Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 27


    రామనాథం భార్యను తప్పుకు తిరుగుతున్నాడు. అపరాధం చేసినట్టు బాధపడుతున్నాడు. శరత్ తనతో మాట్లాడి వెళ్ళినప్పటి నుంచీ రామనాథం మనసు మరీ వికలం అయింది. శరత్ యిల్లు విడిచి వెళ్ళిపోతానంటాడనే భయం కూడా పట్టుకుంది.


    రామనాథం స్నానం చేసి, బట్టలు వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చాడు.


    టేబుల్ మీద పాత్రలూ ప్లేట్లూ పెట్టి వున్నాయి.


    రామనాథం భార్య పక్క కుర్చీలో కూర్చున్నాడు ఆమె గమనించే స్థితిలో లేదు!


    రామనాథం భార్య ముఖంలోకి చూశాడు.


    ఆమె కళ్ళవెంట నీరు ధారగా కారుతూ చెంపల్ని తడుపుతూ గుండెల మీద బొట్లు బొట్లుగా పడుతూ వుంది.


    రామనాథం భార్యకేసి అసహాయంగా చూస్తూ వుండిపోయాడు.


    కొంతసేపటికి భర్త ప్రక్కన కూర్చున్నట్టు గమనించిన సుశీలమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది.


    "ఏడుస్తున్నావా సుశీలా?" అంతకంటే ఏమనాలో తోచని వాడిలా అన్నాడు.


    "లేదు...." అన్నది! కాని అంతలోనే భోరున ఏడవసాగింది. ఆనకట్ట తెగింది. ఆ ప్రవాహాన్ని ఆపే శక్తిలేనివాడు చూసినట్టు, రామనాథం భార్యకేసి జంకుగా, జాలిగా, బాధగా చూశాడు.


    "ఊర్కో! ఎందుకు అంతగా ఏడుస్తావ్?" చేతులు పట్టుకొని అనునయంగా అన్నాడు.


    భర్త చేతుల్లో ముఖం దాచుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది.


    "ఊర్కో సుశీలా! ఇప్పుడేమయిందని? అందరం బాగానే ఉన్నాంగా!"


    అంత దుఃఖంలో చివ్వున తలెత్తి భర్త ముఖంలోకి చురుకుగా చూసింది.

 

    ఆమె చూపుల్ని ఎదుర్కోలేనట్టు కళ్ళు కిందకు వాల్చుకున్నాడు రామనాథం.


    "ఇంకా ఏం జరగాలి? సర్వనాశనం అయింది. ఇరవై ఏళ్ళ సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యం బట్టబయలు అయింది వాడంతా విన్నాడు."


    ఆమె మాట్లాడలేదు. కళ్ళ వెంట నీరు కారిపోతూనే వుంది.


    "నేను పరాయివాణ్ణిగా చూశానా నువ్వే చెప్పు? నాకు మాత్రం బాధగా లేదా?" రామనాథం కంఠం వణికింది.


    "అంతా నా ఖర్మ!" అన్నది సుశీలమ్మ.


    "నన్ను క్షమించలేవా?"


    "తప్పంతా నాదే వాడి పెళ్ళి విషయం వింటే మీకు కోపం వస్తుందని, వాడు ఇంట్లో వుండగా ఆ విషయం మీతో చెప్పాను అంటూ కళ్ళు తుడుచుకుంది."


    "వాడు నీతో ఏమయినా అన్నాడా?"


    "ఇంకా ఏమనాలి? నిన్న పొద్దుట మిమ్మల్ని "మీరు" అంటూ సంబోధించాడు. అలా ఎప్పడయినా అన్నాడా?"  


    రామనాథం మాట్లాడలేదు.


    "నిన్న వాడి పుట్టినరోజని పాయసం చేశానా? వాడు నా పుట్టినరోజు నీకెలా తెలుసు అన్నాడు. ఎంతమాట అన్నాడో చూశారా? వాడి పుట్టినరోజు నాకు తెలియదట. వాడు నా ఒళ్ళోకి వచ్చినరోజే నాకన్నబిడ్డనుకున్నా నండీ! ఇరవై రెండేళ్ళ తర్వాత నాతో అంతమాట అన్నాడు. ఏడుస్తూనే అన్నది సుశీలమ్మ.   


    రామనాథం మౌనంగా వుండిపోయాడు.


    "నిన్న మధ్యాహ్నం ఏమన్నాడో తెలుసా?"


    "ఏమన్నాడు?"


    "ఎలా చెప్పనండీ?" మళ్ళీ భోరుమంది సుశీలమ్మ.


    రామనాథానికి ఎలా ఓదార్చాలో తెలియక భార్య ముఖంలోకి పిచ్చివాడిలా చూస్తూ వుండిపోయాడు.  


    "కన్నా అని పిలిస్తే తనను అలా పిలవద్దన్నాడు."


    రామనాథం భార్య ముఖంలోకి జాలిగా చూశాడు.


    "కన్నా అంటే వాడికి కర్ణా అన్నట్టు విన్పిస్తుందట. అంటే ఏమిటండీ?"     


    రామనాథం జవాబివ్వలేకపోయాడు. తలదించుకొని ఆలోచనలో పడ్డాడు.


    అంటే కర్ణుడిలా తనను కూడా తల్లి కనిపారేస్తే నేను పెంచినట్టు అర్థమేగా."     


    "సుశీలా మనం తప్పుచేశామేమో!"


    "అంటే? వాణ్ని పెంచడమా?"


    "కాదు"


    "మరి?"


    "మనం వాడికి వాడి జన్మరహస్యం ఇంతకాలం తెలియకుండా పెంచడమే మనం చేసిన తప్పు."


    సుశీలమ్మ భర్తముఖంలోకి బెదురుగా చూసింది.


    "వాడు పెంచిన బిడ్డకాడు. నా బిడ్డే! నా బిడ్డే!" పిచ్చిదానిలా తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నది.


    అది నిజమే. నువ్వు అలాగే పెంచావ్. అదికాదు నేను అనేది" అని ఆగి భార్య ముఖంలోకి చూశాడు.


    సుశీలమ్మ దిగాలు పడిపోతూ కూర్చుంది.


    "వాడికి చిన్నప్పుడే అనాధ అని తెలిస్తే ఈరోజు ఇంత బాధపడే వాడుకాదు. ఇరవై రెండు ఏళ్ళు నిండినవాడు. అంతవరకూ తమ తల్లిదండ్రులని భావిస్తున్న వాళ్ళు తనను కన్నవాళ్ళు కారని తెలిస్తే వాడు ఎలా మానసికంగా తలక్రిందులై పోతాడో నువ్వు ఊహించలేవు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS