Previous Page Next Page 
ప్రార్థన పేజి 25


    "నేనడుగుతున్నది చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే లింఫోసైటిక్ లుకేమియా గురించికాదు, నా కూతురికి వచ్చిన మైలోబ్లాస్టిక్ లుకేమియా గురించి".

 

    "... ఒక శాతం".

 

    "అంటే నూటికి ఒకరన్న మాట. అదీ ఎంత కాలం? అయిదారు సంవత్సరాలు. రక్తంలో తిరిగి బలం పుంజుకుని మళ్లీ విజృంభిస్తుంది".

 

    మహేంద్ర విసుగ్గా "అయితే ఏం చెయ్యమంటారు? ట్రీట్ మెంట్ మానెయ్యమంటారా?" అని అడిగాడు. వసుమతి చప్పున కదిలి అతడితో ఏదో అనబోయింది. ఈ లోపులో భార్గవే అన్నాడు. "నా కూతరు బ్రతికే ఛాన్సు నూటికి ఒక వంతు మాత్రమే వున్నప్పుడు అందుకోసం ఆ శరీరాన్ని నిప్పుల్లో కాల్చినట్టూ బాధ పెట్టటానికి నేను వప్పుకోను. పోనీ ఇంత చేసినా ఆ తరువాత నా కూతురు ఎంతకాలం బ్రతుకుతుంది? మరో అయిదు సంవత్సరాలు! నా కూతురి జీవితకాలాన్ని అయిదు సంవత్సరాలపాటు పొడిగించటానికి మాత్రమే ఇదంతా చెయ్యవలసి వస్తే దానికి నేను వప్పుకోను..."

 

    మహేంద్ర అతికష్టంమీద తన కోపాన్ని అణచుకుని "మంచిది భార్గవా! ఈ రోజే మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకు వెళ్లిపోవచ్చు" అన్నాడు తాపీగా.

 

    వసుమతి గాలిలా వాళ్ళ మధ్యకు దూసుకొచ్చి, "మీకేమయినా మతిపోయిందా" అని అడిగింది.

 

    "సరీగ్గా ఇదేమాట అయిదు నిమిషాలక్రితం కూడా అన్నావు".

 

    "అంటారు ఒకసారి కాదు- వెయ్యిసార్లు అంటాను. చావు బ్రతుకుల మధ్య నున్న పాపకి మందులు కూడా వాడకుండా వదిలేస్తారా?" హిస్టీరియా వచ్చినదానిలా అడిగింది.

 

    "కానీ కాన్స్ -క్యూర్ పేషెంట్ ని బ్రతికించదు వసుమతీ! చావుని పోస్ట్ పోన్ చేస్తుందంతే".

 

    "చాలు. ఈ లోపులో ఇంకేదయినా మందు కనుక్కోబడవచ్చు".

 

    "అది కూడా కేవలం నూటికి ఒకరిమీదే ఫలిస్తుంది".

 

    "ఆ ఒక్కరూ ప్రార్థనే కావొచ్చు".

 

    "మూర్ఖంగా వాదించకు. కెమోథెరపీ గురించి నీకు తెలీదు. చిత్రహింస అనుభవించాల్సి వస్తుంది".

 

    ఆమె స్వరం హెచ్చించి, "వాదిస్తున్నది మీరు! కన్న కూతుర్ని మందులు వాడకుండా చంపెయ్యటంకన్నా- కష్టమో, నష్టమో, బాధ భరించటమే మంచిది" అన్నది.

 

    అతడు వెంటనే రియాక్టు అయి, "అవును. బాధ భరించటమే మంచిది" అంటూ బిగ్గరగా నవ్వి, "అయిదు సంవత్సరాలపాటూ బాధ భరించటమే మంచిదట- హహ్హహ్హ..." అని సడెన్ గా నవ్వాపి, "ఇదంతా ఇంత సులభంగా నువ్వెలా చెప్పగల్గుతున్నావో తెలుసా?" అని అడిగాడు.

 

    "ఎలా?"

 

    "అనుభవించేది నువ్వుకాదు కాబట్టి! ప్రార్థన నీ కన్నకూతురు కాదు కాబట్టి!! హహ్హా... హహ్హహ్హ.... కన్నకూతురట... కన్నకూతురు" అని తిరిగి పిచ్చిగా నవ్వసాగేడు.

 

    ఆ క్షణం ఆమె తన స్థితి మర్చిపోయింది. తనో సామాన్యమైన స్కూల్ టీచర్ ననీ, అతడో రిసెర్చి స్కాలర్ అనీ, తమ వివాహం అయి ఒకరోజు కూడా కాలేదనీ, అతడు తన భర్త అని మర్చిపోయింది. సాచిపెట్టి అతడి చెంపమీద బలంగా కొట్టింది. కొట్టిన మరుక్షణం తనెంత తప్పుచేసిందో ఆమె తెలుసుకుంది. లోపల్నుంచి దుఃఖం పొంగి పొర్లింది. తనని తాను సముదాయించుకోలేక చేతుల్లో మొహం దాచుకుని కిటికీవైపు తిరిగి భోరున విలపించసాగింది.

 

    ఈ హఠాత్ పరిణామానికి డాక్టర్ మహేంద్ర కూడా స్థాణువయ్యాడు. బయట ఆస్పత్రి సిబ్బంది మాత్రం తన పని తాను చేసుకుపోతూంది. ఇలాటి హృదయ విదారకమైన ఏడుపులు అక్కడ సర్వసామాన్యమే - ఆస్పత్రి కాబట్టి...

 

                                                               *    *    *

 

    శేఖరం బండిని ఇంటిముందు ఆపి లోపలికి ప్రవేశించాడు. లంచ్ అవర్లో ఎవరో చెప్పారు. భార్గవ ఫోన్ చేస్తే వెళ్ళాడని. విషయం ఏమిటో కనుక్కుందామని బయలుదేరాడు.

 

    బహుశా రెండో టాన్సిల్ ఆపరేషన్ గురించి వసుమతి భార్గవకి ఫోన్ చేసి వుంటుందని అనుకున్నాడు. టాన్సిల్స్ గుర్తురాగానే ప్రార్థనకి తాను వాగ్దానం చేసిన ఐస్ క్రీమ్ కూడా గుర్తొచ్చింది. వెళ్తూ వెళ్తూ దార్లో ఐస్ క్రీమ్ కొన్నాడు. అతనికి అన్నిట్లోకి బట్టర్ స్కాచ్ ఇష్టం. దాన్ని ప్యాక్ చేసి బయలుదేరాడు.

 

    ఆస్పత్రి ఆవరణలోకి అతడు ప్రవేశించి బండి ఆపు చెయ్యబోతూంటే వరండాలోంచి వస్తూ భార్గవ కనపడ్డాడు. భార్గవ ఆకారాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. జుట్టంతా చెదిరిపోయి వుంది. మనిషి ఏదో నిద్రలో నడుస్తున్నట్టు వస్తున్నాడు.

 

    శేఖరాన్ని చూసి "నన్ను కాస్త లాబ్ దగ్గిర దింపుతావా" అని అడిగాడు. శేఖరం విస్మయంగా "ఏమిటి విషయం" అన్నాడు.

 

    భార్గవ విసుగ్గా "అది చెప్తేగానీ దింపవా ఏమిటీ" అని అన్నాడు. శేఖరం నొచ్చుకుని, మారు మాట్లాడకుండా అతడి చేతుల్లోంచి తాళాలు తీసుకుని అతడి కారువైపు నడిచాడు. ఇద్దరూ కూర్చున్నాక డ్రైవ్ చెయ్యసాగేడు. భార్గవ నుదుటిమీద చెయ్యి వేసుకుని సీటు వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు. అయిదు నిముషాలు డ్రైవ్ చేసిన తరువాత శేఖరం తిరిగి అడిగాడు. "అసలేమైంది" అని.

 

    భార్గవ కళ్ళు తెరవకుండానే "ప్రార్థనకి కేన్సర్ శేఖరం... అక్యూట్ మైలోబ్లాసిక్ లుకేమియా" అన్నాడు.

 

    కీచుమన్న శబ్దంతో కారు ఆగిపోయింది. వెనుకనుంచి వస్తూన్న స్కూటరిస్టు ఆ వేగానికి తట్టుకోలేక వచ్చి బంపర్ ని ఢీ కొనబోయి అతి కష్టంమీద తప్పించుకుని తిడుతూ వెళ్ళిపోయాడు. శేఖర్ వీటిని పట్టించుకోకుండా భార్గవవైపు తిరిగి "నిజమేనా... మీరు చెపుతున్నది- నిజమేనా" అని అడిగాడు. భార్గవ మాట్లాడలేదు. అసలు ఈ లోకంలో లేనట్టే కళ్ళు మూసుకుని వున్నాడు. రెండు నిముషాల తరువాత అతడు కళ్ళు విప్పేసరికి కారు తిరిగి ఆస్పత్రి ఆవరణలో వుండటం గమనించి, చివుక్కున శేఖరం వైపు తిరిగి "ఏమిటిది" అన్నాడు.

 

    అతడెంతో మాట్లాడదామనుకున్నాడు. కానీ మాట రాలేదు. ఎలాగో శక్తి తెచ్చుకుని "ఒకసారి చూసి వెళ్లిపోదాం" అనగలిగాడు. ఈ వార్త అతడిని ఎంత కదిలించి వేసిందో అతడి కంఠమే చెపుతూంది.

 

    భార్గవ ఒకసారి గొంతు పెద్దదిచేసి, "నేను వెళ్ళిపోలేక కాదు-నిన్న సాయం అడిగింది" అన్నాడు.

 

    శేఖరం అతడివైపు చిత్రంగా చూసి, "ప్రార్థనంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా" అన్నాడు.

 

    "ఇష్టమే ఇష్టంలేనిదెవరికి? అందుకే ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కెమోథెరపీ అన్న పేరుతో సూదులు పొడవండి. రెడియోథెరపీ అన్న పేరుతో శరీరాన్ని కాల్చండి. కాదన్నదెవరు..."

 

    కారు ఆస్పత్రి ఆవరణలో పక్కగా ఆపుచేస్తూ "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటంలేదు. ఈ ఆస్పత్రి కాకపోతే యింకో ఆస్పత్రిలో చేర్పిద్దాం" అన్నాడు.

 

    "ఏ ఆస్పత్రి అయినా ఒకటే.."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS