Previous Page Next Page 
నా కథవింటావా పేజి 25

    "నన్నేం చెయ్యమంటావు చెప్పు! తనేమీ   చిన్నపిల్ల కాదుకదా, బలవంతాన పీటలమీద  కూర్చోబెట్టి, మూడుముళ్ళూ వేయించడానికి. తన కిష్టంలేని పెళ్ళి ఎలా చేయించమంటావ్ ?"
    "ఇంతవరకూ  ఇన్ని సంబందాలొచ్చాయి. తనకి ఏది నచ్చిందనీ ? నిజానికి  మీ అమ్మగారు కూడా ఆ బెంగతోటే  కన్నుమూశారు. తల్లి మనసుని అర్ధం చేసుకోలేని చదువులెందుకు ? మంచి  సంబంధం  కావాలంటే, ఒక చెడిపోయిన  పిల్లని ఉద్దరించడానికి  నేనున్నానూ అని ముందుకు రావడానికి ఇది సినిమాకాదు, జీవితం!"
    "శోభనా ! మా కావ్య చెడిపోలేదు"....
    "మీరు చూశారా ? ఆమె చెప్పింది నమ్ముతున్నారు! అంతేనా ?"
    "శోభనా !"
    "అవునండీ! మనని మనం  ప్రశ్నించుకుంటే, మనదగ్గరే  సమాధానం లేదు. ఇతరులకేం  చెపుతాం ?"
    క్రాంతి మాట్లాడలేదు.
    కావ్య గుండెలో  రాయిపడ్డంత  బరువుగా  అనిపించింది. క్షణం వరకువున్న ఉత్సాహం, పాలపొంగులా  కుంగిపోయింది. కన్నీళ్ళు చెంపల మీదుగా  జలజలారాలాయి.
    "నా మాటవిని, ముందు ముందు లేనిపోని గొడవలు రాకముందే, మా నాన్న చెప్పిన సంబంధాన్ని  ఖాయం చెయ్యండి. ఈ ఊళ్ళో సంబంధమే కనుక, మీ చెల్లెలు  మీ కళ్ళముందే  వుంటుంది. మళ్ళా ఇటువంటి అవకాశం రాదు. అనాధ శరణాలయంలోనో, సంక్షేమ సంఘాలలోనో ఆమె చేరుతానంటే  సరేనని చెప్పి, ఇంటికి అప్రతిష్ట తేకండి."
    క్రాంతి మౌనంగా వున్నాడు.
    'చెప్పండీ ! ఏంటాలోచిస్తున్నారు ఇంకా ?"
    "అలాగే!"
    "అంటే ?"
    "నువ్వు చెప్పినట్టే చేద్దాం!"
    "నిజంగా అంటున్నారా ?"
    "నిజంగానే అంటున్నాను"
    "ఏదీ నామీద ఒట్టేసి చెప్పండి"
    "పిచ్చిగా ఈ ఒట్లూ సత్యాలూ ఏంటి శోభనా ? నువ్వు  చెప్పినదంతా నిజం. పైగా మన కుటుంబం గౌరవాన్నీ, అమ్మ మనసునీ, అన్నీ దృష్టిలో పెట్టుకుని  సలహా ఇచ్చావు. నేను నీలాగా ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోయాను" ఒట్టేసినట్టున్నాడు.
    శోభన సంతోషంగా "అయితే వినండి. రేప్పొద్దున్న కాఫీ తాగ్గానే, మీ నిర్ణయాన్ని  చెప్పేయండి కావ్యకి! హిమాయత్ నగర్ సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని  చెప్పేయండి. ఆ తరవాత  వాళ్ళని కలుసుకుని, వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టించెయ్యండి. పెళ్ళికూడా సింపుల్ గా చేసేస్తేసరి. ఎలాగా అదివరకు  కొన్న  బట్టలూ, నగలూ వుండనే వున్నాయి. ఒకవేళ ఇప్పుడు ముహూర్తాలు లేవూ అంటే  ఏదైనా  గుళ్లో  చేసేస్తేసరి. గుళ్ళో  దేముడి దగ్గర జరిగే  పెళ్ళికి, ముహూర్తం చూడనక్కర్లేదుట !"
    "అలాగేలే! రేపు మాట్లాడతాను, పడుకో! పొద్దుపోయింది."
    "అలాగే!"
    ఇంక మాటలు  వినిపించలేదు !
    "అన్నయ్య ఇంత వీక్ మైండెడా ? తను చెప్పినదానికీ  సరేనన్నాడు, శోభన చెప్పినదానికీ సరేనన్నాడు. అంటే ఎవరేది  చెబితే అది వినే తత్వమా ? తన స్వంత తెలివితేటలు  ఉపయోగించి ఏదీ ఆలోచించడం లేదా ?" అనుకుంటూ  తన మంచం దగ్గరికెళ్ళి  పడుకుంది కావ్య.
    పుస్తకం  చదవబుద్ధి  కాలేదు. తీసి పక్కన  పెట్టేసింది.
    మళ్ళీ మనసు  ఆలోచనల్లో  మునిగిపోయింది.
    "ఒక వేళ అన్నయ్య  వొదినకిచ్చిన  మాట ప్రకారం  ఆ సంబంధం ఖాయం చేసుకునొచ్చేస్తే ? అప్పుడు తను కాదన్నా బాగుండదు. ఆ ముసిలాణ్ణి కట్టుకుని, బ్రతుకంతా  ఈసురోమని ఈడుస్తూ  లేదా పుత్తడిబొమ్మ పూర్ణమ్మలా  ఆత్మాహుతి చేసుకోవాలి! మైగాడ్ ఇంకా ఈ రోజుల్లో  కూడా పూర్ణమ్మ జీవితాన్ని పోలిన జీవితాలు వున్నాయంటే, నాటికీ, నేటికీ స్త్రీ సమస్యలలో, ఎటువంటి మార్పూ రాలేదనిపించింది. అలా జరగడానికి వీల్లేదు. తను ఎదురుతిరగాలి! ధైర్యంగా నిలబడాలి! తన బ్రతుకుని తనే నడుపుకోవాలి! అందులో మంచి ఎదురైనా ,చెడు సంభవించినా, తనే బాధ్యురాలు. కానీ, తన జీవితాన్ని  మరొకరిచేతిలో  పెట్టి, ఏడుస్తూ కూర్చునే మూర్ఖురాలు కాకూడదు. ఎలాగా ఇన్ని నిందలు మోయగలిగింది. ఇన్ని ఎదురు దెబ్బలు తినగలిగింది. ఇప్పుడు  తన ధ్యేయాన్ని మార్చుకోకూడదు." అనుకుంది.
    "అయితే  ఏం చెయ్యాలి ? ఈ సమాజాన్ని తాను ఒంటరిగా  ఎదుర్కోగలదా ? అమ్మకోసమైతే  తానుమాట్లాడక ఊరుకునేదేమో! అమ్మే పోయింది. ఇక  తను  ఏమైపోయినా  ఫరవాలేదు. అయితే అమ్మ కిచ్చిన  మాట ప్రకారం, తను ఆత్మహత్య మాత్రం  తలపెట్టకూడదు, ఎట్టిపరిస్థితిల్లోనైనా." అనుకుంది.
    ఆలోచనలన్నీ  ఒక  రూపానికొచ్చేసరికి  తెల్లవారుఝామయింది. కొంచెం దూరంగా  వున్న కోళ్ళశాల  పౌల్ట్రీ ఫారమ్ లోని  కోళ్ళు 'కో' అని కూశాయి!
    ఏదో ఒక నిర్ణయానికొచ్చిన దానిలా, అప్పుడు  నిద్రకుసక్రమించింది కావ్య !
    తెల్లారి లేచేసరికి  పొద్దుపోయింది. అప్పటికే కాఫీల  కార్యక్రమం ముగించుకుని  కూర్చున్నారు క్రామ్తిం శోభన! కావ్య మొహం  కడుక్కుని  రాగానే, కాఫీ గ్లాసు నందించింది శోభన!
    గ్లాసు నందుకుని  అన్నయ్య పక్కనే  వున్న కుర్చీలో  కూర్చుంది.
    "కావ్యా! రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను! నువ్వు చెప్పిందంతా విన్నాక కూడా, ఆ ఆదర్శాలు వల్లెవేయడానికే తప్ప, బతకడానికి  పనికి రావనిపించింది. అందుకే, ఈ రోజే వెళ్ళి మామయ్య చెప్పిన సంబంధాన్ని ఖాయం చేసుకొస్తాను." అన్నాడు క్రాంతి!
    "అన్నయ్యా! నువ్వు  చెప్పినదంతా  విన్నాక నేనూ  ఒక నిర్ణయానికొచ్చాను  రాత్రి!"
    "ఏమిటమ్మా  అది ?"
    "వెంటనే  పాండిచేరి  ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ ఆ ఆశ్రమ వాతావరణంలో కొన్నాళ్ళుండి  ఆ తరువాత ఏదైనా  ఉద్యోగం  సంపాదించుకుంటాను, అన్నయ్యా! నాన్న వొదిలిపెట్టి  వెళ్ళిన డబ్బుతో, నా వాటా నాకిచ్చేసెయ్! రేపే నా ప్రయాణం!" అంది.
    శోభనా, క్రాంతీ తెల్లబోయి  చూశారు  కావ్యని!
                                                                                17
    కావ్య ఒక నిర్ణయానికొస్తే, దానికి  తిరుగుండదని  తెలుసు క్రాంతికి!
    "కావ్యా! లాయర్ని పిలిచి, ఇవ్వాళే ఆ ఏర్పాట్లన్నీ  చేస్తాను. నువ్వు ఇదివరకు పనిచేసిన స్కూల్లోనే చేరు. ఈ వూరూ ఆ వూరూ  ఎందుకు ?"
    "అన్నయ్యా! నేనిదివరకు  పనిచేస్తున్న  స్కూల్లో ఇప్పుడు ఖాళీలు లేవు. ఈ వూర్లో ఇంకెక్కడా ఉద్యోగం  చెయ్యడం నా కిష్టంలేదు. పాండిచేరీకి  పోతున్నది, ఆశ్రమంలో  చేరి, సన్యాసం పుచ్చుకోవడానికి కాదు. పవిత్రమూర్తి శ్రీ అరబిందో, 'మదర్' లు మనకి చేసిన సేవలకి మన జాతి మొత్తం ఋణపడి వుంది. ఆ పవిత్ర మూర్తులు సమాధులను దర్శించి, ఆ ఆశ్రమాన్ని  తిలకించి మానసికానందాన్నీ, విజ్ఞానాన్ని పొందవచ్చు. ఆ తరువాత ఆ ప్రశాంత వాతావరణంలోనే ఏదైనా  ఉద్యోగాన్ని  సంపాదించుకోదలచుకున్నాను. అక్కడా ,నా కనుకూలు రైనవారెవరైనా  దొరికితే వివాహం చేసుకుంటాను. ఆఫ్ కోర్స్, నీకూ, వొదినకీ చెప్పి, మీ ఆశీర్వచనాలతోనే! లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ, అక్కడే వుండిపోతాను హాయిగా!"
    "కావ్యా! ఎందుకమ్మా  అలా మాట్లాడతావు. నాన్న  లేకపోయినా, తనే అమ్మా నాన్నయి మనిద్దరినీ  రెండు ప్రాణాలుగా చూసుకుంది  అమ్మ! ఇద్దరికీ చదువులు చెప్పించి, ప్రయోజకులిగా  తయారుచేసింది. దురదృష్టం ఏదో పట్టి ఆమె కళ్ళ ముందు నువ్వు స్థిరపడే అవకాశం ఆమె చూడలేక పోయింది. కావ్యా! అమ్మ కూడా పోయాక, నాకూ, నువ్వూ, నీకు, నేనూ తప్ప ఎవరున్నారు చెప్పు ? నువ్వు నాకు భారమౌతావా ? అసలు నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన ఖర్మేం పట్టింది. నాకు కలిగిన  దానిలో  నువ్వూ....
    "అన్నయ్యా! నువ్వు  చూడవనీ, నాకిక్కడేదో  తక్కువైందనీ, నేను వెళతాననటంలేదు.
    "మరెందుకమ్మా  వెళ్ళడం ? మిమ్మల్ని రచ్చకీడ్చడానికి కాకపోతే ?"
    "వొదినా  ప్లీజ్! ఇది నాకూ, అన్నయ్యకీ సంబంధించిన విషయం నువ్వు జోక్యం చేసుకోకు."
    "అంటే నాకేమీ సంబంధం  లేదా! ఊరొదిలి పెట్టి  ఒదిన గారి బాధ పడలేక వెళ్ళిపోయిందా అమ్మాయి అని రేపు  నన్నాడి పోసుకుంటారు జనం!" ఉడుకుమోతుతనంగా  అంది శోభన.
    "వొదినా! నా భావాలు అన్నయ్యకి తెలుసు! అన్నయ్య మనస్సు నాకు తెలుసు! నిన్నెవ్వరూ ఏమీ అనుకోరు గానీ, అనవసరంగా నువ్వు బాధపడిపోకు"
    "నాన్నగారు రాసిన సంబంధాన్ని ఫిక్స్ చేద్దాం. పెళ్ళి చేసుకున్నాక పాండీచేరీ వెళ్ళినా, ఫ్రాన్స్ కెళ్లినా  ఎవ్వరూ ఏమీ అనరు. అంతేకానీ  ఇలా పెళ్ళీ పెటాకులూ లేకుండా ,ఇల్లు విడిచి  వెళితే  ఏం బాగుంటుంది?"

    "వొదినా! జీవితంలో  పెళ్ళి ఒక ముఖ్యమైన ఘట్టం. కాదనను! కానీ పెళ్ళే జీవితం కాదు. పెళ్ళి లేకపోయినా నేను చెయ్యగలిగిన  పన్లు ఎన్నో వున్నాయి, నా ఆశయాలకి  అడ్డుకాకండి. మీ దారికి నేనెన్నడూ అడ్డుగా నిలవలేదూ, నిలవను. ప్రేమాభిమానాలు, నాకు పెళ్ళి చేసి పంపడం  బాధ్యతలు తీర్చుకోవడంలోనే లేవు. నా ఆశయాలను గౌరవించి, నా ఆదర్శాలకి  విలువనివ్వడంలోనే  వుంది. నేనేం చెయ్యాలీ  అన్న నిర్ణయాన్ని  నేను విన్ననే తీసుకున్నాను. అది మారదు" ఖచ్చితంగా చెప్పింది కావ్య!
    మరి మాట్లాడలేదు శోభన !
    క్రాంతి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
    "అన్నయ్యా! నా నిర్ణయం  నీకేమీ  బాధ  కలిగించడం  లేదు కదా ?"
    "లేదమ్మా! కాకపోతే పెళ్ళయ్యాక  అత్తవారింటికి  వెళ్ళేటప్పుడే మనం దూరమౌతామనుకున్నాను కానీ, ఇలా ఈ విధంగా  విడిపోతాం అనుకోలేదు కావ్యా! అందుకే కొంచెం బాధ పడుతున్నాను" ఆ మాటలు అతను అంటున్నప్పుడు  అతని కళ్ళు  చెమర్చడం  కావ్య చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS