Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 26


    "ఎవరు బాబూ నువ్వు?" ఆర్ద్రకంఠంతో ప్రశ్నించింది.


    శరత్ కు తల తిరిగిపోయింది.


    తన తల్లి. తనకు జన్మనిచ్చిన తల్లి. "ఎవరు బాబూ నువ్వు అంటున్నది."


    తనేం సమాధానం చెప్పాలి?


    "ఎవరు బాబూ?" మళ్ళీ అదే ప్రశ్న.


    "అమ్మా నేను. నేనమ్మా! నన్ను గుర్తు పట్టలేదా?" అనేకసార్లు అన్నాడు శరత్.


    ఆమె వెర్రిచూపులు చూసింది.


    "నేనమ్మా! నీ కొడుకుని. నువ్వు కన్న కొడుకుని. నువ్వు పారేసిన బిడ్డను. నువ్వు చేసిన పాపానికి ఫలితాన్ని."


    "బాబూ!" వెర్రిదానిలా పిల్చింది. ఆ పిలుపు బయటికి విన్పించలేదు. పెదవులు మాత్రం కదిలాయి.   


    "అమ్మా!"


    ఆమె నిలువెల్లా వణికిపోయింది.


    "బాబూ!" అంటూ చేతులు చాచింది.


    "సత్యవతమ్మా!"


    చాచిన చేతుల్ని ఒక్కసారిగా వెనక్కు తీసుకుంది.


    గాభరాగా వెనుతిరిగింది.


    "మీ ఆయన పిలుస్తున్నారు. బీరువా తాళాలు కావాలట" ఆయనకు వ్యక్తి చెప్పాడు.


    దూరంగా భర్త తనకేసి రావడం కనిపించి ఆమె గాభరాగా ముందుకు కదిలింది.


    లోపలకు వెళ్తూ ఒక్కసారి వెనక్కు చూసింది.


    పందిట్లో ఓపిక లేనిదానిలా నడుస్తున్న ఆమె ఒక్కసారిగా విరుచుకు పడిపోయింది.


    "అమ్మా!" అంటూ గావుకేక పెట్టాడు శరత్.


                            *    *    *


    "బాబూ! బాబూ!"


    శరత్ కళ్ళు తెరిచాడు.


    సుశీలమ్మ, భుజం పట్టుకుని ఊపుతూ ఆదుర్దాగా ముఖం మీదకు వంగి చూస్తున్నది.


    శరత్ తృళ్ళిపడి లేచాడు.


    "ఏమిట్రా? అమ్మా అంటూ అంత పెద్దకేక పెట్టావ్? నామీద ఏమైనా పీడకల వచ్చిందా? పిచ్చి సన్యాసికి ఎప్పుడూ నా ద్యేసే!" అంది సుశీలమ్మ.     


    శరత్ గతుక్కుమన్నాడు.


    అపరాధిలా తలవంచుకున్నాడు.


    "ఏం కల వచ్చిందిరా!"


    "ఏదో పీడకల! తలనొప్పిగా వుంది. కాఫీ కావాలమ్మా!"


    "ఇప్పుడే చేస్తాను. లేచి పళ్ళు తోముకో" అంటూ సుశీలమ్మ వెళ్ళిపోయింది.


    శరత్ అలా వెళ్ళిపోతున్న సుశీలమ్మకు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు వెనకనుంచి.


    "మళ్ళీ జన్మంటూ వుంటే నీ కడుపున పుట్టాలని మనసారా కోరుకుంటున్నానమ్మా!" మనసులోనే అనుకున్నాడు.  


    తను చూసిన మూడు దృశ్యాలూ పూర్తిగా కలలు అనటానికి లేదు. తన ఊహా చిత్రాలు మాత్రమే!


    శరత్ కాఫీ తాగుతున్నాడు.


    సుశీలమ్మ కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూసింది.


    "కళ్ళు ఎర్రగా వున్నాయ్, రాత్రంతా నిద్రపట్టలేదా," అన్నది.


    "బాగానే నిద్రపోయాను" అంటూ ఖాళీ కాఫీ గ్లాసు టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుంచి తప్పుకున్నాడు.


    స్నానంచేసి బయటికి వెళుతున్న కొడుకుని "ఎక్కడికి రా పొద్దున్నే బయలు దేరావ్?" అని అడిగింది సుశీలమ్మ.    


    సుశీలమ్మ గుండెల్లో భయం గూడు కట్టుకుంది.


    కొడుకు తనకు కాకుండా పోతాడనే తపన వుంది.


    "కొంచెం పని వుంది!"


    తల్లి ముఖంలోకి చూడకుండానే సమాధానం చెప్పాడు.


    "టిఫిన్ చేసి పోరాదూ? రాత్రి కూడా భోజనం సరిగా చేయలేదు."


    "త్వరగా వెళ్ళాలి. బయట చేస్తాలే."


    "భోజనానికి వస్తావా?"


    "చెప్పలేను. నా కొరకు ఎదురుచూడకు" అంటూ గబగబా మెట్లు దిగాడు శరత్.


                                                                  8


    శరత్ వెళ్ళగానే శక్తిలేనట్టు కుర్చీలో కూలబడింది సుశీలమ్మ దుఃఖం పొంగి వస్తూ వుంది.


    రెండు రోజులుగా ఆమెకు అన్నం, నిద్రాలేదు. భయం పట్టుకుంది. ఎంత మనసును సరిపెట్టుకోవాలన్నా సాధ్యంకావడంలేదు. శరత్ ప్రవర్తన చూస్తుంటే దూరం అయిపోతాడేమోననే బాధ గుండెలు పిండేస్తూ వుంది. హృదయం మొండి కత్తిలా కోస్తూ వుంది.


    భర్తతో ముభావంగా వుంది. అతనితో మాట్లాడితే దుఃఖం వస్తుందేమోనని ఆమె భయం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS