Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 26


    వీళ్ళిద్దరి  వ్యవహారం  యిలా  వుండగా అక్కడ  మోహన్  తన కష్టాల్లో  తాను మునిగి తేలుతున్నాడు.

    దీపిక వ్యవహారం  చూస్తుంటే విసుగేస్తోంది అతనికి. నాలుగ్గోడల మధ్యనించి బయట ప్రపంచంలోకి వెళితే దీపికకి మరింత  దగ్గర అవచ్చు. సమయం చూసుకుని తన  ప్రేమ బయట పెట్టవచ్చునని ఆశపడితే ఆ ఆశకాస్తాలు అడుగంటింది.

    ముగ్గురూ కలిసి బయటికి వెళ్తారు. పృథ్విగారిదేం ట్రబుల్ లేదు పాపం ఆకాశంలో పిట్టలను చెట్లమీద ఆకులను లెక్క బెట్టుకుంటూ పరిశోధన చేసుకుంటూవుంటారు. ఏదీ కాకపోతే డైరీలో బరబరా బరికేస్తూ కూర్చుంటారు. వీళ్ళిద్దరి జాలీ గోలా అక్కరలేదు ఆయన. ఏదో కొంత వర్క్ యిచ్చి వదిలేస్తారు.

    ఓ పక్కకి వెళ్ళి కూర్చుని సరదాగా కబుర్లాడు కుందాం అనే మోహన్ ఆలోచనని సాగనివ్వదు దీపిక. అమిత సీరియస్ గా ఏమిటో ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఏమిటా దీర్ఘాలోచన అని అడిగితే ప్రొఫెసర్ గారు ఫలానా  విషయం గురించిఆలోచించుమన్నారు అని  చెవుతుంది. అంతేకాదు "ప్రొఫెసర్ గారు మీక్కూడా ఏదో ఆలోచించమని చెప్పారుకదా! ఆ పని చెయ్యక వూరికే నాతో కబుర్లు చెప్తారేం?" అని మెత్తమెత్తగా మండలిస్తుంది కూడా.

    అలాంటప్పుడు నాలుగు లెంపకాయలు తగిలించాలనిపిస్తుంది అతనికి. నీ గురుభక్తి మండినట్లే వుంది అని లోలోపలే తిట్టుకుంటాడు.

    ఇన్ని కారణాలవల్ల పదిరోజులుగా శికార్లు తిరుగు తిరుగుతున్నా అతని ప్రేమ వ్యవహారంమాత్రం యెక్కడ వున్నావు గొంగళీ అంటే వేసినచోటే ఉన్నాను అన్నట్లే వుంది.

    ఆ సాయంత్రం బీచ్ ఒడ్డున అందమైన ఆ అమ్మాయిని, పక్కన నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న ఆ అందమైన అబ్బాయిని చూశాడు ఆకసాస విహరిస్తున్న మన్మధుడు.

    ముందు అతనికి ఆ నరుడిమీద కాస్త అసూయ కలిగింది. కానీ అంతలోనే స్వజాతి అభిమానంవల్ల అతడిమీద  జాలివేసింది. ఆ పైన వృత్తి ధర్మం గుర్తొచ్చింది. చిన్నగా నవ్వుకుని గురిపెట్టి ఓ బాణం దీపికమీద ప్రయోగించి తన దారినతాను  పోయాడు.

    అదే క్షణంలో కాకతాళీయంగా దీపిక చేతిమీద తన చెయ్యి అలవోకాగా ఆనించి "దీపా! ఐలవ్ యూ!" అన్నాడు మోహన్.

    ఉలిక్కిపడింది దీపిక ఒళ్ళు ఝుల్లుమంది గుండె జల్లుమంది అంతా అయోమయంగా అయిపోయి ప్రొఫెసరు గారు ఏం ఆలోచించమన్నారో మర్చిపోయి మరేదో ఆలోచించసాగింది.

    ఆవేళేకాదు, వరుసగా నలుగురోజులు, వీలు దొరికినప్పుడల్లా ఆరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా "ఐ లవ్ యూ" అని చెపుతూనే వున్నాడు మోహన్.

    చివరికి అయిదోరోజు ఇంకా అయిదు నిముషాల్లో వెళ్ళిపోతారనగా "ఐ టూ!" అంది దీపిక వినిపించీ వినిపించనట్లు.

    ఎగిరి గంతులేశాడు మోహన్. కొండెక్కినంత సంబరపడిపోయాడు "మరైతే మనం పెళ్ళి చేసుకుందామా?" ఆశగా అడిగాడు.

    తలోంచుకుని తలూపింది దీపిక.

    "ఎప్పుడు?" మరింత ఆశగా అడిగాడు.

    "పెళ్ళికి ముందు నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని వున్నాయి."

    "ఏమిటా బాధ్యతలు?" అడిగాడు.

    "మా నాన్నగారు నామీద పెద్ద  బాధ్యత వుంచారు అది నెరవేర్చి ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి అది మొదటిది.

    ప్రొఫెసర్ గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన పరిశోధన పూర్తయ్యేదాకా ఆయనకీ అండగా ఉంటాననీ, పెళ్ళిమాట తలపెట్టననీ ప్రామిస్ చేశాను. యిది రెండవది" గంభీరంగా చెప్పింది దీపిక.

    నెత్తిమీద పిడుగు పడ్డట్లు అనిపించింది మోహన్ కి.

    ప్రొఫెసర్ గారి పరిశోధన పూర్తికాగానే మా పని చూస్తారు. అవి దొరకగానే నాన్నా గారితో మన విషయం చెప్తాను. ఆయన కాదనరని నా నమ్మకం. మన  పెళ్ళి వైభవంగా జరిపిస్తారు!" అంటూ తన ప్లాన్ వివరించింది.

    అయోమయంగా నిలబడిపోయిన మోహన్ కి దీపిక నోటివేంట వెలువడిన మాటలు వినేసరికి నవ్వు ఆగలేదు ఫకాల్న నవ్వేసాడు.

    "ఎందుకలా నవ్వుతున్నారు?" ఆశ్చర్యంగా అడిగింది. "సంతోషం పట్టలేక, త్వరలోనే జరుగబోయే మన పెళ్ళి గురించి తల్చుకుంటూ ఉంటే భలేసరదాగా ఉంది నాకు!" అన్నాడు.

    తలొంచుకుని చిన్నగా నవ్వుకుంది దీపిక.

    ఆ రోజు రాత్రి పడుకున్నాక మళ్ళీ ఆ విషయం గుర్తువచ్చి నవ్వొచ్చింది మోహన్ కి. ఆ తరువాత ఏడు పోచ్చింది.

    ఆ వేళ సాయంత్రం యింటికి చేరగానే "అమ్మా తల నెప్పిగా ఉంది. కాసిని కాఫీ యిస్తావా?" అని అడిగింది దీపిక.

    "లక్షణంగా ఉంది తల్లీ. చెట్టంత ఆడపిల్లని యింటి పట్టునవుండి కాస్త నాకు సాయం చెయ్యడం పోయింది. చీకటి పడేదాకా షి కార్లు తిరిగి వచ్చి కాఫీ ఇస్తావా టీ ఇస్తావా అంటూ ఆర్డర్లు చేస్తున్నావ్.

    "ఏమిటో ఈ కొంపలో నా మాటకు విలువంటూ ఉండి ఏడిస్తేగా, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏమైనా అంటే కోపాలు. అయినా నా కెందుకొచ్చిన గోల. అందరికీ చాకిరీ చేస్తూ నోరు మూసుకుని ఓ మూల పడుంటాను" అని విసుక్కుంది వర్ధనమ్మ.

    అసలావిడకి ఆ వేళ మూడ్ బాగా లేదు అందుకో కారణం ఉంది ఆవిడ అన్నగారు అంటే స్వంత అన్నగారు కాదు పినతల్లి కొడుకు తెనాలి దగ్గర పల్లెటూళ్ళో ఉంటాడు. ఆయనకీ ఒక కూతురుంది ఆ పిల్లకు పెళ్ళి సెటిల్ అయింది. తీరా అన్ని ప్రయత్నాలూ చేసుకున్నాక పెళ్ళి వారం రోజులు ఉందనగా ఆ పెళ్ళి కొడుకు కాస్తా ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు. పెళ్ళి ఆగిపోయింది.

    ఆ విషయం తెలుసుకున్న వర్ధనమ్మ అన్న గారికి సానుభూతి తెలియజేస్తూ ఉత్తరం రాసింది ఆయన సమాధానం రాశాడు. "జరిగిన దానికి చాలా కృంగిపోయాను వర్ధనీ, నాదేముంది పెద్దవాడిని అనుభవం ఉన్నవాడిని, కానీ  రాధని చూస్తుంటే జాలిగా ఉంది నాకు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. కాస్త ఈ విషయం పాతబడే దాకా అమ్మాయిని యెక్కడికైనా పంపుదామని అనుకుంటున్నాను. కానీ యెక్కడికి పంపుతాను? మన వాళ్ళంతా చుట్టూపక్క లే ఉన్నారు" అంటూ రాసాడు.

    ఆ ఉత్తరం చదువుకుని యెంతో బాధపడింది వర్ధనమ్మ పాపం కష్టంలో ఉన్నాడు. పిల్లని పదిరోజులపాటు ఎక్కకైనా పంపితే బాగానే ఉంటుంది. కాస్త వాతావరణం మారుతుంది. దానికీ మార్పుగా ఉంటుంది. రాధని తన  దగ్గరకు పంపమని రాస్తే  బాగుంటుంది. ఓ నెల్రోజులుండి వెళుతుంది అనుకుని భర్త చెవిన  వేసింది ఈ విషయం.

    ఆయన గయ్ మని లేచాడు. "నీ  మొహం. ఊరికే తలతిక్క ఆలోచనలు చెయ్యకు. అసలే మన గొడవల్లో మనముంటే ఆ పిల్ల ఒక్కర్తితక్కువ అయిందా? అసలే అదృష్టం కలిసి రావడం లేదు మనకు.  ఆ నష్ట జాతకం పిల్లని తెచ్చి యింట్లో పెట్టుకుంటే యిక అడగవే అక్కర్లేదు. యివి కుదిరే పనులు కావుగానీ మాట్లాడకుండా కూర్చో!" అన్నాడు.

    ఆవిడ అభిమానం దెబ్బతింది. "ఏం! నా పుట్టింటి వారంటే అంత చులకనా? మా అన్నయేం తిండిపెట్టలేక దాన్ని పంపిస్తానన్నాడా? అసలైనా నా మేనకోడల్ని నాల్రోజులు నా యింటికీ రప్పించుకొనే హక్కు అధికారం నాకు లేదా? అన్నింటికీ మీ మాటే చెల్లాలా?" అని గట్టిగా దులిపెద్దాం అనుకుంది. కానీ ఆలె బ్లెడ్ ప్రెషర్  మనిషి. అందుకే ఏం మాట్లాడకుండా విసురుగా అక్కడినించి వచ్చేసింది.

    ఆవిడ పైకి అనకపోయినా ఆ విషయం కనిపెట్టారు సత్యంగారు. నిర్లిప్తంగా, చిరాగ్గా ఉంటున్న భార్యని చూస్తే జాలివేసింది ఆయనకీ. పోన్లే అదేమైనా కోరరాని కోరిక కోరిందా. ఏదో అన్నాగారు కష్టాల్లో ఉంటే అడుకోవాలని ఆశపడింది! అనుకున్నాడు. అనుకున్నాక యిక ఆలస్యం చెయ్యకుండా తనే బావమరిదికి ఉత్తరం రాసేశాడు.

    "జరిగిన దానికి బాధ పడ్డాననీ, ఏ సంకోచమూ లేకుండా రాధను తమ దగ్గరికి పంపమని రాసారు. కొన్నాళ్ళ పాటు యిక్కడే ఉండి వూరు చూసి వస్తుంది అని గట్టిగా రాసారు.

    "ఇదుగో మీ అన్నయ్యకి ఉత్తరం రాసాను" అంటూ భార్యకి చూపించారు. అన్యమనస్కంగా చూసిన వర్ధనమ్మ ఎంతో సంతోషించింది. ఆవిడేకాదు ఆ ఉత్తరం అందుకున్న ఆవిడ అన్నగారు కూడా యెంతో సంతోషించారు.

    ఫలానా రోజుకి గోదావర్లో రిజర్వేషన్ చేయించా ఏ మాత్రం వీలున్నా తనూ బయలుదేరారతాననీ, లేక పోతే బెజవాడకి బండి ఎక్కిస్తాననీ రాసాడు. తనొచ్చినా, రాకపోయినా స్టేషన్ కి తప్పకుండా యెవరైనా రమ్మనిరాసాడు.

    ఆ ఉత్తరం అందుకుని యెంతో సంబరపడిపోయింది వర్ధనమ్మ. తల్లి లేని పిల్ల. కడుపులో పెట్టుకు చూచుకోవాలి అనుకుంది.

    తీరా ఆ అమ్మాయి వచ్చేరోజుకీ రెండ్రోజుల ముందునుండే జ్వరం వచ్చి పడకవేసింది.

    స్టేషన్ కి యెవరు వెళతారు. సత్యంగారు లాభం లేదు, దీపిక వల్లా కాదు. అందుకే చివరి ప్రయత్నంగా కొడుకుతో చెప్పింది.

    "సరే తీసుకొస్తాలే, ఆ అమ్మాయినెలా గుర్తుపట్టడం? నీ దగ్గర ఆవిడ ఫోటో ఉందా?" అని అడిగాడు కృష్ణ.

    "నా తలకాయ దాని ఫోటో నా దగ్గరెక్కడుంటుందిరా?" అంది ఆవిడ.

    చిరాగ్గా చూసాడు కృష్ణ "నా కిందుకేనమ్మా మిమ్మల్ని చూస్తే ఒళ్ళు మండేది. ఏపని చేసినా ఇంతే. ఓ ప్లానూ లేదు పాడూ లేదు. ప్లాన్ వేసుకుని  దాని ప్రకారం నడవండర్రా అని మొత్తుకుంటాను. వింటారా? ఇప్పుడు చూడు అసలా వేళ ఉత్తరం రాసేటప్పుడే ఆవిడ ఫోటో ఓటి పంపించమని రాస్తే  బాగుండేది లేదూ వాళ్ళలా  వస్తున్నారని తెలియగానే మన ఇంటిగుర్తులు తెలియజేస్తూ రాయాల్సింది. అదీ లేదు, ఇదీ లేదు. రేపొద్దున్న నేను వెళ్ళి వాళ్ళని ఎలా వెతుక్కోను?" అన్నాడు విసుగ్గా.

    వర్థనమ్మకి విసుగేసింది రైలు దిగినవాళ్ళని కనుక్కోడం బ్రహ్మవిద్యట్రా? అసలు నా ఒంట్లో బాగుంటే నేనే వెళ్ళేదాన్ని. జ్వరం రాబట్టి నిన్ను బ్రతిమాలాల్సి వచ్చింది" అని విసుక్కుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS