"నేను చేసే వచ్చాను" అన్నాడు శ్యామ్.
అన్నం ముందుకి లాక్కుని "పెరుగు!" అన్నాడు మోహన్.
"అప్పుడే పెరుగేమిటి నీ తలకాయ, తిన్నగా తిను. యింకోసారి సాంబారు కలుపుకో" అని కోప్పడి అతను వద్దు మొర్రో అంటున్నా వినకుండా బలవంతంగా సాంబారు వడ్డించేశారు పక్కన కూర్చున్న సూర్యంగారు.
ఇదంతా చూస్తున్న శ్యామ్ కి నవ్వొచ్చింది. "మోహన్ గారి విషయంలో ఎంతశ్రద్ధ చూపిస్తున్నారు సార్" అన్నాడు.
"చూపించవద్దుటయ్యా మరి అల్లుడా మజాకానా?" అనేసారు సూర్యంగారు.
ఎందుకో కలుక్కుమంది శ్యామ్ మనసు.
తలెత్తి భారతివంక చూసాడు అప్రయత్నంగా. ఆ చూపులో చూపు కలిపిన భారతి మనసు కలుక్కుమంది. మోహన్ భోజనం ముగించి తయారై బయలుదేరాడు.
ఇద్దరూ రోడ్ మీదికి వచ్చారు. "మీ మామయ్యా గారికి నువ్వంటే ఎంత ప్రేమో కదూ! నిజంగా మీరు చాలా అదృష్టవంతులు" అన్నాడు శ్యామ్.
నొసలు చిట్లించాడు మోహన్, ఆ! నా మొహం అదృష్టం, విసిగిపోతున్నాను. ఆ తండ్రీ కూతుళ్ళలో ఇద్దరూ యిద్దరే చాదస్తంతో ఆయన విసిగిస్తే పుస్తకాల పిచ్చితో భారతి చంపుకుతినేస్తోంది" అన్నాడు విసుగ్గా.
సూర్యాంగారిని అంటే ఫర్వాలేదు గానీ భారతిని అలా విమర్శించడం శ్యామ్ కి ఏమంత నచ్చలేదు. మాట మార్చేశాడు అంతలోనే హఠాత్తుగా గుర్తొచ్చింది.
"అసలు విషయం అడగడం మర్చిపోయాను. మొన్న బస్ లో వస్తుంటే చూసాను మీరూ మీ వెంట ఆ వేళ మీరు, పెళ్ళాడతానని పందెం వేసిన అమ్మాయీ కనిపించారు. అసలా అమ్మాయితో ఎలా పరిచయం అయింది? యిలా స్నేహం కుదిరింది కుతూహలంగా అడిగాడు.
అదిరిపడ్డాడు మోహన్. యెందుకో అదంతా ఫ్రెండ్ కి చెప్పాలని అనిపించలేదు. అందుకే "అబ్బే! అలాంటి దేమీలేదే! నేను మొన్న అసలు యింట్లోంచి కదలలేదు. ఎవర్ని చూసి ఎవరను కున్నారో మీరు!" అని దబాయించేశాడు.
అతను అబద్దం చెప్తున్నాడేమో అనిపించినా ఆ విషయం రెట్టించి అడగలేదు శ్యామ్. సభ్యతకాదని ఊరుకున్నాడు.
"రేపటినుంచి మీ దగ్గరకు వస్తాను! యిద్దరం కలిసి వద్దాం!" అని మాత్రం చెప్పాడు.
"మహారాజులా రండి! దానికేం" అనేసాడు మోహన్.
ఇక అదే రొటీన్ అయిపోయింది. ఆరోజు సాయంత్రం ట్యూషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు టేబిల్ మీద మంచి యింగ్లీ నవల కనిపించింది. చేతుల్లోకి తీసుకున్నాడు.
"మీరు చదవలేదా? చాలామంచి నవల!" అటుగా వచ్చిన సుధ అడిగింది. ఉలిక్కిపడ్డాడు శ్యామ్. అతను సమాధానం చెప్పేలోపలే "చదవకపోతే తీసుకు వెళ్ళి చదవండి. తప్పకుండా చదవాల్సిన నవల!" అనేసి పనిమీద వెళ్ళిపోయింది. నవల చేత్తో పట్టుకుని నిలబడిన శ్యామ్ కి సడన్ గా సన్నజాజుల పరిమళం గుర్తు వచ్చింది.
ఆ నవల తీసుకునే బయలుదేరాడు. మేడమీద నిలబడి ఉన్న భారతి గేటు తీసుకుని వస్తున్నా ఇతడిని చూడగానే గబగబ మేడదిగి వచ్చేసింది.
"మీ కోసం మంచి నవల తీసుకొచ్చాను" అన్నాడు శ్యామ్ అతను వచ్చినందుకే సంతోష పడుతున్న భారతి అతను నవల తెచ్చాడని తెలిసి పరమానంద భరితురాలైంది.
"ఏది? ఏ నవల?" అంటూ ఒక్క అంగలో అతని దగ్గరికి వచ్చి అతని చేతులో పుస్తకం అందుకుంది.
ఆ సంతోషం కాస్తా నీరుకారి పోగా "ఇంగ్లీషా?" అంది నీరసంగా!
ఈ సారి నీరుగారి పోవడం శ్యామ్ వంతు అయింది. ఏం? మీరు యింగ్లీషు నవల్సు చదవరా?" అన్నాడు దీనంగా.
"ఏమో! ఎప్పుడూ చదవలేదు" అతని ముఖంలో వస్తున్నా మార్పు గమనించింది భారతి.
"ఇదివరకు చదవకపోతే ఏం? యిప్పుడు చదవండి. చాలామంచి నవల!" బ్రతిమాలాడు.
"అర్థం అవుతుందంటారా?"
"ఎందుకర్థంకాదు! మీరేం చదువురాని వారు కారు కాదా! అందులోనూ ఈ నవల్లో లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంది. కావాలంటే కథ నేను టూకీగా చెప్తాను" మరింత వేడుకోలుగా అన్నాడు.
"సరే!" ఇంగ్లీష్ నవల మీద అంత యింట్రేస్టు లేక పోయినా అతను బాధపడతాడేమో అని అంగీకరించింది భారతి.
నవలలోని ముఖ్యమైన కథని క్లుప్తంగావివరించాడు శ్యామ్ "చదవండి! రేపొచ్చి నవల తీసుకువెళతాను" అనేసి, లోపలిరండి కాఫీ తాగి వెళ్దుదురుగాని అంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు.
అతనటు వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి కూర్చుని నవల చదవటం మొదలు పెట్టింది. రెండు పేజీలు చదివేసరికి విసుగు వేసింది. ఏమీ బుర్రకి ఎక్కడం లేదు. యిక చాల్లే అనిపించింది. అంతలోనే దీనంగా మీరు యింగ్లీషు నవల్స్ చదవరా అని అడుగుతున్న శ్యామ్ గుర్తొచ్చాడు.
అందుకనే ఓపికగా చదవసాగింది. మధ్యలో లేచి భోంచేసి మళ్ళీ కూర్చుంది. శ్రద్దగా పట్టుదలగా, పరీక్షలకి చదివినట్లు రాత్రంతా చదివి కోడికూసే వేళకి పడుకుంది.
అలవాటు ప్రకారం తెల్లవారుజామునే మోహన్ ని లేపేశాడు సూర్యంగారు. ఆసనాలు గట్రా వేయించేశారు.
బ్రేక్ ఫాస్ట్ కోసం బల్ల ముందు కూర్చునేసరికి ఎనిమిది అయింది. "ఇంకా భారతి లేవలేదూ!" అడిగాడు మోహన్. "ఊహు!" అన్నాడు సూర్యంగారు.
అసలే చిరాగ్గావున్న మోహన్ కి ఆ సమాధానం వినేసరికి మరింత చిరాకేసింది. "యింకా లేవకపోవడం ఏమిటి?" విసుక్కున్నాడు.
"పడుకోనీరా! పసిపిల్ల. తల్లి లేనిపిల్ల. దానిష్టం. అసలైనా అది లేచి మాత్రం ఏం చెయ్యాలిట?" తేలిగ్గా తీనేశారు ఆయన.
"ఔస్లే! యిలాగే గారాబం చెయ్యి. ఇప్పుడంటే నువ్వు అన్నీ చూసుకుంటున్నావు కాబట్టి సరిపోతుంది. రేపు పెళ్ళయితే యెలా?" అన్నాడు మోహన్.
"మరేం ఫర్వాలేదు. పెళ్ళయ్యాక నువ్వు చూసుకుందువుగాని ఈ పనులన్నీ" దైర్యంచెప్పి వెళ్ళిపోయారాయన.
బారెడు పొద్దెక్కాక లేచింది భారతి. ఆ పగలంతా కూర్చుని నవల రివిజన్ చేసింది. సాయంత్రం మళ్ళీ వచ్చాడు శ్యామ్.
"చదివారా?" ఆత్రంగా అడిగాడు.
"చదివాను. బాగుంది. కానీ చాలా శ్రమపడాల్సి వచ్చింది!" అని వున్నమాట చెప్పేసింది.
"అరెరె" నొచ్చుకున్నాడు శ్యామ్. ఓ పని చెయ్యండి. చేజ్ నవల్సు మొదలెట్టండి. స్పీడుగా చదవటం అలవాటు అయ్యాక ఇర్వింగ్ వాలీన్, ఆర్డర్ హెయిలీల పెద్ద నవల్సు చదవచ్చు" అన్నాడు.
"అలాగే!" తలాడించింది భారతి.
రేపు సాయంత్రం తెచ్చిఇస్తాను!" అనేసి వెళ్ళి పోయాడు.
అదో దినచర్య అయిపోయింది ఆ ఇద్దరికీ. డాక్టర్ గారింట్లో పెద్ద లైబ్రరీ వుంది. రోజుకో పుస్తకం తెచ్చి యిస్తాడు శ్యామ్. కథ ఔట్ లైన్సు చెప్పి వెళ్ళిపోతాడు. పదిరోజులు గడిచేసరికి పెద్దపెద్ద నవల్స్ చదివేయడం మొదలుపెట్టింది భారతి. యిప్పుడు చీటికీ మాటికీ పుస్తకాలు తెచ్చిమ్మన్ని మోహన్ బావని వేధించటంలేదు. అసలంత తీరికకూడా లేదు.
