Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 25

వంచలేను నా శిరస్సు ఏ అధికారంముందు
ఒప్పలేను మానసిక దాస్యాన్ని ఏ ప్రభుతయందు
నాకు వద్దు మీ రంగురంగుల కాగితపు బురఖాలు
పాత వుచ్చులు తీసి తగిలించకు వినూత్న శృంఖలాలు!

ఒక సత్యం మరో సత్యాన్ని ఖూనీ చెయ్యకు
పరదేశ స్తుతిలో స్వకీయ సంస్కృతి విస్మరించకు
ఇంకా కరిగి నీరైపోలేదు హిమాలయ శిఖరాలు
ఇంకా మరిచిపోలేదు తథాగతుని మహాత్ముని ప్రవచనాలు!

వివేకంలేని ఆవేశం విపత్కరమౌతుంది
సంయమంలేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది
సమ్యక్ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది
కరుణలేని కవివాక్కు సంకుచితమౌతుంది!

    (ఆంధ్రప్రభ దినపత్రిక, ఆదివారం సంచిక
            జనవరి 23, 1955)

                       ప్రకటన
             
(పరారీ అయిన వ్యక్తికోసం)

స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి.

ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి
కాఫీహోటళ్ళలో క్లబ్బులలో కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి
సముద్ర తీరాలలో నదీ జలాలలో వెదకండి.

సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వ్రేలి ముద్రల్ని పరీక్షించండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS