Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 26

 

    "బుకాయించి ప్రయోజనం లేదు జానీ .....సీతాపతిని నువ్వే చంపి ఉంటావు "ఈసారి ఇన్ స్పెక్టర్ కిరణ్ కల్పించుకుంటూ అన్నాడు.
    ఇన్ స్పెక్టర్ సాబ్........ ఈ నియోజకవర్గ ఎమ్. ఎల్. ఏ. అనందవర్మ కూడా ఆరోజు పెళ్ళికి వచ్చిన పెద్దలలో వున్నాడు. కావాలంటే ఆయనను వెళ్ళి అడగండి. ఎందరో పెద్దమనుషులు వచ్చిన ఆ పెళ్ళికి నేను వెళ్ళినట్టు ప్రత్యక్ష సాక్ష్యం వున్నా నన్ను అనుమానించడం అన్యాయం."
    కానీవాకర్ ఉడుక్కుంటూ అన్నాడు.
    "అల్ రైట్ మిస్టర్ ..నిజం తరువాత నయినా తెలియక మానదు. అప్పుడు ఆ హత్యను నువ్వే చేశావని తెలిస్తే మాత్రం నీ ఎముకలలో సున్నం మిగలదు. లేచి నడవడానికి జాయింట్లు సక్రమంగా వుండవు ఆలోచించుకో" అని గిర్రున వెనుదిరిగింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    ఇన్ స్పెక్టర్ కిరణ్ మౌనంగా అనుసరించాడు.
    వాళ్ళ జీపు మార్కెట్ ఏరియా వైపు సాగిపోయింది.
    "మేడమ్ .....వాడు చెప్పింది నిజమే కావచ్చు. ఎందుకంటె ఆరోజు పెళ్ళికి చాలామంది పెద్దలు వెళ్ళిన విషయం నాకు తెలుసు. వెళ్ళకుండా వెళ్ళావని అంతమంది చేత అబద్దం చెప్పించలేడు .కాబట్టి జానీవాకర్ ను మీరు అనుమానితుల లిస్టులోంచి తీసివేయక తప్పదు!" అన్నాడు కిరణ్.
    "అవును! నాకూ అదే అనిపిస్తుంది. లలితతో పరిచయం వున్న హోం గార్డును పిలిపించి మాట్లాడినప్పుడు అతను చెప్పింది కూడా నిజమేనని తెలిసింది. అతని భార్యకు జూన్ ఒకటవ తేది నాదే హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేశారని , ఆటను మనకు చెప్పినట్టు గానే ఐదవ తేదీవరకు అక్కడే వున్నాడని కూడా తెలిసింది.... మన లిస్టులో నుండి ఈ ఇద్దరినీ తొలగించక తప్పదు నిరాశగా అన్నది ధీరజ.
    "ఎస్.....ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు , ఒకడు మెకానిక్ బుజ్జి .....ఇంకొకడి పేరు తెలియదు. వాడి పేరు ఏమిటో, అతను ఎవరో ఎక్కడ వుంటాడో లలితను అడిగి తెలుసుకోవాల్సిందే!" సాలోచనగా చెప్పాడు ఇన్ స్పెక్టర్ కిరణ్.
    "అవును ! మీరు చెప్పింది కరెక్టే.... అంతకుమించి అతని ఆచూకి మనకు తెలిసే అవకాశం లేదు."
    జీప్ మార్కెట్ దగ్గర ఆగింది.
    ఇద్దరూ కిందకు దిగి ఒక మెకానిక్ షాపు ముందుకు వెళ్ళారు.
    "మెకానిక్ బుజ్జి వున్నాడా?" ఖంగుమన్నది కిరణ్ గొంతు.
    పనిచేసుకుంటున్న వ్యక్తీ తల పైకెత్తి చూశాడు.
    "నేనే మెకానిక్ బుజ్జిని....." అంటూ ఆశ్చర్యపోతూ వాళ్ళ వద్దకు వచ్చాడు.
    "యూ ఆర్ అండర్ అరెస్ట్ " ధీరజ ఆవేశంగా అన్నది.
    "ఏం .....ఎందుకు?" ఖంగారుపడి పోయాడు అతను.
    "సీతాపతిని హత్య చేసినందుకు"
    ఆ మాటలకు చెప్పలేనంతగా ఆశ్చర్యపోయాడు అతను.
    "నువ్వేచేశావు అనడానికి మా వద్ద ఆధారాలు వున్నాయి . మిస్టర్ జూన్  ఒకటవ తేది నువ్వు లలితను కలుసుకోవడం చూసిన వాళ్ళు వున్నారు. ఆరోజే నువ్వు సీతాపతిని చంపినట్టు ముఖ్యమయిన ఆధారం మాకు దొరికింది" అన్నది ధీరజ ధీమాగా.
    "లేదు ఇన్ స్పెక్టర్ .....నాకు రెండవ తేదినాడు కింగ్స్ జార్జి హాస్పిటల్లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. అంతకు ముందురోజే నేను కడుపులో నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరితే నేను లలిత కలుసుకున్నామంటారేమిటి? సీతాపతిని హత్య చేయడమేమిటి? మీరు పొరపాటు పడి వుంటారు. అవునో కాదో హాస్పిటల్ కు వెళ్ళి ఎంక్వయిరీ చేయండి. నా మాటలు అబద్దం అయితే అప్పుడు అరెస్టు చేయండి, వారం రోజుల వరకూ నేను హాస్పిటల్ లోనే వున్నాను.
    "నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో మీతో అలా చెప్పి వుంటారు అంతే తప్ప నాకు ఏ పాపమూ తెలియదు, లలిత మా ఫామిలీ ప్రెండ్ .....చాలా కాలం నుంచీ పరిచయం వుంది. సినిమాలకు, షికార్లకు తిరిగే మాట నిజమే! సునీల్ అనే వ్యక్తితో ఈ మధ్య కాలంలో కొత్తగా పరిచయం అయింది. ఒకవేళ నిజంగానే సీతాపతిని అడ్డు తొలగించుకోవాలి అని లలిత భావించి వుంటే ఆ అవసరం వున్నది సునీల్ కు మాత్రమే.
    "ఆమె అతనిచేత ఆ హత్య చేయించి వుండాలి తప్ప నన్ను అనుమానించి ప్రయోజనం లేదు. లలితకు న్దేనే కాదు ఎందరో బోయ్ ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళలో ఎవరు అతనిని చంపివుంటారో పరిశోధించవలసినది మీరు అంతే తప్ప ఏమీ తెలియని నన్ను అరెస్ట్ చేసి చేతులు కడుక్కోవాలను కోవడం అన్యాయం."
    తను చెప్పదలుచుకున్నదంతా అక్కసు కొద్ది అతను వెళ్ళ గక్కేశాడు .
    "సునీల్" అనే పేరు వినిపించేసరికి ధీరజ మెదడు పనిచేయడం మానివేసింది.
    ఇతను చెప్పేది తన సునీల్ గురించేనా?
    అలా కావడానికి వీలులేదు...."
    అయినా లోకంలో ఎంతమంది సునీల్ లు లేరు.
    సునీల్ అన్న పేరు కలిగినవాళ్ళు ఎందరో వుంటే.... వాళ్ళలో అతను ఎవరో అయి వుండాలి.
    "ఆ సునీల్ ఎక్కడ వుంటాడు?"
    ఇన్ స్పెక్టర్ కిరణ్ ప్రశ్నించడం ధీరజకు వినిపిస్తూనే వున్నది.
    "ఏమో తెలియదు సార్! లలితకు తెలుసు"
    ఇక అతనిని ప్రశ్నించి ప్రయోజనం లేదని అర్ధమయింది కిరణ్ కు
    "మేడమ్ వెళదామా' విసుగ్గా అన్నాడు.
    అతని విసుగును అర్ధం చేసుకున్న ధీరజ వెళదాం అన్నట్టు యాంత్రికంగా తల వూపింది.
    కిరణ్ వెనుకనే ఆమె అడుగులు వేస్తున్నదన్న మాటే కానీ ......ధీరజ ఆలోచనలు అన్నీ సునీల్ చుట్టూనే ప్రతిభ్రమిస్తున్నాయి.....
    అతను చెప్పిన సునీల్ తన సునీల్ ఒక్కరేనా.
    ఆ ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కి పోతుంది.


                                                         *    *    *

    రవీంద్ర కూల్ డ్రింక్ షాప్.
    డాబా గార్డెన్స్ నుండి వందగజాలు దాటిన తరువాత వచ్చే ఆ కూల్ డ్రింక్ షాపులో ఎన్నిసార్లు తను సునీల్ తో కలిసి అడుగుపెట్టేదో తలచుకోవడంతో ధీరజకు ఒక్కసారిగా ఆరోజులు గుర్తుకు వచ్చాయి.
    "ఏమిటమ్మా ధీరజా .....ఎక్కడ వుంటున్నావమ్మా..... నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయింది" కూల్ డ్రింక్ షాపు అతను ఆప్యాయంగా పలకరించాడు.
    "బాగానే వున్నాను బాబాయ్.... ఉద్యోగం వచ్చిందిగా"
    "అవునవును.....ఎప్పుడో సునీల్ చెప్పినట్టు గుర్తు ....ఎక్కడమ్మా నువ్వు పనిచేసేది."
    "విజయవాడలో"
    "సునీల్ ఎక్కడ వుంటున్నాడు బాబాయ్....." అడగకుండా వుండలేకపోయింది.
    "ఏమోనమ్మా ......తను ఎక్కడ వుంటున్నాడో ఎప్పుడూ చెప్పలేదమ్మా."
    "ప్చ్" దీర్ఘంగా నిట్టూర్చింది ధీరజ.
    "మీ ఇద్దరినీ చిలకా గోరింకల్లా ఈ కళ్ళతో చూశాను, ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు అనుకున్నాను, కానీ ఇలా ఎవరికి యెవరూ యేమీ  కాని వాళ్ళలా.....ఆపై అతని గొంతు పెగలలేదు.
    "బాబాయ్..... జరిగిపోయిన రోజులే యెప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. మనం ఊహించుకున్నా జీవితం ఊహించుకున్నట్టుగా లభించదు అని నాకు తెలియడానికి ఎనిమిదేళ్ళు పట్టింది."
    "అదేమిటమ్మా .....అలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఇద్దరికీ ఏమయినా గొడవలు వచ్చాయా?" ధమ్స్ అప్ బాటిల్ వోపెన్ చేసి చేతికి ఇస్తూ అడిగాడు.
    "అలాంటివి యేమీ లేవు బాబాయ్.... నాకు ఉద్యోగం వచ్చినప్పుడే సునీల్ కూడా ఉద్యోగానికి అప్లయ్ చేశాడు , కానీ తను సెలెక్ట్ కాకపోవడంతో నిరాశ చెందాడు. అప్పుడు అతని మాటలకు అర్ధం ఇప్పుడు తెలిసి వస్తుంది.....అప్పుడే ఏమాత్రం ఊహించాగలిగినా అసలు నేను ఈ ఉద్యోగంలో చేరేదాన్నే కాదు. బహుశా నేను ఈ ఉద్యోగంలో జాయిన్ కావడం వల్లనేమో అతనికి దూరం అయిపోయాను....." కనుకొలకులలో నిలిచిన నీటిని తుడుచుకుంటూ చెప్పింది ధీరజ.
    "మా ఇంటికి వెళదాం రామ్మా."
    "లేదు బాబాయ్.... డ్యూటీ మీదనే వచ్చాను. పోలీస్ క్లబ్ లో దిగాను ఇక్కడే రెండు రోజులు వుంటాను. సునీల్ నీకు కనిపిస్తే నేను ఒకసారి అతనితో మాట్లాదాలను కుంటున్న విషయం చెప్పు.... లేదంటే పోలీస్ క్లబ్ నంబర్ కు ఫోన్ చేస్తే చాలు నేనే వస్తాను" అని నంబర్ ఇచ్చింది ధీరజ.
    షాపులో నుంచి బయటకు వచ్చి పుట్ పాత్ పై అడుగులు వేయసాగింది.
    ఎందుకనో లలితకు పరిచయం వున్న సునీల్ తన సునీల్ అయ్యాడేమోననే సందేహం పదేపదే మనస్సును కలియవేయ సాగింది.
    అటో ఎక్కి సరస్వతి దియేటర్ దగ్గర దిగిందామే.
    తాము ఇద్దరూ కలిసి తరచుగా వచ్చే సినిమా హాలు అది.
    అందుకనే సరాసరి మేనేజర్ గదిలోకి దారి తీసింది.
    ధీరజను చూడగానే ఆ హాలు మేనేజర్ సంతోషంగా ఆహ్వానించాడు.
    'సునీల్ ఎక్కడ వుంటున్నాడో మీకు తెలుసా?"
    "తెలియదమ్మా , యేదయినా పని మీద ఇటుగా వెళుతుంటే మాత్రం కారు దిగి వచ్చి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. ఎక్కడ వుంటున్నావంటే చెప్పడు. ధీరజ ఎక్కడ వున్నది.... ఎలా వున్నది .....ఏం చేస్తున్నది అని అడిగితె మాత్రం కోపగించు కుంటూ ఇంకొకసారి ఆమె విషయం ఎత్తితే ఉన్న స్నేహాన్ని కూడా మరచిపోయి ఇంకెప్పుడూ రాను అని వొకసారి గట్టిగా హెచ్చరించాడు. అప్పటి నుండి నీ గురించి అతన్ని అడగడం మానివేశాను. అసలు మీ యిద్దరికీ ఏ విషయం దగ్గర గొడవలు వచ్చాయమ్మా...." ఒకింత ధైర్యం చేసి అడిగాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS