"అదే గదా నేను చెప్పడం! మాధవిని చూడు ! ఎంత ముచ్చటగా ఉన్నదో! ఇలాంటి పిల్లల మీదనా మీ పరిశోధనలూ! ఇవన్నీ నిజంగా మతి ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులేనా?" ముక్కుమీద గుద్ది నట్టయింది ప్రొఫెసర్ కు.
చంద్ర శేఖరం నిస్సహాయంగా సాగర్ ను చూశాడు.
'అది సరే! అమ్మాయ్! మీ అయన కేమొచ్చింది? ఏమన్నా గొడవలుంటే మీరూ మీరూ సర్దుకోవాలి గాని ఈయన దగ్గర పరీక్ష లేమిటి?' సాగర్ వైపు తిరిగి అన్నది కళ్యాణి. సాగర్ కు ఏం చేయాలో , తోచక ప్రొఫెసర్ వైపు చూశాడు. ప్రొఫెసర్ ఇంటి కప్పు కేసి చూశాడు.
"అయన నా స్నేహితుడు , సాగర్, ఫామిలీ ఫ్రెండ్" మాధవి కళ్యాణికి చెప్పింది.
'ఓహో! అలాగ! నీ భర్తేమో అనుకున్నా! ఆ మీ నాన్నగారి పేరేమిటమ్మా!"
"రామనాధం గారూ!' మాధవి చెప్పింది.
"జడ్జి రామనాధం గారు!" మాట్లాడడానికి అవకాశం దొరికింది ప్రొఫెసర్ కు. "ఎట్లా ఎట్లా జడ్జి రామనాధం గారి అమ్మయివా? రా అమ్మా లోపలికి. కాఫీ తీసుకొందువు గాని." అంటూ కళ్యాణి మాధవిని గదిలో నుంచి తీసుకెళ్ళింది.
"సాగర్! పెద్ద గండం గడిచిందయ్యా!" ప్రొఫెసర్ పెద్దగా నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు.
"ఆమె కేమన్నా?" సాగర్ ఎదురుగా వచ్చి కూర్చొని తలను చూపుడు వేలుతో చూపిస్తూ అడిగాడు.
"లూజ్ ఏమీ కాదు." ప్రొఫెసర్ సాగదీసాడు.
"మరి అలా ప్రవర్తించిందేమి?"
"కల్యాణిది ప్రత్యేకమైన మనస్తత్వం. సైక్రియాటిస్ట్ తో పాతిక సంవత్సరాలు సంసారం చేసిన ఫలితం అది! మతి తప్పినా వాళ్ళకు నేను డాక్టర్ని, ఆ టెస్టులు ఈ టెస్టులూ చేసి, యంత్రాలన్నీ వాళ్ళ తలకు తగిలించి వున్న మతి పోగోడ్తున్నాని ఆమె అభిప్రాయం. ఆమె అభిప్రాయం మార్చడానికి నేను చాలా ప్రయత్నించాను . తనకు మతి పోగోడ్తున్నానని నా మీద అభియోగం?"
"ప్రొఫెసర్! ఆమెగారు ఇలా ఇన్ వెస్ట్ గేషన్ లాబ్ లో కొచ్చి పేషెంట్స్ ముందు ఇలా మాట్లాడితే చాలా ప్రమాదం కదా?"
"ఆ మాట నిజమేనోయ్! మొదట్లో ఇలా చేసేది కాదు. రాను రాను ఇలా నేరుగా లాబ్ లోకి రావడం నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టింది. ఈ పూట గుడికి వెళ్ళింది కదా ఇప్పట్లో రాదని డోర్ లాక్ చేయలేదు."
"మాధవి మీద మీరు చేసిన టెస్టు పూర్తిగా కాలేదు. మీ ప్రయత్నం అంతా వృధా అయినట్టే కదా?"
"అలా ఎందుకు అనుకోవాలి? లేట్ మీ స్టడీ ది గ్రాప్స్ , టేప్స్ అండ్ రిపోర్ట్.నేను బెంగుళూరు వెళ్ళి వచ్చాక అవసరమనుకుంటే మరోసారి టెస్ట్ చేస్తాను."
ఓ.కే సార్" సాగర్ లేచాడు.
"మాధవిని పిలిపించండి. వెళ్తాం!' అన్నాడు సాగర్.
ప్రొఫెసర్ చంద్ర శేఖరం లేచి లోపలికి వెళ్ళాడు. మరో ఐదు నిముషాల్లో ప్రోఫేసరూ, కళ్యాణి మాధవిని వెంటబెట్టుకొని వరండాలోకి వచ్చారు.
"థాంక్యు ప్రొఫెసర్! బై! బై! అంటీ.!" అంటూ మాధవి కారెక్కి సాగర్ పక్కన కూర్చున్నది.
"చూడబ్బాయ్! ఆ అమ్మాయికి ఏ జబ్బూ లేదు. సుబ్బరంగా పెళ్ళి చేసుకో" కల్యాణి సాగిపోతున్న కారులోకి తొంగిచూసి అన్నది.
ఏదో ఘనమైన సలహా ఇచ్చిన దానిలా ముఖం పెట్టి భర్త కేసి చూసింది కళ్యాణి.
"మంచి సలహా ఇచ్చావు కళ్యాణి" అన్నాడు భర్త.
'అందుకే అన్నారు, పెళ్ళయితే పిచ్చి కుదురుతుందని" భర్త నిజంగానే తనను పోగినట్టను కొన్నది కళ్యాణి.
"మరి నువ్వు నీకు పెళ్ళయ్యాక పిచ్చి పట్టిందంటున్నావుగా?"
"సంతోషించాం! సంబడం! అందరూ నీలాంటి వాళ్ళు కాదు!"
"కరెక్ట్! రకరకాల మనస్తత్వాలు కల మనుషులుంటారు."
'అందుకే కదా! మనషి కో పిచ్చి మహిలో సుమతీ! అన్నారు."
"అది సుమతీ శతకకారుడన్నాడా?"
"ఏ శతక కారుడో నాకేం తెలుసు. మూతి తిప్పి చర చరా లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి.
ప్రొఫెసర్ చంద్ర శేఖరం కళ్ళజోడు తీసి తుడుచుకొంటూ వరండా మెట్ల మీద అలాగే నిలబడి పోయాడు.
11
ప్రొఫెసర్ చంద్ర శేఖరం రాత్రి తొమ్మిది గంటలయినా లాబ్ లో నుంచి బయటికి రాలేదు. భార్య కళ్యాణి చూసి చూసి విసుగు పుట్టి భోజనానికి కూర్చుంది. టేప్స్, గ్రాప్స్ అన్నీ పరిశీలించి నోట్స్ రాసుకొన్నాడు. మాధవి కేస్ షీట్ తీసి అందులో కొన్ని వివరాలు చదివి నోట్స్ తో కంపేర్ చేసుకొన్నాడు. విన్న టేప్ మళ్ళీ విన్నాడు. చూసిన గ్రాఫే మళ్ళీ చూసాడు. బాగా పొద్దు పోయేదాకా లాబ్ లో మాధవి కేస్ స్టడీ చేసి అలసిపోయి వచ్చి పడుకొన్నాడు. కాని ఆలోచనలు ఆగడం లేదు. ఆలోచిస్తూ పడుకొన్నాడు. ఎప్పుడు నిద్రపోయాడో అతనికే తెలియదు.
తెల్లవారి లేస్తూనే ప్రొఫెసర్ చంద్ర శేఖరం సాగర్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు.
ప్రొఫెసర్ త్వరగా స్నానం చేసి, కాఫీ తాగి, సాగర్ కోసం ఎదురు చూస్తూ స్టడీ లో కూర్చొని ఉన్నాడు.
"హలో సాగర్! కమాన్ ఇన్ ! నాకు ఇంకా గంటన్నర టైం వుంది ఏర్ పోర్టుకు వెళ్ళడానికి. రాత్రంతా స్టడీ చేసి రిపోర్టు తయారుచేసాను. ఆ సంగతి వెళ్లేముందు చెప్పి పోదామని నిన్ను పిలిచాను." లోపలకు వచ్చిన సాగర్ కు కుర్చీ చూపిస్తూ చెప్పాడు ప్రొఫెసర్.
"థాంక్యు!" సాగర్ ఎదురుగా కూర్చున్నాడు.
సాగర్ ను ఎగాదిగా చూసి "వాట్ హేపెండ్? ఏమయింది సాగర్ అలా వున్నావు?" ప్రొఫెసర్ అడిగాడు.
"ప్రొఫెసర్ ఏం చెప్పమంటారు?" బాధగా అన్నాడు సాగర్.
"ఏమైంది? మాధవి కులాసాగా వుందా? ఎనీ అబ్ నార్మలిటీ?"
"మాధవి బాగానే వున్నది. నధింగ్ రాంగ్ విత్ హర్! మా తల్లి గారి ఆరోగ్యం బాగాలేదు. ఆమె నన్ను వదిలి ఒక్క క్షణం ఉండ లేకపోతున్నది. ఆమెకు ఇక బ్రతకదని తెలిసిపోయింది. డాక్టర్ మూర్తి గారూ రాత్రంతా మా ఇంట్లోనే ఉన్నారు. మూడు గంటలకో సారి ఇంజక్షన్ ఇస్తున్నారు"
"ఐ యామ్ సారీ సాగర్!" చంద్ర శేఖరం సానుభూతి చూపించాడు.
"మాధవి మానసిక స్థితి గురించి నేనొక అభిప్రాయానికి కొచ్చాను. అన్ని కొణాల నుంచి విశ్లేషించి ఈ నిర్ణయాని కొచ్చాను!" ప్రొఫెసర్ గంభీరంగా మొదలు పెట్టాడు.
సాగర్ కుర్చీలో సర్దుకు కూర్చుని శ్రద్దగా వినసాగాడు.
