Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 25

 

    ఆనాటి సౌజన్య రూపం కాదిది. శ్వేతకి ఇప్పటి రూపం చాల భీకరంగా కన్పిస్తోంది.
    "ఎందుకలా చూస్తావు? నా గురించి అన్వేషించాలని వచ్చావు. నా ప్రేతాత్మను విముక్తం చెయ్యాలని చూస్తున్నావు. నా ఉనికి గురించి నీవు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా సమాధి గుహలోకి రాగానే నీవు మరణిస్తావు.
    నీ శరీరంలోని రక్త మాంసాలను ఇలాగే" అంటూ చేతులు చూపింది శ్వేతకి.
    చేతులలో ఉన్న పెద్ద పెద్ద మాంసపు ముద్దలనించి రక్తం ధారగా కారుతోంది. అది చూసి కెవ్వున అరవబోయింది జ్యోతి. కాని నోరు పెగలలేదు.
    శ్వేతకి ఆమె కన్నుల వంక తీక్షణంగా చూడసాగింది. రవంత సేపు అయాక తన శరీరంలోని శక్తులన్నీ నిర్ణీమవుతున్నట్లు అనిపించినాయి. నీరసం ఆవహించింది.
    తన గుండె తాలుకూ చప్పుళ్ళు తనకే విన్పిస్తున్నాయి. కనులు మూసినా తెరచినా ఒకే రూపం. భయంకరంగా రక్త సిక్తమయిన హస్తాలతో శ్వేతకి రూపం.
    మహాశక్తులన్నీ వృధా అయినాయి. ఆ శ్వేతకి ఆత్మరూపానికి పూర్తిగా వశం వదురాలై పోయింది జ్యోతి.
    "జ్యోతి! నీవు నాతొ రా?" అని సూచన ద్వారా ఆదేశించింది శ్వేతకి. నిర్జీవ ప్రతిమలా లేచి నిలబడింది జ్యోతి. శ్వేతకి ముందు నడుస్తోంది. ఆ వెనుక అనుసరించి నడవసాగింది జ్యోతి. ఆత్మ రూపం కృష్ణవేణి తరంగాలు కాళ్ళను తాకుతున్న చోటుకి వచ్చి ఆగిపోయింది. జ్యోతి వంక కఠినంగా , నిశితంగా చూసింది.
    
    "నేను చెప్పినట్లు వింటావు కదూ?" అని అడిగింది ఆత్మ రూపం.
    "అవును" అన్నట్లు ఉపాధ్యాయిని ముందు బడిపిల్లలా అత్యంత అమాయకంగా తల ఊగించింది జ్యోతి.
    "నేను ఎలా చేస్తే అలా చెయ్యాలి" ఆత్మరూపం.
    "చేస్తాను" జ్యోతి.
    "ఇప్పుడు నీ ఎదురుగా జీవజల ధారలతో పొంగి ప్రవహించే కృష్ణవేణి కన్పిస్తుంది. నీవు వెనుతిరిగి చూడకుండా సరాసరి నదీ మధ్యలోకి వెళ్ళిపోవాలి. వెనుదిరిగి చూడకూడదు. తెలిసిందా?" అని కఠినతరమయిన ప్రాణాంతకరమైన ఆదేశాల్ని యిచ్చింది ఆత్మ రూపం.
    "అలాగే" అంటూ అమాయకంగా నది మధ్యలోకి వెళ్ళసాగింది జ్యోతి.

    
                                8


    ధవళకాంతులు చిమ్మే ఆత్మరూపం ఇచ్చే ఆదేశాన్ని ఆమె రవంత అయినా ఎదిరించలేక పోయింది. నదీజలాలు పోనుపోను మనిషిని ముంచేస్తున్నాయి. ప్రారంభంలో చీలమండలను తాకినా నీళ్ళు క్రమంగా పిక్కలు మునిగే లోతు వచ్చాయి. ఆ పైన మోకాళ్ళు మునిగాయి. క్రమంగా తొడలు తడిశాయి.
    నడుములోతు నీటిలోకి వెళ్ళాక కూడా ఆమెకు శరీరం మీదకు తెలివిరాలేదు. వెనుదిరిగి చూడకుండా ముందుకు పోవాలి అన్న శ్వేతకి ఆదేశం ఒక్కటే ఆమె మనసంతా నిండిపోయింది.
    ఆ భయంకరమయిన రక్తసిక్తమయిన ధవళకాంతిపుంజం ఇంకో ఒడ్డున నిలిచి వున్నదా, వెనుదిరిగి వెళ్ళిపోయిందా? తెలుసుకోవాలని అనిపించింది. కాని తాను వెనుదిరిగి చూచేందుకు మాత్రం సాహసించ లేకపోయింది జ్యోతి. ఏకాగ్రంగా నదీ గర్బంలోనే చూపు నిలిచి పోయింది.
    ఆ వైపు నడుస్తోందామే. ఎత్తయిన అలలు శరీరాన్ని తాకుతున్నాయి. వెనుకకు గెంటివేస్తున్నాయి.
    అవరోధం అధికమవుతున్నా ఆమెకు నదీ గర్భంలోకి వెళ్లిపోవాలన్న వెర్రి చూపు రవంత అయినా తగ్గలేదు.
    క్రమంగా నీరు వక్షోజాలను ముంచుతోంది. మరొక అడుగు ముందుకు వేశాక కంఠం దాకా వచ్చాయి . మరొక అడుగు వేసింది జ్యోతి. ఇప్పటికే ముక్కులు మునుగుతున్నాయి. ఇంకొక్క అడుగు ముందుకు పడితే ఇక అంతే సంగతి!!
    ముక్కులు మునిగిపోతాయి. శ్వాస ఆగిపోతుంది  జ్యోతి యింతకాలంగా పడుతున్న అరాటమంతా ఆసాంతమవుతుంది. అనాధగా పుట్టి అనాధగా పెరిగి అనాధగానే అర్దారాత్రి ఆ చీకటిలో కృష్ణమ్మ కౌగలిలో ఆ శరీరం చిర విశ్రాంత మవుతుంది.
    ఆపైన అందానికి మరొక పేరులా వున్న ఆ రూపం మొసళ్ళకు చేపలకు ఆహారమవుతుంది. వేద నాదాలు వీణకై నినదించినట్లు విన్పించే అ కంఠస్వరం మూగపోతుంది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఆమె మీద పెట్టుకున్న ఆశలన్నీ కలలు గానే మిగిలిపోతాయి.
    జయకృష్ణ ఉద్యమించిన ఆశయాలు తొలిరాత్రే తెరవాలుతుంది. ముందుకు వేసేందుకు అడుగు కదిపింది జ్యోతి.
    కానీ మరుక్షణమే వెనుక తట్టు నించి డబ్బు డబ్బుమని శబ్దమయింది. ఒకవేళ శ్వేతకి  వస్తోందా అని ప్రశ్నించుకుంది జ్యోతి. కాని అలా శబ్దాలు చేస్తూ -- అయినా ఈదుతూ రావలసిన ఖర్మ అమెకేమిటి?
    ఆమె ప్రేతాత్మల రూపం. నీటిపై నిలువ కలదు. నిప్పుపై నడవకలదు నీటి అంచుల మీద నించి నాట్యమాడ కలదు. నైనంచిందంతి శాస్త్రాణి . నైనందనం పావకః నచైనంఖేదయాన్తిఅపః!
    అటువంటి ఆత్మరూపం ఈదులాడుతూ రావలసిన అగత్యం ఆవంత  అయినా ఆమె అందు నించి శ్వేతకి అయి వుంటుందా.
    మరెవరు ! ఎవరో!!
    వెనుదిరిగి చూడరాదన్న శ్వేతకి మాటలన్నీ మనసున స్మరించి మరొక అడుగు ముందుకి వేసింది. చావు బ్రతుకులను నిర్ణయించే తుది అడుగు మరణం వైపుగా మొగ్గు చూపింది జ్యోతి.
    కాని ఆమె శరీరం ముందుకు కదలలేదు. నీలి నీలి జలధారలపై తేలియాడే కపిల వర్ణం కెశాలను ఎవరో బలంగా పట్టుకున్నారు. రవంత అయినా కదలలేకపోయింది. శ్వేతకి ఆత్మరూపం ఇచ్చిన ప్రదేశాన్ని అనుసరించింది నదీ జలాల మధ్యలోనికి వెళ్ళలేక పోవటం ఆమెకు ఎంతో నిరాశ అనిపించింది.
    ఆత్మరూపం ఆదేశాన్ని పాటించి ప్రాణత్యాగం చెయ్యలేక పోవటం భాధకరమనిపించింది. ముందుకు పోయేందుకు గింజుకుందామె.
    కాని ఆ ప్రయత్నమంతా వృధా అయిపొయింది.
    వెనుక తట్లు నించి శక్తి అధికమయి లాగి వేస్తోంది.
    కొంతసేపు గింజుకుని నిస్సహాయంగా నీటిపై శరీరాన్ని వదలి ప్రతిఘటించటం మానుకుంది జ్యోతి.
    ఆమె శరీరం నీటిపై తేలియాడుతూ బయటకు చేరుకుంది. రెండు చేతుల మీద శరీర మొత్తాన్ని మోస్తూ తీసుకువచ్చి కృష్ణాజలాల తరంగాలు తాకి అరగదీసి తయారుచేసిన గుండ్రాళ్ళపై పడుకోబెట్టాడు జయకృష్ణ. జ్యోతి రవంతగా నీరు త్రాగి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
    త్రాగిన నీటిని క్రక్కించి ప్రధమ చికిత్స చేశాడు. ఆ తరువాత వెచ్చదనం కోసం తన వెంట తీసుకువచ్చి ఒడ్డున ఒదిలిన గొంగళిని ఆమె శరీరం నిండుగా కప్పాడు. కొంతసేపు అయాక ఆమెలో చలనం కన్పించింది.
    "నీవు కృష్ణలో మునగాలనుకుంటే విజయవాడ నించి నంది కొండకు రావాలా? నన్ను తోడుగా తెచ్చుకుని శ్రీశైలానికి నడక ప్రయాణం ప్రారంభించాలా? కృష్ణలో మునిగి బ్రతుకుని తెల్లవార్చు కోవటం నీ లక్ష్యమయితే నన్ను ఇన్ని కష్టాలపాలు చెయ్యటం ఎందుకు? ఎక్కడయినా మునిగిపోవచ్చును కదా!" అన్నాడు జయకృష్ణ చిరుకోపంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS