మరునాడు శివరావు ఊరునుంచి వచ్చాడు. అతని వెంట లక్ష్మీనారాయణ ఉన్నాడు. శివరావు వెళ్లేసరికి కాంతం జాతరకి తన గ్రామం వెళ్ళింది. తను వచ్చిన పని చెప్పగానే లక్ష్మీనారాయణ మారు మాట్లాడకుండా కొద్దిపాటి బట్టలు తీసుకుని వచ్చేశాడు.
తండ్రి రావడం గమనించి గుమ్మంలోనే చెరో వైపు ఛాతీకి అటుకుపోయారు కూతుళ్ళిద్దరూ. ముసలాయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కూతుళ్ళను చేత్తో తడిమి చూసుకున్నాడు.
10
రామకృష్ణ సాయంకాలం కాసేపు తిరిగి రావడం అలవాటు. తీరిగ్గా ఉన్నప్పుడు తిరగటానికి వెళతాడు. ఒకరోజు సాయంకాలం జగదాంబ వైపు వెళ్ళాడు.
విశాఖలో జగదాంబ సెంటర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ నగరంలో మారుమూల ప్రాంతంలో నివసించే మనిషిని పట్టుకోవాలంటే పదిరోజుల పాటు జగదాంబ సెంటర్ లో నిలబడితే దొరుకుతాడని చెప్పుకోవచ్చు. తొంభై శాతం సిటీబస్సులు ఆ సెంటర్ మీదనుంచి వెళతాయి. గవర్నమెంట్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్, రామకృష్ణా బీచ్, యూనివర్శిటీ, ఇంజనీరింగ్ కాలేజి_ఇలా ఎక్కడకు వెళ్ళాలన్నా జగదాంబ సెంటర్ నుంచి వెళ్ళాలి. అటువంటి సెంటర్ లో సిటీబస్సు స్టాఫ్ ఆనుకుని నిలబడ్డాడు రామకృష్ణ.
ప్రతి వ్యక్తికి ఏదో పని, ఆ పని చెయ్యడం కోసం ప్రయాణం. వివిధ పనులపై వెళుతున్న మనుషుల్ని చూస్తుంటే సమస్యలన్నీ కలిసి గుంపుగా వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఒక పని పూర్తయితే మరో పని. అసలు పనులులేని జీవితం ఉండదేమో?
బస్సునుంచి దిగిన ఓ జంట హడావిడిగా థియేటర్ లోకి నడిచారు. టిక్కెట్లు దొరకవేమో, దొరికినా సినిమా మొదలవుతుందేమోనని వాళ్ళ భయం. ఫుట్ పాత్ పైన అసహనంగా కదులుతున్నాడో ప్రయాణీకుడు. అతను వెళ్ళాల్సిన బస్సు అంతవరకూ రాలేదని అతని చిరాకు. పుస్తకాలు పట్టుకుని జనానికి కాస్త ఎడంగా నిలబడిందో యువతి. ఆమె బస్సుకోసం చూస్తున్నట్లు లేదు. ఎవరో రావాలి కాబోలు బస్సులోంచి దిగుతున్న జనాన్ని చూస్తోంది. ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కించుకుని, రిక్షా తొక్కుతున్నాడో కార్మికుడు. జారిన కండరాలు కదులుతున్నాయి. ఆ డబ్బులు తీసుకెళితే తప్ప పెళ్ళాం అన్నం వండదని అతని మొహంలో దిగులు కనిపిస్తోంది. కిళ్ళీషాపు వద్దా తాడుతో సిగరెట్ ముట్టించుకుని సినిమా వాల్ పోష్టర్లు చూస్తున్నాడో యువకుడు. నున్నటి రోడ్డుమీద మెత్తగా సాగిపోతున్నదో కారు. లోపల విచ్చుకున్న మొహంతో దర్జాగా కూర్చున్నారిద్దరు. ఆ దర్జా కారు తోలుతున్న డ్రైవరు మొహంలో లేదు.
"హల్లో....."
ఓ తియ్యటి గొంతు వినిపించి ప్రక్కకు చూశాడు. అతను తల తిప్పగానే ఒక యువతి చిన్నగా నవ్వింది. ఎర్రగా, బొద్దుగా ఉందామె. నిర్మలమైన ఆకాశంలో చంద్రుడు ప్రకాశించినట్టు ఆమె నుదుటి బొట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆమెను ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం వచ్చింది.
"పేరు రామకృష్ణ" అందామె.
ముందు అవునన్నట్టు తలూపి తరువాత ఆశ్చర్యపోయాడు.
ఆమె పెదాలనుండి ఓ చిరునవ్వు వెలువడింది.
"మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ నిలబడి ప్రజల్ని చూస్తున్నారు అంది.
ఆమెను ఎక్కడ చూసింది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు" రామకృష్ణ.
"నేను మీకు తెలియదా?" అడిగింది.
అతను సమాధానం చెప్పలేదు.
"అమ్మాయి పలకరిస్తే మాట్లాడని అబబయిలు ఉంటారంటే నమ్మేదాన్ని కాదు. కాని ఇప్పుడు మిమ్మల్ని పలకరించిన తరువాత నమ్మకం కలుగుతోంది."
"మీ రెవరో గుర్తు రాలేదు." అన్నాడు.
అతని మెదడులో ఓ దృశ్యం అస్పష్టంగా కదులుతోంది. ఆమెకు సంబంధించిన దృశ్యమేనని అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా దానికి స్పష్టత రావడం లేదు.
"మీ సర్టిఫికెట్లు నా దగ్గరున్నాయి....." చెప్పింది.
"నిజమా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఒకరోజు అవి నా పుస్తకాల మీద ఉండటం చూశాను. వాటిని ఎవరు అక్కడపెట్టారో నాకర్ధం కాలేదు. మా అన్నయ్యని అడిగితే చెప్పాడు విషయం. వాడికి నిర్లక్ష్యం ఎక్కువ. ఒకసారి మీరు సింథియాలో బస్సెక్కడం చూశాను. అప్పుడే మీరు ఓ కుర్రవాడిని నూతిలోంచి బయటకు తీశారు. సర్టిఫికెట్లు గురించి చెప్పాలనుకుంటే మీరు అక్కడనుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఆ రోజే గమనించాను మా ఎదురింట్లో ఉంటున్నారని...."
అప్పుడు గుర్తొచ్చింది రామకృష్ణకి. ఆమెని ఎదురింటి మేడమీద రెండు మూడుసార్లు చూశానని. అంతేకాదు యం.పి. బాడీగార్డుతో మాట్లాడి టీ కొట్టు కుర్రవాడి అక్క పెళ్ళి విషయంలో ఆమె సహాయం చేసిందని బాడిగార్డు ద్వారా తెలిసింది.
"చాలా థాంక్స్..." చెప్పాడు.
"దేనికి?"
"మీరు గణేష్ ప్రియురాలితో మాట్లాడి ఆమెని ఒప్పించక పోయినట్లయితే సమస్య సాల్వ్ అయ్యేది కాదు."
"వెనుకా ముందూ చూడకుండా నూతిలోకి దూకడం కంటే గొప్ప పని కాదులెండి." చెప్పిందామె.
"మీ పేరు?"
"భాగ్యలక్ష్మీ. అద్సరే మిమ్మల్నో ప్రశ్న అడుగుతాను జవాబు చెబుతారా?"
"అడగండి."
"అందరికీ తెలిసిన వాక్యం ఒకటుంది. జీవితంలో దానిని ఒక్కసారే ఉపయోగించే అవసరమొస్తుంది. అయితే నేను ఇంతవరకూ దానిని ఉపయోగించలేదు. ఆ వాక్యం ఏమిటి?"
రెండు క్షణాలు ఆలోచించి చెప్పాడు.
"తెలియదు."
"ఎంతో ప్రాముఖ్యతగల ఆ వాక్యాన్ని మీరు కూడా ఉపయోగించి ఉండరు..."
తల అడ్డంగా ఊపాడు.
"నన్ను చెప్పమంటారా?"
"చెప్పండి."
"ఐ లవ్ యూ!" చెప్పింది.
ఆమె తన మనసులోని మాట తెలివిగా చెప్పిందని గ్రహించాడు.
"ఆ మాట చెప్పడానికి ఈ ప్రదేశం ఎన్నుకున్నారా?" నవ్వుథూ అడిగాడు.
"నువ్వు తాతయ్యని ప్రేమించి పెళ్ళి చేసుకున్నావా అని ఒకసారి నానమ్మని అడిగాను. వాళ్ళకాలంలో ప్రేమంటే ఏమిటో తెలియదట. మా తాత అవకాశం దొరికినప్పుడల్లా నాన్నమ్మని మామిడితోటకి తీసుకుపోయేవాడట. నా తండ్రి పట్నంలో చదువుతూ గ్రామంలోని నా తల్లికి ఉత్తరాలు రాసేవాడు. గ్రామానికి వచ్చి గోడదూకి పిల్లిలా ఇంటిలోనికి దూరేవాడట. వాళ్ళు ప్రేమని ప్రకటించడానికి ఎన్నుకున్న మార్గాలు కాలానికి తగ్గట్టుగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది కదా!" నవ్వుతూ అంది.
"మరోసారి కలుసుకుని తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే జనం మనవంక ఆసక్తిగా చూస్తున్నారు...." చెప్పాడు రామకృష్ణ.
కొంతమంది తమవంక పనిగట్టుకుని చూడటం ఆమె గమనించింది.
"శనివారం సాయంకాలం కస్టమ్స్ ఆఫీస్ వెనుకనున్న వెంకటేశ్వరస్వామి గుడికి పూజ చేయించడానికి వస్తాను...." చెప్పింది.
"ఒంటరిగానా?"
"అవును"
* * * *
ఉదయం పది గంటలకు కోర్టుకి వెళ్ళాడు రామకృష్ణ. ఆశిరయ్య యాక్సిడెంట్ కేసులో ఆ రోజు అతను సాక్ష్యం చెప్పాలి. అతన్ని పిలిచే సరికి పన్నెండు దాటింది. బోనులో నిలబడి మేజిస్ట్రేట్ ముందు తన సాక్ష్యం చెప్పాడతను.
ఆ సమయంలో పెరిగిన గెడ్డంతో, పీక్కుపోయిన మొహంతో మరో బోనులో నిలబడ్డాడు వెంకటేశం. అతని చూపు విర్వికారంగా దేనిని పట్టించుకోనట్టు ఉంది. తన సాక్ష్యం వల్లనే అతను శిక్షించబడతాడని గుర్తొచ్చి బాధపడ్డాడు రామకృష్ణ.
11
డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్నాడు శివరావు. ఆ సమయంలో పిల్లలు స్కూలు కెళ్ళిపోతారు. అందుకే ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.
బట్టలు విడిచి లుంగీ కట్టుకుని వచ్చి అరుగుపైన కూర్చున్నాడు. తలుపుతీసి వెంటనే లోపలికి పోయింది అతని భార్య. అతన్ని ఆమె పలకరించటం గాని, ఆమెను అతను పలకరించటంగాని చెయ్యలేదు. ఇద్దరూ తమ పనులు నిర్లిప్తంగా చేశారు. పిల్లలు కూడా తల్లినే అంటిపెట్టుకుని శివరావుకి దూరంగా ఉంటారు. భార్య పిల్లల్ని దూరంగా ఉంచుతున్నదని తెలుసు.
