Previous Page Next Page 
యువత నవత పేజి 24

                                                           2

    అంగన్ వాడీలో పనిచేస్తున్న  సుజాత ఒకరోజు సుధకు బస్సు స్టాండ్ లో కలిసింది.    

    "వట్టి కంఠశోష, సుధగారూ! పరిసరాల పరిశుభ్రత గురించి, పోషకాహార విలుపలగురించి , నర్సింగ్ గురించి, పెరటి తోటలగురించి, చిన్న మొత్తాల పొదుపు పథకం గురించి ...ఎన్నెన్నో చెప్పాను! కాని, ఒక పర్సెంట్ కూడా మన శ్రమకు ఫలితం వుండదు. కుటుంబనియంత్రణ విషయంలో మాత్రం యిప్పుడిప్పుడు వాళ్ల భయాలు, సందేహాలు పోగొట్టగలిగాం.  ఫామిలీప్లానింగ్ అంటే వాళ్లే ముందుకు వస్తున్నారు. అందరూ కాదనుకోండి; కొందరు! ఆ కొందరూ యెందుకు రావడంలేదంటే ఓ అయిదారేళ్లు గంజినీళ్లుపోసి ఓ కుక్కనో, పిల్లినో సాకినట్టుగా సాకితే తరువాత వాళ్లే పశువుల్ని కాచుకొనో, పేడవేసుకొనో బ్రతికేస్తారు కదాని! వాళ్ల అజ్ఞానానికి వాళ్ల దరిద్రానికి మరో పదిమందిని పుట్టించి వారసులుగా వదిలితే తప్ప వాళ్లకి తృప్తి వుండదు."

    "పల్లెటూరి వాళ్లంటే నీకు బాగా కోపం ఉన్నట్టుంది, ఏం జరిగింది?" అడిగింది సుధ."

    "మూడేళ్ళ క్రితం నేను ఉద్యోగంలో చేరిన క్రొత్తలో మీలానే ఆలోచించేదాన్ని గ్రామీణ స్త్రీలలో అజ్ఞానం తొలగించి, అభ్యుదయ భావాలు రంగరించి పోయాలని, వాళ్ల గురించి ఇంకెవరోకాదు,  వాళ్లే ఆలోచించుకొనే స్టేజీకి తీసుకురావాలని, పరిసరాల పరిశుభ్రత నేర్పాలని ఎన్నెన్నో! ఆ ఆదర్శభావాలన్నీ నా మనసులోనే ఇంకిపోగా యిప్పుడు మామూలు మనషినైపోయాను. గవర్నమెంటునుండి జీతం తీసుకొంటున్నాం కాబట్టి, వర్క్ చూపించాలి కాబట్టి పైపైకి యేదో చేస్తున్నాను గాని మనస్పూర్తిగా ఏం చేయలేకపోతున్నాను. మీ పర్శనల్ ఇంట్రెస్టుకూడా చాలా రోజులుండదని, మాలాగే అయిపోగలరని నా నమ్మకం" అంది సుజాత.

    "ఎంత చిక్కటి చీకటి  అయినా ఒక చిరుదీపం వెలిగిస్తే పారిపోక తప్పదు సుజాతా! మన శ్రమకి వెంటనే ఫలితం రాకపోవచ్చు. ఓపికతో నిరీక్షిస్తే తప్పకుండా వస్తుందని నా నమ్మకం!తరతరాలుగా ఒకరకం జీవితానికి, అజ్ఞానానికి అలవాటుపడ్డారు వీళ్లు. మనం బయటినుండి వచ్చి రెండు ముక్కలు చెప్పగానే వెంటనే ఎలా మారిపోతారు? వాళ్లు మారక పోడానికికూడా మనం కారణాలు  గమనించాలి. ఆ  కారణాలు ఏమయినా ఉన్నాయంటే ముందు వాటికి చికిత్స మొదలుపెట్టాలి" అంది సుధ.

    "వాళ్ళ అభ్యుదయం దేవుడెరుగు! ముందు మనల్ని మనం రక్షించుకోవడం పెద్ద సమస్య అవుతూందండీ! అందరూ కాదనుకోండి! కొందరు పురుషులు -  మనకి శీలమర్యాదలు లేకే యీ ఉద్యోగానికి వచ్చినట్టుగా, వాళ్లు యిలా చేయి చాచగానే మనంవచ్చి వాళ్లచేతుల్లో  వాలిపోతాం అన్నట్టుగా చూస్తుంటారు. మేం అలాంటివాళ్లంకాదు అని వాళ్లకు తెలియజెప్పడానికి ప్రయత్నిస్తే  యీ బెట్టు ఎన్నాళ్లుంటుందో అన్నట్టుగా మీసం మెలివేస్తారు! ప్రస్తుతం....... ఇద్దరు మగవాళ్లు నన్ను  వేటాడుతున్నారు. ఆ వూరికి వెళ్లాలంటేనే నాకు భయం. కానీ, ఉద్యోగ ధర్మంగా వెళ్లక తప్పడంలేదు.

    సుధ సర్కిల్ లో ఆ గ్రామంలేదు అందుకని సుజాత చెప్పిన మగవాళ్లెవరో సుధకి తెలియదు.

    గ్రామల్లో తిరిగేప్పుడు సుధకికూడా యిలాంటి ఇబ్బంది ఎదురవక పోలేదు. అదృష్టవశాత్తూ మీసం మెలేసేవాళ్లు మాత్రం తారస పడలేదు. చదువుకొన్న మగవాళ్లయితే పరాయి ఆడవాళ్లపట్ల చాలా మర్యాదగా మెలుగుతారు. పూర్తిగా చదువుకోని మగవాళ్లూ మర్యాదగా మెలుగుతారు. మర్యాదకి తోడు భక్తినికూడా ప్రదర్శిస్తారు. వచ్చే పేచీ అంతా పదవ తరగతి కూడా దాటకుండా గిరికీలు కొడతారే వాళ్లతో వస్తుంది. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతూ ఆడావాళ్లు పుట్టిందే తమ పాదాలమీద వాలిపోవడానికన్నట్టు ప్రవర్తిస్తారు!

    "మన డ్యూటీ అంతా స్త్రీలకి సంబంధించిందే  కాబట్టి అలాంటి మగవాళ్లను మనం చూసీ చూడనట్టుగా వెళ్ళిపోవాలి సుజాతా!"

    "చూసీ చూడనట్టుగా మనం వెళ్లిపోతామండీ! అంతమాత్రాన వాళ్లు మనల్ని వదిలి పెట్టరుకదా?"

    "అలాంటి మగవాళ్లతో వ్యవహారం కొంచెం కష్టమే! చెప్పువిడిచి కొడితే బుద్దిరావడం అలావుంచి, ఇంకా రెచ్చిపోయి మృగతుల్యంగా మారిపోయే ప్రమాదం వుంది "అన్నా! నేను నీకో చెల్లిలిలాంటిదాన్ని!" అని చేతులు జోడిస్తే మార్పురాదు సరికదా. ఎగతాళి చోటుచేసుకుంటుంది. "చెల్లెలివా ఎలాంటి చెల్లిలివి? మా అయ్య మీ అమ్మప్రక్కన యెప్పుడు పడుకున్నాడే?" అని అడిగినా ఆశ్చర్యంలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS