Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 25

 

    "అది తెలుసుకోకూడని విషయమేమీ కాదులే..... పాపం సీతాపతి ఏమైపోయాడో కనిపించడం లేదట.....ఆ విషయమే లలిత పోలీస్ కంప్లయింట్ చేసింది. అందుకే ఏదో శవం విజయవాడ రైల్వేస్టేషన్లో దొరికితే ఎంక్వయిరీ కోసం రైల్వే పోలీసులు వచ్చారు. అందులో విశేషం ఏం వుంది?" సునీల్ మాములుగా చెప్పాడు.
    'అలాగా.....నా భర్త నన్ను వదిలేసి పోయాడు అన్న సంగతీ నీకు తెలుసు కదా... నువ్వు పెద్ద పోటుగాడివనే కదా నీ కౌగిట్లోకి వచ్చింది. అలాంటి నన్ను ఆ లలిత అన్యాయంగా వెళ్ళగొట్టింది. అందుకే నీ కోసం వచ్చాను"
    "ఎందుకు?"
    "ఎందుకేమిటి..... అందుకే .... నీతో కలిసి పడక సుఖాన్ని పంచుకోడానికి" ఎలాంటి సిగ్గు లేకుండా సూటిగా అడిగింది రమణి.
    "నేను బిజీగా వున్నాను ఇంకోకరిని చూసుకోవడం మంచిది."
    "నువ్వు వుండగా నాకు ఇంకొకరితో ఏం పని?"
    "వీలు పడదు అని చెబుతున్నాను కదా?" విసుగ్గా అన్నాడు సునీల్.
    "వీలుపడదా ... మోజు తీరిందా?" సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది.
    "నువ్వు ఎలా అనుకున్నా సరే..... ఇకనుంచి నేను ఆ జీవితానికి స్వస్తి చెప్పి పవిత్రంగా బ్రతకాలను కుంటున్నాను."
    రమణి పగలబడి నవ్వింది.
    "పవిత్రంగానా ..... ఇప్పటికి ఎందరితో కులికి  మైలపడ్డావో గుర్తులేదా? నీలో ఇంకా ఏ పవిత్రత ఎక్కడ వుంది?"
    "షటప్"
    "అల్ రైట్ .....అంతవరకూ వచ్చాక నీ కాళ్ళ మీద పడి ప్రాధేయ పడవలసిన పనిలేదు..... నేనేం చేయాలో నాకు తెలుసు. ఇటునుంచి ఇటే పోలీస్ స్టేషన్ కు వెళతాను.... వెళ్ళి...." చెప్పడం అపిందామే.
    "ఊ ..... వెళ్ళి .... ఏం చేస్తావు?"
    "ఈ ప్రశ్న మాత్రం నువ్వే వేస్తావని ఊహించాను. మీ ఇద్దరి మీద అనుమానం కలిగేలా పోలీసులకు చెబుతాను. మీ అక్రమ సంబంధం తెలిశాక నా మాటలు నమ్మకుండా వుండరు. మాకు ఏం తెలియదు బాబోయ్ అన్నా పోలీసులు వినిపించుకోరు. మిమ్మల్ని అరెస్టు చేయడం ఖాయం." రమణి విలాసంగా చెప్పింది.
    "బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్నమాట......నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో! నేనేం బెదరను."
    "సునీల్ ఇంకొక విషయం చెప్పడం మరచిపోయాను. నువ్వు ప్లే బోయ్ వని కూడా చెప్పవలసి వుంటుంది. సమాజంలో ఘరానా పెద్ద మనుషులుగా బ్రతికే ఎందరో ఇల్లాళ్ళకు పడక సుఖాన్ని ఇచ్చే ప్లే బాయ్ వి నువ్వేనని తెలిస్తే పోలీసులు చట్టపరంగా నీమీద చర్య తీసుకోవడమే కాకుండా సంసారాలు కూలిపోయిన వాళ్ళు కడుపు మంటతో నీ అంతు చూస్తారు...."
    'యూ బ్లడీ .....షట్ యువర్ మౌత్...."
    "అపు ...తిట్టడం కాదు .....నాకు కావలసింది ఏమిటో నీకు తెలుసు.... అది చెయ్యి చాలు .....నువ్వు అన్నట్టే నోరు మూసుకుని వెళ్ళిపోతాను."
    "కామ పిశాచి ..... ఇప్పుడు కాదంటే వినిపించుకోవే!"
    "నో .... నో .....అదేం కుదరదు..... నేను ఎప్పుడు వచ్చినా కుదరదు అని తిప్పి పంపకుండా నాకు సుఖాని ఇచ్చి పంపవలసి వుంటుంది. లేదంటే నాకు తెలిసిన రహస్యాన్ని చెప్పవలసిన వాళ్ళ వద్ద నోరు విప్పుతాను.... కమాన్ ప్లే బోయ్" అంటూ అతనిని గదిలోకి లాగి తలుపులు వేసింది రమణి.
    పడక గదిలో జీరో బల్బు కాంతి పరచుకున్నది.
    ఆమె అతనినిని బెడ్ మీదకు త్రోసింది.
    సునీల్ నిరుత్తరుడై పోయాడు.
    జీవితంలో తను కనీ వినీ ఎరుగని చర్యను తను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు.
    ఇప్పుడు అతనికి ఆమె మీద మోజు కన్నా కసి పెరిగింది.
    ఆవేశంగా ఆమెను కౌగలిలో బిగించాడు.
    "ఒకే డియర్.....నువ్వు నాకు కావాలి"
    అంతే .... కలం బరువుగా గడచిపోయింది.
    నీకేం కాదు అని అభయం ఇస్తున్నట్టు తృప్తిగా వెళ్ళిపోయింది రమణి.
    రెండు ఫర్లాంగుల దూరం వెళ్లిందో లేదో ...ఎదురయిన పబ్లిక్ టెలిఫోన్ బూతులోకి ప్రవేశించి తనకు కావలసిన నంబర్ చెప్పింది.
    ఆపరేటర్ ఎస్.టి.డి . కోడ్ చేసి నెంబరు రింగ్ కావడంతో ఆమె వైపు చూశాడు.
    ప్రక్కనే వున్న అద్దాల గదిలోకి నడిచింది రమణి.
    రెండే రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసింది.
    ఆమె ఫోన్ చేసిన నంబరు వియవాడ రైల్వే పోలీస్ డి.ఎస్. పి. కి.


                                                            *    *    *


    యూనిఫారమ్ లో వున్న ఇన్ స్పెక్టర్ కిరణ్..... ఇన్ స్పెక్టర్ ధీరజలు డాబా గార్డెన్స్ సమీపంలో వున్న ఒక ఇంటి ముందు జీప్ ను ఆపారు.
    ఏ.సి.పి నెంబర్ వన్ ఈ కేసులో ధీరజకు అవసరమయిన సహాయాన్ని అందజేయడానికి ఇన్ స్పెక్టర్ కిరణ్ ను ఎటాచ్ చేశాడు.....
    అందుకే లోకల్ గా అతని అవసరం వుంటుందని భావించి అతనితో కలిసి వచ్చింది ధీరజ.
    "అన్నా నీ కోసం పోలీసులు వస్తున్నారు....." అంటూ బిగ్గరగా కేక పెట్టాడు ఒకడు.
    ఒక అర్ధ నగ్న సుందరిని ముద్దాడుతున్న జానీవాకర్ మత్తు అనుచరుడి మాటలతో దిగిపోయింది.
    "ఏం కోశావ్ రా బద్మాష్....."
    "నిజం అన్నా..... ఇన్ స్పెక్టర్ కిరణ్ .... ఎవరో అడపోలీస్ అధికారితో కలిసి వస్తున్నాడు" అంటూ వగరుస్తూ నిలబడ్డాడు అతను.
    అప్పుడే మరొక అనుచరుడు కింద నుంచి పైకి వచ్చాడు.
    'అన్నా .......మరేం ఫరవాలేదు ..... వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు. ఏదో నీతో మాట్లాడడానికి వచ్చారు" అన్నాడు రెండవవాడు.
    "వద్దన్నా ......వాళ్ళ మాటలు నమ్మవద్దు.... అరెస్ట్ చేస్తారేమో"
    "ఛీ పొండిరా పిరికి సన్నాసుల్లారా .....మనం ఈ మధ్య ఎదోమ్మి లోనూ తలదూర్చలేదు ఎక్కడా ఏ నేరమూ చేయలేదు.. మనం ఎందుకు భయపడాలి. ఏదో మాట్లాడానికి వచ్చిన వాళ్ళను చూసి పిరికిపందల్లా వణికిపోతారు ఎందుకు....." అని కిందకు వెళ్ళాడు జానీవాకర్.
    ధీరజ అతనిని నిశితంగా చూసింది.
    "నమస్తే ఇన్ స్పెక్టర్ సాబ్ ......ఏదయినా పని వుంటే కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా.....మీరు రావదమెందుకు ' అంటూనే ఇన్ స్పెక్టర్ ధీరజ వైపు అనుమానంగా చూశాడు జానీవాకర్.
    "అది సరే కానీ .......జాన్ ఒకటవ తేదీ ఎక్కడ వున్నావు నువ్వు?"
    ఒకే ఒక నిమిషంలో ఆలోచించాడు అతను.
    "తిరుపతిలో జరిగిన ఒక రాజకీయనాయకుని కుమార్తె పెళ్ళికి వెళ్ళాను. మూడవ తేదీ వరకు అక్కడే వున్నాను. ఆరోజు ఆ పెళ్ళికి చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. వాళ్ళలో ఏ ఒక్కరిని అడిగినా నేను ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అక్కడే వున్నానని చెబుతారు, అయినా ఆరోజు నేను ఎక్కడ వుంటే మాత్రం మీకు ఎందుకు?"
    "కావాలి మిస్టర్.....ఎందుకంటె నీ ప్రియురాలు లలిత భర్త సీతాపతిని ఆరోజు నువ్వు దారుణంగా హత్య చేశావు కాబట్టి ........అంతేకాదు సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్త పడ్డావు " ధీరజ కోపంగా అన్నది.
    "ఇదిగో చూడండి ఇన్ స్పెక్టరమ్మా .....మీరు ఎక్కడ పనిచేసేది నాకు తెలియదు కానీ .......నా గురించి మా ఇన్ స్పెక్టర్ కిరణ్ గారికి బాగా తెలుసు. రౌడీయిజం చేయడమే తెలుసు తప్ప హత్య చేయడం నా వృత్తి కాదు. మీరు చెప్పే లలిత నాకు తెలుసు. అయితే మీరు అన్నట్టు ఆమెకు నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. అమెనాతో చాలా కలివిడిగా తిరిగేది. నా రౌడీతనం ఎలాంటిదో సీతాపతికి తెలుసు. ఆమెను పొందాలంటే అతనిని చంపవలసిన అవసరం లేదు నేనేంటే గజగజలాడిపోతూ నేను ఉన్నంత వరకూ  ఇంటి చాయలకు రావాలంటేనే సీతాపతి భయపడిపోయేవాడు అలాంటి వాడిని నేనెందుకు చంపుతాను......" ఆవేశంగా అన్నాడు జానీ వాకర్.
    "నువ్వు చెప్పేది పచ్చి అబద్దం. అతనిని శాశ్వతంగా అడ్డు తొలగించు కుంటే లలితను శాశ్వతంగా నీదే అవుతుందని కుట్ర పన్నావు అందుకే అతన్ని హత్య చేశావు."
    ధీరజ కరుగ్గా అన్నది.
    "మీరు చెప్పే రీజనింగ్ మీకు చాలా బాగుండవచ్చు. లలిత నాకు స్వంతం కావాలంటే అతన్ని చంపనవసరం లేదు. కావాలంటే అతని ఎదురుగానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నా ఏమీ చేయలేని అసమర్ధుడు . అలాంటి వాడిని చంపి ఆ నేరాన్ని నా నెత్తిన వేసుకొనేటంత తెలివితక్కువ వాడిని కాదు. అసలు అతనిని చంపినవాడు ఎవడో.....ఎందుకు చంపాడో తెలుసుకోలేక ఆ హత్య నేరాన్ని అన్యాయంగా నా నెత్తిన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS