16
పెద్ద మామయ్య దగ్గర్నుంచి వొచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదివారు అన్నయ్యా, వొదినా. 'ఏమై వుంటుందా అన్నిసార్లు చదువుతున్నారూ ?' అనుకుంది కావ్య !
"కావ్యా !" పిలిచాడు క్రాంతి.
"ఏంటన్నయ్యా ?"
"పెద్ద మామయ్య ఇక్కడ ఏదో సంబంధం వుందని రాశాడమ్మా. హిమాయత్ నగర్ లో ఇల్లుట. స్వంత ఇల్లూ, ఆస్తీ, పాస్తీ అన్నీ బాగానే వున్నాయట. అయితే, రెండో పెళ్ళిట. పెద్ద పెళ్ళాం తాలూకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళయిపోయి అత్తవారింట్లో వున్నారట" ఏవేవో చెబుతున్నాడన్నయ్య.
"ఒక్క మాటలో చెప్పాలంటే బహుశ మనవలు కూడా ఆయనకీ పుట్టే వుండొచ్చును లేకపోతే పుడతారో రేపో మాపో! ఆయనకి పెళ్ళి అనడంకన్నా, షష్టిపూర్తి అంటే బాగుంటుందేమో !" అంది కావ్య !
"అది కాదమ్మా...." ఏదో చెప్పబోయాడు క్రాంతి.
"ఇంకెందుకులెండి. ఇష్టం లేదని చెప్పేస్తోందిగా" అంది శోభన.
"ఇలా ప్రతీదీ ఏదో ఒక వంకపెట్టి కాదంటూంటే, ఇంక సంబంధాలే రావమ్మా. ఇప్పటికే ఏదో ఇన్నాళ్ళకి ఇదైనా వొచ్చింది. బాగా ఆలోచించుకుని చెప్పమ్మా"
"అన్నయ్యా! అంత ఏదో ఒక సంబంధాన్ని చూసి చేసేసుకోవలసిన అవసరం ఏముందన్నయ్యా ? పెళ్ళి కాకపోతే కాకపోతుంది. పెద్ద నష్టమేముంది ?"
"అంటే జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా వుండడానికే నిశ్చయించుకున్నావా ?" అడిగింది శోభన.
"అలా అని నేననలేదే ! మంచి సంబంధం వొస్తే తప్పకుండా చేసుకుంటాను"
"ఇవన్నీ మంచి సంబంధాలు కాకపోతే మానాన్న ఉత్తరం రాస్తాడా ?"
"రెండో పెళ్లి సంబంధాలూ, నా ఈడు పిల్లలున్న సంబంధాలూ, నాకు సరైనవనా మీ ఉద్దేశ్యం ?" అంది కావ్య.
"మొదటి పెళ్లివాడూ, అన్నీ సవ్యంగా వున్నవాడూ, సంప్రదాయ కుటుంబంలో నుంచొచ్చినవాడూ ,నిన్నెందుకు చేసుకుంటాడు పిచ్చా ?"
'వొదినా! నీ ఇష్ట మొచ్చినట్టు మాట్లాడకు. ఇప్పుడు పెళ్లికోసం నేనేం పడి చావడంలేదు"
"శోభనా ! నువ్వు లోపలికి వెళ్ళు మాట్లాడకు" అన్నాడు క్రాంతి.
"నాకెందుకులెండి గొడవ, మీరూ మీరూ ఏమైనా చేసుకోండి. అసలు నాన్నగారికి బుద్ధిలేదు. ఆయనకెందుకు ? ఇక్కడ సంబంధం వుందీ ,అక్కడ సంబంధం వుందీ అంటూ" విసుక్కుంటూ, సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
"అన్నయ్యా! నువ్వింత మారిపోతావనీ కలలో కూడా అనుకోలేదు. నువ్వేనా నాకోసం ఇట్టాంటి సంబంధాలు తెస్తున్నది .నేను నమ్మలేక పోతున్నాను. అన్నయ్యా ! నా పెళ్ళికోసం మీరెవ్వరూ బాధపడకండి. ఎందరో పెళ్ళికాని వాళ్ళున్నారు. ఇంకెందరో పెళ్ళయి భర్తని పోగొట్టుకున్న అభాగినులున్నారు. వాళ్ళందరూ బతకడంలేదూ ? చదువుకున్నాను. ఉద్యోగం చేసుకుని నా కాళ్ళమీద నేను నిలబడగలను" అంది. క్రాంతి సమాధానం చెప్పేలోగా గదిలోంచి బయటికొచ్చింది శోభన విసురుగా.
వాళ్ళందరూ బతకడం లేదూ ? అన్నావే కరెక్టు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అయితే, నువ్వు చెప్పినలాంటి వాళ్ళు, ఇష్టంలేకనో, అనుకూలురైనవాళ్ళు దొరకకనో అవివాహితలుగా వుండిపోవొచ్చు. అంతే కానీ నీలాగా చెడిపోయినదని పేరు పడి వుండడం లేదుగా ?" అంది.
అన్నయ్య ముందే శోభన అంత ఇదిగా మాట్లాడడం. అన్నయ్య ఏమీ అనకుండా ఊరుకోవడం కష్టం కలిగించింది కావ్యకి.
శోభనకేసీ క్రాంతి కేసీ మార్చి మార్చి చూసింది. ఒక నిర్ణయాని కొచ్చిన దానిలా క్రాంతితో చెప్పింది.
"అన్నయ్యా ! ఆఖరిసారిగా చెబుతున్నాను. ఇప్పటికి జరిగిన సంఘటనలను బట్టి, నాకు పెళ్ళంటే అసహాయం పట్టుకుంది. నేను పెళ్ళి చేసుకోదలచుకోలేదు. అలా అని నేను ప్రమాణం చేసి కూర్చోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తి, నా తప్పులతో సహా నన్ను మెచ్చిన వ్యక్తీ ఒచ్చిన రోజునే, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంతదాకా ఇలాగే వుండిపోదలచుకున్నాను."
"అది కాదు కావ్యా ! అంటే...."
"అన్నయ్యా ! నేను నీతో మాట్లాడుతున్నాను. ఎన్న ఎదురు దెబ్బలు కలిసి తిన్నాం, కలిసి బతుకుతున్నాం, ఒక్క తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టాం. ఒకే ఆదర్శంగా నిన్నటి వరకూ వున్నాం! ఈ రోజున, నీ రూటు మారింది. నీదారిలో నువ్వూ, నా దారిలో నేనూ నడిచే రోజొచ్చింది. నన్ను చెప్పనివ్వు...."
క్రాంతి బాధగా తలొంచుకున్నాడు. శోభన లోపలికి వెళ్ళిపోయింది.
"అన్నయ్యా! నేను నీకు భారంగా వున్నాననుకుంటా ! అలా వుండదలచుకోలేదు. నావల్ల నీకుగానీ, వొదినకిగానీ ఏమాత్రం శ్రమ కలగకూడదు. నేను బతకగలనన్నయ్యా. చదువుకున్నాను. ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బ్రతకగలను. ఆడది ఏడుస్తూ పడుండే రోజులు పోయాయి. అభాగినులకూ, అండదండలులేని దిక్కులేని వారికీ, ఒంటరిగా వుండి ఉద్యోగాలు చేసుకోవాలనుకునేవారికీ ప్రభుత్వం సహాయం, సంక్షేమ సంస్థల సహాయం వుంది. నేను...."
"ఏమిటా అర్ధంలేని మాటలు ? మనం అడిగినదేమిటి ? తను చెప్పేదేమిటి ? మీరూ అలా ఊరుకుంటారేం ?" మళ్ళీ గదిలోంచి ఒచ్చి అంది శోభన.
కావ్య శోభన కేసి తీక్షణంగా చూసింది !
ఆ చూపులకి తలదించుకుంది శోభన !
క్రాంతి ఆ చూపుల్లో ఏం చదవగలిగేడో "శోభనా ! నువ్వు మాట్లాడకు. నేనూ, కావ్యా మాట్లాడుకుంటున్నాం. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు ! వెళ్ళు !" అంటూ కావ్యకేసి, "కావ్యా ! నాకు తెలుసు నీ భావాలు ! మొదటి నుంచీ ఒకరకమైన స్వతంత్రమైన భావాల తోటే పెరిగావు. ఎదురుదెబ్బలు తిన్నావు"
"నా భావాలవల్ల ఎదురు దెబ్బలు తిన్నానంటే నేనొప్పుకోను ! కేవలం అది నా దురదృష్టం. ఇంట్లో కూర్చుని, ఏ కూరలు కొనడానికి వెళ్ళినప్పుడో ఇటువంటి సంఘటన జరగొచ్చు! ఇంకా మగాడు ఆడదాన్ని ఒక అందమైన బొమ్మను తెచ్చుకుందామనుకుంటున్నాడు. అందులో తప్పులేదు. కానీ, ఆమె బాహ్య సౌందర్యానికీ ఇచ్చే విలువలో నూరో వంతు కూడా ఆమె వ్యక్తిత్వానికి గానీ, ఆశయాలకి గానీ, ఆదర్శాలకి గానీ ఇవ్వడం లేదు. అసలు ఆమెకీ తనతోపాటు సమానస్థాయినిచ్చి ఆలోచించుకునే అవకాశాన్నివ్వడం లేదు. అన్నయ్యా! చట్టపరంగా స్త్రీకి ఎన్నో హక్కులనిచ్చారు. కానీ, ఏ చట్టమూ పరిస్థితులను మార్చలేకపోతున్నాయి. కారణం, ఈ మార్పు రూల్స్ వల్ల ఒచ్చేదికాదు. ఆడవాళ్ళలోనూ రావాలి! ఒకపక్క స్వేచ్చ కావాలని కోరుకుంటూ, సమాన హక్కులు కావాలని అడుగుతూ, మరోపక్క అలా అడిగే స్త్రీలను సమర్ధించకుండా, ఆడవాళ్ళే ఆడవాళ్ళని కించపరుస్తూ, పురుషుడి పాదాలచెంత పడుండి ఆత్మార్పణ చేసుకుంటూ వుంటే, పరిస్థితులు మారవు. లెక్చరిస్తున్నాననుకోకన్నయ్యా! నా వుద్దేశం, స్త్రీ పురుషుణ్ణి ద్వేషించాలనికాదు. పాదాలచెంత వుండకూడదనీ కాదు. ప్రేమతో ఒకరి నొకరు అర్ధం చేసుకుని, ఒకరి తపించి తరించడానికి తమని తాము ఆత్మార్పణ చేసుకోవడంలో ఆనందం వుంది, ఆదర్శం వుంది, మనుగడ వుంది, బ్రతుకుంది. హెచ్చుతగ్గులకు స్థానం వుండదు !...."
క్రాంతి కావ్య చెప్పేదంతా శ్రద్దగా విన్నాడు. ఆమె మాటల్లో తప్పు పట్టడానికి గానీ, వ్యతిరేకించడానికి గానీ, ఏమీ కనిపించలేదతనికి! పైగా కావ్య అంత చక్కగా ఆలోచించగలిగే వ్యక్తిగా తయారయినందుకు గర్వపడ్డాడు.
"కావ్యా! నీ మాటల్లో అక్షరం తప్పులేదు అసలు నిన్ను తప్పు పట్టవలసిన అవసరమే లేదు. కాకపోతే, నాబాధల్లా, నిన్ను అర్ధం చేసుకునే స్థితికి ఎదగక నిన్ను తప్పుపడుతూన్న ఈ సమాజానిదేనని నాకు తెలుసు .కానీ ఈ వ్యవస్థని మార్చడం, ఒక్క నీవల్లగానీ, ఒక్క నావల్ల గానీ లేదు. అందుకు ప్రయత్నం చేస్తే మనమే ఆహుతై పోతామేమోనని నాకు భయంగా వుంది."
"ఈ ప్రయత్నంలో నేను ఆహుతై పోయినా ఫరవాలేదన్నయ్యా! అందుకు నా వ్యక్తిత్వాన్ని చంపుకుని ఒక మామూలు మనిషిగా, బతకలేను" అంది కావ్య!
ఆమె మాటల్లోని, పట్టుదలనీ, నిర్ణయాన్నీ గ్రహించిన క్రాంతి మరి మాట్లాడలేకపోయాడు.
"ఓ....కే....డూ....వాట్....యూ....లైక్!....బెస్ట్....ఆఫ్....లక్!" అన్నాడు.
కావ్య మనస్సు కడిగిన అద్దంలా వుంది! గుండెలోని బరువంతా తగ్గి, మనసు తేలికపడింది!
తృప్తిగా నిట్టూర్చింది !
"ఎన్నో రోజుల తరువాత తను మనసువిప్పి ధైర్యంగా మాట్లాడింది, అన్నయ్యతో! అన్నయ్య కూడా తను చెప్పినదంతా శ్రద్ధగా వినడమే కాకుండా, అన్నీ అంగీకరించాడు". సంతోషంగా మనసు తేలిపోయింది కావ్యకి!
శోభన మాత్రం సంతోషంగా లేదనే చెప్పాలి. ముభావంగా భోజనాలు పూర్తి చేశారు రాత్రి!
చాలాసేపు నిద్దరపట్టక పోవడంతో, ఏదో నవలతీసి ముంద రేసుకుంది కావ్య!
పక్కగదిలోంచి వాదన వినపడుతోంది. వినడం సభ్యతకాదని తెలిసినా, మధ్య మధ్య తనపేరు వినబడడం వల్ల, కుతూహలంతో వింది కావ్య !
"మీరు మీ చెల్లెలు చెప్పిన ప్రతీమాటకీ 'అవునూ ,కరెక్ట్!' అంటూ తందానతానా అన్నారేగానీ, మన బాధ్యతని గుర్తించారా ? తను పెళ్ళి చేసుకోనని చెప్పి వుండిపోయిందని ,తనని ఎవరూ ఏమీ అనరండీ ! మనం పట్టించుకోలేదంటారు. ఆ పిల్ల తల్లే బతికుంటే ఊరుకునేదా, అన్నా వొదినా కాబట్టి, మాట్లాడక ఊరుకున్నారు అంటారు. ఆ నింద నేను మొయ్యలేను"
