Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 25


    ఇక్కడ బ్రహ్మచారి అని ఒకాయన ఉండాలి ఇల్లెక్కడో మీకు తెలుసా?"
    ఉదయార్కర్ వైపు ఒకసారి వింతగా చూశాడు ఆ షాపు అతను. "తెలుసు. ఇక్కడ నుంచి కుడివైపుకి పొతే........"అంటూ గుర్తులు చెప్పడం మొదలెట్టాడు.
    థాంక్స్ చెప్పి బయలుదేరాడు ఉదయార్కర్. షాపు అతను చెప్పిన గుర్తుల ప్రకారం బ్రహ్మచారి ఇల్లు కనుక్కోవడం అంత కష్టం కాలేదు . బాగా ఇరుగ్గా ఉన్న ఒక సందులో ఉంది బ్రహ్మచారి ఇల్లు. కనీసం వంద ఏళ్ళనాటి పాత కట్టడం అది. అయితే ఇంట్లో గుడ్డి దీపం వెలుగుతున్న సూచన కూడా లేదు. సంకోచంగా తలుపు తట్టాడు ఉదయార్కర్. కొద్దిక్షణాల తర్వాత కిర్రుమనే శబ్దంతో నెమ్మదిగా తలుపు తెరుచుకొంది.
    "బ్రహ్మచారిగారి ఇల్లు ఇదేనా......."అని అడగడానికి నోరు తెరిచిన ఉదయార్కర్ ఆశ్చర్యంతో అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. అతని కెదురుగా చీకట్లో పిశాచంలాగా నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తీ. మొహం నిండా జూలులా పెరిగిన జుట్టు అతనే ఉదయార్కర్ కి దారిలో తారసపడ్డ వ్యక్తీ."
    "నేనే బ్రహ్మచారిని. లోపలికి రండి." అన్నాడతను బొంగురు గొంతుతో.
    
                                  9

    ఉదయార్కర్ మాచెర్ల కి బయలుదేరి వెళ్ళగానే ఎడిటరుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
    "హలో"
    ఆ గొంతు వినగానే గుర్తుపట్టాడు ఎడిటరు.
    మిస్టరీ గర్ల్!
    తను ఈ ఎడిటరు వృత్తిలో ఉంటూ ఎన్నో రకాల మనుషులని చూసాడు. ఎన్నో రకాల మనస్తత్వాలు అబ్జర్వు చేసాడు.
    అందరిలోకి చిత్రమైన కారెక్టరు ఈ అమ్మాయి.
    ఈ అమ్మాయి తమ పత్రిక అభిమాని. వెరీ వెరీ గుడ్ క్రిటిక్. ఎక్కడ ఏ లోపమున్నా దాన్ని సూటిగా చూపుడువేలితో చూపించినట్లు పాయింట్ అవుట్ చేస్తుంది. ఎక్కడ ఏ ప్లస్ పాయింట్ ఉన్నా ముఖస్తుతి అనుకుంటారన్న సంకోచం లేకుండా తెగ పోగిడేస్తుంది!
    ఆ అమ్మాయి పేరు అరుణ.
    అంటే
    అంతకు మించి వివరాలు తను ఎన్నడూ అడగలేదు.
    ఆ అమ్మాయి కూడా ఎప్పుడూ చెప్పలేదు.
    చెప్పడానికి సందర్భం రాక చెప్పకపోవడం కాదు. తను ఎవరో ఎవరికి తెలియకూదదనీ, తన ఐడెంటిటిని అతి గూడంగా ఉంచాలని అనుకుంటున్నట్లు అతి జాగ్రత్తగా ప్రతి చోటా తూచి తూచి మాట్లాడుతుంది.
    అలా మాట్లాడడం ఎదుటివాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది కూడా!
    ఆ అమ్మాయి ఎందుకంత మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుందో అంతుబట్టదు.
    "నేను మీరు ప్రతి మూడు రోజులకి ఒకసారి తప్పకుండా రింగ్ చేస్తాను. ఈసారి పదిరోజులయిపోయింది. అయినా ఎందుకని నిలదీయరేం" అంది అరుణ గొంతులో నవ్వు వినబడుతోంది.
    ఎడిటరు కూడా చిన్నగా నవ్వాడు "నిలదీస్తున్నాను. చెప్పండి."
    "డాడీ హాజ్ గాన్ అబ్రాడ్! సెండాఫ్ ఇవ్వడానికి నేను బోంబే వెళ్ళి అక్కడ వేరే ముఖ్యమైన పనిమీద హేల్డప్ అయిపోయాను ఇవాళ మార్నింగ్ ప్లయిట్ లో వచ్చాను."
    "కొత్త ఇష్యూ మార్కెట్ లోకి వచ్చింది చూశారా?"
    "చూశాను మీరు అనౌన్స్  చేసిన కొత్త సీరియల్ అనౌన్స్ మెంట్ కూడా చూశాను. అది చూశాకే ఒక ఇన్ ఫర్మేషన్ చెప్పాలనిపించి వెంటనే ఫోన్ చేస్తున్నాను."
    "చెప్పండి"
    "ఏలూరు దగ్గర ధనందొబ్బ అని ఒక ఊరు ఉంది. ఆర్కియాలజీకల్ సర్వ్ ఆఫ్ ఇండియా వారు అక్కడ త్రవ్వకాలు సాగిస్తున్నారు ప్రస్తుతం."
    "ఐసీ!"
    "ఎక్కడో చదివాను ఎడిటర్ గారూ! ఊరి పేరులో దిబ్బ వస్తే అక్కడ భూమి కింద పూడుకుపోయింది ఏదో ఉంటుందనిఅర్ధం కదా! నిజమేనా!
    "అయి వుండవచ్చు. నేనూ ఎక్కడో చదివినట్లే గుర్తు."
    "ఎగ్జయిటింగ్ గా లేదూ! ఊరి పేరూ ధనం దిబ్బ! నిజంగానే అక్కడ నిధులు దొరుకుతాయేమో! ఇంతకీ ఈ ఇన్ ఫర్మేషన్ మీకు పనికి వస్తుందంటారా!"
    "పనికి రావచ్చేమో! ఇప్పుడే చెప్పలేం! కానీ గుర్తుపెట్టుకుంటాను." అన్నాడు ఎడిటరు.
    "ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు ఫోన్ చేస్తాను అని ఆగి అంది. "ఇంతకీ నేను ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నానో అడగరేం!"
    "అడుగుతున్నాను చెప్పండి. ధనందిబ్బ నుంచా!"
    "ఇదేమన్నా అడగండి చెబుతా శీర్షికా అనుకున్నారా ఏమిటి? అడగ్గానే చెప్పెయ్యడానికి? అడగకూడనిది అడిగితేఎలా చెబుతాను" అని నవ్వి అంతలోనే సీరియస్ గా మార్చింది గొంతు.
    "ఒకే సర్! ఫర్ దర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా దొరికితే మీకు రింగ్ చేస్తాను."
    క్లిక్ మన్న శబ్దంతో లైన్ కట్ అయిపొయింది.
    మెల్లిగా రిసీవరు క్రెడిల్ మీద వుంచేసాడు ఎడిటరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS