మంగళవాయిద్యాల ధ్వనులు ఒక్కసారిగా మిన్నుముట్టాయి.
మంగళసూత్రధారణ జరుగుతూ వుంది.
అందరూ అక్షింతలు వధూవరులమీద చల్లారు.
శరత్ కూడా చల్లాడు.
అతను.... తన తండ్రి కాడు.... రాము తండ్రి.... అంటే తన తమ్ముడి తండ్రి అందర్నీ భోజనాలకు వుండమని చెప్తున్నాడు.
అందులో ఒక యువకుడ్ని చూసి శరత్ కు విస్మయం కలిగింది.
అచ్చం తనలాగే వున్నాడు. తన తమ్ముడా?
"ఓరేయ్! తాపీగా గుంజకు చేరబడి నిల్చున్నావేంరా? చెల్లెలు వెళ్ళిపోతున్నదని దిగులా?
శరత్ దిగ్గున తలతిప్పి చూశాడు.
శరత్ ముఖంలోకి ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి "మామేనల్లుడు అనుకున్నాను. ఏమీ అనుకోకండీ." అంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
ఇతను తన మేనమామా?
తనను చూసి ఆ పందిట్లో తిరిగే యువకుడు.... అదే.... తన తమ్ముడు అనుకున్నాడు.
ఆ యువకుడు అందరి చేతుల్లో అక్షింతలు పెడుతూ శరత్ దగ్గరకు వచ్చాడు.
శరత్ చేతిలో అక్షింతలు పెడుతూ విస్మయంగా చూశాడు. చూస్తూ నిల్చుండిపోయాడు.
శరత్ లో ఉద్రేకం కట్టలు తెంచుకుంది.
"తమ్ముడూ!" అనాలనుకున్నాడు.
పెదవులు కదల్లేదు.
గొంతు పెగల్లేదు.
రామూ అంటూ యెవరో పిలవడంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అందరూ లేస్తున్నారు.
వధూవరులు పీటలమీద నుంచి లేచి లోపలకు వెళ్ళారు.
శరత్ ఆడవాళ్ళ మధ్యలో నిల్చుని నవ్వుతూ కబుర్లు చెబుతున్న తల్లిని చూశాడు.
ఆమె నవ్వుతూ వుంది. ఆనందంగా వుంది.
ఆమెకు తన జన్మ గుర్తు లేదా?
తనను పూర్తిగా మర్చిపోయిందా?
ఇటువంటి ఆనందకరమైన క్షణాల్లో నైనా తను జ్ఞాపకం రాడా?
పీటలమీద కూర్చున్నప్పుడు ఆమె విచారంగా కన్పించింది. తనను గుర్తుచేసుకొని వుంటుంది.
నా బాబు ఎక్కడ వున్నాడో! ఎలా వున్నాడో? బతికున్నాడా ఉంటే సుఖంగా వున్నాడా? పెళ్ళయిందా? ఎవరిపోలికో అని ఆలోచించుకొంటూ వుండి వుండాలి.
తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది.
ఏమిటి తన పిచ్చి! ఆమె తనను ఏనాడో మర్చిపోయి వుంటుంది. ఆడపిల్లకు పెళ్ళి చేస్తూ ఏ తల్లి బాధపడదు? పరాయి పిల్ల అయిపోతుందని బెంగ వుంటుంది.
అంతే అయి వుండాలి. ఆ విచారానికి కారణం అదే అయి వుండాలి.
అలా అనుకుంటే శరత్ కు ఏదో బాధగా వుంది.
అందరూ భోజనాలకు కూర్చుంటున్నారు.
ఎవరో వచ్చి శరత్ ను కూడా కూర్చోమన్నారు.
శరత్ చిన్నగా బయటికి తప్పుకున్నాడు.
వీధి వాకిలి ముందు ఓ ముసలివాడు గొంగళి కప్పుకొని కూర్చుని వున్నాడు.
అతని పక్కగా పొడవాటి కర్ర వుంది.
ఎదురుగా జర్మన్ సిల్వర్ గిన్నె వుంది.
"ఎవరు తాతా నువ్వు?" అంటూ శరత్ అతనితో బాతాఖానీకి దిగాడు.
ఇంతలో ఎవరో వచ్చిన అలికిడై వెనక్కు తిరిగాడు శరత్.
శరత్ తల్లి. దగ్గరగా ఆమెను చూస్తుంటే గుండెలు తమాషా శబ్దం చేస్తున్నాయి.
"ఇదిగో తాతా! గిన్నె పట్టు!" ఆమె గిన్నెలో అన్నం, కూరలూ, లడ్లూ వేసింది.
"వెయ్యేళ్ళు వర్థిల్లు తల్లీ!" అన్నాడు వృద్ధుడు.
"తాతా! అల్లుణ్ణి చూశావా?"
"లేదు తల్లీ."
"రేప్పొద్దున్నే రా చూద్దువుగాని."
"అలాగేనమ్మా!" అంటూ మోకాళ్ళను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కర్రతీసుకుని చిన్నగా వంగి నిల్చున్నాడు.
ఆమె వంగి గిన్నెతీసి తాతకు అందించింది.
"జాగ్రత్త తాతా! చీకటిగా వుంది" అంటూ వెనక్కు తిరగబోయి కొంచెం దూరంలో నిల్చుని వున్న శరత్ ను చూసింది.
"ఎవరు బాబూ! ఇక్కడ నిల్చున్నావేం? భోజనం చేశావా?"
"ఆఁ! ఎన్నడూ చెయ్యనంత సంతృప్తిగా చేశాను" శరత్ కంఠం సన్నగా వణికింది.
రెండడుగులు ముందుకు వేశాడు.
వెలుతురు ముఖంమీద పడింది.
ఆమె ఉలిక్కిపడింది.
కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూనే స్థాణువులా నిలబడిపోయింది.
"అమ్మా!" ఆవేశంగా అన్నాడు శరత్.
