Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 26

    "కాదయ్యా! పోయాడుట."
    "అంటే?... ... ..."
    "చచ్చిపోయాడయ్యా!"
    "ఎట్టా?"
    వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రచ్చబండ దగ్గర మరికొంతమంది చేరారు.
    "దిగులుతో మంచపట్టి"
    "దిగులెందుకు?"
    "ఉండదూమరి! అపురూప సౌందర్యవతి అయిన భార్య ఉండి కూడా నాతిగల బ్రహ్మచర్యం పాటించలేకకొంత బాధ. తన వైవాహిక జీవితం వృధా అయిందన్న బెంగ కొంత. తన జీవితమే వ్యర్థమైందనే బాధ మరింత కలిగి దిగులుపడి, మంచానపడి క్షీణించి చనిపోయాడు. భర్తని దగ్గరకి రానీయని మహాతల్లిరా ఈ వెంకమ్మ" అక్కసుగా చెప్పాడు సోమయాజి.
    "అట్లా అయితే ఈపాటికి కృష్ణయ్యకు కబురు వచ్చేదిగా?" కృష్ణశర్మ సందేహం.
    "వాళ్ళు కోపంతో కబురు చెయ్యలేదేమో! చేసినా కృష్ణయ్య బయట పెట్టటం లేదేమో!" అవధాని.
    "మరీ అట్లామాట్లాడకు ఇవాళకాకపోతే రేపు తెలుస్తుందిగా నిజం".
    "చూద్దాం మరి" అన్నాడు అవధాని.
    అందరికీ చూద్దామనే ఉంది, ఎప్పుడెప్పుడా అని. అందరూ తలొకమాట మాట్లాడుకుంటుంటే సోమయాజి ఆనందంగా చూస్తూ కూర్చుండిపోయాడు. అడిగినవాళ్ళకి తన చాతుర్యం అంతా వినియోగించి కల్పనలు జోడించి కథలుగా చెపుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథని తమతో తీసుకెళ్ళారు. ప్రతిమనిషిలోని 'కవి' ఆ కథకి చిలవలు పలవలు కల్పించి మెరుగులు దిద్దటం జరిగింది. తరిగొండ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెంకమాంబ - వేంకటాచలపతి వృత్తాంతంతో అట్టుడికి పోయాయి. మనుషులకి మాటలకి కొరతే లేదు. కొంతమంది తమస్వంత పనులని కూడా నిర్లక్ష్యం చేసిమరీ తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించటంలో మునిగిపోయారు.
                                   * * *
    తల్లితండ్రులిద్దరూ కొద్దిపాటితేడాతో తనని వదలివెళ్ళిపోయిన దిగులు తీరకుండానే అల్లుడి గురించిన వదంతులు కృష్ణయార్యుని, మంగమాంబలని కుంగదీశాయి. పోనీ అంటే కుమార్తె ప్రవర్తన నిషేకముహూర్తమప్పటి నుంచి ఎటువంటి అనుమానికీ తావియ్యటంలేదు. ఎంతో అణకువగా చెప్పినట్టు వింటోందేకాని వితండవాదనలు లేవు. విషయం తెలుసుకుందామని నారగుంట పాళెంలో ఉన్న తిమ్మయార్యుని వద్దకు స్వయంగా వెళ్ళాడు "అమ్మాయిని కాపరానికి ఎప్పుడు పంపమంటారు?" అని అడిగే నెపంతో. తిమ్మయార్యుడు తమ కుమారుడు విరక్తుడై బైరాగుల్లో కలిసిపోయాడని, మహాలక్ష్మిలాంటి అమ్మాయికి తమవల్ల అన్యాయం జరిగిందని తామెంతో బాధపడుతున్నామని, మనసు మారి తమ కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నామని చెప్పాడు.
    "కోడలు పెళ్ళి అయినాక మా ఇంటిపిల్ల. ఆమెనిక్కడికి ఎప్పుడైనా మీవీలుని బట్టి పంపండి. ఇక్కడే ఉంటుంది. మా అబ్బాయిని కూడ కోడలిలోనే చూసుకుంటాం" అంది తిమ్మయార్యుని ధర్మపత్ని.
    వారి ప్రేమాభిమానాలకి కృష్ణయార్యుని కళ్ళు చెమ్మగిల్లాయి. మానవ మాత్రునితో కాపురం చెయ్యననే కూతురి కోరిక తీరిందని సంతోషించాలో, అసలు కాపురమే లేదు కూతురికి అని బాధపడాలో అర్థంకాలేదు. "అంతా దైవేచ్చ" అని, "అల్లుడు త్వరలో తిరిగి వస్తాడనే నమ్మకం తనకి ఉంది" అని వారిని ఓదార్చి ఇంటిముఖం పట్టాడు.
    తరిగొండలో అడుగుపెడుతూనే ఎదురు చూస్తున్న సోమయాజి కనిపించాడు. ఆయనకి జరిగినదంతా, తాను విన్నది విన్నట్టు పూసగుచ్చినట్టు చెప్పాడు. వింటూనే, రేఖాచిత్రానికి రంగులద్దే కళాకారుడిలాగా తనకి కావలసిన అంశాలని వాటికి జోడించి మంచి వర్ణచిత్రాన్ని తయారు చేసుకున్నాడు సోమయాజి. అంతకు ముందు ప్రచారం చేసిన వదంతులకి, ఈ వాస్తవానికి చక్కని అనుసంధానం చేసి కొత్త కథకి రూపకల్పన చేశాడు.
    కృష్ణయార్యుని కన్నాముందే ఈ వర్తమానం ఇల్లుచేరింది. మంగమాంబ చుట్టూ ఇరుగుపొరుగులు చేరి ఓదార్చుతున్నారు. వెంకమాంబ మాత్రం ఇవేవీ పట్టనట్టు మడి కట్టుకుని వంట పనిలో ఉంది. నాయనమ్మపోయిన తర్వాత వంటింటి బాధ్యత తనే తీసుకుంది, తల్లిని సుఖ పెట్టాలని. పని నేర్చుకుంటే మంచిదేకదా అని మంగమాంబ ఊరుకుంది.
    కృష్ణయార్యుని చూచి అందరూ తప్పుకున్నారు. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. బాధతోపాటు ఒక బరువు దిగిపోయినట్టు, ఒక సమస్య పరిష్కారమైనట్టు భావించి కళ్ళు తుడుచుకుని,
    "వెంకుతల్లీ!" అని పిలిచాడు.
    వంటింట్లోంచి వస్తున్న కూతురిని చూచి,    
    "ఇట్లా అయిందేమిటమ్మా?" అన్నాడు బాధగా.
    "నాకు ముందే తెలుసు. అంతా దైవేచ్చ. మీరు బాధపడ వలసిన పనిలేదు. మనసు కుదుట బరచుకోండి. పాపం! అమ్మ అమాయకురాలు. చుట్టుపక్కలవాళ్ళు అందరూ తన మనసు చెదరగొట్టకుండా చూడండి". అంటూ మరోమాటకి అవకాశం ఇవ్వకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది.
    కృష్ణయార్య దంపతికి ఏమీ పాలుపోలేదు. అర్థం కాలేదు. వెంకమాంబ భవిష్యత్తు అంధకారమయంగా, అగమ్యంగా గోచరించింది. తాము చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. ఇద్దరూ ఒక్కసారిగా నిట్టూర్చి
    "అంతా దైవలీల. మనం నిమిత్త మాత్రులం" అన్నారు.    
                                  * * *
    ఎంతటి నిమిత్త మాత్రులనైనా బాధించగల నేర్పు కొంతమందికి ఉంటుంది.
    "పిల్లలని కనగాసరా! సరిగా పెంచద్దూ!"
    "అందులో ఆడపిల్ల అంటే ఎంత ఒద్దికగా పెంచాలి?"
    "చిన్నప్పటినుంచి అదుపాజ్ఞల్లో ఉంచద్దూ"
    "కుప్పిగంతులూ, కూనిరాగాలూ, కాపరాలు చెయ్యనియ్యవు."
    "మా సూరమ్మని చూడండి మొగుడి ఎదురుగా తలకూడ ఎత్తదు. అందరూ దానికి మాటలే రావనుకుంటారు."
    "మొగుడిని బైరాగుల్లో కలపటం ఎంతమందికి చేతనవుతుంది?"
   "వితండవాదం చేస్తే ఎవరికి విసుగురాదు?"
    "మేమూ కన్నాం పిల్లలని. కాని ఇట్లాకాదు."
    "పెంచటం రాకపోతే కనకూడదు."
    "పశువులూ కంటున్నాయి పిల్లల్ని"
    "మంత్రాల మరిడమ్మలతో ఇదే ప్రమాదం"
    "మాయల మరాఠీలతో జాగ్రత్త అని ఊరికే అనలేదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS