వేంకటాచలపతిలో కదలిక కలిగింది, మాట్లాడాడు.
"అమ్మా! జీవులందరూ సోదరులే. కాని నీవు మాత్రం నాకు సోదరివి కావు. తల్లివి. సాక్షాత్ జగన్మాతవు, మా కుల దైవం చౌడీశ్వరీ దేవియే నీ రూపంలో దర్శనమిచ్చింది. నేనేకాదు మా వంశీయులు ఇటు ఏడుతరాలు, అటు ఏడుతరాలు ధన్యులు."
ఈ మాటలంటున్న వేంకటాచలపతి ముఖం తన ప్రాణ స్నేహితుడి ముఖంలాగా తోచింది.
"మిత్రమా! జగన్మాతని దర్శించటానికెంతపుణ్యం చేసుకుని ఉండాలి?" అంది.
"నిజమే మనం మిత్రులమే. వివాహమైన క్షణం నుండి నువ్వు, నీ జ్ఞాపకాలు నా హృదయంలో పదిలంగా ఉండి నన్ను నడిపించాయి. ఆ క్షణం నుండి నీవు నాకు సహచరిగా, మార్గదర్శిగా ఉన్నావు. మనం లౌకిక జీవితంలోకాక, ఆధ్యాత్మిక మార్గంలో సహచరులం. ఈ సాహచర్యానికి భౌతికమైన సామీప్యం అవసరం లేదు. గురువూ, దైవం అయిన సహచరివి. సెలవిప్పించు" అంటూ చేతులు జోడించి తలుపులు తీసుకుని గదిబయటికి వెళ్ళిపోయాడు.
వెంకమాంబ 'దైవలీల' అనుకుని తన మిత్రుడికోసం తలెత్తి చూసింది
* * *
మర్నాడే వేంకటాచలపతి కుటుంబం నారగుంటపాళెం వెళ్ళిపోయారు. "మూడు నిద్దర్లు కాకుండానా?" అన్నవారికి అబ్బాయికి ఒంట్లో నలతగా ఉందని చెప్పారు. తమ గ్రామం చేరగానే వేంకటాచలపతి తల్లిదండ్రులతో చెప్పాడు.
"నాకు ఈ సంసారంపై విరక్తి కలిగింది. చౌడేశ్వరీదేవి నన్ను కాశీరమ్మని ఆజ్ఞాపించింది. గురూపదేశం కూడా ప్రసాదించింది. నా గురించి మీరెవ్వరూ బాధపడనవసరం లేదు. మోక్షమార్గంలో ప్రయాణం చెయ్యటానికి అనుమతించండి."
"శోభనపు పెళ్ళికొడుకువి. ఇంకా భార్యని కాపురానికైనా తీసుకురాలేదు. అభంశుభం తెలియని ఆ పిల్లని క్షోభ పెట్టటం న్యాయం కాదు" అంది తల్లి.
"విరాగియై పోవాలంటే భార్య అనుమతి ఉండాలని తెలుసా?" తండ్రి కొంచెం భయపెట్టబోయాడు.
"ఆ సాధ్వి అనుమతి లభించినతర్వాతే మిమ్మల్ని అడుగుతున్నాను."
"అందరూ అంటున్నా మనం వినలేదు. ఆ పిల్లే వీడిని ఏదో చేసింది. అందుకే ఇల్లు వదలి వెడుతున్నాడు" వెనుకనించి దూరపుబంధువు ఒకావిడ కొంపలు మునిగిపోయినట్టు ఏడుపుగొంతుతో రాగం తీసింది.
"ఊరుకోండి మామ్మగారూ! ఆ మహానుభావురాలు మన ఇంట్లో, వంశంలో అడుగుపెట్టటం వల్ల మన వంశం ధన్యమయింది. ఆ ఉత్తమురాలిని ఏమైనా అంటే పాపం!" వేంకటాచలపతి నిశ్చలంగా చెప్పాడు.
"నిజమే! ఆ అమ్మాయిని చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. ముఖంలో దేవతాకళ ఉట్టిపడుతుంది. లోపం మన బంగారానిది" వేంకటాచలపతి తల్లి దిగులుగా అంది.
"అందరినీ తన మాయలో ముంచిందన్నమాట" అని సణుగుతూ వెళ్ళిపోయిందావిడ.
చేసేదిలేక తల్లితండ్రులు "సరే"నంటే వేంకటాచలపతి కాశీ వెళ్ళిపోయాడు.
* * *
వేంకటాచలపతి ఇల్లువదలి వెళ్ళిపోయాడన్న వార్త తరిగొండలో గుప్పుమంది. మూడునిద్దర్లు పూర్తికాకుండా వరుడు వెళ్ళిపోయినందుకే చెవులు కొరుక్కున్న వాళ్ళకిప్పుడు బాహాటంగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. కాని సోమయాజికి పచ్చివెలక్కాయ గొంతులో అడ్డుపడినట్లయింది. వెంకమ్మ ఊరొదిలి వెళ్ళిపోతుందనుకుంటే ఇప్పుడసలు కదిలేట్లే లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు.
సోమిదమ్మ నీలాటి రేవుకి రోజుకన్నా ముందుగా చేరింది. వచ్చినవాళ్ళందరినీ చుట్టూ చేర్చుకుని అందరూ వచ్చేదాకా పిచ్చాపాటి మాట్లాడుతూ గడిపింది. అందరూ వచ్చారనుకున్నాక,
"ఈ సంగతి తెలుసా? పాపం! కృష్ణయ్య అల్లుడి సంగతి."
"ఏమయ్యింది?" అయిదారుగురు ఒకేసారి అడిగారు తెలిసినా తెలియనట్టు
"చచ్చిపోయాడు. పాపం!" జాలిగా ముఖం పెట్టి అంది.
"కాశీకి పోయాడన్నారుగా!" రామక్క అడిగింది.
"బైరాగుల్లో కలిశాడుటగా! మన దెయ్యప్పిలని చూసి దడుసుకుని" లక్షిందేవి ఏదో కొత్తవిషయం కనిపెట్టినట్టు చెప్పింది.
"అయినా,ఈ పిల్లసంసారం చేస్తుందని ఎవరనుకున్నాం?" భ్రమరాంబ మూతి విరిచింది.
"అతణ్ణి ఏదో భయపెట్టే ఉంటుంది. లేకపోతే మంత్రమేమయినా వేసి ఉంటుంది" బుచ్చిలక్ష్మి ముందుకొచ్చి మరీ అంది.
"అసలు సంగతి నే చెపుతా వినండి" అంది సోమిదమ్మ. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏంకొత్తవిషయం చెపుతుందోనని.
"ఆ రోజు రాత్రి ఆ మాయలాడిని గదిలోకి పంపి మనమంతా వెనక్కి వచ్చామా?... ... ..." ఆగింది సోమిదమ్మ. గాలికూడా కదలటం లేదా అనేంతటి నిశ్శబ్దం.
"గదిలోకి అడుగ పెడుతూనే, పాపం! ఆ కుర్రాడిని 'పాపీ! మూఢా' అంటూ పిలిచిందట. ఆ వెర్రిబాగులవాడు కంగారు పడిపోయాట్ట. 'నన్ను స్పృశించినట్లైతే నీ తల వెయ్యిముక్కలవుతుంది జాగ్రత్త!' అని హెచ్చరించిందిట." 'నావంక కన్నెత్తి చూస్తే భస్మం అవుతావు జాగ్రత్త!' అని భయపెట్టిందిట. తలెత్తిచూస్తే కాళికాదేవిలాగా నాలిక బయటపెట్టి భయంకరంగా కనిపించిందిట. వెర్రిచూపులు చూస్తున్న అతడిని చూసి హుంకరించిందిట. ఆ హుంకారానికి అతడు వెళ్ళి మన ఊరికి ఆరుమైళ్ళదూరంలో ఉన్న బావిలో పడిచనిపోయాడుట. పాపం!"
అందరూ ఊపిరి ఉగ్గబట్టి మరీ విన్నారు. అందరి కళ్ళముందూ ఆ దృశ్యాలు కదలాడుతున్నాయి. పరిసరాలు కనపడటం లేదు.
"ఇవన్నీ ఎవరు చూశార'ట'? శోభనం గదిలో సంగతులు దొంగతనంగా ఎవరు చూశారు'ట'? చూసినవాళ్ళు ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు'ట?" నాంచారమ్మ ప్రశ్నలకి వెనక్కి చూసినవాళ్ళు ఆలోచనలో పడ్డారు. నిజమే కదా ఆవిడ అన్నమాటలు అని.
"మనకెందుకర్రా ఊళ్లో వాళ్ళ సంగతులు. ఎవరెట్టా పోతే మనకేం?" అంటూ బిందె భుజానపెట్టింది రామక్క.
"నిజంకాదంటావా పిన్నీ!" బుచ్చిలక్ష్మి నాంచారమ్మని అడిగింది.
"తెలియని సంగతులు వదిలెయ్యి! అదీ మంచి పద్ధతి."
"అవునులే!" అంది మూతి ముప్పైవంకర్లు తిప్పి.
* * *
"అవధానీ ఈ సంగతి విన్నావూ?" వెడుతున్న అవధానిని ఆపాడు సోమయాజి.
"ఏ సంగతీ?" గుసగుసగా అడిగాడు అవధాని
"అదే! కృష్ణయ్య అల్లుడి సంగతి."
"సన్నాసుల్లో కలిశాడుటగా. లేకపోతే ఆ దెయ్యంతో ఎవరు కాపురం చేస్తారు?"
