"మీకీ దేశపు ఆస్పత్రులమీద నమ్మకం లేకపోతే అందరం చందాలు వేసుకుని అయినా ప్రార్థనని విదేశాలకు పంపిద్దాం. ప్రార్థన బ్రతకాలి. ఆరు మూడైనా మూడారయినా... ప్రార్థన బ్రతకాలి".
"విదేశాలా?" బిగ్గరగా నవ్వాడు భార్గవ. "ఈ ప్రపంచంలో ఎక్కడా కేన్సర్ కి పూర్తిగా మందు కనుక్కోబడదు, ఎందుకో తెలుసా శేఖరం, కేన్సర్ చాలా పెద్ద బిజినెస్. డబ్బున్న వాళ్ళకి వచ్చేది. అది చాలా ఖరీదయిన వ్యాధిగా వుండిపోవాల్సిందే? కేన్సర్ ని నాశనం చెయ్యటానికి ఒక చౌక అయిన మందుగానీ మూలికగానీ కనుక్కోబడిన మరుక్షణం అమెరికాలో కోట్ల కోట్ల రూపాయల్తో స్థాపించబడ్డ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ లు మూలబడ్తాయి. ఎందరో కేన్సర్ స్పెషలిస్టులు వీధినపడ్తారు. మొత్తం ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ఎంత ఖర్చయినా అసలు మందు కనుక్కోకుండా నొక్కెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ తెలియని సత్యం ఇది! నేను దీన్ని బయటపెడితే నాకు పిచ్చెక్కిందంటారు".
"అంటే ప్రార్థనకి ఏ మందు ఉపయోగించవద్దంటారా?"
"మరణాన్ని ప్రశాంతంగా ఆహ్వానిద్దామంటాను".
"ఆస్పత్రి నుంచి స్మశానానికి తీసుకెళ్లి చుట్టూ కూర్చుని ప్రార్థన చేద్దామంటారా" కోపమూ, వ్యంగ్యమూ మిళితమైన స్వరంతో అడిగాడు.
"ఆస్పత్రి కన్నా స్మశానమే మంచిది నా దృష్టిలో" నిర్లిప్తంగా అన్నాడు భార్గవ.
శేఖరం కారుదిగి, డోరు చప్పుడయ్యేలా వేశాడు. "ఎవరో అనక్కర్లేదు- నేనే అంటున్నాను. మీకు పిచ్చెక్కింది" అని. మరేమీ మాట్లాడకుండా ఇంటెన్సివ్ కేర్ వైపు నడిచాడు. భార్గవ కూడా అంత విసురుగానూ కారు స్టార్టు చేసి పోనిచ్చాడు.
శేఖరం ప్రార్థన వున్న గదికి చేరుకొనేసరికి అక్కడ పరిస్థితి మరీ ఘోరంగా వుంది. వసుమతి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. శేఖరం తనని తాను మహేంద్రజైన్ కి పరిచయం చేసుకున్నాడు.
"మీరు రావటం మాకెంతో ఆనందాన్నిస్తూంది మిస్టర్ శేఖరం! మీ స్నేహితుడు ఇక్కడంతా మెస్ చేసి వెళ్ళాడు..." అంటూ జరిగింది వివరించాడు.
శేఖరం బాధగా, "ఈ విషయంలో మీరేమీ అనుకోకండి. ఈవేళ కాకపోతే రేపైనా భార్గవని నేను ఒప్పిస్తాను" అన్నాడు.
మహేంద్రజైన్ వసుమతివైపు తిరిగి, "ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ధైర్యం కోల్పోకండి. మీరు మావైపు స్థిరంగా వుంటే మేమూ కాన్ఫిడెన్సుతో 'రెమిషన్; కోసం ప్రయత్నించగల్గుతాం".
ఆమెకు అర్థంకాలేదు. తను స్థిరంగా వుండటం ఏమిటి? పాప బాగవటం కావాలి... అస్పష్టంగా తలూపింది.
శేఖరం అడిగాడు "మీరు మాటిమాటికీ రెమిషన్ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు! దాని అర్థం ఏమిటి?"
"లుకేమియా (బ్లడ్ కాన్సర్) లో ముఖ్యమైన లక్షణం- పనికిరాని తెల్లకణాలు పెరిగిపోవటం. వాటిని ఆపుచెయ్యకపోతే శరీరంలోని రక్తాన్నంతా అవి ఆక్రమించుకుంటాయి. అలా ఆపుచెయ్యగలగటాన్నే రెమిషన్ అంటారు. ముందు దాన్ని సాధించాలి- తర్వాత ఏం చేసినా"
శేఖరం అర్థమయిందన్నట్టు తలూపేడు.
"రండి, చూద్దురుగాని"
శేఖరం తటపటాయించాడు. అతడు పైకి జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొనేవాడుగానూ, అమ్మాయిల గురించి మాట్లాడేవాడుగానూ కనిపించినా, అంతరాంతరాల్లో చాలా సున్నిత హృదయుడు. ప్రార్థన విషయం తెలిసినప్పటినుంచీ అతడి మనసు మనసులో లేదు. కానీ అతడిలో గొప్ప విషయం ఏమిటంటే, మనసుని ముఖంలో ప్రతిబింబించక పోవటం, కేవలం నవ్వునే అవతలివారికి పంచటం. ప్రార్థనని చూడలేడని తెలుసుకానీ లోపలకు వెళ్ళకపోతే బావోదు అని వెళ్ళాడు.
ప్రార్థన అతడిని చూసి విచ్చుకున్న నవ్వుతో "హలో" అంది. అతడి కళ్ళు తడి అయ్యాయి. "హల్లో" అన్నాడు. ప్రార్థన చేతికి ఐ.వి. ఫ్లూయిడ్ గొట్టం వుంది కానీ దానికి అలవాటు పడినట్టు వుంది. "ఏమిటి నువ్వుకూడా వచ్చేసేవు?" అని అడిగింది.
శేఖరం తడబడి - "నీకు జ్వరం వచ్చిందా" అన్నాడు.
"ఎవరు చెప్పారు? ఇదిగో చూడు" అంటూ ఖాళీగా వున్న రెండో చేతిని ఎత్తింది. అతడు దాన్ని అందుకున్నాడు.
"చల్లగా వుంది కదూ"
"ఆ చల్లగానే వుంది"
"చూడు ఇంతదానికి స్కూలు మానిపించేసింది. ఇదే టీచర్ గా వున్నప్పుడయితే ఒక్కరోజు రాకపోతే కోప్పడేది".
తల పక్కకి తిప్పుకుని వసుమతి అతికష్టంమీద తనని తాను నిగ్రహించుకుంది.
ఈ లోపులో డాక్టర్ స్విచ్ ఆన్ చెయ్యగానే బరువు తూచుకునే మిషన్ చప్పుడు చేసినట్టు శబ్దం అయి, రెండు సెకన్లలో ఎలక్ట్రాన్ అక్షరాలు కనపడ్డాయి.
వసుమతి ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ముఖం జేగురు రంగులోకి మారింది. ఈ హఠాత్ సంఘటనకి కారణం అర్థంకాక శేఖరం కూడా బయటకొచ్చాడు. వసుమతి స్తంభం పక్కగా నిలబడి తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది.
"ఏమైంది?.....ఏమంది?" అని అడిగాడు అనునయిస్తున్నట్టు.
"ఆ మిషనులో అంకెలు చూసేవా శేఖరం?"
"చూసేను".
"ఎంతుంది".
"54,000".
"ప్రొద్దున ప్రార్థనని తీసుకొచ్చినప్పుడు నా కళ్ళముందే ఈ పరీక్ష చేసేరు. అప్పుడు కౌంటు ఎంతుందో తెలుసా శేఖరం 50,000. కేవలం యాభైవేలు" అని ఏడుస్తూ ఆమె "డాక్టరు నర్సుతో చెపుతుంటే విన్నాను. కౌంటు లక్ష దాటితే మనిషి దక్కదట" అంది.
శేఖరం స్థాణువయ్యాడు. అతడు ఛార్టెర్డు అకౌంటెంటు. లెక్కల్లో పుట్టి లెక్కల్లో పెరిగినవాడు! మూడు గంటల్లో నాలుగువేల చొప్పున పెరుగుతున్న కణాలు లక్ష అవటానికి ఎంతకాలం పడుతుందో క్షణంలో లెక్కకట్టాడు. మరణం ఎంత దూరంలో వుందో అంత సరీగ్గా లెక్కకట్టి చెప్పగలిగిన ఆ మిషన్ ని చూసి అతడి వళ్ళు జలదరించింది. అభినందించాలా?
సైన్స్- బ్లడీ సైన్స్.
కొంచెంసేపు ఒంటరిగా వుండాలన్న కోర్కె బలీయమైంది. వసుమతి అక్కడే వున్నదనీ- ఆమెకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత తన మీద వున్నదనీ కూడా ఆలోచించలేదు. అతడి కళ్ళముందు ప్రార్థనే కదలాడుతూంది. ఆ రోజు డైనింగ్ రూమ్ లో వాష్ బేసిన్ దగ్గిర చెయ్యి కడుక్కుంటూ వుంటే నీళ్ళు పోస్తూ 'నేను నిన్ను అన్నయ్యా అని పిలవచ్చునా' అని తడబడుతూ అడిగే ప్రార్థన ముఖమే కనపడుతూంది. పాపా! మమ్మల్నందర్నీ ఇంత దుఃఖంలో, వ్యధతో ముంచెయ్యటం కోసమేనా అమ్మా దేవుడు నిన్ను అంత ముగ్దగా, అపురూపంగా, బ్రిలియెంట్ గా సృష్టించింది?
అతడు తన బండి పార్క్ చేసిన చోటికి నడిచాడు. ఈ ప్రపంచం నుంచీ, మనుషుల్నుంచీ అయితే దూరంగా వెళ్ళగలడుగానీ, మనసునుంచి ఎలా పారిపోగలడు? అయినా వెళ్లిపోవాలి....ఎక్కడా ఆగకుండా అలానే వెహికల్ మీద గంటలతరబడి డ్రైవ్ చేయాలనిపిస్తూంది అతడికి. అంత పిచ్చిగా వుంది. విసురుగా కూర్చొని స్టార్టు చేయబోయాడు. కాళ్ళ దగ్గర తడి తగిలి, వంగి చూసేడు.
