"అబద్దం చెప్పినందు వలన నాకేం ప్రయోజనం. నిజంగానే చెబుతున్నాను. నేను ఎంత స్నేహితుడినయినా తనను గూర్చి ఏదీ నాకు చెప్పడు తనకు అవసరం వస్తే వచ్చి పలకరిస్తాడు."
అతని మాటలలో నిజాయితిని గుర్తించింది.
"అసలు అతను చేసే వ్యాపారం ఏమిటి?"
"ఏమో..... అది మాత్రం చెబితేగా ....బార్ కు వెళ్ళి డ్రింక్ తీసుకోవడం బాగా అలవాటు అయింది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడతాడు. ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయి అతని వెంట వుంటూనే వుంటుంది. అమ్మాయిల పిచ్చి ముదిరి పాకాన పడినట్టుంది" నవ్వుతూ అన్నాడు నందకూమార్.
"అమ్మాయిలతో తిరుగుతున్నాడా?" అడగకుండా వుండలేక టక్కున అడగనే అడిగేసిందామే.
"ఒకప్పుడు ఎంత బుద్ది మంతుడిలా వుండేవాడో తలుచుకుంటే వాడేనా ఇలా ప్రవర్తిస్తుంది అని ఎవరికయినా ఆశ్చర్యం కలుగకమానదు. నా అనుమానం ఏమిటంటే ...." అని ఒక నిమిషం మౌనం వహించాడు నందకూమార్.
"ఆగిపోయావెం చెప్పు."
"ఏదో అక్రమ వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నాడనిపిస్తుంది. లేకపోతే తన వ్యాపారం ఏమిటో కూడా చెప్పకుండా ఎందుకు దాచుకుంటాడు."
అతని మాటలు విన్న ధీరజకు సునీల్ మీద వున్న నమ్మం పోయింది.
అప్పటివరకు హృదయంలో మిగిలివున్న అకాస్తా చేజారిపోయినట్టనిపిస్తుంది.
నందకూమార్ ముందు తను బయట పడకుండా జాగ్రత్త పడింది.
ఎంతయినా తను ఒక పోలీస్ ఆఫీసర్.
రాగద్వేషాలకు, మమతానురాగాలకు దూరంగా వుండాలి.
అందుకే ఇక సునీల్ ను గురించి ఇక ఎవరినీ ఆడకూడదని నిర్ణయించుకుని గిరుక్కున వెను దిరిగింది ధీరజ.
నందకుమార్ పిలుస్తున్నా వినిపించుకోకుండానే అటో ఎక్కి వెళ్ళిపోయిందామె.
ఇప్పుడు ధీరజ అంతరంగం నిండా ఎన్నో అనుమానాలు.
సునీల్ అమ్మాయిలతో తిరుగుతున్నాడంటే లలితతో తిరిగే సునీల్ తన సునీల్ ఒకడేనా?
లలిత భర్త సీతాపతిని హత్య చేసింది సునీల్ అయ్యుంటాడా?
అసలు అతను అలా వ్యసనపరుడు ఎందుకయ్యాడు?
అతనికి ఏం తక్కువ? ప్రాణాధికంగా ప్రేమించిన తనను కాలదన్నుకున్నాడు. ఎంతో అందమయిన జీవితాన్ని ఊహించుకున్న తమ కలలను తనే కల్లలు చేశాడు.
ఎందుకలా చేశాడో ఎంత ఆలోచించినా సరి అయిన కారణం కనిపించలేదు.
నేరస్థునిగా సునీల్ ను అరెస్ట్ చేయాలనే వూహకే ఆమె మనస్సు అదోలా అయిపొయింది.
ఇంతవరకూ ఒకప్పటి అత్మీయుని కోసం, ప్రియుని కోసం విశాఖ నగరాన్ని జల్లెడ పట్టినట్టు ఆచూకి తీయాలని ప్రయత్నించింది.
కానీ ఇప్పుడు వొక నేరస్థుడిని పట్టి చేట్టానికి అప్పజెప్పడానికి సునీల్ కోసం గాలించ వస్తుందేమో ..... అసలు అతను ఇంతవరకు పోలీసు రికార్డులలో ఎక్కడో లేదో తెలుసుకోవాలని కమీషనర్ ఆఫీసుకు బయలు దేరింది ధీరజ.
* * *
తనకు కావలసిన ప్లాట్ అదేనని మరొకసారి నిర్ధారించుకున్నాడు ఎస్. ఐ. ప్రసాద్.
ఎస్. ఐ. .సైగ చేయడంతో వెంట వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ లో వొకడు కాలింగ్ బెల్ నొక్కాడు.
ఒక నిమిషం తరువాత తలుపులు తెరుచుకున్నాయి.
గది నుండి బయటకు వచ్చిన సునీల్ ఎదురుగా కానిస్టేబుల్స్ చూసి ఖంగారు పడిపోయాడు అతనికి నోట మాటరాలేదు.
అది గమనించిన ఎస్. ఐ ప్రసాద్ అతను తప్పనిసరిగా నేరస్థుడు అయి వుంటాడనే అభిప్రాయానికి వచ్చేశాడు.
హోటల్ లో జరిగిన మంగళ హత్యను గురించి పోలీసుల ఎంక్వయిరీ కి వచ్చారనీ భావించి సునీల్ బిగుసుకు పోయాడు.
ఆ సమయంలో ఆమెతో పాటు హోటల్ గదిలో గడిపిన వ్యక్తీ ఎవరో పోలీసులు ఆచూకీ తీసి వుంటారని . అందుకే తనను వెతుక్కుంటూ వచ్చారని ఖంగారుతో నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండిపోయాడు.
"ఎరా .......నీపేరు సునీల్ కదూ...."
అయిపొయింది ..... తన చాప్టర్ క్లోజ్ అయిపొయింది.
తన పేరు కూడా తెలుసుకునే వచ్చారన్నమాట. హోటల్ లో మారుపేరుతో దిగినా అసలు పేరు కూడా తెలిసిపోయిన తరువాత బుకాయించి ప్రయోజనం లేదు.
"ఏరా మాట్టాడవూ.... అవునా కాదా?"
తడబడిపోతూ అవునన్నట్టు తల వూపాడు సునీల్.
'అమ్మాయిలతో శృంగారాన్ని నడిపే మన్మధ పురుషుడివట నీ అందచందాలతో కోరివచ్చిన మగువల కోర్కెలను తీర్చి పంపగల మనోహరుడవి నీవేనా? కండలు తిరిగిన నీ కండలు ఇంతకాలం ఆడవారితో పడక సుఖాలు పంచుకోవడానికే అలవాటుపడిపోయి వుంటావు. పాపం....ఇంతకాలం అనందం అనుభవించిన నీ శరీరం ఇక నుంచి నరకం ఎలా వుంటుందో రుచి చూస్తుంది. వొళ్ళు కొవ్వెక్కి.....కామంతో కళ్ళు కానక హత్యలు కూడా చేస్తావురా బద్మాష్...." అంటూ ఈసడించుకున్నాడు ఎస్. ఐ. ప్రసాద్.
చివరిమాటలతో సునీల్ పంచప్రాణాలు పైనే పోయినట్టయ్యాయి.
ఎలాగో గొంతు పెకలించుకుంటూ నేను హత్య చెయడ మేమిటి? నాకేం తెలియదు?" అని మాత్రం అనగలిగాడు.
"సీతాపతిని నువ్వే సంపావని మాకు తెలుసు. అయినా హత్య చేసిన హంతకుడు ముందు తను హత్య చేయాలేదనే అంటాడు తప్ప పోలీసులను చూడగానే గజగజ వణికిపోయి నేనే హత్య చేశానుం నన్ను వదిలేయండి బాబోయ్ అని ఏ హంతకుడూ కాళ్ళ పైబడి నేరాన్ని వొప్పుకోడు. పాడరా బేవకూఫ్! నువ్వే చేశావో , నీ జేజెమ్మ చేసిందో నీ నోటితో నువ్వే చెబుదువు గానీ.....విసురుగా లాఠీ తో నెట్టాడు ప్రసాద్.
సునీల్ అప్పుడు విషయం అర్ధం అయింది. పోలీసులు ఎందుకు వచ్చారో తెలియడంతో అతనిలో ఆరాటం తగ్గినట్టయింది. మరొక కేసులో వాళ్ళు అనుమానిస్తున్నారు. హత్య అంటే తను ఖంగారు పడిపోయాడు కానీ ....మంగళ హత్యను గురించి కాదు పోలీసులు వచ్చింది."
సీతాపతి హత్యను పరిశోధిస్తున్నారు పోలీసులు..... ఆ హత్య తను చేయలేదని తెలుసు కాబట్టి వొక విధమయిన తెగింపుతో వాళ్ళ వెంట నడిచాడు సునీల్.
* * *
మంగళ హత్య మిస్టరీని చేదించే బాధ్యతను ఏ.సి.పి. నెంబర్ వన్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కు అప్పగించాడు.
పోస్ట్ మారటం రిపోర్టు వచ్చింది.
ఆమె పూర్తిగా నగ్నంగా వున్నప్పుడు చంపబడింది అంటే ఆమెను చంపడానికి ముందు ఇష్టపూర్వకంగా ఎవరో ఆమెను అనుభవించయినా వుండాలి లేదా రేప్ చేసయినా వుండాలి.
మంగళ బాత్ రూంలో వుండడాన్ని బట్టి ఆగదిలో వున్న వ్యక్తితో ఇష్టపూర్వకంగానే సెక్స్ లో పాల్గొనడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయి.
తరువాత బాత్ రూమ్ లో ఉండగానే కాల్చి చంపాడు.
ఈశ్వరరావు అనే పేరు మీద హోటల్ గది బుక్ చేయబడి వున్నది.
చనిపోయిన మంగళ ప్రముఖ వ్యాపారవేత్త భార్య కావడం వలన పబ్లిసిటీ కానివ్వలేదు. కానీ దర్యాప్తు మాత్రం రహస్యంగా చేయమని ఇన్ స్పెక్టర్ కిరణ్ కు ఆదేశాలు అందాయి.
తన శక్తి వంచన లేకుండా ఆధారాల కోసం కృషి చేస్తున్నాడు అతను.
ఆరోజు రూమ్ సర్వీసు లో ఉన్నవాళ్ళను వాకబు చేసి ఆగదిలో అతనితో పాటు మంగళ చాలా గంటల నుండీ వున్నదని తెలుసుకున్నాడు.
అంటే, ఆ ఈశ్వరరావు ఎవరో మంగళకు తెలుసు కాబట్టే అంత సేపు వుండగలిగింది.
