"మన జాగ్రత్తలో మనం వుండాలని తప్ప ఇంకే సలహా యివ్వలేను సుజాతా! మనం ఋషులంకాదు ఒక మంత్రంతో వాణ్ని సమూలంగా మార్చడానికి. ఏదయినా న్యాయవిచారణ జరిపించి శిక్ష వేయించాలంటే వాళ్లని రౌడీలుగా న్యాయస్థానం ముందు నిలబెట్టడం కష్టం! చిన్న న్యాయం కావాలన్నా సాక్ష్యాలూ, రుజువులూ కావాలి న్యాయస్థానానికి! ఆ రుజువులూ, సాక్ష్యాలకు జడిసే చాలామంది తమకు జరగాల్సిన న్యాయాన్ని వదులుకోవడం జరుగుతూంది" అంది సుధ.
"మీరేకాదు, ఈ సమస్యకు యెవరూ పరిష్కారం చూపలేరండి! ఒక్కోసారిన అనుకొంటాను యీ ఉద్యోగం వదిలేయనా అని!కాని, చెరువు మీద అలిగినట్లుగా అవుతుంది నా పని! ఎందుకంటే మాది చాలా పేద కుటుంబం! ప్రస్తుతం నా జీతమే ఆధారం మా కుటుంబానికి. నా తరువాత ఇద్దరు మగపిల్లలు చిన్నవాళ్లు. వాళ్లు చదువుకొని కొంచెం సంపాదించడం మొదలుపెడితే తప్ప ఉద్యోగమనే యీ జైలు శిక్ష నాకుతప్పదు. ఉద్యోగం వదిలేసినరోజు నేను చాలా నిశ్చింతగా నిద్రపోగలను" సుజాత అంది.
* * * * *
"అమ్మా! మిషనమ్మ వచ్చింది" పిల్లపరిగెత్తి వంటింట్లో సతమత మౌతున్న తల్లితో చెప్పింది.
"వస్తున్నాపద!"
సుధే లోపలికి వచ్చింది. వంటిల్లు అసలే చీకటి. అందులోనూ పచ్చికట్టెల పొగతో నిండిపోయి ఏం కనిపించలేదు మొదట. తరువాత పొయ్యిముందు కూర్చొని ఉఫ్ ఉఫ్ మని పొయ్యిలోకి ఊదుతున్న సుశీల కనిపించింది.
"రోజూ యిలాంటి గదిలో వంటచేస్తే నీ కళ్లు పోకుండా యెలా వున్నాయి!" అడిగింది సుధ ఆశ్చర్యంగా"అసలు గదా యిది? గుహ అంటే సరిపోతుంది!"
"ఇంకేం చేయాలి? ఉన్న గది ఇది."
"ఉన్న గదినే కాస్త పొగపోయేట్లు చేసుకోకూడదా? అక్కడ గోడకి చిన్న కిటికీ పెడితే వెలుతురు, గాలి వస్తాయి పొగకూడా యిలా ఇంట్లో సుళ్లు తిరగదు! బయటికి వెళ్లిపోతుంది."
"పాతకాలం ఇల్లు! అట్టనే నెట్టుకొస్తున్నం బతుకులు! పచ్చికట్టెలు! దినభత్యం! ఒకనాడు ఎదగదు!" నిర్లిప్తంగా అంది సుశీల.
"ఏం మనుషులో మీరు! రోజు గడిస్తే చాలుననుకొంటారు. ఆరోజు గడవడమన్నది కొంచెం మెరుగ్గా, కొంచెం తృప్తిగా గడవాలని యెందుకు కోరుకోరు మీరు? ఇలా పచ్చి కట్టెల్తో సతమతమయ్యేకంటే అది నాలుగు రోజులు ముందేసుకుని ఎండకి ఆరవేసుకొంటే ఇవాళ యిలా సతమతమయ్యే అవసరం వుండదు కదా!"
"ముందేకొని పెట్టుకోడానికి డబ్బులేడవుంట్, మిషనమ్మా?"
"మిషనమ్మా , మిస్సమ్మా కాదు - చక్కగా నా పేరు సుధ అని పిలవండి."
"అయితే పంతులమ్మ అంటలే!"
"పాఠాలు చెప్పేవాళ్లను పంతులమ్మ అనాలి! నేను చెప్పడం లేదుగా!"
"ఏదో ఒకటి పిలుస్తలే, తల్లీ! నా నోటికొచ్చింది పలుకుత తల్లీ!"
"పూట భత్యం, నీళ్ళుకారే కట్టెలతో వంట ఎన్నాళ్లు? మీరు సంసారాలు చేస్తున్నారేగాని ముందుచూపు లేదసలు! ముగ్గురాడపిల్లలు వున్నారు కదా, వాళ్ల పెళ్ళిళ్లు ఎలా చేస్తారు?"
"ఆ మారాజుకే ఎరిక, తల్లీ! నాకేం ఎరిక!"
"అంతా మగవాళ్ల మీద బరువేసి ఇప్పుడు నిశ్చితంగా కూర్చోగల నేమోగానీ, వాళ్లు ఎదిగాక గుండెలమీద కుంపట్లయ్యాక అప్పుడిలా ఉండగలవా? ఏమండీ! పిల్లలు ఎదమీది రాళ్లలా అయ్యారు, సంబంధాలు చూడరేమండీ?" అంటావు. "నేనెక్కడ చూడనే? పెళ్ళిళ్లకి బ్బేదీ?" అంటాడు మీ ఆయన. వయసొచ్చిన ఆడపిల్లలకు పెళ్ళిళ్లు చేయలేకపోతే ఎక్కువగా కుమిలిపోయేది తల్లేకదా?"
"ఆ మాట నిజమే పంతులమ్మా! కాని నేనేం చేయను? పుట్టిందే గానీ ఇంత వరకు పావలా డబ్బులు కళ్లజూసి ఎరగను."
"మీ ఆయన మంచి మూడ్ లో వున్నప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి! ఒకే మొత్తంగా డబ్బు దాచుకోలేరు. పంటకింతని ధాన్యం వస్తుంది కదా?వచ్చినప్పుడల్లా ఓ అయిదు బస్తాలో పదిబస్తాలో అమ్మేసి పిల్లల పెళ్లిళ్ళకనో, మిగతా అవసరాలకనో దాస్తూండండి. మాటవరసకు అంటున్నాను, రేపు నీకో, నీ పిల్లలకో ఏదైనా జబ్బు చేసిందనుకో, మందులకు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి పరిగెడతారు? వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ కట్టే షావుకారు దగ్గరికి. మీరే ఉన్నప్పుడు కాస్త కాస్త తీసి చిన్న మొత్తాల పొదుపు పథకంలో వేశారంటే అవి ఇంతై రేపు మీకు కల్ప వృక్షాలవుతాయి."
"బాగానే చెప్పుతున్నరుగాని, ధాన్యం కల్లంమీదినుండే షావుకారు అప్పులకి పోదతి తల్లీ మరునాటి నుండి కొత్త అప్పు ప్రారంభం"
