Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 24


    ఏ ఆలోచనలూ రాకుండా మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది రాగిణి. అదేమిటో ఎక్కణ్ణుంచి వస్తున్నారో ఈ జనం? ఊటీకూడా హైదరాబాదులాగానే, కిటకిటలాడిపోతోంది జనసమూహంతో. దానప్రకాష్ తప్ప వేరే ఇంకేహోటల్ కైనా వెళ్లాలి. అని రాగిణి చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది. ఎక్కడా ఖాళీలు లేవన్నారు. "పోనీలేమ్మా! ఎక్కడో అక్కడ పద దానప్రకాష్ కే పోదాం" అంది అప్పుడే అక్కడి చలికి వొణికిపోతూన్న సూర్యకుమారి.
    హోటల్లో దిగి స్నానంచేసి, భోంచేసి, స్కూల్ కి బయలుదేరారు రాగిణీ, సూర్యకుమారి. సిస్టర్ ఫెర్నాండిస్ కి, సూర్యకుమారిని పరిచయంచేసింది రాగిణి అవినాష్ గ్రాండ్ మదరని చెప్పి!
    "అవినాష్ చాలా తెలివైన పిల్లవాడు!"
    నవ్వింది సంతోషంగా సూర్యకుమారి.
    "అన్నింట్లల్లో అవినాష్, శిల్పా వాళ్ళేపస్టు" అంది మళ్ళీ సిస్టర్ ఫెర్నాండిస్ నవ్వుతూ
    శిల్పని చూడాలంటే ఏదో భయంగా వుంది. పట్టుమని పదేళ్ళు నిండని పిల్లని చూడడానికీ, ఆమెతో మాట్లాడడానికి కన్నతల్లే భయపడవలసి వచ్చిన పరిస్థితికి, సిగ్గుపడిపోయింది రాగిణి." శిల్పకి, రాజేష్ పట్టుదలవొచ్చుంటుంది. లేకపోతే, ఆరోజు విడిపోయాక, ఒక్కసాకి కూడా, ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చూస్తే అటువుంటిదెక్కడా జరగలేదు.
    ఒకసారి తను పూనాలో డాన్సు ప్రోగ్రాముకని వెళ్ళింది. వాళ్లేదో హోటల్లో దింపారు గ్రూపునందరినీ. ఆ హోటల్లోనే ఏదో పనిమీద పూనావొచ్చిన రాజేష్ కూడా దిగాట్ట. తామొచ్చామని తెలిసి, రాజేష్ వెంటనే హోటలు ఖాళీచేసి వెళ్ళిపోయాట్ట. ఈ రోజువరకూ అతన్ని చూడ్డంగానీ, అతనిగురించి వినడంగానీ జరగలేదు. మొన్న నాన్నగారు రాసిన ఉత్తరంలో అతను కెనడాలో స్థిరపడిపోయినట్టు తెలిసింది. కోపంలో ఆ రోజు తనూ అతనూ కలిసి దిగిన ఫోటోలన్నీ చింపి ముక్కలు ముక్కలుచేసి పారేశాడు."
    "ఏమిటి? సీరియస్ గా ఆలోచిస్తున్నారు?" అడిగింది సిస్టర్ ఫెర్నాండిస్.
    ఉలిక్కిపడింది రాగిణి. 'ఆహా..... ఏమీకాదు.....' అంది కంగారుగా.
    ఒక పదిహేను నిమిషాలు గడిచిపోయాయి. అవినాష్.... శిల్పా..... మాట్లాడుకుంటూ రావడం, అంతదూరం నుంచే చూశారు, రాగిణీ సూర్యకుమారి. శిల్పనిచూసి, ఆశ్చర్యపోయింది రాగిణి. 'అచ్చు రాజేష్ ముద్ర. బాగా పొడుగైంది! పెరుగుతూన్నకొద్దీ కలిగే తెలివితేటలతోపాటు, వొచ్చే అందం, దానికి తగ్గట్టు మెరుగులు దిద్దుకుందేమో వయస్సుకి. రెండు జడలూ, ముందుకేసుకుని, ఒకజడ, విడిపోయివుంటే అల్లుకుంటూ వస్తూన్న శిల్పని చూస్తుంటే, ఎంతో ముచ్చటగా, ముద్దుగా అనిపించింది రాగిణికి.
    భార్గవ మైకంలోపడి రెండేళ్ళు తను శిల్పని చూడలేదు. గిల్టీగా ఫీలవుతోంది రాగిణి. లోపలికి రాగానే, "బాగున్నావా అమ్మా? నువ్వొక్కదానివే ఎలా వచ్చావ్?" అన్నాడు అవినాష్ సూర్యకుమారికేసి చూసి. "ఇదుగో! రాగిణీ ఆంటి. తను వస్తూ వుంటే, నిన్నూ నీ స్కూలునీ, ఈ ఊరునీ చూడాలని, నేనూ వస్తానన్నాను."
    "నమస్తే ఆంటీ" అన్నాడు అవినాష్ రాగిణిని చూసి.
    "నమస్తే మామ్మీ...... కోటయ్య తాతగారు రాలేదా?" అడిగింది శిల్ప సూర్యకుమారితో.
    శిల్ప రాగిణిని చూడగానే, తల తిప్పుకుంది. ఆ చూపులోని ధిక్కారం ఏవగింపూ చాకులా దూసుకుంది రాగిణి గుండెల్లో! బాధగా మాటరాక గొంతు మూగబోయింది ఒక్కక్షణం. వెంటనే తేరుకుని, "శిల్పా..... బాగున్నావా?" అంది. శిల్ప మాట్లాడలేదు.
    రాగిణికి ఏం చెయ్యాలో తెలీలేదు.
    "శిల్పా! అమ్మొచ్చింది చూశావా?" అంది శిల్పని చూస్తూ సూర్యకుమారి.
    రాగిణి దుఃఖన్నాపుకోలేక, కర్చీపుతో కళ్ళు తుడుచుకుంది.
    "మామ్మా.... నాకు తెలిసిన అమ్మ మా గ్రాండ్ మా...... అమెరికాలో వుంది. నాకు ఇంకో అమ్మలేదు....." సూర్యకుమారికి ఏమనాలో, ఎలా చెప్పాలో అర్థంకాలేదు.
    శిల్ప అంతస్పష్టంగా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూంటే, రాగిణికి ఆశ్చర్యంగా వుంది. అలా ఆ పిల్ల మాట్లాడుతూ వుంటే వినాలనివుంది. తెల్లగా, నాజూగ్గా, అందంగా తెలివితేటలతో గంభీరంగా కనబడే ఆ బిడ్డని చూసి, నా బిడ్డే అని గర్వంగా చెప్పుకునే అదృష్టాన్ని కోల్పోయింది తను. "అమ్మా" అని ఆ అమ్మాయి తన ఒడిలో పడుకుని, కబుర్లు చెప్పే ఆనందాన్ని పోగొట్టుకుంది తను..... ఇప్పుడు కన్నబిడ్డముందే దోషిలా కూర్చుంది. మాట్లాడలేని స్థితిలో.
    "జరిగింది మర్చిపో శిల్పా! అమ్మ నిన్ను చూడడానికే ఇంతదూరం వచ్చింది. రా కూర్చో....." బుజ్జగించింది సూర్యకుమారి.
    "అయ్యయ్యో! నన్ను చూడడానికి ఇంతదూరం వచ్చిందా! పాపం! ఐ....యమ్.... సారీ. ఫర్.....హర్.....! హైదరాబాదొచ్చినప్పుడు నన్ను చూడడానికి రాలేదేమీ! రావాలనిపించలేదా! గ్రాండ్ పానీ...... గ్రాండ్ మానీ.... చూడ్డానికి రాలేదేమీ? భరణి అక్క మారేజికి రాలేదేమీ? నాకు మమ్మీలేదు..... నన్నెవ్వరూ చూడక్కర్లేదు మామ్మా! నేను రూంకి వెళ్ళిపోతాను" అంటు రెండడుగులు ముందుకు వేసింది.
    రాగిణి ఏడుపుని ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి చేతుల్లో మొహాన్నిదాచుకుని ఏడ్చింది. అమ్మ చేసింది తప్పే! అమ్మవల్ల తప్పుంది! కానీ తన వొప్పుకుని, నీకోసం అమ్మ ఇంత దూరం వచ్చింది. అమ్మని క్షమించి, అమ్మతో మాట్లాడు" అంది సూర్యకుమారి శిల్ప తల నిమురుతూ, బుజ్జగిస్తూ!
    "మామ్మా! అమ్మ అనేమాటనీ, అమ్మ అన్న మనిషినీ ఏనాడో మరిచిపోయాను. నేను అమ్మతో మాట్లాడలేను. ఆమె అంటే నాకు అసహ్యం" ఖచ్చితంగా చెప్పేసింది.
    ఆ చివరి మాటలు రాగిణిని పిచ్చిదాన్నిచేశాయి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థంకాలేదు ఆమెకి. "ఆమె అంటే నాకు అసహ్యం.... అసహ్యం..... అసహ్యం......" అవే మాటలు గుండెని సూదుల్లా పొడుస్తున్నాయి! రాగిణి అచేతనంగా కూర్చుండిపోయింది.
    దూరంనుంచి ఇదంతా చూస్తు కాస్సేపు ఏమీ పట్టించుకోనట్టుగా ఊరుకుంది సిస్టర్ ఫెర్నాండిస్! కాని శిల్ప ధోరణీ, రాగిణి ఏడవడం చూసి ఇంక లాభంలేదని, తన సీట్లోంచి లేచొచ్చింది.
    నుంచునే వున్న శిల్పని, అవినాష్ ని కూర్చోమంది. శిల్ప దగ్గరికి వచ్చి, రాగిణి పక్కన కూర్చోమంది. శిల్పకి అక్కడ కూర్చోవడం ఇష్టం లేనట్టుగా నుంచునేవుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS