Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 25


    "సిట్ డవున్..... మైడియర్....." అంది నవ్వుతూ." ఠక్కున కూర్చుంది శిల్ప! ఇవ్వాళ ఏదో టెస్టుండాలి కదా మీకు? అయిపోయిందా?"
    "సోషల్స్! అయిపోయింది" తలవంచుకుని, సమాధానం చెప్పింది శిల్ప.
    "బాగా రాశావా?"
    "ఎస్..... సిస్టర్! బాగానే రాశాను"
    "నువ్వు, అవినాష్?"
    "నాకు హిస్ట్రీ వుంది సిస్టర్! బాగానే రాశాను!"
    "గుడ్" అంది.
    రహీంని పిల్చి కొన్ని బిస్కట్లు, పేస్ట్రీలూ, ప్లేట్లలో పెట్టి తెమ్మంది. అవినాష్ నీ, శిల్పనీ వాటిని అందరికీ ఇవ్వమంది. అవినాష్ బిస్కట్ల ప్లేటూ, శిల్ప పేస్ట్ రీ ప్లేటు పుచ్చుకొని, ఒక్కొక్కరికీ అందిస్తూ వచ్చారు. శిల్ప తలవంచుకొని, రాగిణికి ప్లేటునందించింది. రాగిణి ప్లేటునికాక, శిల్పని కన్నార్పకుండా చూసింది. ఆమె మొహంలో కొట్టొచ్చినట్లున్న తెలివితేటలు కొత్త అందాన్నిచ్చాయి! ఇన్నాళ్ళూ ఈ పిల్లలో ఈ తెలివితేటలన్నీ ఎక్కడ దాక్కున్నాయి? అనాలోచితంగా శిల్ప రెండు భుజాలు పట్టుకుని బుగ్గలు ముద్దుపెట్టుకుంది.
    "ఛీ" అంటూ శిల్ప ప్లేటుని కింద పెట్టేసి కర్చీపుతో బుగ్గలు తుడుచుకుంది.
    "తప్పు! మమ్మీని అలా అనకూడదు" అంది సిస్టర్ ఫెర్నాండిస్
    "ఐ..... హేట్..... హర్!" అంటూ పక్కకు తిరిగి, కర్చీపుతో కళ్లు తుడుచుకుంది శిల్ప. ఇటు రాగిణీ, అటు శిల్పా..... ఇద్దరూ ఏడుస్తున్నారు. ఒకరిది పొంగేమాతృత్వంలోని ప్రేమ, రెండోది కరుడుగట్టి, పాషాణమైపోయిన కరగని, ఆప్యాయత! ఒకరు జారికింద పడిపోయిన వస్తువును తీసి, మళ్ళీ జాగ్రత్తగా ఒకదాన్లోపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకరు జారి కిందపడిపోయిన వస్తువుని, తీసి అవతల పారేసే ప్రయత్నంలో వున్నారు. ఇద్దరికీ వస్తువు ఒక్కటే! కిందపడిపోవడం కరెక్టే! కాకపోతే వారి ప్రవర్తనేవేరు! ఒకరు ఏరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకరు ఏరి పారెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో, ఎవ్వరూ చెప్పలేరు.
    పరిస్థితిని అర్థం చేసుకున్న సిస్టర్ ఫెర్నాండిస్, రాగిణికేసి చూసి "రాగిణిగారూ! మీరు వెళ్ళండి! తరువాత నేను శిల్పతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు" అంది.
    "అలాగే" అంటూ బయలుదేరారు రాగిణీ, సూర్యకుమారి.
    "బై..... బై.... మామ్మా! రేపు సాయంత్రం దాసప్రకాష్ కి వచ్చి కలుస్తాను! ఇవ్వాళ చదువుకోవాలి!" అన్నాడు. అలాగే అంది సూర్యకుమారి. "బై.... బై.... ఆంటీ!" అంటూ రాగిణికి కూడా చెప్పి వెళ్లాడు అవినాష్!
    శిల్ప ఒక్క సూర్యకుమారికి బై..... బై..... చెప్పి వెళ్ళిపోయింది. రాగిణికి అవమానం, బాధ, అన్నీ కలిసి ఏడుపొస్తొంది. శిల్ప ఇంత దృఢ సంకల్పంతో తన మొహం చూడకుండా వుంటుందని కలలో కూడా అనుకోలేదు. రాగిణి చేసేదిలేక సిస్టర్ ఫెర్నాండిస్ సలహా ప్రకారం హోటలుకి వెళ్ళిపోయింది.
    సూర్యకుమారి మొదటిసారి ఊటీకి రావడం కనుక, ఆమెకి ఊటీ చూపించడానికి, ఒక టాక్సీ మాట్లాడింది. ఆ సాయంత్రం నుంచి, మర్నాడు సాయంత్రం వరకూ, చూడవలసినవి నాలుగూ చూపించింది రాగిణి. అక్కడి చలి భరించలేక వొణికిపోతోంది సూర్యకుమారి. అందుకే సాయంత్రం పెందరాడే హోటల్ కొచ్చి కూర్చున్నారు రాగిణీ, సూర్యకుమారి! అలసిపోయి మంచంమీద వాలిపోయింది సూర్యకుమారి! అంతులేని ఆలోచనలలో మునిగిపోయింది రాగిణి!
    భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది రాగిణికి! శిల్పని చూస్తూవుంటే మారుతుందన్న ఆశ ఏకోశానాకలగడంలేదు. "ఎన్నాళ్లు తను కోటయ్య బాబాయ్ గారింట్లో వుంటుంది? భరణి దగ్గరికి వెళదామా అన్నా మనస్కరించడంలేదు. భరణి హాయిగా కాపురం చేసుకుంటూ, సంతోషంగా వుంటే తను వెళ్ళి తన బాధల్ని వారికి పంచకూడదు! తల్లిదండ్రులకీ, చెల్లెలికీ తను సంతోషాన్నందివ్వలేనప్పుడు, బాధల్ని మాత్రం ఎందుకు పంచాలి? తనబాధలు తీరి, తను సంతోషంగా వుండి, తనవాళ్ళని సంతోషపెట్టగలననే ధైర్యం కలిగినప్పుడే వాళ్ళని చూడాలిగానీ, లేకపోతే లేదు" అనుకుంది. అయితే ఏం చెయ్యాలి! హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా మొహం చెల్లడంలేదు. రాజేష్ తో జరిగిన గొడవలు గుట్టుగా నాలుగు గోడలమధ్యే ఉన్నాయి. మహా అయితే కొందరు ముఖ్యమైన స్నేహితులకీ, బంధువులకీ మాత్రమే తెలుసును. కానీ, ఈ రోజున తనకీ భార్గవకీ మధ్య జరిగిన గొడవలు, ఆ చరిత్ర, ఆ అపనిందలూ, అపవాదులూ ఊరూ వాడా అందరికీ తెలిసిపోయాయి. హైదరాబాదులోనే కాదు, ఆంధ్రదేశం యావత్తు గాలించినా ఈ గొడవలు తెలీని వారుండరు! అందుకని, ఇక్కడే ఈ ఊటీలోనే ఒక ఇల్లు తీసుకుని ఏదైనా ఉధ్యోగం చేసుకుంటూ వుంటే, ఏరోజునైనా శిల్ప మారి తనదయితే అంతకన్నా ఏంకావాలి? అందుకు తను ఇక్కడే వుండిపోవాలి! ఇప్పుడు శిల్ప పసిపిల్ల! కొంచెం పెరిగి పెద్దదయ్యాక. అన్ని విషయాలూ అర్థం చేసుకునే శక్తిని సంపాదించగలుగుతుంది. అంతవరకూ, దూరంనుంచైనా ఆ బిడ్డని చూసుకుంటూ ఈ ఊళ్ళోనే వుండడం మంచిది" అనుకుంది. ఒక నిర్ణయానికిరాగానే, గుండెలమీది బరువు దించినట్టయింది! హృదయం తేలికపడింది.

    ఆ సాయంత్రం కొంచెం కొంచెం పొద్దుపోయాక, సిస్టర్ ఫెర్నాండిస్, అవినాష్ నీ, శిల్పనీ వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళిద్దరినీ, సూర్యకుమారినీ మాట్లాడుతూ వుండమని చెప్పి, రాగిణిని తనతో కూడా, బయటికి తీసికెళ్ళింది.
    "రాగిణిగారూ! శిల్పకి మీమీద ఒకరకమైన ద్వేషం పట్టుకుంది. షి..... హేట్స్..... యూ.....! మీకు తనంటే ఇష్టంలేదనీ, అందుకే తనచేత అక్కా అని పిలిపించుకుంటూ. తన బాధ్యతని, మీ అమ్మగారికి అప్పజెప్పి, ప్రోగ్రాములకని వెళ్ళిపోయేవారంటుంది. మీకు ప్రోగ్రాములూ, డబ్బూ తప్ప, తనక్కర్లేదనంటుంది! నేను ఎంతో నచ్చచెప్పాను. ఆ చిన్న మనస్సులో నాటుకున్న బీజం పెరిగి పెరిగి పెద్దదైంది తప్ప, పెరికివెయ్యడానికి వీల్లేకుండా అయింది. "సిస్టర్! మమ్మీతో మాట్లాడమని మీరు బలవంతం చేస్తే నేను ఈ స్కూలు నుంచే వెళ్ళిపోతాను" అంది. ఈ రోజుల్లో పిల్లలకి ఆ ధైర్యం వుంది కూడా! అసలు పిల్లల సైకాలజీ తెలుసుకోకుండా పిల్లల వాలకేమీ తెలీదని, కొట్టిపారేస్తూంటారు పెద్దవాళ్ళు! కానీ, అసలు పెద్దవాళ్ళకే పిల్లల గురించి ఏమీ తెలీదు! అందుకే వాళ్ళని తక్కువగా అంచనా వేస్తూంటారు.
    శిల్పలో పరివర్తన కలిగేదాకా, దానంతట అదే మార్పు వచ్చే దాకా, మనం బలవంతం చెయ్యడం మంచిదికాదు. అంతవరకూ మీరు ఓపికపట్టాలి! ఓర్చుకోవాలి" అంది.
    "సిస్టర్! నాకు తెలుసు ఇలా జరుగుతుందని! అందుకే ఇప్పుడే నేనొక నిర్ణయానికొచ్చాను. అందుకు మీ సహాయం కావాలి!"
    "ఏమిటో చెప్పండి! నా సహాయం మీకు ఎప్పుడూ వుంటుంది!"
    "సిస్టర్! నాకిక్కడ ఏదైనా చిన్న ఇల్లు చూసి పెట్టండి! మా అమ్మా, నాన్నా, చెల్లెలూ అందరూ అమెరికాలో వుంటున్నారు. అన్నీ పోగొట్టుకుని, అపనిందలు మోసుకుంటూ, కన్నవారిని మరింత కష్టపెట్టడానికి, నేనీ స్థితిలో అమెరికా వెళ్లలేను. ఇన్నాళ్ళూ నేను ఏం పోగొట్టుకున్నానో, అవి పోయేదాకా తెలీలేదు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. సిస్టర్! పశ్చాత్తాపంతో నాగుండె మండిపోతోంది. కన్నీళ్ళతో నా మనస్సుకు అభిషేకం జరిగింది! నా శిల్పని మార్చాలి! నాదాన్ని చేసుకోవాలి. ఒక చిన్న ఉద్యోగం చూసిపెట్టండి. నేనిక్కడేవుంటూ, చాటుగానైనా బిడ్డని చూసుకుని తృప్తిపడతాను!" రాగిణి చీర కొంగును నోటికడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సిస్టర్ ఫెర్నాండిస్ కళ్ళల్లోకూడా నీళ్ళు తిరిగాయి!
    "అలాగే చూస్తాను! రేపే మీ బయోడేటా ఇస్తూ, ఒక ఆప్లికేషన్ రాసివ్వండి! ఉద్యోగ ప్రయత్నం, ఇంటి ప్రయత్నం రెండూ చేస్తాను! అవి దొరికాక మీరు ఇక్కడికి ఒచ్చేద్దురుగాని! దేముడు మీకు తప్పకుండా మేలు చేస్తాడు!" అంది :
    "థాంక్యూ సిస్టర్! మీ ఋణం, ఈ జన్మలో తీర్చుకోలేను. మూగదానిలా వున్న నాశిల్పకి, మాటలునేర్పి మనిషిని చేశారు. చితికిపోయిన నా బ్రతుకులో చివురాశలు కల్పించి నాకు ప్రాణంపోశారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS